Others

భక్తి సరే! శ్రద్ధ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రముఖులు మరణించిన సందర్భాల్లో మీడియా స్పందన అభినందనీయం. ఎనభైలలో మహా కవి శ్రీశ్రీ, దాశరథి, ఆత్రేయ మొదలైన వారు మరణించినప్పుడు పత్రికలు తప్ప దృశ్య మాధ్యమానికి చెందిన చానల్స్ లేకపోవడంవల్ల ఇంత విస్తృత ప్రచారం లేదు. అయితే ఇప్పుడు కొన్ని టీవీ చానల్స్, పత్రికలు వెంటనే సమాచారం ఇవ్వాలనే అత్యుత్సాహంతో సత్యాల మీద దృష్టిపెట్టే వ్యవధిని తీసుకోకుండా పొరపాట్లకు తావిస్తున్నారు. ముఖ్యంగా దివంగత సినీ గేయకవుల పట్ల అతి భక్తితో వారికీ, చరిత్రకు అపచారం చేస్తున్నారు.

ఉదాహరణకు డా.సి నారాయణరెడ్డికి శ్రద్ధాంజలి కార్యక్రమాల్లో కొన్ని టీవీ ఛానల్స్ ఆయన రచనలుగా ప్రసారం చేసిన పాటలలో నా దృష్టికి వచ్చిన ఆయనవి కాని కొన్ని-
1. అరెరె! చేతిలో డబ్బులుపోయెనే...
(కుల గోత్రాలు- కొసరాజు)
2. ఈ వౌనం, ఈ బిడియం ఇదే నా ఇదేనా...
(డా. చక్రవర్తి- ఆరుద్ర)
3. ఓ బంగరు రంగుల చిలక, పలకవే...
(తోటరాముడు- దాశరథి)
4. నన్ను వదిలి నీవు పోలేవులే...
(మంచి మనసులు- దాశరథి)
5. అన్నా, నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం...
(ఆడపడుచు- దాశరధి)
6.రాళ్లల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు...
(సీతారామ కల్యాణం- ఆత్రేయ)
సినారె బ్రతికుండగానే కొన్ని ప్రాచుర్యం పొందిన టీవీ కార్యక్రమాల్లో ఆయన ఖాతాలో జమ అయిన ఆయన రాయని పాటలకు ఉదాహరణలు
1.జోరుమీదున్నావు తుమ్మెదా..
(శివరంజని- దాసంగోపాలకృష్ణ)
2. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురులో..
(ముత్యాల ముగ్గు- ఆరుద్ర)
ప్రముఖ పత్రికలలో సినారె
రచనలుగా దొర్లిన పొరపాటులు-
1. మనసొక మధుకలశం.. (నీరాజనం- ఆత్రేయ)
2. మానవుడే మహనీయుడు.. (బాలభారతం- ఆరుద్ర)
పై ఉదాహరణల్లో కొన్ని వివాదాస్పదమైన చర్చల్లో ప్రాచుర్యం పొందినవి కావడం గమనార్హం. ‘మానవుడే మహనీయుడు’ పాట గురించి అది తను రాసిన ‘గాంధారి గర్వభంగం’లోని ‘మనుష్యుడిల మహానుభావుడే’ స్పూర్తితో రాసిందని శ్రీశ్రీ స్వయంగా చెప్పారు. అలాగే ‘ఓ బంగరు రంగుల చిలకా’ రాజశ్రీ రచనగా ప్రచారమైతే దానిని ఆయన తనయుడు సుధాకర్ రాజశ్రీయే ఖండించారు!
ఇక ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావుకు నీరాజనాలు సమర్పిస్తూ ప్రసారం చేసిన ఆయన రచనలు కాని కొన్ని పాటలకు ఉదాహరణలు...
1. ఇదే నా మొదటి ప్రేమ లేఖ..
(స్వప్న- రాజశ్రీ)
2. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన..
(మేఘ సందేశం- వేటూరి)
3. ఎవరు రాయగలరు అమ్మ అనే..
(అమ్మ రాజీనామా- సీతారామశాస్ర్తీ)
అయితే పై పాటలు ఆయనవి కాకపోయినా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లోవి కనుక పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
ఒకరి పాటలు ఇంకొకరి పేరుతో రావడం సినిమాల్లో మొదటినుంచీ ఉంది. ఉదాహరణకు సముద్రాల రాఘవాచార్యులవారి పాటల్లో కొన్ని మల్లాది రామకృష్ణ శాస్ర్తీ రాసినవేనని, దాసరి పాటల్లో కొన్ని కృష్ణశాస్ర్తీ, పాలగుమ్మి పద్మరాజు కృతులని చాలామంది అభిప్రాయం. ఇలాంటి ఘోస్ట్ రైటింగ్ గురించి ఆరుద్ర, మల్లాదివారిని సూటిగా అడిగితే- ‘నీ పేరు భాగవతుల సదాశివ శంకరశాస్ర్తీ కాగా ‘ఆరుద్ర’ పేరుతో రాస్తున్నట్టే నేను ‘సముద్రాల’ కలం పేరుతో రాస్తున్నాను’ అని గడుసుగా సమాధానమిచ్చారట. ‘సౌదామిని’ చిత్రంలో ఆరుద్ర రాసిన కొన్నిపాటలు సముద్రాలలో కలిసిపోగా- ‘పల్లె పడుచు’ చిత్రంలో మల్లాదివారు రాసిన- ‘ఏరు నవ్విందోయ్, ఊరు నవ్విందోయ్’ అనే పాట ఆరుద్ర ‘సింగిల్ కార్డ్’లో తల దాచుకుందట. కాగా శ్రీశ్రీ- ఆరుద్ర మొదలైన జంటకవులు చేసిన ఉమ్మడి సేద్యంలో వారి ముద్రల్ని నిశితంగా పరిశీలిస్తే తప్ప ఏ పాట ఎవరిదో తేల్చడం అంత తేలిక కాదు.
