మెయన్ ఫీచర్

‘సరిహద్దు’ను దిగమింగిన వాణిజ్య ‘బంధం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిక్కింలోని నాథులా కనుమ మార్గం గుండా ‘సీమాంతర’ వా ణిజ్యాన్ని పునరుద్ధరించడం వల్ల చైనా ‘చొరబాటు’ మరింత విస్తరించిందన్నది ధ్రువపడిన సత్యం! ఈ ‘చొరబాటు’ వా ణిజ్య దురాక్రమణ, వ్యూహాత్మాక దురాక్రమణ. ఇప్పుడు ‘సిక్కిం- భూటాన్’లలో విస్తరించి ఉన్న డోక్‌లా-డోక్‌లామ్-పచ్చిక మైదానంపై చైనా దళాలు జరిపిన భౌతిక దురాక్రమణకు ఈ వాణిజ్య దురాక్రమణ పూర్వ రంగం. శత్రు దేశమైన చైనా మనకు వాణిజ్య మిత్రదేశంగా అవతరించడం అంతర్జాతీయ సమాజం ఆశ్చర్య చకిత అయి తిలకిస్తున్న విస్మయకర పరిణామం. క్రీస్తుశకం 1989లో అంకురించిన ఈ విపరిణామానికి ఫలితం చైనా వస్తువులు మన జాతీయ జీవనాన్ని ముంచెత్తుతుండడం! చైనా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది! 2009 వరకు అమెరికా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. ఆ తరువాత చైనా ఈ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఆక్రమణకు దోహదం చేస్తున్న పరిణామ చరిత్రలో పదునాలుగేళ్ల క్రితం నాథులా కనుమ మార్గపు ‘ద్వారాలు’ తెరచుకొనడం కీలకమైన ఘట్టం! అనాదిగా నాథులా కనుమ మార్గం గుండా వ్యాపారులు, తీర్థ యాత్రికులు పయనించారు. గత రెండు వేల ఐదు వందల ఏళ్లుగా నాథులా కనుమ ‘్భరత్-టిబెట్’ దేశాల మధ్య అనుసంధాన పథం!బ్రిటన్ దురాక్రమణ సమయంలో మళ్లీ మనదేశం నుండి విడివడిన ‘సిక్కిం’ 1974లో తిరిగి మన దేశంలో స్వచ్ఛందంగా కలిసిపోయింది. స్వతంత్ర దేశమైన టిబెట్‌ను 1959లో చైనా దురాక్రమించింది. 1962లో మనదేశాన్ని చైనా దురాక్రమించింది. ఈ దురాక్రమణ సమయంలో నాథులా కనుమ మార్గం మూతపడింది! మూతపడిన కనుమ మార్గం మళ్లీ తెరుచుకొనడం వల్ల కనుమకు ఇరువైపులా ఉన్న చిన్న వ్యాపారులకు ‘ఉపాధి’ పెరగుతుందన్నది జరిగిన ప్రచారం! కానీ ఈ ‘వాణిజ్య చర్య’ సిక్కిం, భూటాన్ సరిహద్దులను దురాక్రమించడానికి చైనా అమలు జరుపుతున్న దీర్ఘకాల దుస్తంత్రంలో భాగమని ఇప్పుడు ధ్రువపడింది! ‘డోక్‌లా’ పచ్చిక మైదానం తమదని చైనా కొత్త పేచీ పెట్టింది, అబద్ధాలను చారిత్రక సాక్ష్యాధారాలుగా ప్రచారం చేస్తోంది! ఈలోగా నాథులా కనుమ గుండా కుప్పలు తెప్పలుగా నాసిరకం వస్తువులు, అక్కరలేని దినుసులు చైనానుండి మన దేశంలోకి వచ్చిపడ్డాయి! గణపతి విగ్రహాలను మొదలుకుని గాలిపటాల-పతంగ్‌ల-ను ఎగురవేయడానికి ఉపయోగించే ‘దారం’-మాంజా- వరకూ చైనా నుండి దిగుమతి చేసుకున్న మనం ఈ వాణిజ్య దురాక్రమణను ప్రోత్సహించాము! ఈ ‘విషపు దారం’ వేలాది పక్షులను గాయపరిచి చంపింది. వందలాది జనాలను గాయపరిచింది! చైనా మనకు అతిపెద్ద ‘వాణిజ్య భాగస్వామి’.. మనదేశం చైనాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాలేదు! చైనాకు మన వస్తువులు పెద్దగా ఎగుమతి కావడం లేదు, చైనా వస్తువులు మనదేశాన్ని ముంచెత్తుతున్నాయి! అందువల్లనే చైనాతో వాణిజ్యం వల్ల మనకు సాలీనా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల లోటు ఏర్పడి ఉంది. అంటే రెండు లక్షల కోట్ల రూపాయల దేశ ప్రజల శ్రమార్జిత ధనం విదేశీయ వినిమయ ద్రవ్యం- ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ- రూపంలో చైనాకు తరలిపోతోంది.. దీన్ని ఎందుకని నిరోధించలేకపోతున్నాము? చైనా వస్తువులను ఎందుకు నిషేధించలేకపోతున్నాము?
