నల్గొండ

అసాంఘిక శక్తుల ఆటకట్టించే ‘త్రినేత్రం’ సిసి కెమెరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, జూలై 21: సమాజంలోని అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు సిసి కెమెరా శంకరుడి ‘త్రినేత్రం’గా పనిచేస్తుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సిసి కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ నేరాల అదుపునకు సిసి కెమెరాలు ఎంతో తోడ్పడుతాయన్నారు. సిసి కెమెరాలతో ప్రజలు ప్రశాంతంగా నిద్రించే అవకాశం ఏర్పడుతుందన్నారు. దాదాపు 8లక్షల రూపాయాలతో మొత్తం మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో 24 కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అందులో ఒకటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నా చిత్రీకరించే కెమెరా కూడా ఉందని పేర్కొన్నారు. వలిగొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో మొట్టమొదటగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసిన మండలంగా ప్రథమ స్థానంలో ఉందని ప్రశంసించారు. ఇందుకు సహకరించిన దాతలకు అభినందనలు తెలియజేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సిసి కెమెరాలను రిమోట్ కంట్రోల్‌తో ప్రారంభించారు. అనంతరం సిపి మహేశ్ భగవత్ విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కెమెరాలను ఏర్పాటు చేస్తామని, కొరతగా ఉన్న సిబ్బందిని త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్, జాయింట్ కలెక్టర్ రవినాయక్, డిసిపి పాలకూర్తి యాదయ్య, సాదు మోహన్‌రెడ్డి, ఎసిపి స్నేహిత, తహశీల్దార్ యాదయ్య, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్థన్‌రెడ్డి, వంగాల వెంకన్న, జడ్పీటిసి మొగుళ్ల శ్రీనివాస్, ఎంపిపి శ్రీరాముల నాగరాజు, చైర్మన్‌లు తుమ్మల వెంకట్‌రెడ్డి, మారగోని జంగాలు, వాకిటి అనంతరెడ్డి, సర్పంచ్‌ల ఫోరమ్ మండల అధ్యక్షుడు పబ్బు ఉపేందర్‌బోస్, టిఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు బద్దం భాస్కర్‌రెడ్డి, పబ్బుస్వామి, సర్పంచ్‌లు కాసుల కృష్ణ, రమేశ్, మమత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

హరితహారంలో ఆదర్శంగా సూర్యాపేట
సూర్యాపేట, జూలై 21: ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రికగా భావిస్తున్న హరితహారం కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్ అన్నారు. మూడవ విడత నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని పరిశీలించేందుకు శుక్రవారం ఆమె జిల్లాలో పర్యటించారు. తొలుత మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రీన్ బిగ్రేడ్ విద్యార్థులు మొక్కల సంరక్షణపై ఇచ్చిన ప్రదర్శనను తిలకించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాల, చైతన్య మెటల్ ఇండస్ట్రీస్‌లో నిర్వహించిన హరితహారంలో పాల్గొని జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం సిఎం కెసిఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలుచేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు అన్ని జిల్లాల నుండి నివేదికలు తెప్పించుకొని పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. మొక్కల సంరక్షణను పక్కాగా చేపట్టేందుకు ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ వేస్తున్నామన్నారు. అదేవిధంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలనే లక్ష్యంతో 51 మంది సభ్యులచే ప్రతి గ్రామంలో, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో గ్రీన్ బిగ్రేడ్‌లను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. సామాజిక స్ఫూర్తితో గ్రీన్ బిగ్రేడ్ సభ్యులు పనిచేసి మొక్కల సంరక్షించాలని పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాటిన మొక్కలను సంరక్షించే లక్ష్యంతో కలెక్టర్ సురేంద్రమోహన్ వినూత్నంగా గ్రీన్‌డే కార్యక్రమాన్ని అమలుచేయడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో అందరు ప్రభుత్వం ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలను భాగస్వామ్యం చేసి నాటిని మొక్కలంన్నిటిని సంరక్షించేలా సామాజిక బాధ్యతను తెలియజెప్పేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఇతర జిల్లాల కలెక్టర్‌లకు స్ఫూర్తినిస్తుందన్నారు. గ్రీన్ టీషర్ట్స్ ద్వారా హరితహారం పెంపుదలకు యువత, స్వచ్ఛంద సంస్థల్లో ఉత్సాహం నింపుతున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ మూడవ విడత హరితహారంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 30 లక్షల మొక్కలను నాటినట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే మొక్కలను పంపిణీ చేస్తున్నామని, ఆయుర్వేద మొక్కలను విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, డిఆర్‌డివో పిడి సుందరి కిరణ్‌కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి బి.