నెల్లూరు

కడుపుకోత (బోరుబావిలో పడి మృతి చెందిన చిన్నారికి నివాళి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోరు వేసిన రైతుకి నీళ్లు పడితే
కళ్లల్లో ఆనందభాష్పాలు
నీళ్లు పడని బోరు నోరు తెరచి
మృత్యుకుహరమై
చిన్నారిని మింగేస్తే..?
అమ్మనాన్నల కళ్లల్లో అశ్రుజలాలు..
చీకటి కుహరంలో చిన్నారి
ఒంటరిదై.. ఉక్కిరిబిక్కిరై..
ఊపిరాడని పరిస్థితిలో..
అమ్మ పిలుపు విన్నా చెయ్యి అందుకోలేని
దౌర్భాగ్యపు విధి దాడికి బలి అయినావా చిన్నారి..?
నీ బోసినవ్వుల తలపు
నీ భవితపై మీ అమ్మ కలలు
బుడిబుడి నడకలు
చిన్నిచిన్ని ముద్దుల మాటలు
ఇక కనబడవా..వినపడవా..?
బోరు మింగిన నీ జీవమెక్కడ..?
బోరుబోరున విలపిస్తున్న
అమ్మ కడుపుకోతకు అంతమెక్కడ..?
అన్నిదారులు మూసుకుపోయి
ఏ దారి నిన్ను రక్షించలేని
సాంకేతిక పరిజ్ఞానమే తలవంచుకొని
నిశబ్ధంగా స్తంభించి పోయిందా..?
అమ్మ నీకు జన్మనిచ్చి పుడమిపైకి తెచ్చింది
ఆ పుడమే నిన్ను మింగేసిందా..?
నీవు బ్రతకాలని అమ్మపాలు తాగాలని
అమ్మ ఒడిలో సేదతీరాలని
ఎందరెందరో దేవుని మొక్కారు
అమ్మగర్భం నుండి బయటపడిన నీవు
భూగర్భంలోకి జారిపోయి..
భద్రంగా ఉన్నావనుకొన్నప్పుడు
చితికి చిధ్రమై బయటపడ్డావా తల్లీ..
ఎంతమంది కార్చిన కన్నీళ్లతో..
లోకమే శోకమయమైపోగా..
నీవు ఇక రావని తెలిసి ఆ ఆకాశం గూడా
బోరున ఏడ్చింది...
బోరుబావిలో నీ జీవితం ముగిసింది...
- కంచనపల్లి ద్వారకనాథ్
చరవాణి : 9985295605

మంత్ర ప్రక్రియ

ఎవరో మంత్రించినట్లు నడుస్తోందీ ప్రపంచం
ప్రేమ గానాల మాటున ఏదో రహస్యాన్ని దాచి
మనిషిని ప్రపంచం మధ్య బొడ్రాయిలా నిల్పి
పూరేకుల్ని వెదజల్లినట్లు
కుటుంబాన్ని చల్లుకుంటూ వెళ్లిపోతున్నారు
మంత్రించిన వాళ్లెవరో పులకించిపోతున్నారు
ప్రాపంచిక ఫలాల్నెవరో అనుభవిస్తున్నారు
ప్రవహిస్తున్న జీవనదుల్లో
నల్లమందులాంటిదేదో కల్పి రహస్యంగా
మనిషిని తన వైపు తిప్పుకుంటున్నారు

చేపలు తోమినట్లు నక్షత్రాల్ని తోమి
ఆకాశంలో రోజూ ఎగరేసి నవ్వుకుంటున్నారు
రంగు రంగుల కాంతుల్ని వెదజల్లుకుంటూ
కాలాన్ని పక్షవాతం బారిన పడకుండా చేస్తూ
పగలూ రాత్రుళ్ల కొప్పుల్లో పారిజాతాలు తురిమి
ఏవో రాగజ్వాలల్ని ఆలపించుకుంటూ
ఎక్కడినుంచో రహస్యంగా మంత్రజపం
చేసుకుంటూ
ఈ మానవ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు
నిద్రామెలకువల మధ్య తెరలు కట్టి
నియంత్రిస్తున్నారు

జీవశిబిరాల మీద మంచులాంటి
మంత్ర పుప్పొడి చల్లబడుతూ ఉంది రోజూ
ఆయుధాలు పట్టుకుని యుద్ధం చేస్తున్న వాళ్లంతా
మంత్రవలయంలో చిక్కుకున్న వాళ్లే
సప్త సముద్రాలు ఉప్పగా మారటం కూడా
ఈ మంత్ర ప్రక్రియలోని భాగమే
ఏళ్ల తరబడి ఇలా సాగుతూనే ఉంది
నేను తప్ప ఎవరూ
పసిగట్టిన దాఖలాయే లేదు
మంత్ర రహస్యాన్ని ఛేదించిన వాడిని
ఎప్పటికయినా ఆ మంత్రదండాన్ని
చేజిక్కించుకుంటాను
గుండెకు హత్తుకుని నన్ను నేను
సత్కరించుకుంటాను
లేదా నేనే మంత్రపుష్పంలా
మారిపోతాను
- ఖాదర్‌షరీఫ్, సోమశిల
చరవాణి : 9441939140