కవుల శైలులను, వారి పేర్లలో ఉండే సారూప్యతను బట్టి అప్పుడప్పుడు ఒకరి పాట ఒకరిదిగా భ్రమపడే అవకాశం ఉంది. ఆచార్య ఆత్రేయ మనసు పాటలకు, శ్రీశ్రీ విప్లవగేయాలకు ప్రసిద్ధులు కావడంవల్ల ‘తోడికోడళ్లు’ చిత్రానికి ఆత్రేయ రాసిన ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదాన’ పాట శ్రీశ్రీ రచనగాను, డా.చక్రవర్తి చిత్రానికి శ్రీశ్రీ రాసిన ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై’ పాటను ఆత్రేయదిగాను భ్రమించి పందాలు కూడా కాసిన వాళ్లెందరో. ఇక వీటూరి- వేటూరి పేర్లలో వుండే పోలికను బట్టి ఈ తరానికి అంతగా తెలియని వీటూరి పాటలను వేటూరి ఖాతాలో వేసిన విమర్శకులు, పాత్రికేయులు లేకపోలేదు. ఆమాటకొస్తే యమగోల చిత్రంలో పైఇద్దరు పాటలు రాయడంవలన ‘చిలక కొట్టుడు కొడితే’ పాట రచయితగా పాటల పుస్తకాల్లో వీటూరి సుందరరాంమూర్తి అని ప్రచురించారు. ఒక్కొక్కసారి ఒకే చిత్రంలో అదే పల్లవి పునరావృత్తమైనప్పుడు ఆనంద, విషాద సన్నివేశాలకు గురు శిష్యుల్లాంటి వేర్వేరు కవుల చేత పాటలు రాయించినపుడు కూడా ఈ గందరగోళం నెలకొంటుంది. ఉదాహరణకు ‘పెళ్లికానుక’ చిత్రంలో ఆడేపాడే పసివాడ.. అనే పల్లవితో ఆనంద సన్నివేశానికి చెఱువు ఆంజనేయ శాస్ర్తీ, విషాద సన్నివేశానికి ఆత్రేయ పాటలు రాశారు. అలాగే ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రానికి ‘ఓ ముత్యాల రెమ్మ, మురిపాల కొమ్మ..’ అంటూ సినారె కథానాయిక పరిచయ గీతం రాస్తే, సుద్దాల అశోక్ తేజ ఆ పాట బాటలో ‘రామ చక్కని తల్లి రాములమ్మో’ అంటూ విషాద గీతాన్ని రాశారు. మంచి పాటలు రాయించాలనే పూనికతో కె మురారి వంటి నిర్మాతలు ఒకే పాటను ఇద్దరు ముగ్గురు కవుల చేత రాయించడం కూడా కర్తృత్వం గురించి సంశయాలను కలిగించింది. ‘గోరింటాకు’ చిత్రంలో ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పాటకు పల్లవి మాత్రమే రాసిన (చరణాలు ఆత్రేయ రాశారు) వేటూరికి, ఆ పాట క్రెడిట్స్ ఇవ్వడం, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంలో ‘ఇరువురు భామల కౌగిలిలో’ పాటకు పల్లవి మాత్రమే రాసిన ఆత్రేయకు (ఎక్కువ భాగం వేటూరి, కొన్ని పంక్తులు సిరివెనె్నల రాశారట) ఆ పాట క్రెడిట్స్ ఇవ్వడం విమర్శకులను పరిశోధకులను తికమకపెట్టదా మరి.
