విజయవాడ

కోపూరి ‘నానీ పుష్పాల’తో నిండిన ‘పూలవనం’! (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోపూరి పుష్పాదేవి రచయిత్రిగా, కవయిత్రిగా

తెలుగు సాహితీ రంగంలో తనదైన ముద్ర

వేసుకున్నారు. గృహిణిగా వుంటూనే నిత్యం

ఎంతో ఆసక్తిగా సమాజాన్ని అధ్యయనం చేస్తూ

సాహితీ సేవ చేస్తున్నారు. అత్యంత సులభ శైలిలో

వెలువరించే ఈమె కవిత్వం, కథలు ఇప్పటికే

పాఠకుల మదిలో నిక్షిప్తమై ఉన్నాయి.

ఇంతకుముందే ‘పుష్పరాగాలు’ (2006),

‘పూలరేకులు’ (2008) పేరిట రెండు నానీల

సంపుటులు వెలువరించారు. నేటి సాహిత్యంలో

నానీలది ఓ ప్రత్యేక స్థానం. వాటిపై మరింత

మక్కువతో వెలువరించిన పుష్పాదేవి మూడో

సంపుటి ఈ ‘పూలవనం’. మొత్తం 224 నానీలతో

పరిమళించిన పూలవనమిది! ఒక్కసారి దీనిలో

విహరిస్తే వాటి పరిమళాలను మనమూ

ఆస్వాదించవచ్చు. కళలు, దైవభక్తి, రాజకీయం,

సాహిత్యం, కుటుంబ విలువలు, అవినీతి, ప్రసార

మాధ్యమాల వైచిత్రి వంటి అంశాల చుట్టూ అల్లిన

నానీలివి. ఒక్కసారి వీటిని పరికిద్దాం..
దేవుళ్ల చిత్రాలను పవిత్రంగా చూడాలి. కవర్లపై

ముద్రించి చెత్తగా పారెయ్యరాదంటూ ‘పరమ

భక్తులం/ దేవుళ్ల చిత్రాలు/ కవర్లపై ముద్రించి/

చెత్తపాల్జేస్తాం’ అంటూ ఓ నానీలో ఆవేదన

వెలిబుచ్చారు పుష్పాదేవి. ‘యాక్సిడెంట్/

ముగ్గురు మృతి/ దొరికింది/ ఛానల్సుకి ఈరోజు

మేత!’ అంటూ నేటి ప్రసార మాధ్యమాల తీరును

కళ్లకు కడతారు. మానవీయ కోణంలో

చూడాల్సిన మరణాలు కూడా వ్యాపారాత్మక

ధోరణిలో వస్తువులయ్యాయనే బాధను

వ్యక్తపరిచారు. తల్లి ఒడిలో బిడ్డ చనుబాలు

స్వీకరించటం ఎంత మధురమో చెపుతారిలా ఓ

నానీలో. ‘మాతృక్షీరం/ బిడ్డకు అమృతం/

దైవధ్యానం/ మనసుకీ అంతే!’ అంటూ

దైవారాధనలో మనసుకు లభించే సాంత్వనను

తెలియజెపుతారు.
‘తీవ్రవాదం/ మనిషికి ముప్పు/ ఆధ్యాత్మిక

తీవ్రవాదం/ అవనికే నిప్పు’ అంటూ మానవ

సమాజ మనుగడకు తీవ్రవాదం ఎంతటి ముప్పో,

ఆధ్యాత్మికత ముసుగులో సంస్కృతిని అంతం

చేయాలనుకోవటం ఈ భూమికి అంతకంటే పెద్ద

ముప్పని తేటతెల్లం చేస్తారామె. ‘మన రచన/

పత్రికలో చూడటం/ అద్దంలో/ ముఖం

చూసుకోవటం!’. ఎంతో మధనంతో వెలికివచ్చే

రచన పాఠకులకు చేరాలంటే ముద్రితం కావాలి.

అలా ముద్రిస్తే రచయితలకు కలిగే సంతోషం

అంతాఇంతా కాదు. ‘ఎంత బాగుందో/ నానీల

సృష్టి/ అన్నం వండుతూ ఒకటి/ అన్నం తింటూ

ఒకటి!’. నానీలు రాయటంలోని ఆనందాన్ని

రచయిత్రి ఎలా ఆస్వాదించారో తెలియజెప్పారు.

‘ఆదరించే అతివ/ ఉత్తమ ఇల్లాలు/ అధికారంతో

ఆలి/ ఉత్త ఇల్లాలు’!.. ఇల్లాలంటే ఆదరణతో

ప్రేమించాలి గానీ అధికారం చలాయించకూడదనే

ఆకాంక్షను వ్యక్తపరిచారు. ‘అన్నం లేదు/

బట్టల్లేవు/ భర్త ఫొటో ఉంది పెద్దది/ భార్య కడుపు

నిండింది!’ భర్త తోడో, ఆయన జ్ఞాపకమో చాలు

భార్యకు, అన్నం, మంచి దుస్తులతో పనిలేకున్నా

అంటూ పతిభక్తిని చాటారు. ‘తృప్తిగా/ కన్ను

మూయవచ్చు/ కావాల్సినంత/ సాహితీ సుధను

తాగాను!’ తన సాహితీ యానంలో ఆమె ఎంతగా

తృప్తిపడ్డారో చెప్పారు. ‘ఎంత గ్రోలినా/

తనివితీరదు/ కావ్య సాహితీ/ అమృతపానం!’

