విశాఖపట్నం

పారిన పాచిక (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాన్నా మా ఆయనకు చెక్ చెప్పేశా. మరి నేను వెళ్లేది లేదు’’ అంటూ ఉరుము లేని పిడుగులా నా కూతురు చెప్పిన వార్త విని బిత్తరపోయాను.
‘‘అదేమిటే అమ్మడూ ఆ మాటలు’’ అంటూ వంట గదిలో నుండి బయటిచి వచ్చిన నా భార్యకు ‘‘నువ్వు మరేం మాట్లాడకమ్మా నీకేం తెలియదు’’ అంటూ నా కూతురు గదిలోకి పోవడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం.
దాని తీరుకు మీరే కారణం అన్నట్లు నా భార్య ఒకసారి నా వైపు చూసింది.
ఏం చెయ్యాలో బోధపడక కుర్చీలో కూర్చుండిపోయాను.
ఇంతలో గదిలో నుండి బయటపడిన నా కూతురు సోఫాలో కూర్చుని పేపర్ తిరగేస్తూ ‘‘అమ్మా ఆకలి వేస్తోంది అన్నం పెట్టు’’ అంది.
‘‘ ఏంట్రా చిట్టీ ఏం జరిగిందసలు? నువ్వెందుకు చెప్పా పెట్టకుండా వచ్చావు’’ అంటూ ప్రశ్నించాను.
‘‘అదంతేలే నాన్నా’’ అని సమాధానం చెప్పి తిరిగి పేపర్ చదువుకోసాగింది నా కూతురు.
నా కూతురు ఇలా అల్లుడితో మాటమాటికి గొడవ పడి వచ్చేయడం దానికి పెళ్లయిన ఈ ఏడాదిలో ఇది ఏ అరడజను సారో కాబట్టి నా ముసలి గుండె తట్టుకోలగలిగింది. ఇది నాకు మామూలే.
తను చెప్పా పెట్టకుండా అలిగి వచ్చేయడం, అల్లుడు వచ్చి బ్రతిమిలాడి తీసుకెళ్లడం, మేం కూడా మందలించడం. ఇలా వెళ్లి అలా తను వచ్చేయడం మామూలయిపోయింది.
ఇలా ఆలోచిస్తున్న నాతో ‘‘నన్ను మళ్లీ ఆయనతో పంపించడానికి చూడకండి. నేను వెళ్లను’’ అంటూ నా కూతురు చెప్పడంతో ఈ లోకంలోకి వచ్చాను.
‘‘సరేలే సంబడం. అయిన దానికి కాని దానికి ఊర్లేనే ఉన్నా కాబట్టి నువ్విలా మొగుడితో గొడవ పడి పరిగెత్తుకుంటూ రావడం, ఓట్లో నాలుక లేనివాడు కాబట్టి మీ ఆయన నీ ఆగడాలు, అలకలు సహిస్తూ లోకానికి వెరసి నిన్ను బతిమిలాడి తీసుకెళ్లడం అవసరమా. ఇలాంటివి మన ఇంటా వంటా లేవు. అసలు నీకేం తక్కువయిందని శ్రీరాముడి లాంటి భర్తను ఉసురు పెడుతున్నావు. ఈ పాపం ఊరికే పోదు. సరే రండి భోజనాలు చేద్దాం’’ అంది నా భార్య.
ఆ సంభాషణకు తాత్కాలిక విరామం ఇచ్చి అంతా భోజనాలకు కూర్చున్నాం. అందరం భోజనాలు చేసాక ‘‘నాకు తలనొప్పిగా ఉంది. పడుకుంటాను. ననె్నవరు లేకపండి’’ అంటూ వారపత్రిక తీసుకుని గదిలోకి వెళ్లి తలుపేసుకుంది.
ఒంటరిగా హాల్లో నేను, పాత్రలు సర్దుతూ వంట గదిలో నా భార్య మిగిలాం. వాలు కుర్చీలో కూలబడి టివి చూస్తున్న నాకు ఏదో ఛానల్‌లో పిల్లల్ని పెంచడంలో మెలకువలు అంటూ ప్రముఖ మానసిక శాస్తవ్రేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు అభిరాం సూచనలు, సలహాలు అంటూ యాంకర్ చెప్పడం వినిపించింది. ఆ ప్రకటన నన్ను ఉద్దేశించి చెప్పినట్లుగానే అనిపించింది.
