రివ్యూ

రివెంజ్.. రివర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * పటేల్ సార్

తారాగణం: జగపతిబాబు, పద్మప్రియ, తాన్యాహోప్, ఆమని, సుబ్బరాజు, పోసాని, రఘుబాబు, సుధాకర్
సినిమాటోగ్రఫి: శ్యామ్ కె.నాయుడు
సంగీతం: డి.జె.వసంత్
ఎడిటింగ్: గౌతంరాజు
మాటలు: ప్రకాష్
నిర్మాత: రజనీ కొర్రపాటి
రచన, దర్శకత్వం: వాసు పరిమి
*
హీరో నుంచి విలన్‌గా, తర్వాత క్యారెక్టర్ హీరోగా టర్న్ తీసుకున్నాడు జగపతిబాబు. చాలా గ్యాప్ తర్వాత అలాంటి హీరోయజాన్ని చూపించిన సినిమా ‘పటేల్ సర్’. 60 ఏళ్ళ వయసు గెటప్‌లో జెబి -పటేల్ సార్‌లా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టైటిల్‌లోనే ఆసక్తి కనబర్చిన పటేల్ కథ ఏంటంటే...
రిటైర్డ్ ఆర్మీ మేజర్ సుభాష్ పటేల్ (జగపతిబాబు) ఓ పాపతో కలిసి ఉంటుంటాడు. ఒకవైపు పాప చూపు కోసం ఆస్పత్రుల వెంట తిరుగుతూ, మరోవైపు దేవరాజ్ (కబీర్‌సింగ్) గ్యాంగ్‌లో ఒక్కొక్కరినీ లేపేస్తుంటాడు. పాప కళ్ళు తెరిచే సమయానికి టార్గెట్ పూర్తిచేయాలన్నది పటేల్ లక్ష్యం. మరోవైపు హత్య కేసులు దర్యాప్తు చేస్తున్న క్యాథరిన్ (తాన్యహోప్) అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ దేవరాజ్ గ్యాంగ్‌ని పటేల్ ఎందుకు టార్గెట్ చేశాడు? పటేల్‌కి ఆ గ్యాంగ్‌కి ఉన్న సంబంధమేమిటి? హత్యలన్నీ పటేల్ చేస్తున్నట్టు క్యాథరిన్ ఎలా గుర్తించింది? ఇదీ మిగతా కథ.
నిజానికి పటేల్ సార్‌లో గెటప్ తప్ప కొత్త అంశమేమీ లేదు. సినినా మొదలైన పది నిముషాల్లోనే రొటిన్ రివెంజ్ డ్రామా అన్న నిర్ణయానికి వచ్చేస్తాం. కష్టం లేకుండా క్లైమాక్స్ కూడా ముందే అర్థమైపోతుంది. 60 ఏళ్ళ వయసులో హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అతనికి జరిగిన అన్యాయం ఏమిటి? పాప ఎవరు? వీటికి సమాధానమే అసలు కథ.
క్యారెక్టర్ హీరోగా మారిన జెబి, మరో కొత్త గెటప్‌లో కనిపించాడు. సీక్వెల్ మర్డర్లు గత సినిమాల్లోనే చూసేసినా, 60లు దాటిన వ్యక్తి పగ తీర్చుకోవడం రివెంజ్ డ్రామాలో ఒకింత కొత్త విషయం. జెబి తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్‌లోగానీ ఆకట్టుకునే పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. బేబీ డాలి కూడా తన నటనతో ఆకట్టుకుంది. సినిమా స్టార్టింగ్ నుండి కథతో లింక్ అయి వున్న క్యారెక్టర్‌లో పోసాని తనదైన స్టైల్‌లో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన తాన్యాహోప్ నటన కాస్త ఓవరైంది. మిగతా పాత్రల్లో రఘుబాబు, కబీర్‌సింగ్, ప్రభాకర్, సుబ్బరాజు, శుభలేఖ సుధాకర్ తదితరులు పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గంలో- శ్యామ్ కె.నాయుడు ఫొటోగ్రఫి రిచ్‌గా వుంది. ప్రతి ఫ్రేమ్‌ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. పాటలు అంతగా ఆకట్టుకోకున్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది. నిడివి పెంచడానికి కొన్ని అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయకుండా వదిలేశారనిపిస్తుంది. రొటీన్ రివెంజ్ డ్రామాని డైరెక్టర్ వాసు పరిమి కొత్తగా చూపించడానికి చేసిన ప్రయత్నం వర్కవుట్ కాలేదు. చాలా సందర్భాల్లో లాజిక్‌ను గాలికొదిలేసి దాటేసే ప్రయత్నం చేశారు. సింథటిక్ డ్రగ్స్ గురించి సినిమా స్టార్టింగ్‌లో మాత్రమే చెప్పాడు. విలన్ గ్యాంగ్ ఎంత గట్టిదైనా వాళ్ళని చంపడానికి వారి స్థావరానికి హీరో ఇట్టే చేరిపోతుంటాడు. చాలా రోజుల తర్వాత హీరోగా చేసిన జగపతిబాబు సినిమాను చాలావరకు తన భుజాలమీదే నడించాడు. సెకెండాఫ్ ఎమోషనల్ డ్రామా, జగపతిబాబు నటన, మేకోవర్, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు ప్లస్ పాయింట్లు. రొటీన్ రివెంజ్ స్టోరీ, ఫ్లాష్‌బ్యాక్‌లో మిస్సయన లాజిక్ మైనస్ పాయంట్లు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో రొటీన్‌గా మర్డర్లతో బోరింగ్ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హీరో కొడుకు క్యారెక్టర్ ఎంటర్ అవ్వడంవల్ల, వారిమధ్య నడిచే కొన్ని సెంటిమెంట్ సీన్స్‌తో గ్రాఫ్ కాస్త పెరిగింది. అతను విలన్లను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది తెలిసిన తర్వాత, సినిమామీద కాస్త ఆసక్తి పెరుగుతుంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కొన్ని అంశాలు ఉన్నా, పటేల్ సర్ ఒక తరహా సినిమాకు అలవాటుపడిన ప్రేక్షకులకే నచ్చుతాడు.

-త్రివేది