అనంతపురం

దిగిరాని ధరలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 21 : మహిళలకు తెల్లారితే చాలు .. ఏం కూర వండాల్లో.. ఎలా ఇంటిల్లిపాదికీ వడ్డించాలోనన్న ఆందోళన.. మార్కెట్‌కు వెళ్లి రూ.500 పెట్టినా కూరగాయలు సంచి నిండటం లేదు. వారానికి కనీసం రూ.200 వెచ్చించే వారు ప్రస్తుత ధరల్లో అరకొరగా కూరగాయలు కొన్నా రూ.300 దాటుతోంది. కనీసం నలుగురున్న కుటుంబానికి రూ.400 నుంచి రూ.500 వరకూ వెచ్చించక తప్పడం లేదు. రోజు కూలీలు, అరకొర ఆదాయం ఉన్న వారు చూసి చూసి కొనాల్సిన పరిస్థితి. ఇష్టమైన కూరలు వండుకుని నోటికి రుచిగా, కడుపు నిండా తిండి తినలేకపోతున్నారు. హోటళ్లలో టమాటా నామమాత్రంగా వేసి చింతపండుతో కూరలు వండేస్తున్నారు. కిలో రూ.80తో టమాటా ఠారెత్తిస్తుంటే, పచ్చి మిర్చీ రూ.50 తగ్గకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో కిలోపై రూ.30 నుంచి రూ.40 అధికంగా రిటైల్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మామూలుగా మదనపల్లి, బెంగళూరు, కర్నూలు నుంచి మార్కెట్లకు కూరగాయల్ని తెస్తున్నారు. కదిరి, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, ధర్మవరం, మడకశిర, గుంతకల్లు తదితర ప్రాంతాలకు బెంగళూరు నుంచి పచ్చి మిర్చి వస్తుంది. అలాగే క్యారెట్, బీన్స్, క్యాబేజ్, క్యాప్సికం, దొండకాయ తదితరాలు వస్తున్నాయి. ఫస్ట్ క్వాలిటీ మిరప కాయలను కర్నూలు నుంచి తెప్పిస్తున్నారు. ఇటీవల రైతు బజార్లో కిలో రూ.60 లెక్కన రెండు రోజుల పాటు టమాటాలను మార్కెటింగ్ అధికారులు విక్రయించి తర్వాత చేతులెత్తేశారు. ధరలవారీగా చూస్తే టమోటా (కిలో) - రూ.80, పచ్చిమిర్చి రూ.50, కాకర- రూ40, గోరుచిక్కుడు-రూ.50, బీన్స్-రూ.50, క్యాప్సికం-రూ.50, క్యారెట్-రూ.40, అల్లం-రూ.60, బూడిద గుమ్మడి-రూ.40, క్యాబేజీ రూ.30, బెండకాయలు-రూ.50, ఆలూ-రూ.30, బీర-రూ.25 ధర పలుకుతున్నాయి.
కాగా ధరలు విపరీతంగా పెరగడంతో టమోటా కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ఇదివరకు 25 కిలోలున్న టమాటా బాక్సు ఒక్కటి రూ.1600కు హోల్‌సేల్ వచ్చేంది. ఇటీవల తమిళనాడుకు అధికంగా తరలిస్తుండటంతో బాక్సు పైన రూ.200 పెరిగిందని అనంతపురం వ్యాపారులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం 700 నుంచి 800 టమాటా బాక్సులు వచ్చేవని, వీటిలో రోజుకు కనీసం 300 బాక్సుల మేర అమ్మేవాళ్లమని, ఇప్పుడు 300 బాక్సులు మించి తేవడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇందులో కూడా కనీసం 50 బాక్సులు అమ్ముడు పోవడమే గగనంగా మారిందంటున్నారు. కొనుగోళ్లు గణనీయంగా తగ్గడంతో లాభాలు కూడా లేవని వాపోతున్నారు.
త్వరలో తగ్గుముఖం..* వంశీకృష్ణ (మండీ ఓనర్)
జిల్లాలో మరో 15-20 రోజుల్లో ధరలు తగ్గుముఖం పడతాయి. జిల్లాలో సాగు చేసిన కూరగాయల తోటలు కాపునకు రానున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి తేవడం తగ్గుతుంది.
స్థానికంగా కూరగాయలు తక్కువే..* కృష్ణమూర్తి, టమాటా హోల్‌సేల్ మండీ వ్యాపారి
జిల్లాలో అరకొరగానే టమాటా పండుతోంది. అది కూడా మార్కెట్లు ఎక్కడికక్కడ ఉండటంతో వ్యాపారులు రైతుల నుంచి కొనేస్తున్నారు. కిలో రూ.60 చొప్పున కొంటున్నారు. పుచ్చులు, వృథా అయ్యేవి, కూలీల ఖర్చులు ఉంటున్నాయి. 25 కిలోల బాక్సు రూ.1700 కొని, రిటైలర్లకు రూ.1800 నుంచి రూ.1900 అమ్ముతున్నాం.
ధరలతో అల్లాడిపోతున్నాం.. : కృష్ణవేణి, రుద్రంపేట
అధిక ధరలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఇంట్లో ఐదుగురం ఉన్నాం. గతంలో వారంలో రూ.300 కూరగాయలు కొనేవాళ్లం. ఇప్పుడు సంచి సగానికి కూడా రాలేదు. తక్కువ ఆదాయం ఉన్న మాలాంటి వాళ్లు ఎలా బతికేదో అర్థం కావడం లేదు. రిటైల్‌గా కొనలేక పాతికోపరకో మిగులుతుందని పాతూరు మార్కెట్‌కు వచ్చాను.