నా గారాబం చేతనే కదా నా కూతురు ఇంత పెంకిగా, పెడసరంగా తయారయింది అనుకుంటూ టివి గొంతు నొక్కి గతంలోకి జారుకున్నాను. వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన నేను కష్టసుఖాత కావిడి మోస్తూనే అతి దుర్భర దారిద్య్రాన్ని అనుభవించాను. కష్టాల కడలిని ఆత్మవిశ్వాసం అనే నావ సాయంతో ఒక ఒడ్డుకు చేరి నేను ఆర్థికంగా మంచిస్థితిలోనే జీవితాన్ని వెళ్లమారుస్తున్నాననే చెప్పాలి.
నాకు కొంత ఆలస్యంగా కలిగిన ఒక్కగానొక్క సంతానం నా గారాల పట్టి గీత. తరువాత నాకు బిడ్డలు కలగలేదు. గీత పుట్టాక నా కృషి వల్లనో, పాప పుట్టడం వల్లనో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా అధికారి స్థాయికి చేరాను. ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నాననే చెప్పాలి. ఆర్థికంగా నా ఉన్నతి నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది. బాల్యంలో నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదని నా భార్య వారిస్తున్నా వినకుండా నేలపై నడిస్తే తన పాదాలు ఎక్కడ కందిపోతాయోనన్నంత గారాబంగా నా అరచేతులపై నడిపించాను. తను కోరకుండానే అన్నీ కొన్నాను. తను కోరితే కోరిన దాని కన్నా ఎక్కువే ఇచ్చాను. ఫలితంగా దాని చదువు కూడా అంతంతమాత్రమే. నాలా ఏ తండ్రీ తమ బిడ్డలను కష్టసుఖాలు తెలియజెప్పకుండా పెంచకూడదనే జ్ఞానోదయం నాకు కలిగే సరికి పరిస్థితి చేయి దాటిపోయింది. అలా తను ఇంజనీరింగ్ పరీక్షలు సరిగా రాయకపోయినా నా ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి డిగ్రీ చేతికి వచ్చేటట్లు చేశాను.
నా కూతురు మనస్తత్వం, పెంకితనం బాగా తెలిసిన వాడిని అవడం వల్ల నా అంతస్తుకి బాగా తక్కువైనా దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి అల్లుడిని తెచ్చుకుంటే మంచిదని అనుకున్నాను. వెతికి వెతికి నాలాగే కష్టపడి చదువుకుని, జీవితం పట్ల అవగాహన కలిగిన వాడని, ఎట్టి అవలక్షణాలు లేని వాడని నిఖార్సు నా ఎంక్వయిరీ తేలిన తర్వాతనే బ్యాంకులో క్లర్క్‌గా పని చేస్తున్న శేఖర్‌ని నా అల్లుడిగా చేసుకున్నాను. శేఖర్‌కి ఒక్క చెల్లి మాత్రమే. ఆమెకి ఆమె మేనమామని ఇచ్చి వివాహం జరిపారు. తల్లీదండ్రితో పాటు ఆ మేనమామ కూడా కలిసే ఉంటున్నాడు. కాబట్టి శేఖర్‌కు తల్లీదండ్రి బాధ్యత కూడా పెద్దగా లేదు అనే చెప్పాలి. ఉభయఖర్చులు నేనే భరించి వారు కోరిన దానికి రెట్టింపుగా అన్నీ ఇచ్చి పెళ్లి చేసి అందరినీ సంతృప్తి పరిచాను. ఎందుకంటే శేఖర్ లాంటి అల్లుడు ఈ రోజుల్లో దొరకడం అంటే మాటలు కాదు.
