నల్గొండ

పంట రుణాలకు రైతుల తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 20: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులకు పంట రుణాల మంజూరీలో బ్యాంకర్ల ఉదాసీనత ఖరీఫ్ పంటల సాగులో ఉన్న రైతాంగానికి తిప్పలు పెడుతుంది. రెండు నెలలు గడుస్తున్నా నేటికి 40శాతం కూడా రుణాల మంజూరు చేయకపోవడంతో రైతులు ఖరీఫ్ పంటల సాగు పెట్టుబడులకు ప్రైవేటు రుణాలను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నారు. వార్షిక రుణ ప్రణాళికను ఆలస్యంగా ఖరారు చేసుకున్న బ్యాంకర్లు రుణాల పంపిణీలో ఆలస్యమే సాగిస్తుండగా రైతులు రుణాల కోసం బ్యాంకర్ల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ నాల్గవ విడత డబ్బులను, వడ్డీని బ్యాంకుల్లో జమచేయడంలో నెలకొన్న జాప్యం సైతం రైతులకు కొత్త రుణాల మంజూరులో సమస్యాత్మకంగా మారింది. నల్లగొండ జిల్లాలో ఈ దఫా ఖరీఫ్ రుణాల మంజూరు లక్ష్యం 1,554కోట్లకుగాను ఇప్పటిదాకా 612కోట్లు మాత్రమే మంజూరు చేశారు. 40శాతం రుణ పంపిణీ సాగడంతో జిల్లా రైతులు బ్యాంకు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 31వ తేదిలోగా మిగతా రుణ పంపిణీ లక్ష్యాలను పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్లు బ్యాంకర్లపై ఒత్తిడి పెంచుతున్నా ఆశించిన పురోగతి కానరావడం లేదు. సూర్యాపేట జిల్లాల్లో 729కోట్ల రుణ పంపిణీకి లక్ష్యానికి 285కోట్లు పంపిణీ కాగా 39శాతం రుణాల మంజూరు జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 557కోట్ల రుణ పంపిణీ లక్ష్యానికి 90కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. కేవలం 16.5శాతం మాత్రమే రుణాల పంపిణీ చేశారు. రైతులకు పంట రుణాల పంపిణీలో బ్యాంకర్లు నిర్లక్ష్యం ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రైతాంగానికి మరిన్ని ఆర్ధిక ఇబ్బందులు కల్గించేదిగా తయారైంది. వర్షాలు సమృద్దిగా పడుతుండటంతో ఖరీఫ్ పంటల సాగు పనులను ముమ్మరం చేస్తున్న రైతులకు ఎరువులు, విత్తనాల కొనుగోలు, కూలీలకు పెట్టుబడులు అవసరమవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో బ్యాంకర్లు రుణాలివ్వకుండా చేస్తున్న జాప్యం రైతులకు ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతుంది.
రుణాలివ్వక ఫసల్ బీమాకు దూరమవుతున్న రైతాంగం
రైతులకు కొత్త పంట రుణాలివ్వడంలో బ్యాంకర్లు జాప్యం చేస్తుండటంతో కేంద్రం అందిస్తున్న ఫసల్ బీమా యోజన పథకంలో రైతులకు దూరమవుతుంది. ఆగస్టు 31లోగా ఈ బీమా పథకంలో రైతులు తమ ప్రీమియం చెల్లించాల్సివుంది. వరికి 2శాతం చొప్పున ఎకరాకు 560 ఆగస్టు 31లోగా, పత్తికి ఎకరాకు 5శాతం చొప్పున 1200రూపాయల ప్రీమియం ఈ నెల 31లోగా చెల్లించాల్సివుంది. బ్యాంకర్లు పంట రుణాల మంజూరు సమయంలో సదరు ప్రీమియంను జమచేస్తుండటం సాగుతుండగా రుణ మంజూరు జరుగక రైతులు బీమా పథకం ప్రయోజనాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.
కార్పొరేషన్ రుణాల పంపిణీలోనూ అదే తీరు..!
రైతు రుణాల పంపిణీలో వార్షిక లక్ష్యాల సాధనలో తీవ్ర జాప్యం చేస్తు రైతాంగాన్ని తిప్పలు పెడుతున్న బ్యాంకర్లు అటు కార్పొరేషన్‌ల నుండి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు అందిస్తున్న సబ్సిడీ రుణాలను సైతం సకాలంలో మంజూరు చేయకుండా లబ్ధిదారులకు ఎదురుచూపులు మిగిలిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరులో నల్లగొండ జిల్లా పరిదిలో 2015-16లో 200యూనిట్లకు 130యూనిట్లు మంజూరిచ్చిన పదిశాతం కూడా గ్రౌండింగ్ చేయలేదు. బిసి కార్పొరేషన్ కింద 109యూనిట్లకు పది శాతం మంజూరు, గ్రౌండింగ్ సాగలేదు. మైనార్టీ కార్పొరేషన్ కింద 104యూనిట్లకు 25యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆ వర్గాలకు ఒక్క నిర్ధేశించిన బ్యాంకు రుణ లక్ష్యాల్లో ఒక్క యూనిట్ కూడా మంజూరు చేయలేదు. ప్రస్తుతం 2017-18 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రుణాల మంజూరు ఊసే లేదు. ఈ నేపథ్యంలో బ్యాంకర్లపై పంట రుణాలు, ఇతర రుణాల మంజూరు విషయమై ప్రభుత్వం మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.