సబ్ ఫీచర్

కులవ్యవస్థ నిర్మూలన ఇలాగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్ర, నిమ్న కులాలనే హిందూ సామాజిక వ్యవస్థ మానవత్వానికీ, సమానత్వానికీ శత్రువు కాబట్టి ఆ వ్యవస్థ అంతం కావాలని దా దాపు వంద సంవత్సరాల నుంచి ఎందరో సం స్కర్తలు బోధిస్తూ వచ్చారు. అంటరానితనం, దేవాలయ ప్రవేశ నిషిద్ధం, కొన్ని కులాల ఆధిపత్యం ఇవన్నీ అదృశ్యం కావాలని గొప్ప వ్య క్తులు, సంస్థలు ఉద్యమాలు చేపట్టిన విషయం తెలిసిందే. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆర్థికాభివృద్ధి సాధించి, అసమానతలు తొలగించడానికి, భ్రాతృత్వాన్ని పెంపొందించడానికి దృఢమైన జాతి నిర్మాణానికి కుల నిర్మూలన జరగాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు ఘోషిస్తున్నారు. తెలుగునాట 1945 నుంచి ఒక దశాబ్ద కాలంలో కమ్యూనిస్టు భావాల ప్రాచుర్యంతో కులాల స్పృహ తగ్గుముఖం పట్టింది.
కానీ, స్వాతంత్య్రం వచ్చిన తరువాత సార్వత్రిక ఎన్నికలు 1952 నుండి ప్రారంభవడంతో కుల స్పృహ, కుల ప్రభావం ఎక్కువైపోయింది. చట్టసభలు, స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో ఏ కులం వారిని పోటీకి పెడితే గెలుపు అవకాశాలు ఎక్కువవుతాయనే అంచనా ప్రారంభమైంది. ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు మంత్రులవ్వాలనే విషయం కూడా కులాన్ని పరిగణనలోకి తీసుకునే జరుగుతోంది. ఇలా జరుగుతుండగానే కుల నిర్మూలన జరగాలన్న ప్రసంగాలు, నినాదాలు, ఉద్బోధనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాలయాలలో ప్రవేశానికి, సంక్షేమ పథకాలకు రిజర్వేషన్ల రూపేణా కులం స్పృహ నానాటికీ తీవ్రతరం అవుతోంది. జనాభా పెరుగుదల, ఉపాధి అవకాశాల తగ్గుదల, పరిమితమైన అవకాశాలకు, సంక్షేమానికి కులాల వారీగా పోటీ ఎక్కువవుతోంది. ఇది ఎంతవరకు వికటించిందంటే- ‘మా కులం వెనుకబడింది, మాది మరీ వెనుకబడింది, మాలో ఉప కులాలున్నాయి. మాకై ఉద్దేశించబడిన రిజర్వేషన్లు ఉపకులాల ప్రాతిపదికన విభజింపబడాలి’ అని ఇపుడు కులసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఒకప్పుడు మా కులం గొప్పది అంటే, మా కులం మరీ గొప్పదని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు వెనుకబాటుతనం కోసం తీవ్రమైన పోటీ పడుతున్నారు. కొన్ని అగ్రకులాల వారు తమను బిసి జాబితాలో చేర్చాలని, బిసి జాబితాలో కులాలను ఎ,బి,సి,డి,ఇ గ్రూపులుగా వినజించాలని, బిసిలలో మరీ వెనుకబడినవారం కాబట్టి తమను ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించాలని పోటాపోటీగా ఉద్యమాలను నడుపుతున్నారు. అధికారం కోసం పాకులాడే రాజకీయ నేతలు, పార్టీలు అందరి కోరికలకు తాము సుముఖమే అంటూ ఎన్నికల ముందు తమ ‘సంకల్ప పత్రం’ (మానిఫెస్టో)లో హామీలు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి సమస్యలు ప్రారంభమయ్యాయి. కుల ప్రాతిపదికన గానీ, మత ప్రాతిపదికన కానీ రిజర్వేషన్లకు పరిమితులు, హద్దులు సుప్రీం కోర్టు తీర్పుతో గతంలోనే ఏర్పడ్డాయి.
