సాహితి

నేల.. మట్టి.. నిండు జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనమడు తాతతో పొలానికి షికారుగా వెళ్లాడు. ‘‘తాతయ్యా, మన పొలం ఏది?’’ అని అడిగాడు. ‘నీకు కనబడుతున్నదంతా మందేరా!’ అన్నాడు తాత. వంద ఎకరాల ఏకకండ్రిక. తన మనమడికి అవతలి తట్టు కనబడకుండా సముద్రంలా వున్న పొలం చూస్తూ ‘ఇదంతా మందేరా’ అన్నప్పుడు అతని మనస్సు ఆనందంతో నిండింది’’. ఇదీ జోగయ్య తాత కథ.
జోగయ్య ఎడ్లను అమ్ముకోవటానికి ఒక వూరు వెడతాడు. తన ఎడ్లను కొనుక్కున్న ఆసామికి ఆకర్షితుడయి, ఆ యింటి అల్లుడయిపోతాడు. మామకు అయిదెకరాలు భూమి. జోగయ్య కష్టపడి, మామయ్య చనిపోయేటప్పటికి ఆయిదెకరాలను వంద ఎకరాలు చేశాడు. మామ ‘నిన్ను దగ్గరికి తీసినందుకు నా పరువు నిల్పావు’ అని ఏక వాక్యంతో మెప్పుదలగా అన్నాడు.
అలాంటి జోగయ్య ఇప్పుడు వృద్ధాప్యంలో పడిపోయి, తన కుటుంబం పొలాన్ని అశ్రద్ధ చేస్తోందనీ, వాళ్లను తన దారికి మలుచుకోలేకపోతున్నానని ఒకటే విచారం మనసులో పెంచుకుంటున్నాడు. చనిపోతున్న భార్య దగ్గర వుండడం కంటే, పొలానికి సరిగా నీళ్లు పడుతున్నాయో లేదో- ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే వాటిని పక్కకు నెట్టివేయగలుగుతున్నారా లేదా అని గమనించడంలోనే ఆయనకు ఎక్కువ మక్కువ.
జోగయ్య వ్యవసాయదారుడు. మట్టివాసనను మించిన సుగంధం మరేం లేదనుకున్న మనిషి.
ఇతని కథను అక్షర రూపం కల్పించి, ఆ ఆవేదనను ఇతరులతో పంచుకున్న రచయిత త్రిపురనేని గోపీచంద్. పల్లె వాతావరణం, గ్రామీణ జీవితంలో వస్తున్న మార్పులను ప్రత్యక్షంగా చూచి పరావర్తనాన్ని రికార్డ్ చేసిన రచయితలలో ప్రముఖుడు. ఇంగ్లీషు చదువులు, ఉద్యోగాలు, కొత్త కొత్త ప్రయోగాలు ఎన్నో చేసినా- నేల తల్లిని నమ్ముకున్నవాళ్ల కథలను అక్షరబద్ధం చేయడంలో ఆసక్తి చూపించిన మనిషి.
ఆయన వ్రాసిన ‘మమకారం’ అనే కథలో జోగయ్య తాత (మామ) కథ సవిస్తరంగా రూపుకట్టుకుంటుంది. నూరేళ్ల జీవితం, నాలుగు పేజీలలో మనః ఫలకంపైన ముద్రను నిలుపుతుంది. జోగయ్యకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. కుటుంబాన్ని ప్రేమించిన మనిషి. అంతకంటే ఎక్కువగా భూమిని ప్రేమించి తరించిన మనిషి. పెద్దకొడుకు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయ్యాడు. పొలం పనులు యధాలాపంగా చేస్తూనే తండ్రికి చేదోడుగా వుంటున్నాడు. రెండో కొడుకు బట్టల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. మూడోవాడు ఇంగ్లీషు చదువులో మునిగిపోయి వున్నాడు. తండ్రి మనస్థితిని తెలుపుతూ రచయిత ఏమంటున్నారో చూడండి; ‘ఆస్తంతా ఎక్కువ భాగం తను రెక్కలమీద సంపాదించినదే. అందుకని మిగిలిన బాంధవ్యాలన్నీ ఆస్తిముందు స్వల్పంగా కనిపిస్తాయి అతనికి’-
నేరేడు చెట్టుకింద కూర్చుని అన్నం తినడం అలవాటు అతనికి. కొడుకు యిలా వుండటాన్ని భరించలేడు. కాదని ఏమీ చేయలేడు. మనమరాలు తనకు అన్నం తెచ్చిపెడుతూ వానలో తడిసిపోతుందేమోనని ఒకటే ఆరాటం జోగయ్యకు. ‘ఒక పక్క గోంగూర పచ్చడి నల్లగా నిగనిగలాడుతూంది. ఒక పక్క ఆవకాయ ఎర్రగా నెత్తురు ముద్దలా వుంది. ఆ రెంటిమధ్యా తెల్లటి అన్నం’- ఇదే అతని భోజనం. తాత వేసుకోమన్నాడని జరీ పరికిణీ వేసుకు వచ్చింది అతని మనుమరాలు. ‘చెరువుగట్టుమీద అన్నం తింటే పరువు పోతుందా?’ అంటాడు జోగయ్య. కొడుకుకు మాత్రం యిలా వుండడం యిష్టంకాదు.
నేలను నమ్ముకుని, జీవితాంతం దానికే సేవ చేస్తూ పోషిస్తూ పెంచుకుంటూపోయిన మనిషి నేరేడు చెట్టుకు ఆనుకుని కూర్చుని ఉన్నాడు.
