భక్తి కథలు

బసవ పురాణం- 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసవేశ్వరుని సహోదరి నాగమాంబకు చెన్నబసవడనే కుమారుడున్నాడు. అతడు మహాయోగి. ఆయన మర్కట కిశోర న్యాయంతో బసవన్నను ఆశ్రయించి బసవ సంస్తుతితో బసవని సేవలో చరితార్థుడైనాడు.
అల్లమ ప్రభువు రాక
ఇలా వుండగా ఒకనాడు అల్లమ ప్రభువు అనే సంయమి బసవన్న భవనానికి వచ్చాడు! రత్న పరీక్ష చేసి, వ్యాపారి రత్నాన్ని స్వీకరించినట్లు బసవన్న అల్లమ ప్రభువులో శివుణ్ణి
దర్శించి, ఆదరించి ఆతిథ్యమిచ్చాడు. అల్లమ ప్రభువును స్వర్ణ సింహాసనం ఎక్కించి మంగళ తూర్యములు మోగుతుండగా మంగళ హారతులెత్తి అర్చించాడు. పళ్ళెం పెట్టి అందులో పంచభక్ష్యాన్నములు వడ్డించి వానిని ముద్దలుగా చేసి బసవన్న ఆదరంతో అల్లమ ప్రభువుకు అందించాడు. బసవన్న అందించినది అందించినట్లు అల్లమ ప్రభువు తినసాగాడు. ఇలా బసవన్న ఆనాడు లక్ష ఎనబదివేల జంగముల అర్చనకై సిద్ధం చేయించిన సమస్త పదార్థాలూ అల్లమ ప్రభువు ఒక్కడే భుజించాడు. అది చూచి బసవన్న ఆశ్చర్యపడి ‘అల్లమ ప్రభూ! వండిన పదార్థాలన్నీ అర్పించాను. ఇక నా శరీరాన్ని కూడా తమకు సమర్పించుకుంటున్నాను’’ అని వినీతుడై అల్లమ ప్రభువు ముందు బసవన్న కూర్చున్నాడు. బసవన్న దివ్య భక్తినీ, పరమ త్యాగాన్ని చూచి అల్లమ ప్రభువు ఆనందించాడు. ‘‘బసవా! నీవు అమృతమూర్తివి! మాణిక్య దీపానివి! చెరుకుకు పండూ పసిడికి కమ్మదనమూ, మలయ పవనానికి పూవూ, చిత్తరువుకు జీవమూ, బంగారు బొమ్మకు ప్రాణమూ వస్తే ఎలా వుంటాయో అలాంటివాడవు నీవు!
వడివడిగా పారే జలానికి ఒడలెల్ల కాళ్ళు, వడివడిగా కాలే చిచ్చుకు ఒడలెల్ల నోళ్లు. వడివడిగా వీచే గాలికి ఒడలెల్ల తలలు. వడివడిగా చేసే బసవన్నా నీకు ఒడలెల్ల భక్తియేనయ్యా!
నీ పేరు స్మరిస్తే చాలు ఆబాల వృద్ధులకు పశుపక్ష్యాదులకు కూడా భక్తి అబ్బుతుంది. శత్రువులు మిత్రులౌతారు. కార్చిచ్చు వెనె్నల అవుతుంది అని ఈ విధంగా అల్లమ ప్రభువు బసవని భక్తిని ప్రశంసించాడు.
అప్పుడు బసవన్న ఇలా అన్నాడు.
‘‘అల్లమ ప్రభూ! నీవు సాక్షాత్తు సంగమదేవునివి! నీకు వలసినంత పెట్టగలిగిన భక్తుడిని కాను స్వామి నేను!
లోగడ ఒకసారి కైలాసంలో ప్రమథులంతా శివసారూప్యంలో ఉన్నారు. అప్పుడు పార్వతి శివుడెవరో ప్రమధులెవరో తెలియక సందేహంలో పడింది. అది చూచి శివుడు తప్ప తక్కిన ప్రమథులంతా తమ తమ ఇష్టాలను అనుసరించి గో, మేష, వానర, కుక్కుటాది ముఖాలతో భిన్న భిన్న రూపాలు ధరించారు. ఇట్లు అనేక ముఖాలు, అనేకమైన చేతులూ కాళ్లు గల ప్రమథ రూపాలను చూచి పార్వతీదేవి అద్భుతపడి వారందరికీ విందు పెట్టాలని విశ్చయించుకున్నది.
