విజయవాడ

బుచ్చిబాబు జీవన చిత్రాలు (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ శతాబ్ది నాది’- అని మహాకవి చెప్పుకున్నాడంటారు ఘనత వహించిన కొందరు వీర కమ్యూనిస్టులు. ఈ శతాబ్దంలో నాకూ భాగముందని బుచ్చిబాబు భావిస్తాడని నేనంటాను. విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. నాకెప్పుడూ ప్రభుత్వ విధానాల మీద, దాని తెలుగు భాషాభిమానం మీద నమ్మకం లేదు. చాలాకాలం తరువాత సమర్థ అధికారిగా వచ్చిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ దీర్ఘాశి విజయభాస్కర్ స్వతహాగా రచయిత కావటం, ఏ పుస్తకం ప్రచురిస్తే పాఠకులు ఆదరిస్తారనే విషయం తెలిసిన వైద్యుడు కావటంతో తాజాగా ప్రచురించిన బుచ్చిబాబు జీవన చిత్రాలు (160 పేజీలు) పుస్తకం బహు పసందుగా వచ్చింది. ఆధునిక తెలుగు సాహిత్యకారులలో శివరాజు వెంకట సుబ్బారావు (బుచ్చిబాబు) మొదటి వరుసలో ఉంటారు. కథకుడు, నవలాకారుడు, వ్యాస రచయిత, గొప్ప అనువాదకుడైన బుచ్చిబాబు శత జయంతి సందర్భంగా ప్రచురించిన ఈ పుస్తకంలో ఆయన జీవన శైలి ఉన్నదున్నట్లు కనిపిస్తుంది. 75 నుంచి 160 పేజీల వరకు అనేక మంది సాహితీమూర్తులు, పండితులు, భాషావేత్తలు ఫొటోల రూపంలో కనిపిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ ప్రారంభ కాలంనాటి చిత్రాలు కూడా మనం దొరకబుచ్చుకోవచ్చు. ఆయనతో పరిచయం వున్నవారి ఆలోచనలు, ఆయనను కలిసిన వారి జ్ఞాపకాల దొంతరలను మనమూ పంచుకోవచ్చు. బుచ్చిబాబు గారి శ్రీమతి తొమ్మిది పదుల వయస్సులోనూ తన జ్ఞాపకాలను అమూల్యంగా గుదిగుచ్చటం దీనిలోని మరో విశేషం. ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు, ఆర్‌ఎస్ సుదర్శనం, డాక్టర్ యుఎ నరసింహమూర్తి, విహారి, శ్రీవాత్సవ, తదితరుల వ్యాసాల ద్వారా బుచ్చిబాబు జీవనరేఖలను మనం తిలకించవచ్చు. బాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన రెండో పుస్తకం ‘బుచ్చిబాబు నాటికలు’. ఇందులో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ గారి ముందుమాట అదనపు ఆకర్షణ. 340 పేజీల ఈ పుస్తకంలో 16 నాటికలు ఉన్నాయి. ఇవి గతంలో అనేక ప్రచురణ సంస్థలు ప్రచురించినవే అయినా బుచ్చిబాబు అభిమాన పాఠకుల సౌలభ్యం కోసం ఒకేచోట మరోసారి వీటికి స్థానం కల్పించారు. మల్లీశ్వరి చిత్రానికి ఆధారమైన రాయలకరుణ కృత్యం, అనేక బహుమతులు పొందిన ఉమర్ ఖయాం, మధుర తరంగం, రాజమార్గం, తదితర నాటికలు ఇందులో ప్రచురించారు. ఇవన్నీ ప్రదర్శనకు అనుకూలమైనవే. అన్ని పుస్తకాల దుకాణాల్లోనూ ఇవి దొరుకుతాయి.

బుచ్చిబాబు నాటికలు
పేజీలు : 340, వెల : రూ. 300
బుచ్చిబాబు జీవన చిత్రాలు
పేజీలు : 160, వెల : రూ. 200
దొరికేచోటు: ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయం, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, దుర్గాపురం, విజయవాడ- 520003

- వేలూరి కౌండిన్య, చరవాణి : 9392101586