జవహర్‌లాల్ నెహ్రూ మన ప్రధాన మంత్రిగా ఉండిన సమయంలో ఈ కమ్యూనిస్టు ‘నవ’ చైనాకు ‘ఐక్యరాజ్యసమితి’లో సభ్య త్వం ఇప్పించడానికి 1962 వరకు నిరంతరం కృషి చేసాడు. కమ్యూనిస్టు ‘నవ’ చైనాకు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేకపోవడం వల్లనే ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతోందని విశ్వశాంతి స్థాపనకు సరైన మార్గం చైనాకు ‘సమితి’లో శాశ్వత సభ్యత్వం కల్పించడమని నెహ్రూ పదే పదే వాక్రుచ్చినట్టు చరిత్ర చెబుతోంది. నెహ్రూ విదేశాంగ మంత్రిత్వ శాఖను స్వయంగా నిర్వహించాడు! అందువల్ల ఇతర దేశాల విదేశాంగ మంత్రులు మనదేశానికి వచ్చినప్పుడు ఆయన స్వయంగా స్వాగతం చెప్పేవాడు. 1950వ దశకంలో ఆఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రి ఒకరు పర్షియా సింధుశాఖ దేశాలలో పర్యటించాడు. తిరిగి కాబూల్‌కు వెడుతూ విమానం మారడం కోసం కొంతసేపు ఢిల్లీలోని ‘పాలం’ విమానాశ్రయంలో వేచి ఉన్నాడు. మన ప్రధాన మంత్రి నెహ్రూ విదేశాంగ మంత్రి హోదాలో ‘పాలం’ విమానాశ్రయానికి వెళ్లి, ‘మన దేశంలో పర్యటనకు రాని’ ఆ అఫ్ఘానిస్థాన్ మంత్రితో ఇష్టాగోష్టిగా ‘ప్రపంచ శాంతి’ సమస్యలు చర్చించినట్టు చరిత్ర సాక్ష్యం చెబుతోంది. ఈ ‘చర్చల’లో ప్రధాన అంశం కమ్యూనిస్టు చైనాకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఇప్పించడం.. ఇందుకు చైనా చూపిన ‘కృతజ్ఞత’ మనదేశంపై 1962లో దురాక్రమణ జరపడం...