అతని ఆఖరు ప్రయాణం రచయిత యిలా వర్ణిస్తాడు:
‘చేతి కర్ర, తలపాగా ఒక పక్కన పడి వున్నాయి. కళ్లు మూసుకుని ఏమిటో ఆలోచిస్తున్నాడు. అవసరం ఉన్నా లేకపోయినా ఆలోచించడం తప్పదు. గుప్పిడి ముక్కుకి ఆనించుకుని ఏదో వాసన చూస్తున్నాడు. గుప్పెటిలో ఏం వుంది? పువ్వా? కాదు, పొగాకా? కాదు, మన్ను- మట్టి మన్ను. నేరేడు చెట్టు క్రింద రేగడి మన్ను’- కొడుకు తండ్రిని పలుకరిస్తాడు.
మాటమాత్రంగా బదులు పలుకుతాడు తండ్రి. ఆయన గుప్పిట సడలి చెయ్యి కిందకు వాలిపోయింది. మన్ను ధారగా పడింది. మట్టి మట్టిలో కలిసింది’.
-జోగయ్య తాత (మామ), (తండ్రి) పరి పలకలేదు.
జీవితమంతా నేలకు అర్పణం చేసిన మనిషి, బతుకు పరిసమాప్తం అయింది. అతను అనుకున్నట్లుగానే జీవిత పరమార్థం సమకూడింది.
‘నేను - నాది’ అనుకున్నవాటిమీద ‘మమకారం’ పెంచుకోవడం మనిషికి సహజం.
కుటుంబాన్ని నేను, నాది అనుకోలేదు జోగయ్య.
భూమిని- పొలం విస్తృతం అవడాన్ని తనది అనుకున్నాడు.
అతని చుట్టూ వున్న ప్రపంచమంతా ఈ భూమే.
అతనికి వేరే వ్యావృత్తిలేదు.
వేరే వ్యావృత్తి ఎంచుకున్న కుటుంబ సభ్యులను కూడా మనసారా ప్రేమించలేకపోయాడు. అసహ్యాన్ని, అసహనాన్ని తన గుండెలలోనే దాచుకుని జీవితం వెళ్లమార్చుకున్నాడు.
రైతులు, రైతుల కష్టాలు, నాటి ఇబ్బందులు, ఎరువులు సదుపాయాలు తగు మాత్రంగా లేకపోవడం, ధాన్యానికి తగిన ధర రాకపోవడం, దళారులు మోసం చేయడం.. ఇలాంటి వ్యవహారాలన్నింటిమీద మనకు అనేక కథలు వచ్చాయి. పొలాన్ని వదిలేసుకుని ఇతర దేశాలకు, వృత్తులకు వలసలు పోయిన మనుషులు, అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఎన్నయినా పోగయిపోతున్నాయి యిప్పటి రోజుల్లో.
నిజమైన మమకారాన్ని, ఆత్మీయతను, అనుబంధాన్ని వ్యక్తపరిచే రుూ ‘మమకారం’ కథ డెబ్బయి సంవత్సరాల కిందటిది. ఈ ఏడు పదుల జీవితంలో దేశంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. అప్పటి జీవితాలను గురించి, ఆర్తనాదాల గురించి యిప్పటివారికి పూర్తిగా తెలియదు.
ఆ రకంగా చూచినప్పుడు ‘మమకారం’ కథ ఆ తరగతి కథలకు- కల్పనలకు మూల వస్తువులా కనిపిస్తుంది. నేలలో స్థాపితం అయిపోతున్న రైతు కథ, నేలను వదలలేక, దానిని పరలోకాలకు కూడా తీసుకుపోవాలనే- తనకే తెలియని ఆసక్తిని అంతరంగంలో పలికించే ధ్వని.
వ్యవసాయ వాతావరణంతో ప్రత్యక్ష సంబంధం వున్న రచయిత మటుకే వ్రాయగల కథ. రచయిత- తరువాత రోజులలో నగర వాతావరణాన్ని గురించి, నగరంలో మనుషులు మనసులు మార్చుకోవడాన్ని గురించి ఎన్నో కథలు, నవలలు రాసి కీర్తి సంపాదించుకున్నారు. మామిడిపళ్లు డజన్ల లెక్కన అమ్మే సర్కారు జిల్లాల నుంచి, కిలో తూకంలో అమ్మకం జరిగే నిజాం రాష్ట్రం గురించి కూడా ఈయన ఆచార వ్యవహారాల వ్యత్యాసాలను స్పష్టపరుస్తూ కథలు వ్రాశారు. కేవలం కథలు, నవలలు మటుకే కాకుండా దేశ, విదేశ తత్త్వవేత్తలను గురించి చరిత్రలు- విమర్శలు రాశారు. ఏ రచన చేసినా తన భూమిని, తన దేశాన్ని మరచిపోని రచయిత ఈయన. ఆయన చేసిన చివరి పని చైనా యుద్ధం జరుగుతున్న రోజుల్లో ప్రధానమంత్రి యుద్ధనిధికి విరాళాన్ని అందించడం అన్న విషయం తెలిసినవాళ్లు బహు తక్కువమంది. సమకాలికులకు రుూ విషయం విదితమే అయినా, తరువాతి తరాలకు ఆదర్శంగా మటుకు మిగులుతుంది.

- విరించి, 9444963584