నెల్లూరు

పనిపిల్లోడు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొలం పనులు జోరుగా సాగుతున్నాయి. రైతు సిద్ధయ్య గట్టున కాలుమీద కాలు వేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. జగదీష్ పని జరిగేలా చూస్తున్నాడు.
సిద్ధయ్య ‘‘ఒరేయ్ జగ్గా! ఎంతసేపురా అక్కడ! రారా! నాకు ఇక్కడ చెనా ఆకలిగా ఉండాది’’ అన్నాడు. ‘‘పని చేస్తా ఉండ్లా ఈడ నీకేమి కురిచీలో కూరుచుని సవాళ్ళు పట్టిస్తా ఉంటావు. ఉండుమామా! ఫైవ్ మినిట్స్‌లో వస్తా’’ అన్నాడు జగదీష్. ‘‘ఒరేయ్ మీ విజయత్త కూడా నన్ను ఇంతలేసి మాటలు అనదు గదరా, నీకు బాగా కొవ్వు బట్టిందిరా.. తంతా నాయలా!’’ అన్నాడు సిద్ధయ్య. ‘‘విజయత్త నీ వైఫ్ కాబట్టి భయంగా ఉండాల. నువ్వేమి నాకు మొగుడివా ఎట్టా.. నిన్ను చూసి వణికే దానికి’’ అని అంటూ శాల్తి పడ్డాడు జగదీష్. కాసేపు తర్వాత సిద్ధయ్య ‘‘ఒరేయ్ నువ్వు నా కడుపు మాడ్చేలా ఉన్నావు గానీ.. అక్కడ జూడ్రా ఎవర్రా అది’’ అన్నాడు. ‘‘ఏడ మావా!’’ అన్నాడు జగదీష్. ‘‘అదిగోరా అక్కడ ఎర్రచీర కట్టుకొని నారేత ఏస్తా ఉండాదే ఆ పిల్ల ఎవుర్రా’’ అన్నాడు సిద్ధయ్య. జగదీష్ ‘‘నీకు ఆ పిల్లతో ఏం పని మామా’’ అంటుండగానే ‘‘సెప్పరా అల్లుడా’’ అని బతిమాలాడు సిద్ధయ్య. ‘‘అబ్బో..! ఇందాక జగ్గా, నాయాలా అన్నావు, ఇపుడేమో అల్లుడూ అని వరసలు కలుపుతుండావే. మీ ఉన్నావోళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు మావా!’’ అన్నాడు జగదీష్. ‘‘ ఒరేయ్ సెప్పరా పుణ్యం ఉంటాది’’ అన్నాడు సిద్ధయ్య. ‘‘సరే ఏడవద్దు మావా సెప్తా. ఆ పిల్ల మాయత్తగదా రాజగోపాల్ మామ భార్య’’ చెప్పాడు జగదీష్. ‘‘అవునా దాని కలర్‌జూసి ముందే అనుకున్నాలే గాని, దాన్ని నారేత సరిగ్గా ఎయమనరా బాబు.. నా యంకే జూస్తా ఉండాది’’. అన్నాడు సిద్ధయ్య. ‘‘మావో! అదీ ఇదీ అనబాక మాయత్త ఆమె... చెప్పాననుకో చెప్పు ఇరిగిపోతాది నీకు. పాత సినిమాల్లో రాజనాల లాగా మట్టికరస్తావు’’ అంటూ కసిరాడు జగదీష్. సిద్ధయ్య ‘‘ఒరేయ్ నీకు రాజనాల కూడా తెలుసా’’ అని అడిగాడు. ‘‘మామా! మా ఇంట్లో మా నాయన పాత సినిమాలే పెడతాడు. చూసి చూసి ఆ పేర్లే వస్తాయి నానోటి నుంచి’’ అన్నాడు జగదీష్. ‘‘సరేగానీ మీయత్త నాయాకే జూస్తా ఉండాది ఎందుకంటావ్’’ అన్నాడు సిద్ధయ్య మురిసిపోతూ. ‘‘అబ్బా! ఈయన శోభన్‌బాబు అని మాయత్త వాణిశ్రీ అయిపోయా నీయంకే జూస్తాది.. నువ్వాపు మావా! సాలుగానీ’’ అన్నాడు