సాహితి

గుణదోష విచక్షణ కరువైన విమర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని ఎంతగా అన్నా, వర్తమాన కాలానికిగల ఆకర్షణ తిరుగులేనిది. వర్తమాన కాలంలో ఏది జరిగినా అది మనిషి అనుభూతిని పదిలం చేస్తుంది. పది కాలాలపాటు గుర్తుంచుకొనేలా మలుస్తుంది. సాహిత్య విషయంలో కూడా ఇదే పునరావృతవౌతుంది. మనిషి తన సమకాలంలో ప్రభవిస్తున్న సాహిత్యాన్ని ఎక్కువగా స్వీకరిస్తాడు. ఇందుకు కారణం అతని వర్తమాన కాలానికీ, అనుభవంలో ఉన్న జీవితానికీ మధ్య అంతరం లేకపోవడమే.
సాహిత్యం అన్నింటి కలయిక. సకల గుణ సహితం అయినందువల్లనే ‘సాహిత్యం’ అనే పేరు సార్థకం. సాహిత్యంలో మూడు కాలాలున్నాయి. గత కాలపు సాహిత్యం అంతా పునాదివంటిదే. దానిపై కడుతున్న భవనం లాంటిది వర్తమాన సాహిత్యం. వర్తమాన సాహిత్యం కూడా కొంతకాలమైన తరువాత గతంలోకి జారుకునేదే. అయినా ఎప్పుడూ వర్తమాన సాహిత్యం తాజా భోజనం వంటిది. దానిని ఆరగించడానికి పాఠకభోక్తలు ఉవ్విళ్లూరుతారు. అయితే వర్తమాన సాహిత్యం అంతా ఆస్వాదయోగ్యమని చెప్పలేము. గుణదోషాలు రెండు రచనలలో సర్వ సాధారణాలు. పాఠకులు గుణాలను స్వీకరించి, దోషాలను వదలి వేయాలి. అప్పుడే మనస్సు ఆహ్లాదభరితవౌతుంది. అప్పయ్య దీక్షితుడు కువలయానందంలో - ‘వివేకం కలిగిన పాఠకుడు శివునివంటివాడు. శివుడు గుణాకరుడైన చంద్రుణ్ణి తలమీద పెట్టుకొన్నాడు. దోషాత్మకమైన విషాన్ని కంఠంలో దాచుకున్నాడు. అలాగే సహృదయ పాఠకుడు సైతం గుణాలను శిరస్సుపై ధరించి, దోషాలను దిగమ్రింగాలి’ అంటాడు.
వర్తమాన సాహిత్యంలో విమర్శకు అగ్రస్థానం ఉంది. కానీ సదసద్వివేచనతో కూడిన విమర్శలు ఎక్కువగా రావడం లేదు. దీనికి కారణం విమర్శకులలో నిజాయితీ కొరవడడమే. ప్రతీ కవీ, ప్రతీ రచయిత తన రచనను కన్నబిడ్డలా భావిస్తాడు. కన్నబిడ్డ ఎలా ఉన్నా తల్లిదండ్రులకు ప్రీతిని కలిగిస్తాడు. కారణం మమతానురాగాలే. కన్నబిడ్డ తెలిసీ తెలియని ప్రాయంలో చేసే తప్పులను పెద్దలు పట్టించుకోనవసరం లేదు. ఆ వయస్సులో ఏది చేసినా ఒప్పే అవుతుంది. కానీ తెలిసి కూడా చేసే తప్పులను తల్లిదండ్రులు మమకారాన్ని అడ్డుపెట్టుకొని అంగీకరిస్తూ పోతే, పిల్లలు ఎంతగా ఎదిగినా తప్పులే చేస్తుంటారు. వాళ్ళకు తప్పేదో, ఒప్పేదో తెలియనే తెలియదు. కనుక తల్లిదండ్రులు పిల్లలను చిరుప్రాయం నుండే సంస్కరించడానికి పూనుకోవాలి. ‘మొక్కై వంగనిది మ్రానై వంగుతుందా?’ అనే సామెత పిల్లలపట్ల అన్వయించినట్లే కవులపట్ల, రచయితలపట్ల అన్వయించుకోవాలి. వారిని సంస్కరించేందుకు విమర్శకులు పూనుకోవాలి. ఈనాటి సాహిత్య విమర్శకులలో చాలామంది నిష్పక్షపాత విమర్శకు పూనుకోవడం లేదు. ముఖస్తుతి పరాయణత్వం, మొగమాటం, ఆశ్రయంవల్ల లబ్ధిపొందాలనే తాపత్రయం, ప్రతిఫలాపేక్ష, సత్కృతి సమ్మానాలపైన గల లోభం వారి విమర్శలలో సత్యాన్ని మరుగుపరచి, అసత్యాలను ఆవిష్కరింప జేస్తోంది. కొందరు విమర్శకులకు అందరు రచయితలూ ఒకే విధంగా కనబడుతారు. అలాంటివారు ‘రామాయ స్వస్తి, రావణా స్వస్తి’ అన్నట్లు అందరినీ అందలమెక్కిస్తారు. దీనివల్ల వారికి లాభమే తప్ప నష్టం లేదు. కానీ సాహిత్య రంగానికి మాత్రం అపార నష్టాన్ని కలిగిస్తున్నారని మరచిపోరాదు. ప్రతివాణ్ణీ ‘ఇంద్రుడూ, చంద్రుడూ’ అని పొగిడితే ఆ పదాలకు విలువ ఉండదు. శబ్దగత దోషాలూ, వాక్యగత దోషాలూ, సమాసకల్పనలలో తప్పుల తడకలూ, వాక్య నిర్మాణంలో అయోమయాలూ, గందరగోళాలూ స్పష్టంగానే కనబడుతున్నా వాటిని గూర్చి సూచన చేయకుంటే విమర్శకు అర్థం ఉందా? ఒక్క రాత్రిలో మహాకవి పీఠాలను అధిరోహించాలనీ, మహా రచయితలమని ప్రచారం చేసుకోవాలనీ భావించేవారి సంఖ్య దినదిన ప్రవర్థమానవౌతున్నది. ఇది సాహిత్యరంగానికి అభ్యుదయ కారకమేనా? ఆలోచించాలి. ఏదిపడితే అది పుంఖాను పుంఖాలుగా రాసి, అచ్చువేసి, అనతికాలంలోనే అగ్రపురస్కారాలు అందుకోవాలనే తహతహతో కొందరు కవులూ, రచయితలూ కనీసం ఒక్క నిముషమైనా వెనుకకు తిరిగి ‘సింహావలోకనం’ చేసుకోవడం లేదు. ఏది మంచి రచనో, ఏది కాదో ఒక్కసారి పునస్సమీక్ష చేసుకుంటే తెలుస్తుంది. కానీ కొందరికి ఆ తీరిక కూడా ఉండడం లేదు. రాకెట్ వేగంతో పురోగమించాలనే దుగ్ధతో అన్ని ప్రమాణాలనూ గాలికి వదిలేస్తున్నారు. రాసిందల్లా అచ్చు కావాలనీ, అచ్చు అయినా ప్రతీ అక్షరం ప్రశంసకు నోచుకోవాలనీ కొందరు పడుతున్న ఆరాటం చూస్తుంటే ఇంత దిగజారడం అవసరమా? అని అనిపించక మానదు. చాలామంది కవులు తమ రాతలు వనె్నదేరకుండానే ఆగమాగం చేసి రాసేస్తుంటారు. అలాంటి రాతలు ఏ రసంలో చెప్పినా నీరసంగానే ఉంటాయి. ఉక్తివైచిత్రి శూన్యం. వర్ణనశీలం మృగ్యం. ప్రయోగ చతురత అత్యల్పం. భావుకత అదృశ్యం. ఇక కవిత్వానికి ఏది విలువ? రాసిందల్లా కవిత్వమే అనే అత్మోత్కర్ష స్వభావం పతన హేతువేగాని, ప్రగతి హేతువు కాదు.