వెంకటనర్సమ్మ, పరిశ్రమల శాఖ జిఎం బాబురావు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలను నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
పెద్దఅడిశర్లపల్లి, జూలై 21: ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని చిల్కమర్రి, అంగడిపేట ఎక్స్ రోడ్డు, మండల కేంద్రంలోని దేవాలయ ప్రాంగణంలో మొక్కటు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల శాతం పూర్తిగా తగ్గిపోయిందని, దీంతో వర్షాలు లేక రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మానవాళి భవిష్యత్‌కు మొక్కలను నాటి వాటి సంరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, అదే కోణంలో నేటి మొక్కలే రేపటి వృక్షాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి హరిత తెలంగాణగా మార్చాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. తొలుత అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద గల పునరావాస కేంద్రంలోని పాఠశాలలో మొక్కలు నాటి మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మేడారం రాజ్యమ్మ నారాయణ, పిఏ పల్లి, అంగడిపేట ఎక్స్ రోడ్డు సర్పంచులు పల్లె సత్యనారాయణ, పాండునాయక్, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఏవి.రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కె.గోవర్థన్‌రెడ్డి, సహదేవుడు, ఏఎంఆర్‌పి నాల్గో డివిజన్ ఈఈ కరుణాకర్‌రెడ్డి, డిఈ నర్సింగరాజు, ఎంపిడివో శేషుకుమార్, తహశీల్దార్ నాగరాజు, ఎంఈవో వేమన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూముల వివరాలు నవీకరించాలి
చిట్యాల, జూలై 21: గ్రామాల్లో ఉన్న భూముల వివరాలు వాటికి సంబంధించిన పట్టాపాస్ పుస్తకాల వివరాలు-రెవెన్యూ రికార్డుల్లోని వివరాలు-ఆన్‌లైన్‌లోని వివరాలు ఒకేలా ఉండేలా పక్కాగా నిర్వహంచి అన్నింటిని నవీకరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఇందుకు భూముల వివరాలు రెవెన్యూ రికార్డుల నవీకరణను పూర్తిచేసేందుకు విఆర్‌వోలు సైనికుల్లా పనిచేయాలన్నారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించి భూములకు సంబంధించిన రికారులను తనిఖీ చేశారు. మండలంలోని గ్రామాల విఆర్‌వోలతో సమావేశమై గ్రామాలకు సంబంధించిన రికార్డులను సంబంధిత విఆర్‌వోలతో పరిశీలించారు. భూముల వివరాల్లో వ్యత్యాసాలున్నాయా అని తహశీల్దార్ పుష్పలత, ఆర్‌ఐ పృథ్వీ, విఆర్‌వోలను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఆర్‌ఐ, విఆర్‌వోలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ భూముల వివరాలు రెవెన్యూ రికార్డులు వ్యత్యాసాలుండకుండా ఉండేందుకు విఆర్‌వోలు రికార్డుల నిర్వాహణను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. రెవెన్యూ అధికారులు, విఆర్‌వోలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి భూములకు సంబంధించిన పట్టా పాసుపుస్తకాల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో సమానంగా ఉన్నాయా లేదా? పరిశీలించాలన్నారు. భూములు ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగా మార్పులు చేయబడుతుందని, పాస్‌పుస్తకాలు పహాణీలు రెవెన్యూ రికార్డుల వివరాలను గ్రామాల్లో ఇంటింటికి తిరిగి పరిశీలించి చేతిరాత ద్వారా పహాణీలను విఆర్‌వోలు స్వతహాగా తయారు చేయాలన్నారు. న్యాయస్థానంలో ఉన్న కేసులు మినహా మిగతావన్నింటిని సరిచేస్తామన్నారు. భూములకు సంబంధించిన వివరాలను తెలుకునేందుకు యజమానుల వద్దనున్న పాస్‌పుస్తకాలు పహాణీలను రెవెన్యూ రికార్డులన్నింటిని పరిశీలించేందుకు రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఇంటింటికి తిరిగి రైతులను కలుస్తామని పూర్తయిన ప్రతి ఇంటికి స్టిక్కర్లను అంటిస్తామని పేర్కొన్నారు.