జగదీష్. ‘‘అయితే ఎవురు సాయ జూస్తా ఉండాది ఆయమ్మి’’ అడిగాడు సిద్ధయ్య. దానికి జగదీష్ నాయంకే మావా’’ అన్నాడు. ‘‘ ఒరేయ్! పిల్ల నాయాలా! అత్తని లైన్‌లో పెట్టినావా... మీమావకి సెప్తా ఉండు’’ అని బెదిరించాడు సిద్ధయ్య. ‘‘మావో! నువ్వాపు!: మాయత్త గుట్కాపట్లం నాకాడ ఉండాదిలే అందుకని చూసి అడగతా ఉండాది’’ అని అసలు విషయం చెప్పాడు జగదీష్’’. అదా కతా...! ఆడోళ్ళు గూడా గుట్కాలు, సిగరెట్లు తాగిపారేస్తుండార్రా. నేను పుట్టినకాడ నుంచి ఇప్పటిదాక గుట్కా మొహమే జూల్లా తెలుసా’’ అని బీరాలు పలికాడు సిద్ధయ్య. దానికి జగదీష్ ‘‘పునె్న పురుషుడు బయలుదేరాడయ్య దేశం మీద! బాబురెడ్డి మావాళ్లతో కలసిమొందు తాగే సిద్ధయ్య ఎవురో! బ్రమ్మంగారి సిద్ధయ్య, లేకపోతే మనూరి కర్రిమొక్క సిద్ధయ్యా!’’ అని ఎగతాళి చేశాడు. ‘‘ ఒరేయ్ దొంగనాయాలా, గుట్కా తిననురా... మొందు పీకలదాకా తాగేస్తా’’ అన్నాడు సిద్ధయ్య. అప్పుడు జగదీష్ ‘‘అయితే పతివర్తలాగా మాట్లాడుతుండావే’’ అన్నాడు. ‘‘సరేగానీ, నీయబ్బ ఏమి ఈరోజు పనికి రాలేదు నిన్ను పంపించాడు’’ అడిగాడు సిద్ధయ్య. ‘‘మా నాయన దగ్గతా ఉండాడు మావా అందుకని గొడ్లుకాడికి ఆయన్ని పంపి పనికి నేను వచ్చినాను’’ అని చెప్పాడు జగదీష్. ‘‘బీడీలు తాగమను ఎధవనాయాలుని, ఎన్నిసార్లు జెప్పినా నీయబ్బ రోజుకి 2, 3 బీడీ కట్టలు తాగేస్తాడు’’ అని చెప్పాడు సిద్ధయ్య’’. ‘‘మమ్మల్ని ఏం జెయమంటావు మావా... ఆపడం లేదే.! కనీసం బీడీలు, సిగరెట్లు తయారుజేసే వాళ్లైనా అమ్మడం మానేస్తే సొగం శని వదల్తాది’’ అన్నాడు జగదీష్. ‘‘అదేం మాటరో.. బీడీలు, సిగరెట్లు, మందు అమ్మడం ఆపేస్తే గవర్మెంట్‌కి ఆదాయం ఎట్టా... డాక్టర్లకి చేతినిండా పని ఎట్లా!’’ అని చెప్పాడు సిద్ధయ్య. ‘‘వాళ్ల కోసం నాలాంటి పిల్లకాయల్ని బలి జేస్తా ఉండారే’’ అన్నాడు జగదీష్. ‘‘నీకేమిరా పని జేసుకొని బతుకు’’ అన్నాడు సిద్ధయ్య’’. మామా! నా ఈడోళ్లు జూడు మావా బడికి పోయి బాగా చదువుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. నా బతుకు ఎందుకు సెప్పు’’ అని బాధపడ్డాడు జగదీష్. ‘‘నిజమేరా జగ్గా నిన్ను బడికి పంపించాలని నాకూ ఉంది కానీ పంపించాలంటే మీ నాయన అప్పులన్నీ నేను తీర్చలేను, నేను తీరస్తానని చెప్పినా మీనాయన వద్దంటాడు. ఆత్మాభిమానం గల మనిషాయె’’ అని నిట్టూర్చాడు సిద్ధయ్య. ‘‘ఆత్మభిమానం కూడు బెట్టడం లేదులే మావా’’ అన్నాడు జగదీష్. ‘‘నువ్వే