భక్తి కథలు

బసవ పురాణం- 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగమేశ్వరం చేరి, అక్కడ ఆలయంలో ఉన్న బసవన్నను చూచి సాష్టాంగ ప్రణామం చేసి ఇలా అన్నారు.
‘‘బసవన్నా! నీకీ స్వర్గసుఖాలే ఒక లెక్క లేదు. అలాంటిది లౌకికమైన పదవులు కావాలా? శివభక్త సారానుభవ రుచ్య సుఖికి ఈ పదవులు రుచులు కావు. ఐనప్పటికి లోకహితార్థం కోసం నీవు మా ప్రార్థన స్వీకరించి బిజ్జలుని మంత్రి పదవి స్వీకరింపరావాలి. మంత్రి పదవి ఏమిటి, మండలత్వముకూ తంత్రముకూ నిజాప్త పదవికి, మూల భాండారానికి భూపతి సమస్త రాజ్యానికి నీవు కాక వేరెవరు అర్హులైన అధికారులున్నారు? నిజం చెప్పాలంటే బిజ్జలుడు నీ వద్ద ఇంత భిక్ష స్వీకరింపవలసిన వాడు. నీవే సమస్త భూమండలానికి పతివి! అందువల్ల నీవు కాదనకుండా కల్యాణ కటకము రావలసింది’’ అని ప్రార్థించారు.
అది విని బసవన్న భక్త హితార్థం తలచి ‘అట్లే అగుగాక!’ అని అంగీకరించి భక్తగుణానికి మొక్కి సమస్త జనులు కొలువగా సంగమేశ్వరం నుండి కల్యాణ కటకానికి పయనమైనాడు.
బసవన్న కల్యాణ కటకానికి వస్తున్నాడని విని ప్రభువైన బిజ్జలుడు నగరాన్ని సుందరాతి సుందరంగా అలంకరింపజేశాడు. పనె్నండు ఆమడల విశాలమైన నగరమంతా తోరణాలు కట్టించి, వివిధ వాద్య ధ్వనులు చెలరేగా మంత్రి సామంత సమస్త బలగంతోను బిజ్జలుడు బసవన్నకు ఎదురేగి స్వాగతం చెప్పాడు. అసదృశాకారుడూ, తత్వార్థ విచారుడూ అయిన బసవన్న ప్రభువును కలిశాడు. బిజ్జలుడు పాదచారియై బసవన్నను స్వీకరించి తగిన రీతుల గౌరవించాడు. ఏడు వందల ఏనుగులు, పనె్నండు వేల గుర్రములూ, పనె్నండు లక్షల పదాతి బలమూ, పనె్నండు మంది భాండారులను రాజు బసవనికి అప్పగించాడు. బసవన్న రాజు వెంట కల్యాణ నగరంలో ప్రవేశింపగానే నగరవాసులు గుంపులు గుంపులుగా బసవ కుమారుని చూడసాగారు.
ఇక స్ర్తిల ఉత్సాహము వర్ణనాతీతము. ‘కంటివా బసవన్నను కమలాయతాక్షీ!’ అని ఒక వనిత అంటే ‘కన్నాను, మోక్షలక్ష్మినే కన్నాను’ అని మరొకామె సమాధానం చెప్పింది. ఇలా బసవన్న సాగివస్తుంటే, తండోపండములై వచ్చి చూచేవారూ, విభూతి వీడ్యములిచ్చేవారూ వివిధ పుష్పాంజలులు చల్లేవారూ మంగళహారతులెత్తేవారూ, ‘స్వస్తి దీర్ఘాయువు శంకరా’ అని ఆశీర్వదించేవారూ, గీత, గద్య, పద్యములలో స్తుతించేవారూ కైవారములు చేసేవారూ అసంఖ్యాకులు బసవ కుమారుని అలా ఎన్నో విధాల అర్చించారు.