అస్వారస్యాలను ఎండగట్టి, స్వారస్యాలను ఎత్తి చూపడం విమర్శ. విచ్చివిచ్చి వింగడించడం విమర్శ. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో స్పష్టంగా చెప్పడం విమర్శ. విమర్శకునికి సత్యశీలం అవసరం. మహాకవులైనంత మాత్రాన వారి రచనలన్నీ, ఎల్లవేళలా గొప్పగానే ఉంటాయనుకోరాదు. పరిణతకవులు సైతం పనికిరాని రాతలు రాయవచ్చు. అలాంటి వాటిని విమర్శకుడు నిష్కర్షగా చెప్పాలి. కొత్తగా కలం పట్టినవాడు గొప్పగా రాయవచ్చు. ప్రసిద్ధ కవులు సైతం అచ్చెరువొందేలా రాసే సామాన్య కవులు కూడా ఉంటారు. విమర్శకుని దృష్టి ఇలాంటివి గుర్తించాలి. నేడు చాలా పుస్తకాల మీద వస్తున్న విమర్శలు అనవసర వ్యాఖ్యానాలతో అతిశయిస్తున్నాయి. మూలంలో లేని గొప్పతనాలను ఆపాదిస్తున్నాయి. అలాంటి విమర్శలను మొదట చదివి, ఆ తరువాత మూల గ్రంథాన్ని చదివేవారికి విమర్శకులపై దురభిప్రాయం ఏర్పడదా? కొందరు విమర్శకులు పుస్తకాలను ఆమూలాగ్రం చదవరు. పైపైనచదివి తంతు ముగిస్తారు. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న పుస్తకాలవలెనే తామూ కుప్పలు తెప్పలుగా విమర్శలను రాసిపారేయాలనే ‘కండూతి’ విమర్శన రంగాన్ని భ్రష్టుపట్టిస్తోంది. ఇప్పుడు ఎంత గొప్పగా విమర్శ చేశాడనే మాట వినబడదు. ఎన్ని వందల పుస్తకాలకు విమర్శలు రాశామనేదే ప్రాతిపదిక అవుతోంది. ఇది విమర్శ రంగానికి పురోగమనమా? తిరోగమనమా? విమర్శకులే చెప్పాలి. తమకు అవగాహనలేని విషయాలపై వచ్చే పుస్తకాలకు సైతం కొందరు విమర్శకులు విమర్శలు రాస్తుంటారు. అలాంటి సందర్భాలలో వారి ‘అజ్ఞానం’ ఎక్కడో ఒకచోట బయటపడుతుంది. అప్పుడు విమర్శకుడు అభాసుపాలుకాక తప్పదు. పూర్వం ఒక విమర్శకుడు తన దగ్గరికి సమీక్షకై వచ్చిన ‘ప్రౌఢమనోరమాకు చమర్దనం’ అనే గ్రంథాన్ని చదువకుండానే అది ఒక గొప్ప శృంగార ప్రబంధమని వ్యాఖ్యానించాడట. తీరా ఆ పుస్తకంలోని విషయాన్ని చదివితే ‘ప్రౌఢమనోరమ’ అనే వ్యాకరణ శాస్త్ర గ్రంథంపై ఒక వ్యాకరణ వేత్త ఖండన రూపంలో రాసిన విమర్శ గ్రంథమని తేలింది. ఇలాంటి విమర్శకులూ నేడు ఉన్నారని చెప్పాలి.
ఏది ఏమైనా సమకాలీన సాహిత్య రంగానికి గుణదోష విచక్షణ శీలురైన విమర్శకులు కావాలి. వారి విమర్శలు గ్రంథస్థ విషయానికి న్యాయం చేసేవిగా ఉండాలే గానీ, అన్యాయం చేసేవిగా ఉండకూడదు. అనుచిత విమర్శలు సాహిత్యరంగాన్ని కలుషితం చేస్తాయని విమర్శకులు గుర్తుంచుకోవాలి.

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ 9440468557