ఈ అడ్డంకులను అధిగమించడానికి అడ్డదారులు పట్టాయి అధికారంలోని పార్టీ ప్రభుత్వాలు. కుల ప్రాతిపదికన సంక్షేమ కార్పొరేషన్లు స్థాపించడం ఆరంభమైంది. అగ్రకులానికి చెందిన బ్రాహ్మణులు- ‘మేము వెనుకబడ్డాం, మేము కటిక పేదవాళ్లం, మాకు రక్షణ కల్పించండి’ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బ్రాహ్మణ సంక్షేమ ఆర్థిక సహాయ సంస్థలను ఏర్పరిచి ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపాయలు ఇస్తున్నాయి. ఒకప్పుడు అగ్రకులం అని పేరుబడ్డ కాపు సామాజిక వర్గానికి మరొక సంక్షేమ కార్పొరేషన్‌ను ఏర్పరిచారు. ఒక రాష్ట్రంలో బిసిలను విభజించి ఎంబిసి (మోస్ట్ బాక్‌వార్డ్ కాస్ట్) అని కొన్ని కులాలను గ్రూపులుగా చేసి బిసి కోటాలో వారికొక నిర్దిష్టమైన నిష్పత్తిని ఇచ్చారు. ఇప్పటివరకు ముస్లింలకు, క్రిస్టియన్లకు, షెడ్యూలు కులాల వారికి దళితులు, షెడ్యూలు తెగలవారికి విడివిడిగా ఆర్థిక సహాయ సంస్థలను పెట్టారు. కులం పేరున వారికి సంక్షేమ భవనాలను నిర్మిస్తున్నారు.
‘మా కులానికి తక్కువ డబ్బిచ్చారు.. వేరే కులానికి ఎక్కువ డబ్బిచ్చారం’టూ కులాల మధ్య ద్వేషాలు, రగడలు ప్రారంభమవుతున్నాయి. కుల నిర్మూలన కావాలనుకున్న ధ్యేయం మరుగన పడి కులాల శాశ్వతీకరణ జరుగుతోంది. తమ మతంలో కులాలు లేవు అని చెప్పి మత మార్పిడులు చేయిస్తున్న క్రైస్తవ, ఇస్లాంలో కూడా కులాలున్నాయి. ఫలానా వృత్తిలో వున్న వారు ఫలానా కులానికి చెందినవారు కాబట్టి తమ మతంలోకి చేరిన కులాల వారిని ‘హిందూధర్మంలోని కులాల వారి’తో సమానంగా రిజర్వేషన్లలో వాటా ఇవ్వండి అని అంటున్నారు.
ధనార్జన కోసం, వంశపారంపర్యంగా అధికారం చెలాయించడం కోసం కొందరు ఘరానా వ్యక్తులు కంపెనీ తరహాలో రాజకీయ పార్టీలు పెట్టి అధికారం కోసం కులాలను సమీకరించుకుంటూ, కుల వ్యవస్థను శాశ్వత రూపంలో ఉంచడానికి సమాజాన్ని, జాతీయతను చీల్చుతున్నారు, బలహీన పరుస్తున్నారు. కుల స్పృహ ఎక్కువవుతుందే కానీ, సామాజిక స్పృహకు శతృత్వమే కానీ మిత్రత్వం పెరగడం లేదు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు, దేశభక్తులు, రాష్ట్రద్రష్టలు ఉద్బోధించిన విధంగా కాకుండా కుల వ్యవస్థను పటిష్టం చేస్తున్న రాజకీయ నాయకులు సామాజిక న్యాయం పేరిట ద్రోహం చేస్తున్నారు. మీడియాలో కులం అనే మాట తీసేసి, దాని స్థానే ‘సామాజిక వర్గం’ అంటున్నారు. ఈ విధంగా రచయితలు, మేధావులు కూడా వంచనలో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ దుర్గతికి బాధ్యులైన వారు ఇకనైనా జాతీయత పరిరక్షణకు పునరాలోచించాలి.

- డా.టి. హనుమాన్ చౌదరి