నా కూతురు ముందు గునిసినా శేఖర్‌ని చూడగానే అతని రూపం, నెమ్మదితనం చూసి కొంత, నా పట్టుదల వల్ల కొంత వివాహానికి అంగీకరించింది. అయితే అల్లుడి ఆనందానికి, ఏకాంతానికి ఇల్లరికంలా అల్లుడిని తన ఇంట్లోనే ఉంచుకుంటే కుదరదని, అదీ కాక తన కూతురి ఆగడం రెట్టింపు కాగలదనే భయంతో మాకు కూతవేటు దూరంలో ఒక డబుల్ బెడ్‌రూం ఇల్లు అమర్చాను. అయితే శేఖర్‌కి ధనరూపేణా, వస్తు రూపేణా ఎన్ని ఇచ్చినా నా కూతురిని కట్టబెట్టి శేఖర్‌లాంటి ఉత్తముడి గొంతు కోశానన్న బాధ నన్ను వీడిపోవడం లేదు. ఇంతలో ‘‘మామయ్యగారు’’ అంటూ శేఖర్ నా ముందు ప్రత్యక్షం అయ్యాడు. శనివారం కావడంతో బ్యాంక్ ఒక్క పూటే పని చేస్తుంది. లంచ్ బాక్స్ తీసుకెళ్లకుండా ఇంటికి చేరిన శేఖర్‌కి ఇంట్లో భార్య కనిపించకపోవడంతో ఇటు వచ్చాడు.
ముందు రోజు సినిమాకి వెళదామని గీత ప్లాన్ చేస్తే, మీటింగు వల్ల శేఖర్ ఆలస్యంగా రావడంతో గీత అలిగింది. ఉదయం శేఖర్ ఆఫీసుకి వెళుతుండగా కనీసం టిఫిన్ కూడా తయారు చేయలేదు. దాంతో అతనికి ఆమె ఇంట్లో లేకపోతే ఎక్కడ ఉంటుందో తెలిసి తిన్నగా అత్తగారి ఇంటికి వచ్చేశాడు.
ఇలా జరుగుతుందని ముందే ఊహించిన మా ఆవిడ అల్లుడికి కూడా భోజనం సిద్ధం చేసింది.
‘‘గీత ఎక్కడుంది అత్తగారూ?’’ అంటూ ప్రశ్నించాడు శేఖర్.
‘‘ ఉందిలే నాయనా. ముందు భోజనం చెయ్. ఉదయం టిఫిన్ కూడా పెట్టిందో లేదో. దాని వరస నాకు తెలుసు కదా’’ అంటూ అల్లుడికి కొసరి కొసరి వడ్డించింది నా భార్య.
భోజనం చేసి నా ముందుకు వచ్చిన శేఖర్ ‘‘అసలేం జరిగిందంటే మామయ్యగారూ’’ అన్నాడు.
‘‘తర్వాత మాట్లాడుదాంలే బాబూ. ఎండన పడి వచ్చావు. ముందు కొంచెం సేపు విశ్రాంతి తీసుకో’’ అని మరో మాటకు ఆస్కారం లేకుండా ఎసి ఆన్ చేసి నా గదిలోకి అల్లుడిని తరిమాను.
అల్లుడు, కూతురి బాగోతం సాయంత్రం వేడివేడి పకోడీ తింటూ, టీ తాగుతూ ఆస్వాదించవచ్చులే అని నా ఆలోచన. అల్లుడు ఇంటికి వచ్చిన ప్రతిసారీ నా భార్య అల్లుడికి ఇష్టం అని ఉల్లి పకోడీ చేస్తుంది. నా భార్య చేతి ఉల్లి పకోడీ తిన్న వారెవరికీ మర్కెడా ఉల్లి పకోడీ నచ్చదు అని దృఢ విశాసం అనుకుంటూ నడుం వచ్చాను.
అయితే కంటి మీదకు కునుకు రావడంలేదు. నా గారాబం, పెంపకంలో లోపమే నా కూతుర్ని ఇల్లాలిగా మారినా కాపురం విలువ, భర్త విలువ తెలియని బుద్ధిహీనురాలిగా మార్చిందన్నది సత్యం. అల్లుడి మంచితనానికైనా ఒక హద్దుంటుంది కదా. మనసు విరిగితే మరి అతకదు అన్నమాట గుర్తొచ్చి ఏదో ఒకటి చేసి నా కూతురి మంకుతనానికి చెక్ అని దృఢంగా నిశ్చయించుకున్న తర్వాత మాగన్నుగా నిద్రపట్టింది.