అప్పుడామె ఆకాశమే వంటగదిగా చేసుకొని బ్రహ్మాండమునే పాత్రగా చేసి కోట్లానుకోట్ల సముద్రాల పెరుగు, పాలు చెరకు రసములు సిద్ధం చేసి వివిధ పక్వాన్నములు వండి వుంచింది.
అప్పుడు ప్రమథులు తమలో ఒక చిన్నవాణ్ణి ‘వెళ్లి వంట అయిందేమో అమ్మగారిని కనుక్కోమన్నారు. ఆ బాల ప్రమథుడు వచ్చి అడిగాడు ‘వెళ్లి అందరినీ పిలువు, సిద్ధంగా ఉంది’ అని అమ్మవారు చెప్పారు. ‘అయితే అమ్మా! కాస్త నాకు పెట్టు, మరీ నీరసంగా వుంది. అది తిని సత్తువ తెచ్చుకొని వెళ్లి అందరినీ పిలుచుకువస్తాను’ అన్నాడు బాల ప్రమథుడు. ‘సరే’నని అమ్మవారు పెట్టడం మొదలుపెట్టింది. బాల ప్రమథుడు తినడం మొదలుపెట్టాడు. అలా సమస్త ప్రమథులకోసం వండిన వంటకమంతా అవలీలగా బాలప్రమథుడే ఆరగించాడు. అది చూచి పార్వతీదేవి అత్యాశ్చర్యమతియై శివుని వద్దకు పోయి ఈ సంగతి చెప్పింది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ‘పార్వతీ! ఈ చిన్నవాడు అందరికన్నా చిన్నవాడు సుమా!’ అని ఎగతాళి చేశాడు. ‘‘పార్వతీ! ప్రమథులంటే ఏమనుకున్నావు’, ‘అసంఖ్యతాస్సహస్రాణి’, ఏవమేతన్నిబోధిత’ అని వేదములచే ప్రస్తుతింపబడి వేదములకు కూడా అందని మహాగణ మీ ప్రమథగణం. ప్రమథులే మాకు శరీరం. బ్రహ్మ విష్ణ్వాది సమస్త దేవతలూ వారిచే పరాజితులౌతారు. అట్టి గణముయొక్క మహాత్మ్యము నేనేమని వర్ణింపను?’’ అని పరమేశ్వరుడు పార్వతీదేవితో అన్నాడు.
అలాగే అల్లమ ప్రభూ! నీవు సాక్షాత్తు పరమేశ్వరునివి. ఈ సమస్త పదార్థమూ ఆరగించడంలో ఆశ్చర్యమేముంది?’’ అ న్నాడు బసవన్న.
అప్పుడు అల్లమ ప్రభువు సంతోషించి బసవేశ్వరునికి వరాలునిచ్చాడు. తలచిన పదార్థములు ధరపై ప్రత్యక్షమయ్యేటట్లు, ఆడిన మాట అక్షరాలా జరిగి తీరేటట్లు, మట్టి పట్టుకుంటే బంగార మయ్యేటట్లు తాకితే శూన్యం ఘనీభవించి నిలిచేటట్లు, పరీక్షలో ఈశ్వరుణ్ణైనా గెలువగలిగేటట్లు, అక్షయ సంపదలు అల్లమ ప్రభువు బసవనికి అనుగ్రహించాడు. అల్లముని అనుగ్రహంతో ఉప్పుమూట నీట ముంచినట్లు కర్పూరం అగ్నితో కలిసినట్లు వడగళ్ల వాన సముద్రాన కురిసినట్లు బసవడు శివ తత్త్వంతో తలమునకలై ప్రవర్తింపసాగాడు.
- ఇంకా ఉంది

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్