బడికి పోతానని ఏడవకూడదా! మీ అయ్య, అమ్మ దగ్గర’’ అన్నాడు సిద్ధయ్య. ‘‘మొన్న అయ్యోరు వచ్చినోడు మావా’’ చెప్పాడు జగదీష్. ‘‘ఎవుర్రా పిలకయ్యోరా, కర్రి అయ్యోరా’’ అడిగాడు సిద్ధయ్య. ‘‘కర్రి అయ్యోరులే మావా’’ అన్నాడు జగదీష్. ‘‘ఏమన్నాడు అయ్యోరు వచ్చి’’ అడిగాడు సిద్ధయ్య. ‘‘ఏమంటాడు పిల్లకాయల్ని బడికి పంపాల, పనికి పంపితే పోలీసులకి సెప్తానని బెదిరించాడు’’ అని చెప్పాడు జగదీష్. ‘‘అపుడు మీవాళ్ళు ఏమన్నారురా’’ అడిగాడు సిద్ధయ్య. రెండు రోజులు మా అమ్మ బడికి పోరా జగ్గా అన్నాది. రెండు రోజుల తరువాత పనికి పోతే సిగ్గా అన్నాది మావా!’’ అని వాపోయాడు జగదీష్. ‘‘ఒరెఁ ఒరెఁ మొండికెయరాదా.!’’ అన్నాడు సిద్ధయ్య. ‘‘ఇంట్లో కష్టాలన్నీ జూస్తా ఎట్టా మొండి కేసేది మావా’’ అని చెప్పాడు జగదీష్. ‘‘ఏం కష్టాలురాఁ తిండే కదా. మీ యబ్బ పనిజేస్తే చాలదా’’ అన్నాడు సిద్ధయ్య. ‘‘మాయక్కకి పెళ్ళి కుదిరింది మామా’’ చెప్పాడు జగదీష్. ‘‘ఎట్టెట్టా మీ యక్కకి పెళ్ళా ఒరేఁ. ఆ పిల్లకి 13 ఏళ్ళే కదరా’’ ఆశ్చర్యపోయాడు సిద్ధయ్య. ‘‘అవును మావా రేపు నెల్లోనే పెళ్ళి’’ అని జగదీష్ అంటుండగానే సిద్ధయ్య ‘‘మీ నాయనికి బుద్ధి లేదురా.. అయినా పెళ్ళి చేసేదానికి డబ్బెక్కడిదిరా మీకు’’ అడిగాడు. ‘‘ ఏముంది మామా ఆ ఉండే అర ఎకరా అమ్మి అల్లుడి మొహాన పెట్టేస్తున్నాడు.. తర్వాత నేను...’’ అని బాధపడ్డాడు జగదీష్. ‘‘పోనీలేరా మీ యక్కకే గదా! నువ్వు ఎక్కడి దాకా చదివావురా’’ అడిగాడు సిద్ధయ్య. అప్పుడు జగదీష్ ఐదు దాకా చదివాను మావా’’ అన్నాడు. ‘‘ఒరేయ్ ఐదు దాకా చదివితేనే నీకు ఇంత లోకగ్యానం ఎట్ట వచ్చిందిరా ఇంటి గురించి, బాధల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటున్నావు’’ విచిత్రంగా అడిగాడు సిద్ధయ్య. సదువు దేనికి మావా.. సంస్కారం ముఖ్యం మావా’’ చెప్పాడు జగదీష్. ‘‘మనూరి గవర్నమెంట్ బళ్ళో సంస్కారం గూడా నేర్పుతున్నారా ఏందిరా’’ అని ఎగతాళిగా అడిగాడు సిద్ధయ్య. ‘‘మావా! ఎగతాళి జేసింది సాలు గానీ, గవర్మెంటు బళ్ళో విలువలు, చదువు, సంస్కారం, ఆటలు, పాటలు అన్నీ నేర్పుతారు. అన్నింటికన్నా మించి స్వేచ్ఛ ఉంటాది మావా తప్పుడు ఆలోచనలకు మనస్సు వెళ్ళదు’’ వివరించాడు జగదీష్. ‘‘అబ్బా భలేసెప్తావ్ లేరాఁ.. పరివేటు బళ్ళో ఇయ్యన్నీ ఉండవా ఏంది.. మావాడు కూడా పరివేటు బడే.. అన్నీ పనులు సేస్తాడు’’ అని దెప్పి పొడిచాడు సిద్ధయ్య.