లేచేటప్పటికి వంట గదిలో సలసలా మారిగే నూనెలో వేగుతున్న పకోడీ వాసన, మరో పక్క మసాలా టీ వాసన ముక్కుపుటాలను అదరగొడుతోంది. అల్లుడు లేచాడా అని నా గది వైపు చూసిన నాకు అల్లుడు నా గదిలో నుండి బయటికి వచ్చి గీత పడుకున్న రూంలోకి వెళ్లడం కనిపించింది.
‘అయ్యో అల్లుడా’ అనుకున్నాను. అయితే అది ఒక్క క్షణమే. భార్యాభర్తల మధ్య కలహం తర్వాత కలయిక అతి మధురం కదా అనిపించింది.
ఏ కళనుందో కానీ నా కూతురు తొందరగానే అలకపాన్పు దిగి ఇద్దరూ నవ్వుకుంటూ గదిలో నుండి బయటికి వచ్చారు. నేను మాత్రం అదేమీ పట్టించుకోనట్లుగా అతి గంభీరంగా మొహం పెట్టి నా కూతుర్ని ఎప్పుడూ పిలవనంత కోపంగా పిలిచి ‘‘అమ్మా నేను కూడా మీ ఆయనకి శాశ్వతంగా చెక్ చెప్పేద్దామనుకుంటున్నాను. లాయర్ దగ్గరకి పద’’ అంటూ గదిమేసరికి ఊహించని నా ఎన్‌కౌంటర్‌కి బిక్కమొహం వేసుకుని కళ్లనీళ్ల పర్యంతం అయింది గీత. దాని కళ్ల నుండి నీళ్లుకు నా మనసు కరిగిపోతున్నా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం చెదిరిపోకుండా అదే బింకంతో ‘‘ ఇక ముందు మీ ఆయన వల్ల నీకు ఏ ఇబ్బందీ ఉండదు. మరి నీవు అక్కడికి పోనక్కరలేదు’’ అంటూ అల్లుడి మాత్రమే కనిపించేటట్లు కనుసైగ చేసి ‘‘శేఖర్ నువ్వు కూడా లాయర్ దగ్గరకి పద’’ అంటూ గద్దించాను.
ఇదేమీ అర్ధం కాని నా భార్య ‘‘చాల్లెండి సంబడం పెద్ద న్యాయం చెప్పొచ్చారు. భార్యాభర్తలన్న తర్వాత పోట్లాడుకోరా తిరిగి కలుసుకోరా’’ అంది.
‘‘నువ్వు నోర్మూసుకో. నా కూతురు అల్లుడి దగ్గరికి మరి పోనంటే ఎలా పంపను’’ అంటూ గీత వైపు చూశాను.
నా ఆజ్ఞకి బద్ధుడైనట్లు బట్టలు మార్చుకున్న నా అల్లుడు ‘‘నేను రెడీ మామగారూ’’ అన్నాడు.
దాంతో నా కూతురి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. కథ ఇలా అడ్డం తిరుగుతుందని, తన తండ్రే తనకు ఇలా ఎదురు తిరుగుతాడని కలలో కూడా ఊహించని నా కూతురి తలబిరుసు తగ్గి అల్లుడితో కాళ్ల బేరానికి వచ్చింది. కథ పాకాన పడడంతో నా భార్యకు మాత్రమే కనిపించేటట్లు శబ్దం రాకుండా పెదవులతో పిచ్చిమొహమా అని సైగ చేసి వంట గదిలోకి తరిమాను. నేను కూడా తయారవడానికి అన్నట్లుగా నా గదిలోకి దూరాను.
హాల్లో నా కూతురు, అల్లుడు మిగిలారు. నేను తయారై వచ్చే సరికి నా కూతురు నాకు చెక్ చెప్పి బ్యాగ్‌తో సహా మొగుడిని తీసుకుని జారుకుంది. నా పాచిక పారింది. ఇక తను చెప్పా చెయ్యకుండా ఇలా మొగుడితో గొడవ పడి రాదని, నాకు అర్ధమయింది. నవ్వుకుంటూ నా భార్య ఇచ్చిన పకోడీ తింటూ, టీ తాగుతూ కాపురంలో కలహాలు, కలయికలు ఈ పకోడీ టీల్లాగే కాస్త కారంగా, మధురంగా ఉండాలి కదా అనుకున్నాను.

- మండా శ్రీ్ధర్, శ్రీకాకుళం. సెల్ : 9493309030.