అంటూ సాహిత్య తృష్ణ తనివితీరనిది కదా! అని

వివరించారు. ‘సాహిత్యం/ ఊటబావి/ ఎంత

తోడినా ఇంకాఇంకా/ ఊరుతుంది అమృతం!’

సాహిత్యంలో మునిగితేలితే ఆ అనుభూతే వేరు.

ఎంత తోడినా అమృతం వస్తూనే ఉంటుందట!
ఎంత తప్పు చేసిన వారినైనా మన సహనం,

క్షమాగుణంతో గెలవాలి, తద్వారా మన వ్యక్తిత్వం

ఉన్నతీకరించుకోవాలని అంటారు పుష్పాదేవి.

‘వాళ్లు/ పొరపాటు చేశారని తెల్సిందా/ నీ

వ్యక్తిత్వం/ మరోమెట్టు ఎక్కించుకో!’. మనసును

స్వచ్ఛంగా ఉంచుకుంటే మంచి ఆలోచనలు

వస్తాయంటారు మరో నానీలో. ‘అలంకరణ/

శరీరానికే/ స్వచ్ఛత మాత్రం/ హృదయానికి!’.

శరీరానికి ఎంతటి అలంకరణ చేస్తే మాత్రం ఏమిటి?
చిన్నతనంలో చదువుకుందామంటే పుస్తకాలు

దొరికేవి కావు. కానీ ఇప్పుడు గ్రంథాలయమే

వుంది.. చదవటానికి శక్తే లేదు- అంటారు

నర్మగర్భంగా. ‘అప్పుడు/ గ్రంథం లేదు/ ఇప్పుడు

గ్రంథాలయం ఉంది/ ఓపిక లేదు!’. ఎక్కడపడితే

అక్కడ తిండి తింటే ఎలా! తాగుడుకు బానిసలైతే

ఆసుపత్రే శరణ్యమన్నారు మరో నానీలో. ‘రోడ్డుకి/

ఓ పక్క మిక్చర్ బండి/ ఆ పక్క బ్రాందీ షాపు/

దగ్గరే ఆసుపత్రి!’. ‘మంచి స్నేహితులు లేరే/ అని

బాధ/ మనమే మంచి స్నేహితులుగా/

మారితే...?’ స్నేహమాధుర్యాన్ని మనమే అందరికీ

పంచుదాం. మంచి స్నేహితులు లేరనే బాధ

ఎందుకు? అని ప్రశ్నిస్తారు పుష్పాదేవి.
పరిశ్రమకు లొంగని అంశమేముంది? కష్టపడితే

సాధించరానిదేముంది? ప్రతిగా విజయం, ఆనందం

మిగులుతాయని ప్రబోధించారు. ‘కఠోర శ్రమకు/

పుట్టిన కవలలు/ అఖండ విజయం/ అమోఘ

ఆనందం!’ అని చెపుతారు. నేను, నాది

అనుకోవటం స్వార్థం. మనం, మనది

అనుకోవటంలోనే వుంది సౌఖ్యం, సంతోషం

అంటారీ నానీలో. ‘నేను- నాది/ నలుగురిలో

ఒంటరి/ మనము- మనది/ పరిమళించే విరి!’.

అందరిలోనూ మంచి, చెడూ ఉంటాయి. ఎంత

శాతం అనేదే తేడా. మంచిని పెంచుకొని

పంచటమే జీవితానికి కావలసింది- అంటారు ఈ

నానీలో. ‘మంచీ, చెడూ/ దాగుంటాయి

అందరిలో/ నిష్పత్తి చెప్తుంది/ మన నిజాయితీ!’.

ఆధునిక యుగంలో అరచేతిలోని

అయోమయాలయ్యాయి చరవాణి, అంతర్జాల

ఆధారిత వస్తువులు. జనాలేమో భ్రమారణ్యంలో

బతుకుతున్నారని వ్యాకులతచెందారీ నానీలో.

‘ఫేస్బుక్, వాట్సాప్/ ప్రపంచం అరచేతిలో/

భ్రమారణ్యంలో/ అయోమయం!’
రచయిత్రి సమాజంలోని ప్రస్తుత కాలమాన

పరిస్థితులను చదువుతూ వెలువరించిన

భావాలు ఈ పుస్తకం నిండా నానీల రూపంలో

మనల్ని పలకరిస్తాయి. తర్కం, చమత్కారం,

భావుకత, తాత్వికత, ఆధ్యాత్మికత నిండిన

భావావేశపు ఆలోచనలు గోచరిస్తాయి. కుటుంబ

విలువలు, మానవీయ కోణాలు, రాజకీయ

జిత్తులు, అవినీతి మరకలు, తదితర అంశాలపై

పుష్పాదేవి నానీలు నిర్మొహమాటంగా

స్పందిస్తాయి. గోపీ, సోమేపల్లి గార్ల

ముందుమాటలు పుస్తకానికి మరింత వనె్న

తెచ్చాయి. ముద్రణ, ముఖచిత్రం బాగున్నాయి.

మున్ముందు పుష్పాదేవి గారి కలం నుంచి

మరెన్నో సమాజ హిత రచనలు వెలువడాలని

ఆశిద్దాం. ఆమె సాహితీ సేవకు అభినందనలు.

పుస్తకం : పూలవనం
రచయిత్రి : కోపూరి పుష్పాదేవి
వెల : రూ. 70
ప్రతులకు : కోపూరి రామచంద్రరావు,
1-3/24-6సి, శంకావారి వీధి, విద్యాధరపురం,
విజయవాడ- 520012.
చరవాణి : 9440766375

- డా. మక్కెన శ్రీను, విజయవాడ. చరవాణి : 9885219712