భక్తి కథలు

బసవ పురాణం- 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది చూచి భక్తగణమంతా బసవణ్ణి పొగిడారు. ‘‘పూర్వం మధురను పాలించే పాండ్యునికి ఒక మంత్రి ఉండేవాడు. అతడు శివభక్తుడు. పాండ్యులు కొన్ని గుర్రాలు కొనవలసిందిగా మంత్రికి ధనమీయగా మంత్రి దానిని జంగమార్చనకై వినియోగించాడు.
రాజు గుర్రాలను అడిగేసరికి మంత్రి పొలాలనుండి నక్కలను తెప్పించి చూపాడు. అయితే మధురలో వెలసిన శివుడు చొక్కనాధుడు భక్తుణ్ణి కరుణతో చూచాడు. తక్షణమే నక్కలన్నీ ఉత్తమాశ్వాలుగా మారిపోయాయి. అలాంటి బసవన్న తలిస్తే ధనాగారంలో లెక్కకు మిక్కిలి ధనం ఉండటంలో ఆశ్చర్యమేముంది?’’ అని భక్తులు ప్రశంసించారు.
బిజ్జలుడు ‘ఒరే! కొండెములు బసవన్నమీద ఎవరైనా కనుక ఇకముందు చెప్పినట్లయితే వాళ్ళ నాలుకలు కోసి సున్నం పూస్తాను’ అన్నాడు.
బసవన్న త్యాగం
ఇలా ఉండగా ఒకనాడు ఒక జంగముడు వేశ్య మందిరంలో ఉండి ఒక దాసిని పంపి నిత్యనైవేద్యం భండారి ప్రాసాదం నుండి తీసుకొని రమ్మన్నాడు. ఆ దాసి బసవన్న మందిరానికి పోయి బసవన్న ధర్మపత్ని గంగమాంబ ధరించిన చీరె చూచి భ్రమసిపోయి తిరిగి వచ్చి ‘అమ్మా! గంగమ్మ దాల్చిన చీరెవంటి చీరె ఎక్కడా చూడలేదు’ అన్నది.
అది విని వేశ్య జంగమయ్యను పిలిచి ‘నాకా చీర తెచ్చిపెట్టు. బసవన్న గంగార్చనలో జంగములకు ఏ వస్త్రాలు కావాలంటే అవి ఇవ్వడం అలవాటే కదా!’ అన్నది. జంగమయ్య వేశ్యమీద వ్యామోహంతో బసవన్న వద్దకుపోయి అడుగకూడదని తెలిసి కూడా గంగాంబ కట్టుపుట్టాన్ని అడిగాడు. బసవన్న చిరునవ్వు నవ్వి ‘శివుడు చీరనడుగుతున్నాడు. గంగా! విప్పి ఇచ్చెయ్య’మన్నాడు. గంగాంబ భక్తితో చీరెను విప్పింది. ఆశ్చర్యంగా ఆ చీర విప్పితే మరో చీరె గంగాంబ శరీరంమీదకు వచ్చింది. భక్తులంతా నివ్వెరపోయారు. జంగమయ్య అద్భుతపడి ‘శివభక్తికి అసాధ్యమేముంది? లోగడ ఒక భక్తుడు ఇలాగే నార చీరెలు ఒలిచి ఇచ్చాడు. దేజర దాసయ్య ఒక తపసికి పనె్నండేండ్లు శ్రమించి నేసిన బంగారు చీర ఇచ్చాడు. బల్లముడు సతినే దానం చేశాడు. అధీరుడు మాణిక్యం దానం చేశాడు. ఒక భక్తుడు సవరం కావాలని అడిగితే మానకంజారుడనే శరణుడు భార్య కొప్పును కోసి ఇచ్చాడు. బసవన్న నేడు అలాంటి అపూర్వ దానం చేశాడు’’ అని ప్రశంసించి గంగాంబ విప్పిన చీరెను తీసుకొని వెళ్లిపోయాడు.
