జాతీయ వార్తలు

గోప్యత హక్కు పరిపూర్ణం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18:గోప్యత హక్కు పరిపూర్ణం కాదని, దీనిపై సహేతుక రీతిలో కొన్ని ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చునా అన్న అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం పరిశీలనకు చేపట్టిన సందర్భంగా ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ అంశానికి సంబంధించిన భిన్నమైన కోణాలు, అంశాలు, పరిధి, పరిమితుల పరిశీలన విషయంలో తమకు సహకరించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం కోరింది. గే సెక్స్ నేరమంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించిన న్యాయమూర్తులు ‘గోప్యత హక్కును విస్తృత పరిధిలో పరిగణనలోకి తీసుకుంటే..నాజ్ ఫౌండేషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు బలహీన పడుతుంది’అని పేర్కొన్నారు. పరస్పర అంగీకారంతో లెస్బియన్లు, గేలు తదితరుల మధ్య జరిగే అసహజ లైంగిక సంపర్కాన్ని నేరంగా పరిగణించకూడదంటూ నాజ్ ఫౌండేషన్ న్యాయపోరాటం చేయడం తెలిసిందే. బుధవారం ఉదయం నుంచి జరిగిన విస్తృత స్థాయి విచారణలో ధర్మాసనం అనేక అంశాలను విపులీకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గోప్యత హక్కు పరిపూర్ణం కాదని, స్వేచ్ఛా హక్కులో ఇది ఓ చిన్న భాగం మాత్రమేనని న్యాయమూర్తులు చలమేశ్వర్, ఎస్‌ఎ బోద్బే,ఆర్‌కె అగర్వాల్,్ఫలీ నారిమన్, చంద్రచూడ్‌లతో కూడిన ఈ విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది. పిల్లల్ని కనడం అన్నది గోప్యతా హక్కు పరిధిలోకి వచ్చినా తమ పిల్లల్ని స్కూళ్లకు పంపించాలని ఆదేశించే హక్కు ప్రభుత్వానికి ఉండదని చెప్పడం దీని పరిధిలోకి రాదని కోర్టు తేల్చిచెప్పింది. అలాగే డేటా భద్రతా అంశాన్నీ ప్రస్తావిస్తూ ‘ ఇది గోప్యత హక్కు కంటే చాలా విస్తృతమైనది. మనం సమస్త కోణాల్లోకి విస్తరించి డేటా ప్రపంచంలో నివసిస్తున్నాం. నేర నియంత్రణ, పన్నులు విధించడం వంటి అనేక అంశాల కోసం దీన్ని నియంత్రించాల్సిన హక్కు ప్రభుత్వానికి ఉంటుంది’అని ధర్మాసనం వివరించింది. గోప్యతా హక్కు చట్టాలు చేయడానికి, నియంత్రించడానికీ ప్రభుత్వానికి ఎంత మాత్రం వీల్లేనంత పరిపూర్ణమైనది కాదని విస్పష్టంగా తెలిపింది. రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వ్యక్తిగత వివరాలు అడిగితే అది గోప్యతా హక్కును హరించినట్టు కాదని తెలిపింది. పిటిషనర్ల తరపున వాదించిన సీనియర్ న్యాయమూర్తి గోపాల్ సుబ్రమణియం ఈ చర్చను ప్రారంభించారు. గోప్యతా హక్కు అన్నది ప్రాధమిక హక్కు నుంచి విడదీయలేని, అంతర్గత భాగమని ఆయన వాదించారు. స్వేచ్ఛా హక్కులో ప్రైవసీ హక్కు కూడా భాగమేనని స్పష్టం చేసిన గోపాల్ సుబ్రమణ్యం దీన్ని రాజ్యాంగం ధృవీకరించడమే కాకుండా ప్రజలందరికీ అందిస్తోందని తెలిపారు. ప్రైవసీ లేకుండా స్వేచ్ఛను ఎలా అనుభవించగలుగుతామని ప్రశ్నించిన ఆయన ‘స్వేచ్ఛ, జీవనం అన్నవి రాజ్యాంగం కల్పిస్తున్న సహజసిద్ధమైన హక్కు’లని ఉద్ఘాటించారు. గోప్యతా హక్కు స్వేచ్ఛా హక్కులో భాగమే కాకుండా ఇది వ్యక్తి గౌరవానికీ సంబంధించిందని చెప్పారు. రాజ్యాంగ పీఠికను, 14వ అధికరణ (చట్టం ముందు సమానత),19వ అధికరణ (వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ),21వ అధికరణ (జీవన, స్వేచ్ఛా హక్కుల రక్షణ) వంటి అవిభాజ్య ప్రాథమిక హక్కుల్లో ప్రైవసీ హక్కు కూడా అంతర్భాగమన్నారు. ఇది మామూలు చట్టం కల్పించే హక్కే తప్ప ప్రాథమిక హక్కు కాదన్న అటార్నీ జనరల్ కెకె వేణు గోపాల్ వాదనతో గోపాల్ సుబ్రమణ్యం విభేదించారు.