భక్తి కథలు

బసవ పురాణం- 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సరే’నని బిజ్జలుడు వెళ్లి మాచయ్యకు శరణుచేశాడు. బసవన్న కూడా మాచయ్యకు శరణు చేసి రాజును దండించేలా చూడమని ప్రార్థించాడు. మాచయ్య అప్పుడు మరణించి ఏనుగుకు ప్రాణం పోశాడు. అది చూస్తున్న ప్రజంతా నివ్వెరపోయి మాచయ్యను స్తుతించారు. బసవన్న భక్తితో మాచయ్యను వెంటబెట్టుకొని వెళ్లి శైవమఠంవద్ద వదిలిపెట్టి వచ్చాడు.
బసవని గీతములో తప్పుబట్టుట
బసవన్న మొత్తం నాలుగు లక్షల అరువది నాల్గువేల గీతాలు (వచనాలు) రచించాడు. అందులో ఒక గీతాన్ని ఒక భక్తుడు పాడుడూ వెళ్లి మాచయ్యకు వినిపించాడు. ఆ గీతంలో బసవన్న యొక్క అహంకార ఛాయ లేశమాత్రం మాచయ్యకు కన్పించింది. దానితో మాచయ్య కోపగించి బసవన్నను నిందించాడు. బసవన్న అది విని భయభ్రాంతుడై వచ్చి మాచయ్య పాదాలపై బడి క్షమించమని కోరాడు.
అప్పుడు మాచయ్య ‘బసవా! నేను విన్న నీ గీతంలో నీ అహంకారం కొంచెం కన్పడింది. నీవొక పెద్ద ఇచ్చేవాడవూ శివభక్తులు తీసుకునేవారూనా? నీ గుర్రపు గాడిదలూ, పచ్చమన్నూ, కుటిల స్ర్తిలూ, ఎర్ర కోకలూ- ఇవేనా మహాదానాలు. రా, ఇటు చూడు. శివభక్తులంతా పేదవారేమీ కాదు అని మాచయ్య ఇన్ని నీళ్లు చల్లాడు. నీటిబిందువులన్నీ మరుక్షణంలో మరకత నీల నిర్మల పుష్యరాగ వర వజ్ర విద్రుమ వైఢూర్యాది రత్నములుగా మారిపోయాయి. ఆ మెరుగుల కాంతుల ముందు సూర్యుడు మిణుగురుపురుగైనాడు.
ఇది బిజ్జలుడు విన్నాడు. సమస్త జనమూ విన్నారు. అందరూ పరుగు పరుగునవచ్చి మడిమాల మాచయ్య పాదాలకు నమస్కరించారు. భక్తుడే పరమేశ్వరుడని గ్రహించాడు. అప్పుడు బసవన్న మాచయ్యను శరణు వేడి ‘‘నీవు శంకరుడివి, నేను అజ్ఞానిని. నీవు అమృతాంగుడవు. నేను విషాంగుణ్ణి. నీవు పశుపతివి! నేను పశుజీవిని. నీవు త్రైలోక్య చూడామణివి’’ అని ఎన్నో విధాల మాచయ్యను ప్రశంసించాడు. అప్పుడు మాచయ్య సంతసించి బసవన్నకు ఎందరో శివభక్తుల కథలు చెప్పి ఆనందపరిచాడు!
5
కల్యాణ నగరంలో కిన్నర బ్రహ్మయ్య అనే శివభక్తుడున్నాడు. ఆయన ఎన్నో విధాలైన కాయకష్టాలు చేసి ధనం సంపాదించి దానినంతా శివరాధనలో జంగమార్చనలో వినియోగించేవాడు. శివకైంకర్యంలో కిన్నర వాయించినందువల్ల ఆయనకు కిన్నర బ్రహ్మయ్య అని పేరు వచ్చింది.
బ్రహ్మయ్య బసవణ్ణి చూద్దామని ఒకసారి రాజభవనానికి వెళ్ళాడు. బసవయ్య బ్రహ్మయ్యను చూచి ఎన్నో విధాల పూజించి బ్రహ్మయ్యతో తత్వానుభవ గోష్ఠిలో ఉండిపోయాడు.
