ఖమ్మం

ముసురుకుంటున్న వ్యాధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 21: వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినప్పటికీ జిల్లాలోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాల్లో మురుగు నీరు చేరి ఆయా ప్రాంతాల్లో మురుగు గుంటలు ఏర్పడి రోగాలకు నిలయాలుగా మారాయి. వర్షాలు కురియడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గతేడాది అనుభవాలు మరచి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అపరిశుభ్రత, మురుగు, కలుషిత నీటితో పలు రకాల వ్యాధులు సోకుతున్నాయి. గత ఏడాది బోనకల్ మండలం రావినూతల, గోవిందాపురం, ఆళ్ళపాడు గ్రామాల్లో డెంగ్యూ సోకి దాదాపు 13 వందల మందికి పైగా విష జ్వరాల బారిన పడ్డారు. 20 మందికి పైగా ఈ మూడు గ్రామాల్లో మృత్యువాతకు గురయ్యారు. ఈ అనుభవాన్ని అధికారులు మరచి ఈ ఏడాది కూడా పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలివేశారు. ఇళ్ల చుట్టుపక్కల కాల్వలు, మురుగు గుంటల్లో దోమలు విజృంభిస్తున్నాయి. బోనకల్ సంఘటన గుర్తు చేసుకుంటున్న ప్రజలు అధికారుల తీరుతెన్నులపై మండిపడుతున్నారు. 3 రోజుల క్రితం కురిసిన వర్షాలకు గ్రామాల్లో సరఫరా అవుతున్న నీరు మురికిగా ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నగరంలో, గ్రామాల్లో మినరల్ వాటర్ కోసం పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీ, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా పంచాయతీ అధికారులతో కలెక్టర్ సమావేశమై సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినప్పటికీ పట్టించుకున్న వారే కరవయ్యారు. గ్రామీణ నీటి సరఫరా శాఖకు చెందిన అధికారులు క్షేత్ర స్థాయిలో దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. 2016 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మలేరియా బారిన 1242 మంది, డెంగ్యూ 1340, గున్యా 15, అతిసారం 49,944, టైఫాయిడ్ 17,378, ఎఆర్‌ఐ 62,707, న్యుమోనియా 1020, కామెర్లు వ్యాధి బారిన 8 మంది పడ్డారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది అతిసారం 4456, ఎఆర్‌ఐ 8791, టైఫాయిడ్ 891, మలేరియా 21, డెంగ్యూ 133, గున్యా 2, కామెర్లకు 6 మంది గురయ్యారని అధికారులు చెబుతున్నారు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఇంతమంది నమోదైతే ఇక ప్రైవేటు ఆసుపత్రుల లెక్కలు ఇంతకు నాలుగు రెట్లు ఉండే అవకాశం ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైద్యాధికారులు, పంచాయతీ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి ప్రజలు సీజన్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.