నిజామాబాద్

లక్ష్యాన్ని అధిగమించే దిశగా కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 20: పచ్చదనాన్ని పెంపొందిస్తూ, అటవీ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ హరితహారం కార్యక్రమం అమలులో నిజామాబాద్ ఇతర జిల్లాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గతేడాది నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి రాష్ట్రంలోనే ముందంజలో నిలిచిన నేపథ్యంలో, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా విరివిగా మొక్కలు నాటి ఎట్టి పరిస్థితుల్లోనూ హరితహారాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోంది. ఈ మేరకు అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేసేందుకు వీలుగా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా కార్యాచరణ ప్రణాళికను రూపొందింపజేశారు. జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖలు, వివిధ సంస్థలు, స్వచ్ఛంద సంఘాల వారి తోడ్పాటుతో లక్ష్యం సాధించేలా ఆయా శాఖలు, సంస్థల వారీగా ప్రత్యేక తేదీలను ఖరారు చేస్తూ, సంబంధిత శాఖలు వారికి కేటాయించిన తేదీలలో విరివిగా మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం అధికారికంగా ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఈ నెల 21న గిరిజన, మహిళ, బిసి సంక్షేమ శాఖలతో పాటు వైద్యారోగ్య శాఖ, పశు సంవర్ధక, విద్యుత్, పౌర సరఫరాల శాఖల ఆధ్వర్యంలో నర్సరీల నుండి మొక్కలు సేకరించుకుని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు. అదేవిధంగా 22వ తేదీన విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యుఎస్, మైనినింగ్, మార్కెటింగ్, సాంఘిక సంక్షేమ శాఖలు, 23న పంచాయతీరాజ్, మైనార్టీ, పరిశ్రమలు, సహకార శాఖలు, 24న జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థలు, మత్స్య శాఖ, దేవాదాయ శాఖ, ఆర్టీసీల ఆధ్వర్యంలో 25న ఇరిగేషన్, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటేలా కార్యాచరణను రూపొందించి సంబంధిత అధికారులకు బాధ్యతలు పురమాయించారు. జిల్లాలో ప్రస్తుత మూడవ విడతలో కోటీ 83లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే దాదాపు 50లక్షల పైచిలుకు మొక్కలు నాటారు. మరో వారం పది రోజుల వ్యవధిలో మిగతా లక్ష్యాన్ని వంద శాతం సాధించే దిశగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. మొదటి విడతగా 2015లో హరితహారానికి శ్రీకారం చుట్టిన సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియని కారణంగా హరితహారం అమలులో లక్ష్యాన్ని సాధించలేకపోయారు. సుమారు మూడున్నర కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అతికష్టం మీద కేవలం 80లక్షల మొక్కలను మాత్రమే నాటగలిగారు. వాటిలోనూ చాలావరకు మొక్కలు సంరక్షణకు నోచుకోక వాటి ఆనవాళ్లు గల్లంతయ్యాయి. అయితే గతేడాది సీజన్ ఆరంభం నుండే వర్షాలు అనుకూలించడంతో జిల్లా యంత్రాంగం హరితహారంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, పకడ్బందీ కార్యాచరణను అమలు చేయడం ద్వారా లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతమైంది. 3.35కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా, అంతకుమించి మొక్కలు నాటడంతో నిజామాబాద్ జిల్లా ముందంజలో నిలిచి హరితహారం అవార్డును దక్కించుకుంది. ఇదే స్ఫూర్తితో జిల్లా యంత్రాంగం ప్రస్తుత మూడవ విడతలోనూ మరింత విస్తృత స్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు కృషి చేస్తోంది. ప్రధానంగా అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను బ్లాక్‌లుగా గుర్తిస్తూ అటవీ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో అత్యధికంగా మొక్కలు నాటేలా చర్యలు చేపడుతున్నారు.
మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
కాగా, మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోకుండా వాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మొక్కలు నాటే కార్యంలో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయగా, వాటి సంరక్షణ బాధ్యతలను ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారికి అప్పగిస్తున్నారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల ఆవరణలలో మొక్కలు నాటుతూ వాటికి జియో ట్యాగింగ్ చేసి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలతో ఆయా ప్రాంతాల్లో, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థులతో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసి మొక్కల సంరక్షణ బాధ్యతలను అప్పగిస్తున్నారు.