పనిలేని పిచ్చయ్య గండుపిల్లికి స్నానం చేయించినట్టుగా ముత్తాతగారి వారసత్వాన్ని రాహుల్ గాంధీ అనే ‘రాజకీయ హాస్యకారుడు’ ఇప్పుడు నిలబెడుతున్నాడు. కాంగ్రెస్ వంటి రాజకీయ పక్షానికి జిల్లా స్థాయి అధ్యక్షుడిగా ఉండడానికి కూడా పనికిరాని రాహుల్ గాంధీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉండడమే ఆ సంస్థకు దాపురించిన దౌర్భాగ్యం.. ఇది ఆ సంస్థ అంతర్గత విషయం కావచ్చు. కానీ దశాబ్దికిపైగా తన విచిత్ర వికృత విన్యాసాలతో రాజకీయ వ్యవస్థను అపహాస్యం పాలు చేయడానికి యత్నిస్తున్న ఈ ‘అనభిజ్ఞుడు’ ప్రతిసారీ తానే నవ్వులపాలవుతున్నాడు! ఇలా నవ్వులపాలు కావడంలో మరో ఘట్టం ఇతగాడు వెళ్లి చైనా రాయబారిని కలసి రావడం! ఢిల్లీలోని చైనా రాయబారి ‘లావూ జావో హుహై’ని తాను కలవనే లేదని దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పడం, పట్టుబడిన తరువాత ‘కలిస్తే తప్పేమిటి?’ అని బూకరించడం రాహుల్ గాంధీ ‘ఆషామాషీ’ తనానికి మరో నిదర్శనం! ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో చైనా అధ్యక్షుడు ఝీజింగ్‌పింగ్‌ను కలవలేదా?’ అని రాహుల్‌గాంధీ ప్రశ్నించడం అజ్ఞానానికి అహంకారానికి పరాకాష్ఠ! ఇతగాడి తండ్రి రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి హోదాలో 1988లో చైనాకు వెళ్లి రావడం ఇలా చైనా వస్తువులు మన దేశాన్ని ముంచెత్తుతుండడానికి శ్రీకారం! ద్వైపాక్షిక వాణిజ్యం రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రిత్వం నాటి ‘పథభగ్న’-పాత్ బ్రేకింగ్-విధానం ఇప్పటికీ నడుస్తుండడం ఈ కమ్యూనిస్టు చైనా వస్తువులు మన దేశానికి వెల్లువెత్తుతుండడానికి ప్రాతిపదిక!
ఈ కమ్యూనిస్టు చైనాకు క్రీస్తుశకం 1970వ దశకం ఆరంభం వరకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం లేదు. చిన్నదేశమైన మరో ప్రజాస్వామ్య ‘జాతీయ చైనా’కు మాత్రమే ‘సమితి’లో సభ్యత్వం ‘్భద్రతా మండలి’లో శాశ్వత సభ్యత్వం ఉండేవి! 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఐక్యరాజ్యసమితి ఏర్పడిన నాటికి ఒకే చైనా ఉంది! ఆ ప్రజాస్వామ్య చైనా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ అమెరికా తదితర ‘మిత్రదేశాల’-అల్లీడ్ పవర్స్- కూటమిలో ఉంది. జర్మనీ, జపాన్ తదితర ‘అక్ష దేశాల’-యాక్సిస్ పవర్స్- కూటమికీ ‘మిత్ర దేశాల’ కూటమికీ మధ్య యుద్ధం జరిగింది. అప్పటికి చైనా దురాక్రమణకు గురి కాని స్వతంత్ర దేశమైన టిబెట్ ఏ కూటమిలోను చేరలేదు, యుద్ధంలో పాల్గొనలేదు! తటస్థంగా ఉంది! గెలిచిన ‘మిత్రదేశాల’ కూటమి ఆధిపత్య పర్యవేక్షణలో ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అందువల్లనే ‘చైనా’కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభించింది! 1949లో చైనాలో ‘మావోసేటుంగ్’ నాయకత్వంలోని కమ్యూనిస్టులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు, ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థను ఏర్పాటు చేసారు. చాంగ్ కయ్ షేక్ ఆధ్వర్యవంలోని ప్రజాస్వామ్య వాదులు చైనా ప్రధాన భూమికి సమీపంలోని చిన్న ద్వీపమైన తైవాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ‘జాతీయ చైనా’ను ప్రకటించారు. 1970వ దశకం ఆరంభం వరకు చిన్నదైన ఈ ప్రజాస్వామ్య ‘జాతీయ చైనా’ను మాత్రమే ఐక్యరాజ్యసమితి నిజమైన చైనాగా గుర్తించింది! ఆ ‘చైనా’ను ‘సమితి’ నుంచి వెళ్లగొట్టి పెద్దదైన ఈ ‘కమ్యూనిస్టు‘ నవ చైనాకు సభ్యత్వం ఇప్పించడానికి మన నెహ్రూ కృషి చేశాడు! కమ్యూనిస్టు చైనా 1962లో మన దేశాన్ని వెన్నుపోటు పొడిచింది...