ఇంతకీ పైన పేర్కొన్న తారుమారులకు, తప్పులకూ కొంత అర్థం ఉంది. వీటికి ద్వితీయ శ్రేణి ఆకరాలు, నెట్‌లోని సమచారాన్ని ప్రామాణికంగా గ్రహించడం కూడ కారణాలే. అయితే దివంగత కవులకు చెందిన అయినవాళ్లు ప్రచురించిన పుస్తకాలలోను, అమిత ప్రాచుర్యంగల సినీ సంగీత కార్యక్రమాల్లోను తప్పులు దొర్లడం మాత్రం దారుణం. ఉదాహరణకు శ్రీశ్రీ ‘పాడవోయి భారతీయుడా’ పేరుతో తన సినిమా పాటల సంకలనాన్ని ప్రచురించగా, ఆయన మరణానంతరం శ్రీమతి సరోజ ‘పాడవోయి భారతీయుడా’ మొదలైన ఐదు సంపుటాలుగా శ్రీశ్రీ సినిమా పాటలను ప్రచురించారు. అవి తప్పులు తడకలనడానికి శ్రీశ్రీ ఖాతాలో వేసిన ఇతర కవుల ప్రసిద్ధ గీతాలే సాక్ష్యాలు.
1. చల్లని రాజా, ఓ చందమామా (ఇలవేలుపు -వడ్డాది)
2. దేవుడికే హాయిగ ఉన్నాడు... (శభాష్ సూరి- ఆత్రేయ)
సుప్రసిద్ధ రచయిత్రి, ఆరుద్ర అర్ధాంగి అయిన శ్రీమతి కె రామలక్ష్మి ఆరుద్ర సినీ గీతాలను ఐదు సంపుటాలుగా వెలువరించేటప్పుడు కూడా ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. డా.కంపెల్లి రవిచంద్రన్ ఆరుద్ర సినీగీతాల ప్రచురణలోని లోటుపాట్లు అనేకం ఏకరువు పెడుతూ 2009లో ‘చిత్రప్రభ’లో ఓ సుదీర్ఘ వ్యాసం రాశారు. ఇంద్రధనస్సు చిత్రంలో ఆత్రేయ రాసిన-
‘నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమ వాసివి’ వంటి బహుళ ప్రాచుర్యం పొందిన పాట కూడా ఆరుద్ర రచనగా ఇందులో చోటు చేసుకుందంటే ఈ సంకలనంలో నిర్లక్ష్యానికి ఇంకా నిదర్శనాలు అవసరమా?
సినీ గేయ సాహిత్య పరిశోధనలో మూర్థన్యులైన భరాగో ప్రచురించిన 116 గొప్ప తెలుగు సినిమా పాటలు, మరో నూట పదహారు సినీగేయ విశే్లషణ గ్రంథాల్లో కూడా దొర్లిన సమాచార దోషాలకు-
1. సంసారం సంసారం ప్రేమసుధా పూరం... (సంసారం- సదాశివ బ్రహ్మం -కవిగా కెజి శర్మను పేర్కొనడం సరికాదు)
2. రామ సుగుణ ధామ (లవకుశ- సదాశివ బ్రహ్మం- సముద్రాలను కవిగా చెప్పడం పొరపాటు)
3. అమ్మానొప్పులే, అమ్మమ్మా నొప్పులే (చిన్నప్పుడు మోహన్‌కందా నటించగా ప్రాచుర్యం పొందిన ఈ పాట రాసింది పింగళి కాదు- ఊటుకూరి సత్యనారాయణ)
4. చిగురులు వేసిన కలలన్నీ.. (‘పూలరంగడు’లో సినారె రాసిన ఈ పాటను దాశరధి ఖాతాలో జమ చేశారు)
‘ప్రమాదో ధీమతామపి’ అని ఎంతటి వారి రచనల్లోనైనా పొరపాట్లు సహజం. ఎటొచ్చి అవి పరిపాటి, అలవాటు కాకూడదు. భరాగో అంతటి అనారోగ్యంలోను ఇంతటి అమూల్యమైన పుస్తకాలను రూపొందించడం మాత్రం అవశ్యం అభినందనీయం. ‘పాడుతా తీయగా’ కార్యకమంలో అడపా దడపా ఇలాంటి అపశృతులు వినిపిస్తున్నప్పుడు తర్వాతి సంచికల్లో వాటిని సరిదిద్దుకుని విచారాన్ని వ్యక్తం చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్కారం ఈ విషయంలో అందరికీ ఆదర్శప్రాయం.
చివరిగా మన(సు)లో మాట. తెలుగు సినీ గేయ కర్తృత్వానికి సంబంధించిన సమచార దోషాల గురించి ఇంతగా రాద్ధాంతం చేస్తున్న నా పరిశోధన గ్రంథాల్లోను తప్పులు లేకపోలేదు. వాటిని మలి ముద్రణల్లోను, తర్వాతి వ్యాసాల్లోను సవరించుకుంటున్నాను. సినీ గేయ సాహిత్యానికి సంబంధించిన ఉద్దండులూ, ప్రామాణికులు అనదగిన వారి కలాలనుంచి, గళాలనుంచి పొరపాట్లు దొర్లితే- అవి జనసామాన్యం నిజమనుకునే ప్రమాదముంది. భావి పరిశోధకులను అవి పెడదారి పట్టిస్తాయి. అందువల్ల సత్యనిష్ఠ కొరవడిన సమాచారం ఉపచారానికి బదులుగా చరిత్రకు అపచారం చేస్తుందని ఈ హెచ్చరిక.

-డా.పైడిపాల