‘‘అవును మావా! మీవోడు అన్నీ పనులు చేస్తాడు.. మొన్న విజయత్త 100 రూపాయలిచ్చి అంగడికి పోయి సామాను తెమ్మంటే చిల్లర తక్కువ తెచ్చినాడంట. అత్తకి కోపం వచ్చి మీ వోన్ని కూడికలు కూడా రావా ఎధవా అని దంచి పారేసిందంట. అంగడికి పోయి అడిగితే అంగట్లో రామబావ ‘‘మీ వోడికి లెక్కలేరావు. మర్యాద తెలియదు. ఏ వస్తువు ఎందుకు వాడతారో తెలియదు. బడికి పోయి అడుగు విజయక్కా’’ అన్నాడంట. ఇంక ఇంటికొచ్చి అత్త మీ వోన్ని జాతరలో దెయ్యం బట్టినామెలాగా శివాలెత్తేసింది’’ అని చెప్పాడు జగదీష్. ‘‘ఒరేయ్ నాకియ్యన్నీ తెలియదే.. అయినా ఆ పరివేటు బడోళ్ళు నా పరువు తీసిండారే.. వెళ్తా వెళ్ళి కడిగిపారేస్తా వాళ్లని’’ ఉద్రేకంతో అన్నాడు సిద్ధయ్య. ‘‘మావో! ఎగిరింది సాలు గానీ ఆగాగు.. ఆ పని నీ భార్య ఎప్పుడో జేసింది. పరివేటు బడోళ్ళు ఏమన్నారో తెలిస్తే షాకవుతావు తెలుసా’’ అన్నాడు జగదీష్. ‘‘ ఏమన్నార్రా! సెప్పరా స్వామీ!’’ అడిగాడు సిద్ధయ్య. మీవోడు మాట ఇనడంట, సదువేరాదంట, అచ్చరం ముక్కరాదు.. వీన్ని మేం ఏగలేం.. గవర్మెంటు బళ్ళో చేర్చుకోండి అన్నారంట’’ అని మాటల్లో వ్యంగ్యాన్ని రంగరించి పలికాడు జగదీష్. కోపంతో ఊగిపోయిన సిద్ధయ్య ‘‘ ఎవుర్రా సెప్పింది నా బిడ్డకి సదువు రాదని... ఎ, బి, సి, డిలు టకటకా సదువుతాడు, మమీ, డాడీ అంటాడు. ఇంకేం కావాలి వాళ్ళకి.. అయినా.. నాకు తెలియక అడగతా.. 6 సంవత్సరాల నుంచి వాళ్ళబళ్ళోనే కదా సదివిచ్చేది. ఏంట్రా నాకీ బాధ జగ్గా’’ అన్నాడు చివరికి దీనంగా. ‘‘మామా నువ్వు బేబీ క్లాసు నుంచి నాలుగో తరగతి దాకా ఈడే సదివిచ్చావు కదా.. అచ్చరం ముక్క రాదన్నారంట ఎట్ట మావా! నీకేమి తెలుసుకానీ..! నేను ఒక మాట సెప్తా ఇను. మీవోడ్ని గవర్మెంటు బళ్ళో చేర్చు. సంవత్సరం తిరిగేకల్లా కొంచెం సదువు, కొంచెం లోకజ్ఞానం వస్తాది’’ అన్నాడు జగదీష్.
‘‘ఓయమ్మో! ఇంకేమైనా ఉందా! ఊరి పెద్దని నేను గవర్మెంటు బళ్ళో నాకొడుకుని జేరిస్తే తలెత్తుకొని తిరగ్గలనా... నువ్వుండ్రా పిల్ల నాయాలా’’ అన్నాడు సిద్ధయ్య. ‘‘అంతే మామా! దేవుడికి మనసే లేదు’’ అన్నాడు జగదీష్. ‘‘ ఏం రా అలా అంటావు’’ అడిగాడు సిద్ధయ్య. ‘‘కాకపోతే ఏంది మావా, సదువు బాగా వచ్చినోడికి అంటే నాలాంటి వాడికి బడికి పొయ్యే ఊసే లేదు. సదువురాని మీవోడిలాంటోడికి అన్నీ అవకాశాలుండాయి. ఎన్ని ఉన్నా సదువు ఎట్టా వస్తాది. అదేమైనా అంగట్లో వస్తువా ఏంది. పరివేటోళ్ళు వ్యాపారం జేసినంతమాత్రన ప్రపంచకంలో ఉండే మొద్దుపిల్లకాయల తండ్రుల చేతిలో తన్నులు తినక తప్పదు’’ అని తన మనసులోని నిరాశావాదాన్ని వెల్లిబుచ్చాడు. సిద్ధయ్య వెంటనే ‘‘నీకు చదువుకోవాలనుందా జగ్గా’’ అని అడిగాడు ‘‘నాకు సదువుకోవాలనుంది మావా! మనూరి బళ్ళో అయ్యోర్లు బాగా సెప్తారు. మంచి విషయాలు, లోకజ్ఞానం తెలస్తాది. నువ్వైనా మా వాళ్లకి సెప్పి బళ్ళో సేర్చు మావా’’ అని బతిమాలాడు జగదీష్. సిద్ధయ్య బాధపడుతూ ‘‘అట్టాగేలేరా నిన్ను సదివిత్తాలేఁ.. మీ అయ్య పనికి బోతే సాల్లే..!’’ అని ధైర్యం చెప్పాడు. అప్పుడే కట్టమీది నుంచి చెంగల్రాయులు కేక వినిపించింది. సిద్ధయ్య ‘‘ ఒరేయ్! చెంగల్రాయుడు అరుస్తున్నాడు ఏంటో అడిగి రారా’’ అని జగదీష్‌ని పంపాడు. జగదీష్ కట్ట దగ్గరికి వెళ్ళాడు. చెంగల్రాయులు ‘‘ఒరేయ్ జగ్గా! సిద్ధమావనే రమ్మనురా, అర్జెంటు అని చెప్పు’’ అని జగదీష్‌ని తిప్పి పంపాడు. జగదీష్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ‘‘మామా! నీతోనే మాట్లాడాలంట. అర్జెంటు అంట. మీ సీక్రెట్‌లు ఏమో నాకు చెప్పరు గదా మీ పెద్దోళ్ళు’’ అన్నాడు. సిద్ధయ్య హడావుడిగా వెళ్ళాడు. ‘‘ ఏరా చెంగా! ఏంది విషయం’’ అన్నాడు. చెంగల్రాయులు ఏడుస్తూ ‘‘మావా జగదీష్ వాళ్ల నాయన చచ్చిపోయినాడు. వాడిని జాగ్రత్తగా తీసుకురా’’ అన్నాడు. ఆ మాటతో సిద్ధయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అయ్యో! పాపం, జగ్గాగాడు చదువు కోవాలనుకున్నాడు.. వాడికి నేను ఎట్టా సెప్పేది అని ఆలోచిస్తూ కాలువలో పడబోయాడు. అప్పుడు జగదీష్’’ ఏంది మామా కత ఏదో సీక్రెట్ మాట్లాడినట్లున్నారే... మొందు పార్టీయా’’ అన్నాడు. సిద్ధయ్యకి ఏడుపు ఆగలేదు. గట్టిగా ఏడ్చేసి జగదీష్‌ని గట్టిగా పట్టుకున్నాడు. ‘‘మామా... ఏమైంది... ఎందుకు ఏడుస్తున్నావ్... సెప్పు మావా.. ఏమైందో సెప్పు మావా! అంటూనే జగదీష్ నడుస్తున్నాడు.
ఇంటికి వెళ్ళగానే జగదీష్ వాళ్ళ అమ్మ ఒరేయ్ జగ్గా మీనాయన ఇంక లేడురా అంటూ ఏడ్చేసరికి, జగదీష్ గుండె రాయిలా మారిపోయింది. కాసేపటి తర్వాత వాళ్ళమ్మని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాడు జగదీష్. సిద్ధయ్య ‘‘ఏడవద్దురా జగ్గా’’ అని పైన చెయ్యివేశాడు. ‘‘మామా నువ్వు కూడా బీడీలు తాగొద్దంటే మానాయన వినకపోయెనే. ఇప్పుడెవురు మావా బాధపడేది, మాయక్క పెళ్ళి ఎట్టా సెయ్యాలో. నాకా సదువు లేకపోయె.. ఎందుకు మావా నా బతుకు’’ అంటూ బోరున విలపించాడు జగదీష్. ‘‘ఒరేయ్ జగ్గా, నా దగ్గర పని చేసుకొని బతుకు. నీ ఇల్లు గడిచేదానికి కావలసిన డబ్బు ఇస్తా. మీ యక్క పెళ్ళి జేస్తా సరేనా.. నీ అర ఎకరా దున్నుకొని బతుకుదువులే. బాధపడకురా నేనున్నాలే’’ అని సిద్ధయ్య అక్కున చేర్చుకున్నాడు.
ఇలా ఎంతోమంది పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. లేత భుజాలపై కుటుంబ భారం పడితే వారి పరిస్థితి ఎంత దుర్భరమో ఆలోచించేందుకే కష్టంగా ఉంది. కానీ అనుభవిస్తున్న పిల్లలకెలా ఉంటుందో..! ‘‘పిల్లలు బడికి-పెద్దలు పనికి’’.

- యర్రాబత్తిన మునీంద్ర, నాయుడుపేట చరవాణి : 8331844527