ఈ వెన్నుపోటు ఫలితంగా దాదాపు యాబయివేల చదరపు కిలోమీటర్ల మన భూభాగం 1962 నుంచి చైనా దురాక్రమణలో కొనసాగుతోంది! దురాక్రమించిన మన భూభాగాన్ని తిరిగి మనకు అప్పగించే వరకు చైనాతో ఇతర ‘స్నేహ సంబంధాల’ను కొనసాగించరాదన్నది లాల్‌బహదూర్ శాస్ర్తీ, ఇందిరాగాంధీ, మొరార్జీదేశాయ్ ప్రధాన మంత్రులుగా ఉండిన సమయంలో మన ప్రభుత్వం అనుసరించిన విధానం! ఈ ‘జాతీయ సమగ్రతా పథాన్ని’ 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పగులగొట్టింది! ఆలోగా- 1972లో ఐక్యరాజ్యసమితి నుంచి చిన్నదైన ‘ప్రజాస్వామ్య జాతీయ చైనా’ను వెళ్లగొట్టారు, ఈ కమ్యూనిస్టు నియంతృత్వ ‘నవచైనా’కు స్థానం కల్పించారు! భద్రతామండలిలో ‘నిరోధక నిర్ణయ’-వీటో-అధికారం కల శాశ్వత సభ్యత్వం కూడ ఈ నియంతృత్వ చైనాకు దక్కిపోవడం మన జాతీయ ప్రయోజనాలకు భంగకరమైన అంతర్జాతీయ పరిణామం.. దురాక్రమణకు గురి అయి ఉన్న మన భూభాగాన్ని తిరిగి పొందడంతో నిమిత్తం లేకుండా, చైనాతో వాణిజ్య సంబంధాలను, ఇతర సంబంధాలను పెంపొందించుకోవాలన్నది రాజీవ్‌గాంధీ ప్రభుత్వం రూపొందించిన ‘పథభగ్న’-పాత్ బ్రేకింగ్ విధానం! ఈ విధానం ఫలితంగా మన భూమిని మళ్లీ మనం సాధించుకోవాలన్న ప్రాదేశిక సమగ్రతా నిష్ఠ, చైనా దురాక్రమణ ధ్యాస అడుగంటిపోయాయి! ‘సరిహద్దు వివాదం’ పరిష్కారం కోసం ఏడాదికోసారి జరుగుతున్న చర్చలు కేవలం లాంఛనప్రాయంగా మారిపోయాయి! ‘కరచాలనాలు, చిరునవ్వులు, విందులు, వినోదాలు..’ తరువాత మళ్లీ ఏడాది వరకు ‘సరిహద్దు’ను మరిచిపోవడం- పాతికేళ్లకుపైగా నడుస్తున్న ప్రక్రియ! ‘సరిహద్దు’ను మరిచిపోవడం చైనాకు లాభం, దురాక్రమించిన మన భూమిని చైనా వదులుకోనక్కరలేదు...
సరిహద్దు ధ్యాసలేని మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు పదే పదే చైనాకు వెళ్లి వస్తున్నారు. పెట్టుబడుల కోసం చైనా ‘సంస్థల’ ముందు మోకరిల్లుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చైనా సంస్థల సహకారం కోరడం ‘మన దేశ హితాన్ని మనమే భగ్నం చేసుకుంటున్న’ విధానానికి ఒక నిదర్శనం మాత్రమే! మన ఇరుగుపొరుగు దేశాలలో చైనా భారీగా పెట్టుబడులను పెట్టింది! దీనివల్ల మన ‘రక్షణ’కు కలుగుతున్న ప్రమాదాలను గుర్తించడానికి మన ప్రభుత్వం ‘అధ్యయనం’ చేస్తోందట! చైనా వస్తువులు మన దేశంలోకి వెల్లువెత్తుతుండడం వల్ల జరిగే అనర్థాల గురించి ఎప్పుడు అధ్యయనం ఆరంభిస్తారు..?

-హెబ్బార్ నాగేశ్వరరావు