బసవని ముందు ఐరావతాలను బోలిన గుర్రాలపై అశ్విక దళం సాగుతుంటే దారి పొడుగునా నందికోలలు, కేళికలు, పేరణి నాట్యాలు వంటి ఎన్నో నృత్యగీత వైభవాలు ప్రదర్శించారు. ఈ విధంగా బసవన్న కల్యాణ నగరం ప్రవేశించిన తరువాత బిజ్జలుడు బసవనికి భవనమూ, వస్త్ర భూషణాదులూ సమర్పించి ‘‘నా సామ్రాజ్యము ఇక నీ చేతులలో పెట్టాను. నా అర్థానికీ ప్రాణానికీ నీవే పతివి! ఎలా పాలిస్తావో మరి’’ అని బాధ్యతలను అప్పగించాడు.
అప్పుడు బసవన్న ‘ప్రభూ! సమస్త లోకాలనూ రక్షించే శివునికి ఈ రాజ్యం రక్షించడం ఒక పెద్ద సమస్య ఏమిటి? నీవు మా శివ భక్తులను ఎప్పుడూ భయభక్తులతో పూజిస్తూ వుండు అంతే చాలు! రాజ్యపాలనం ఎంత పని’ అని చెప్పాడు. లోగడ బలదేవ దండనాయకుడున్న నిలయంలోనే బసవన్న ఉండి తన శక్తియుక్తుల చేత రాజ్య నిర్వహణను సాగించి కీర్తి ప్రతిష్ఠలు పొందాడు.
బసవన ప్రతిజ్ఞ
బసవేశ్వరుడు కల్యాణాన్ని ఈ విధంగా ప్రధానమంత్రియై పాలిస్తూ శివాచర విషయంలో కొన్ని కఠోర ప్రతిజ్ఞలు చేసి నిర్వర్తించసాగాడు. నిత్యమూ శివరాత్రి వ్రతమే తాను ఆచరించాలి, శివభక్తులెల్లరూ తనకు శివునితోనే సమానం. భక్తుల తప్పులు పట్టరాదు. భక్తుల కులగోత్రాలు పలుకకూడదు. శివుణ్ణయినా నాకిది ఇమ్మని అడుగకూడదు. వంచన అనేది తెలియని జీవనం. భక్తుడేమి అడిగినను ఇచ్చే వ్రతం పాటించాలి.
త్రికరణశుద్ధిగా ప్రతి పనీ ఉండాలి. అసత్యమూ, మోసమూ, అపమార్గమూ దాస్యమూ కలనైనా ఎరుగరాదు.
శివునికెన్నడూ గెలుపీయకూడదు. భక్తునిదే విజయం కావాలి. పరసతి, పరధనం, పరనింద, నిషిద్ధాలు. పరధర్మం పరిమార్పదగింది. పరవాదులను తిరస్కరించాలి. హరదూషణ చెవిని పడరాదు. హరగణమునకు అర్పితం కానిది అంటరాదు, భక్తపరాధీనుడై, వారు ఎట్లా అంటే అట్లే చేస్తూ జంగముడే ప్రాణలింగమని విశ్వసించాలి. భవి తిరస్కారం, భవబాధలను లెక్కింపకుండటం, విషయేంద్రిములను జయించి వేదోక్త భక్తిని సంపాదించి, ఆది శివాచారమును ప్రతిష్ఠాపించాలి.
ఈ విధంగా బసవన్న ప్రతిజ్ఞలు చేసి వానిని యధాతథంగా నెరవేర్చసాగాడు. బసవన్న వైభవం విని భక్తగణం ‘ఇతనిది కేవలం కీర్తియేనా? లేక భక్త నిజంగానే వుందా?’ అని పరీక్షించేందుకా అన్నట్లు గుంపులు గుంపులుగా రాసాగారు.
వచ్చిన మహేశ్వరులందరికీ బసవన్న మార్గమంతా కస్తూరితో అలికి, ముత్యాల ముగ్గులు పెట్టి, మకర తోణాలు కట్టి, తెల్ల గొడుగు నెత్తి విభూతి వీడ్యాలిచ్చి- వారి పాదాలపై మళ్లీ మళ్లీ పడి శరణు చేసి వారు ఏమి కోరితే అది ఇచ్చి అర్చించేవాడు.
స్ర్తిలనూ రత్న భూషణాలనూ వస్త్రాదులను ఇచ్చి భక్తులకు రాజోపచారములు, అష్టాంగ భక్తి క్రియలలో జరిపేవాడు.
- ఇంకా ఉంది

ప్రొఫెసర్ ముదిగొండ శివ ప్రసాద్