విద్యాసంస్థల బంద్ విజయవంతం
నల్లగొండ, జూలై 21: కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజులను ప్రభుత్వం నియంత్రించాలని, కెజి టూ పిజి ఉచిత విద్య, విద్యాహక్కు చట్టం అమలు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి ఖాళీలను పూర్తి చేసి వౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేస్తు వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో విజయవంతమైంది. విద్యార్థి సంఘాలు బంద్‌కు ముందస్తుగా పిలుపునివ్వడంతో యాజమాన్యాలు పాఠశాలలను తెరువలేదు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచినా విద్యార్థి సంఘాల కార్యకర్తలు వెళ్లి తరగతులను బహిష్కరింపచేసి విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. మహాత్మగాంధీ యూనివర్సిటీలో సైతం బంద్ విజయవంతంగా సాగింది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, హాలియా, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, భువనగిరి, యాదాద్రి, ఆలేరు, వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్, బీబీనగర్‌లలో విద్యాసంస్థల బంద్ విజయవంతంగా సాగింది. పాఠశాలలు, కళాశాలల తరగతులు సాగలేదు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు, బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బంద్‌లో పాల్గొన్నాయి. నల్లగొండ పట్టణంలో విద్యా సంస్థల బంద్‌లో ఆయా సంఘాల నాయకులు మల్లం మహేష్, గండిచెరువు వెంకన్నగౌడ్, బరిగెల వెంకటటేశ్, బి.వి.చారి, సయ్యద్ జమర్, ఆవుల రామన్న, బొల్గూరి వెంకటేశ్వర్లు, ఏర్పుల శ్రవణ్, యాద శ్రీను, మాతంగి అమర్, నితీష్, నవీన్, మైనం శివప్రసాద్, వికాస్, పృథ్వీ, యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు రామకృష్ణ, నవీన్, నరసింహారావు, ఆరుణ్, నరేష్, జయంత్, భాస్కర్, స్వాతి, సందీప్‌లు తదితరులు పాల్గొన్నారు.

2కోట్ల మొక్కలు నాటి జిల్లాను హరితవనంగా తీర్చిదిద్దాలి
మిర్యాలగూడ, జూలై 21: జిల్లాలో 2కోట్ల మొక్కలు నాటి నల్లగొండ జిల్లాను హరితవనంగా తీర్చిదిద్దేందుకు అందరు కృషిచేయాలని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న మూడవ విడత హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడాన్ని ప్రజలు ఉద్యమంలా చేపట్టాలని అప్పుడే తెలంగాణ హరితవనంగా మారుతుందని అన్నారు. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమన్నారు. హరిత ఉద్యమంలో ప్రజలందరు భాగస్వాములు కావాలని అప్పుడే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యం నెరవేరుతుందన్నారు. వృక్షాలు అంతరించిపోవడం వలనే వర్షాలు కురవడంలేదని, మొక్కలు నాటి సంరక్షించినట్లయితే వర్షాలు కురిసి కరవును దూరం చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ముందుచూపుతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు. మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, ప్రతి ఒక్కరు మొక్కలునాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, జడ్పీటిసి మట్టపల్లి నాగలక్ష్మీ, ఎంపిపి ఒగ్గు జానయ్య, ఎంపిడిఓ సోము వెంకట్‌రెడ్డి, ఎంపిటిసిలు బారెడ్డి నాగమణిరెడ్డి, పడిగపాటి పద్మరెడ్డి, సర్పంచ్ చింతల మంజుల, మాజీ ఎంపిపి తిరుపతమ్మ, ఎంఇఓ చాంప్లానాయక్, నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఏడుకొండలు, చిట్టిబాబునాయక్, రవినాయక్, డిసిసిబి డైరెక్టర్ సజ్జల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యా బోధన
చింతపల్లి, జూలై 21: ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే మెరుగైన విద్యా బోధన జరుగుతుందని జడ్పి చైర్మన్ బాలునాయక్ అన్నారు. మండలంలోని బీదేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గ్రామ ఎన్‌ఆర్‌ఐలు అంకం వెంకటేశ్వర్లు, మర్రు దేవేందర్‌రావు, ధరణిపతి రవికుమార్‌లు లక్షా 60 వేల రూపాయలు వెచ్చించి విరాళంగా ఇచ్చిన కంప్యూటర్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు చిత్తశుద్ధితో బోధిస్తున్నందున ఉత్తమ ఫలితాలను సాధిస్తుండటంతో విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపుపరుగులు తీస్తున్నారని అన్నారు. ఎలాంటి మాదక ద్రవ్యాలు వాడని విద్యార్థులు ఉన్నారంటే అవి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలేనని తాను గర్వంగా చెప్పగలనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవర్చడానికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తారన్నారు. పేద విద్యార్థులు సైతం సాంకేతిక విద్యను అభ్యసించేందుకు ఎన్ ఆర్‌ఐలు కంప్యూటర్లను విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. తన అమెరికా పర్యటనలో దాతలను కలిసి అభినందనలు తెలియజేస్తానన్నారు. అంతకు ముందు అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో ఫోటోలు దిగి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రవి, జడ్పీటిసి హరి, ఎంపిడివో మమత బాయి, సర్పంచ్ మల్లమ్మ, ఎంపిటిసి చాంది, పాఠశాల చైర్మన్ రాజు, ప్రధానోపాధ్యాయులు పద్మాచారి, జగ్‌రాంనాయక్, మణిపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గోపిడి కిష్టారెడ్డి, అంకం అంజూర, మారయ్య, డి.శ్రీనివాస్, రావు వెంకటనర్సింహారావు, వెంకటయ్యగౌడ్, ఎస్‌ఐ నాగభూషణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.