రివ్యూ

మార్పులేని మాస్ మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** ఏజెంట్ భైరవ

తారాగణం: విజయ్, కీర్తి సురేష్, జగపతిబాబు, డేనియల్ బాలాజీ, అపర్ణా వినోద్, రోషన్ బషీర్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాత: బెల్లం రామకృష్ణ
దర్శకత్వం: భరతన్‌కమర్షియల్

కథకి నట్‌లూ బోల్ట్‌లూ ఉంటాయ్. అంటే ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటాయన్నమాట. అదే చట్రంలో కథ కదలకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. దీన్ని నిందించలేం. అలాగని చూస్తూ భరించలేం. కానీ- చూడక తప్పదు. విజయ్‌లో ఏదో స్పెషల్ ఎట్రాక్షన్ ఉండటంవల్ల.. కళ్లప్పగించి అలా చూస్తూనే ఉండిపోతాం. కథ గురించిన ప్రస్తావన ఉండదు. రీళ్లకు రీళ్లు కళ్ల ముందు కదిలిపోతూ ఉంటాయి. ఏ ‘మాస్’ కథలోనూ ఈ ఈక్వేషన్ దెబ్బతినదు. దర్శకుడు భరతన్ కూడా -ఒక సామాజికాంశాన్ని తలకెత్తుకొని.. ఆ చట్రంలోనే కథని ఎంతో సాదాసీదాగా నడిపించేశాడు.
భైరవ (విజయ్) చెన్నైలోని ఓ బ్యాంక్‌లో కలెక్షన్ ఏజెంట్. ఇతగాడి టార్గెట్ అంతా రౌడీ మూకలతోనే. వాళ్ల దగ్గర నుంచీ మనీ రికవరీ చేయటం. మాధవీలత (కీర్తి సురేష్) తిరునల్వేలీలోని ఓ మెడికల్ స్టూడెంట్. బ్యాంక్ మేనేజర్ కూతురి పెళ్లిలో మాధవిని చూసి మనసు పారేసుకుంటాడు భైరవ. ఆమె చెన్నై వదిలి వెళ్లిపోతూండగా - బస్టాండ్‌లో లవ్ ప్రపోజల్ పెట్టబోతూంటే.. మాధవిని ఒక గ్యాంగ్ చుట్టుముడుతుంది. ఆమెని మట్టుబెట్టాలని చూస్తారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందన్నది ఆరా తీస్తాడు భైరవ.
పీకే అలియాస్ పిడకల కోటయ్య (జగపతిబాబు) దీనికంతటికీ కారణమని తెలుస్తుంది. పీకే తెర వెనుక ఓ క్రిమినల్ డాన్.. తెరపైన రాజకీయ నాయకుడు. అతడి కుడిభుజం వీరన్ (డేనియల్ బాలాజీ). మాధవీలత చదివే మెడికల్ కాలేజీలో కనీస సదుపాయాలుండవు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు ఉండరు. మాధవి ఫ్రెండ్ వైశాలి (అపర్ణ) ‘ఎంసిఐ’కి ఈ విషయంగా కంప్లైంట్ చేయటంతో ఈ మెడికల్ కాలేజీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. ఎంసిఐతో పీకే డీల్ కుదుర్చుకుంటాడు. ఫలితంగా వైశాలి అనూహ్య రీతిలో మరణిస్తుంది. మాధవి తండ్రి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. వైశాలి మరణం వెనుక పీకే కుట్ర ఉన్నట్టు ఇనె్వస్టిగేషన్‌లో తెలుస్తుంది. ఐతే మాధవి తండ్రిని కూడా పీకే ముఠా హతమారుస్తుంది. మాధవి కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది- తన తండ్రి మరణానికి కారణకుడైన పీకేపై.
ఈ కథంతా తెలుసుకొన్న భైరవ -ఏం చేశాడన్నది సెకండ్ హాఫ్.
వైశాలి మరణానికి కారకుడైన పీకేపై ఎలా పగ తీర్చుకొన్నాడు? భైరవని ఎదుర్కోటానికి పీకే పన్నిన పన్నాగం ఏమిటి? ఇత్యాది అంశాలతో క్లైమాక్స్ ముగుస్తుంది.
కమర్షియల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలో అన్నింటినీ జొప్పించి.. కథని అనేకానేక మలుపులు తిప్పి.. విజయ్ ‘మాస్’ విశ్వరూపాన్ని మళ్లీ తెర కెక్కించారీ చిత్రంతో. ఈ సినిమాని ‘మాస్’ కోణంలోంచి చూడాలి తప్ప.. మరే విధంగా చూసినా.. బోర్ కొట్టేస్తుంది. అంటే ముందుగా ‘మాస్’కి ఫిక్స్ అయిపోతే.. ఇక ఏ గొడవా ఉండదు. ఇది విజయ్ 60వ చిత్రం కావటం విశేషం. ‘60’వ చిత్రం కోసం 10 మంది దర్శకులు విజయ్‌ని కలిశారు. తన ప్రతి మూడవ సినిమా ‘డిఫరెట్’ యాంగిల్‌లో ఉండేలా చూసుకోవటం విజయ్ ప్రత్యేకత. కాబట్టి పక్కా ‘మాస్’కి తెర మీదికి వచ్చిందీ చిత్రం.
నటనాపరంగా - విజయ్‌ని పక్కనబెడితే.. కీర్తి సురేష్ తన గ్లామర్‌తో నటనతో ఆకట్టుకొంది. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ జగపతిబాబు. పోటాపోటీగా నటించాడు. డేనియల్ బాలాజీ, అపర్ణా పాత్ర పరిధి మేరకు నటించారు. ‘మాస్’ మసాలాగా రూపొందించిన ఫైట్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. సంగీతం ఫర్వాలేదు. స్క్రీన్‌ప్లే ఓకే. ఐతే - ఎంత మాస్ కథ అయినప్పటికీ.. ముందుగా కథ తెలిసిపోతూంటే.. ప్రేక్షకుల్లో థ్రిల్ ఉండదు. ఇక్కడా అదే జరిగింది. సన్నివేశం జరగకముందే ఆ తర్వాత ఏం జరగబోతోందో ఇట్టే అర్థమై పోతూంటుంది. ఆ లోపాన్ని సవరించి.. కాస్తంత సస్పెన్స్‌ని జోడించి ఉంటే.. ఈ ‘మాస్’ చిత్రం ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేది.

-బిఎనే్క