మడివాలు మాచయ్య కథ
ఆ కల్యాణ నగరంలో మాచయ్య అనే శివ శరణుడున్నాడు. అతడు వీరవ్రతాచారయుతుడు. న్యాయ నిష్ఠుడు. అతడు నిత్యమూ శివభక్తుల వస్త్రాలు తీసుకొనిపోయి ఉతికి శుభ్రం చేసేవాడు. తెల్లని వెండి కొండలా వస్త్రాల కుప్ప ఉండేది. అందులో నుండి జంగమయ్యలు బట్టలు తీసుకొనిపోవడానికి వచ్చినపుడు వారి వారి బట్టలు దక్షిణలతోపాటు అందించేవాడు. ఎవరూ చడకుండా తెల్లవారు జామునే లేచి ‘‘నేను బట్టలు ఉంతకడానికి పోతున్నాను. ఈ బట్టలను శైవేశ్వరుడు ఎవడూ తాకరాదు జాగ్రత్త’’ అని చాటింపు వేసుకుంటూ మెడలో ఒక కత్తి కట్టుకొని రేవుకుపోయేవాడు మాచయ్య.
ఇలా ఉండగా ఒకడు తెల్లవారు జామున పోతున్న మాచయ్యను చూడక ఆ బట్టలను తాకాడు. వెంటనే మాచయ్య అతణ్ణి హతమార్చాడు. ఈ విషయం బిజ్జలునికి తెలిసి కోపగించి మాచయ్యను చంపేటందుకొక ఏనుగును పంపాడు. మాచయ్య దానిని అవలీలగా చంపివేశాడు. ఆ వార్త విని బిజ్జలుడు దిగ్భ్రాంతుడైనాడు. అప్పుడు బసవన్న బిజ్జలునితో ఇలా అన్నాడు.
‘‘రాజా! మాటిమాటికీ మాచయ్యను చాకలి చాకలి అని అవమానించావు. చాకలి కాదు సాక్షాత్తు లింగమూర్తి అతడు. మాచయ్యను మించిన భక్తాగ్రగణ్యుడున్నాడా?
మాచయ్య ఏనుగును చంపడం నీకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కాని భక్తులకు అసాధ్యమేదీ లేదు. విను. పూర్వం తమిళ దేశంలో కరబాలాది చోళభూపతి రాజ్యంలో ఇరువదాండాది అనే శివభక్తుడు ఉండేవాడు. శివభక్తులకు ఎగ్గుచేసిన వారిని సహింపననే నియమం కలవాడతడు. ఒకనాడు ఒక శైవుడు చీకటిలో తోటలో పూలు కోస్తూ వుండగా ఒక ఏనుగు అతణ్ణి చంపింది. ఇది తెలిసి ఇరువదాండాది రోషంతో వచ్చిఏనుగునూ మావటీని చంపివేశాడు. అంతేకాక ‘‘ఈ ఏనుగుకు ఎవడు పాలకుడో వాడి పొగరు అణుస్తాను’’ అన్నాడు.
ఆ ఏనుగు చోళభూపతిది. రాజుకీ విషయం తెలిసి గజగజ వణికిపోయాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇరువదాండాది శివభక్తికి మెచ్చి ఏనుగునూ మావటిని బతికించి రాజుకు ఇరువదాండాదికీ సాయుజ్యమిచ్చాడు. అలాగే బావూరి బ్రహ్మయ్యగారి కథలోనూ జరిగింది. బ్రహ్మయ్య పూలమాలలు కట్టి వాటిని భక్తులకిచ్చి ఆ విధమైన కాయకంవల్ల లభించిన దానితోనే జంగమార్చన చేసేవాడు. ఒకానాడొక రాజుగారి ఏనుగు మధించి బ్రహ్మయ్యగారి పూలదండలను చిందరవందర చేయగా బ్రహ్మయ్య ఏనుగును హతమార్చి వేశాడు. రాజుకీ విషయం తెలిసి దుఃఖించి బ్రహ్మయ్య పాదాలను శరణు చేయగా బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వి ఏనుగును మళ్లీ బతికించాడు కాబట్టి బిజ్జలా! మాచయ్యను నిందించి లాభం లేదు. వెళ్లి ఆ మహాత్ముణ్ణి శరణువేడు’’ అని చెప్పాడు బసవన్న.
- ఇంకా ఉంది

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్