కృష్ణ

సర్వ హంగులతో శాఖమూరు పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: నూతన రాజధాని అమరావతిలో అన్ని హంగులతో అత్యాధునికంగా శాఖమూరు పార్కును రూపొందించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్‌లోని పబ్లిసిటీ సెల్‌లో బుధవారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడారు. సిఆర్‌డిఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎడిసి) అధికారులతో బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారాంతపు సమీక్ష సమావేశం ముగిసిన తరువాత ఆ వివరాలను మంత్రి విలేఖరులకు తెలిపారు. అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సిపి డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సంస్థ శాఖమూరు పార్కు డిజైన్‌ను రూపొందించి ఇచ్చినట్లు తెలిపారు. 241 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పార్కుని ప్రధానంగా నాలుగు జోన్లుగా విభజించినట్లు చెప్పారు. మొదటి జోన్ 85 ఎకరాలు, రెండో జోన్ 34 ఎకరాలు, మూడో జోన్ 49 ఎకరాలు, నాలుగో జోన్ అంబేద్కర్ పార్కుతో కలిపి 73 ఎకరాలు ఉంటుందని వివరించారు. మొదటి జోన్‌లో 46 ఎకరాల్లో అమ్యూజ్‌మెంట్ పార్కులో వాటర్ ఫాల్స్‌తో పాటు క్రాఫ్ట్‌బజార్, జలక్రీడలు ఉంటాయని తెలిపారు. రెండో జోన్‌ను పూర్తిగా పిల్లలకు కేటాయించారని, సాహస క్రీడలు, పిల్లల అవుట్‌డోర్ జిమ్ ఉంటాయని చెప్పారు. మూడో జోన్‌లో ఫ్లవర్ గార్డెన్, బాతుల చెరువు ఉంటాయన్నారు. జోన్ 4లో కల్చరల్ మ్యూజియం, అంబేద్కర్ పార్కు, ఇండోర్ అథ్లెటిక్ సెంటర్, స్పోర్ట్స్ క్లబ్, 5 స్టార్ హోటల్ వంటివి ఉంటాయన్నారు. ఇక్కడే అంబేద్కర్ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తారన్నారు. అన్ని జోన్లలో ఫుడ్‌కోర్టులు ఉంటాయని తెలిపారు. త్వరలో పార్కు నిర్మాణానికి టెండర్లు పిలుస్తారని, వచ్చే సంక్రాంతి నాటికి పూర్తిచేసి ఈ పార్కును ప్రారంభిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. ఈ పార్కుకు ‘గాంధీ మెమోరియల్’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో రోడ్ల ప్యాకేజీలు కూడా చివరి దశకు వచ్చాయని, రోడ్ల నిర్మాణానికి 18 నెలల సమయం ఇచ్చినట్లు తెలిపారు. హోటళ్లు నిర్మించడానికి ఆసక్తి కనబర్చిన వారిని పిలిపించి మాట్లాడినట్లు చెప్పారు. వారికి కేటాయించే భూమి విలువను ఎకరం 3కోట్ల రూపాయలుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. హోటళ్ల ఏర్పాటుకు ఆర్థికంగా సమర్ధులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి నారాయణ వివరించారు.