సాహితి

ఇనప్పెట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటలొచ్చిన ఇనప్పెట్టిలో
దస్తావేజులెందుకుంటాయి
కట్టలు కట్టిన ఆత్మలుంటాయి కాని

రహస్య బిలంలాంటి మా ఇనప్పెట్టి
అరల్లోపలి అరల్లో ఎక్కడో
బొమ్మలేవో వేసుకుంటూ
నా చిన్నప్పటి నేను కూర్చునే ఉంటాను

అందులో
నానమ్మ మట్టి గాజులతో
తాతయ్య ఆడుకునే శబ్దాలు
ఊరొదలి వలసపోయిన వాళ్లు దాచుకున్న
తడి ఆరని జ్ఞాపకాల పేగులు
ఆ బండకు పూచిన గుండెకు చెవి ఆనిస్తే
తరాలు తరలిపోయిన కలకలల అలికిడి

అది నా శరీరం..నేను దాని ఆత్మ
ఊళ్లో నేను బలాదూరైతే
అది ఇంట్లో కదలకుండా గెంతులేసింది
అమ్మ ఏడ్చినప్పుడు నేను వణికిపోతే
ఇనప్పెట్టే నన్ను చేతుల్లోకి తీసుకునేది
బడెగ్గొట్టి ఆటలకి పోవాలంటే
నా పుస్తకాల సంచి వీపుకి తగిలించుకుని
ఏమీ ఎరగనట్టు ఇకిలించేది

ఊరంతా మోయలేని ఇనప్పెట్టి
నేనెళ్తే చాలు
అరచేతుల్లోనో భుజాలమీదో
రెప్పల మీదో.. చటుక్కున వాలిపోతుంది
అప్పుడు నేను ఇనప్పెట్టిగా మారితే
అది తాళం చెవిలా నాలో
తలుపులన్నీ తెరిచి నవ్వుతుంది

దాన్ని తెరిస్తే చిన్నప్పటి మైసూరెడ్లు
కొమ్ములు బైటపెట్టి నా రొమ్మును ముద్దాడతాయి
దొడ్లో ఇప్పుడు లేదుగానీ
ధాన్యం గాది మా ఇనప్పెట్టిలో మాత్రం
గుడ్లు గుడ్లుగా వొడ్లు పొదుగుతుంది

దీని లోహ చర్మంలో
ఏ తీర్థానికో ఇంటికి చందాకొచ్చిన మేజువాణి
ఇంకా గుబాళిస్తుంది
ఇది పెట్టి కాదు
ఆరని ఇనప అగరబత్తి

వీధుల్లో కత్తులూ బరిసెలూ
కక్షలు కక్కి నెత్తురు చిమ్మితే
దాని ఇనప కళ్లకు కమ్మిన నీరు
నేను మాత్రమే చూసాను

అక్కడ పుట్టి ఇప్పుడెక్కడో తిరుగుతున్నాం
అది మాత్రం మా జ్ఞాపకాల గిలక్కాయను
కడుపులో దాచుకుని అప్పుడప్పుడూ
ఒంటరి అమ్మానాన్నలను ఆడిస్తుంది

ఇప్పుడు ఊళ్లో ... ఇంట్లో..
ఒక మూల అమ్మ...ఒక మూల నాన్న..
ఒక మూల ఇనప్పెట్టి.

- ప్రసాదమూర్తి, 8499866699