ఇలా ఉండగా ఒకనాడు కిన్నర బ్రహ్మయ్య కల్యాణ నగరంలో వున్న త్రిపురాంతక దేవుని గోపురం వద్ద కూర్చొని వున్నాడు. అప్పుడొక విటుడు ఆ దారి వెంట ఒక గొర్రెను తీసుకొనిపోతున్నాడు. త్రిపురాంతకుని గుడి వద్దకు వచ్చేసరికి ఆ గొర్రె తాడు తెంపుకొని గుడిలోనికి పారిపోయింది. విటుడు దాని వెంట పడ్డాడు. కిన్నర బ్రహ్మయ్య అది చూచి గబగబా వచ్చి సంగతి విచారించాడు. ఆ గొర్రెను తన వేశ్యకోసం ఆ విటుడు తీసుకొనిపోతున్నాడని అది ప్రాణరక్షణకై గుడిలో దూరిందని బ్రహ్మయ్యకు తెలిసింది. అప్పుడు బ్రహ్మయ్య ఆ విటునితో ‘‘ఓరుూ! ఈ గొర్రె తన ప్రాణాన్ని కాపాడుకునే నిమిత్తం శివాలయంలో దూరింది. అంటే ఈశ్వరుణ్ణి శరణుకోరింది. కాబట్టి దానిని రక్షించడం శివభక్తుని ధర్మం. దీని వెల ఎంతో చెప్పి తీసుకుపో. ధనం నేనిస్తాను. మృత్యువనేది సకల కోటికీ సమానమే. అలాంటప్పుడు మనిషయితేనేం? జంతువయితే నేమి? నీ వేశ్య ఈ గొర్రెను సృష్టించలేదు. అలాంటిది చంపే అధికారం ఏముంది?’’ అని ప్రశ్నించాడు.
అది విని విటుడు ‘ఓహోహో! ఏమి చెపుతున్నావు నువ్వు? ఖరీదు పెట్టి కొన్న గొర్రెను గుడిలోకి పోయిందని వదిలే మూర్ఖుడెవడైనా ఉంటాడా? దీనిని తీసుకొనిపోకపోతే నా ప్రియురాలు కోపగిస్తుంది. పెద్ద ధర్మపన్నాలు చెపుతున్నావు, ప్రాణం ఎవరికైనా ఒకటేనని. మనిషి ప్రాణానికి విలువ వేయి మాడలు. మరి ఈ గొర్రె ప్రాణానికి నీవు వెయ్యి మాడలు ఇస్తావా?’’ అని అడిగాడు.
‘ఇస్తాను’ అన్నాడు కిన్నర బ్రహ్మయ్య
వెంటనే వేయి మాడలు తెప్పించి ఆ విటునికి ఇచ్చి గొర్రెను నేను కొన్నాను. గుడిలో ప్రవేశించిన గొర్రె నందితో సమానం. దాని ప్రాణరక్షణాధికారం నాది’ అన్నాడు బ్రహ్మయ్య. విటుడు మాడలు తీసుకొని వేశ్య ఇంటికి వెళ్లాడు. ఆమె గొర్రె ఏదని అడిగింది. విటుడు వేయి మాడలు చూపి జరిగింది చెప్పాడు. ఆమె కోపగించుకొని ‘‘ఎవడికి కావాలి నీ ముష్టి మాడలు! గొర్రె తీసుకురా’’ అన్నది.
‘‘ఒక గొర్రె ఏమిటి? ఈ మాడలు పెట్టి ఒక మందను మందనే తోలుస్తాను’’ అన్నాడు విటుడు.
‘‘మూర్ఖుడా! నాకు నీవూ వద్దు, నీ మందా వద్దు. నాకు ఆ గొర్రెయే కావాలి. దానిని దేవతలకు బలి ఇస్తానని మొక్కుకున్నాను కదా! అలాంటి బలిపశువును వదిలి వేరే వెయ్యి గొర్రెలు తెచ్చి మాత్రం ఏం ప్రయోజనం- ఫో పొమ్మన్నది.
కామాంధుడైన విటుడు మంచి చెడు విచక్షణ మరచి మళ్లీ వెనుదిరిగి గుడికివచ్చాడు. వస్తూనే గొర్రెను పట్టుకుని గుంజుకుపోజూచాడు. బ్రహ్మయ్య ‘ఓరీ! మాట తప్పకు.
- ఇంకా ఉంది

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్