అదిలాబాద్

హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, జూలై 21: పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మూడో విడత కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జైలు ఆవరణలో, తిర్పెల్లి శ్మశానవాటికలో మొక్కలు నాటారు. అదేవిధంగా జైనథ్ మండల కేంద్రంలో ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ మానవ మనుగడకు వృక్షాలు ఎంతో అవసరమని అన్నారు. బావి తరాల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులందరూ స్వచ్చందంగా మొక్కలు నాటాలన్నారు. అదేవిధంగా నాటిన మొక్కలను సంరక్షించుకునుప్పడే హరితహారం కార్యక్రమానికి స్వార్థకత లభిస్తుందన్నారు. గత రెండు విడతల్లో ఎదురైన ఇబ్బందులను అదిగమిస్తూ మూడో విడతను జిల్లాలో విజయవంతం చేసేందుకు అధికారులు ముందుండి కార్యక్రమాన్ని నడిపించాలన్నారు. హరితకమిటీలను ఈసారి పూర్తి బాధ్యతలు అప్పగించడం జరిగిందని, ప్రతి మొక్కకు లెక్క ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. హరితహారం రాజకీయ లబ్దికోసం కాదని, ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలు హరితహారంలో అవినీతి జరుగుతోందని గగ్గోలు పెట్టడం సమంజసం కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకు హరితహారం పథకం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని, దీనిని ఓర్వలేని ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వంపై అసత్యపు ప్రచారాలకు తెరలేపుతున్నాయని విమర్శించారు. మంత్రి రామన్న వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్న, కౌన్సిలర్లు బండారి సతీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వారసత్వంపై అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నాం
శ్రీరాంపూర్ రూరల్, జూలై 21: సింగరేణి కార్మికుల వారసత్వం ఉద్యోగాలపై అన్నికోణాల్లో పరిశీలిస్తున్నమని టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు బి వెంకట్రావు అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్‌లోని ఆర్కె న్యూటెక్ గని ద్వార సమావేశంలో మాట్లాడారు. కార్మిక సమస్యలపై కోలిండియా చైర్మన్ సుదీర్ధ భట్టాచార్యను కలసి 10 వేజ్ బోర్డు అమలు సత్వరమే చేయాలని మొమోరాండం సమర్పించామని పేర్కొన్నారు. 32అంశాలతో కూడిన డిమాండ్ పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. కార్మికులకు 50శాతం జీత భత్యాల పెరుగుదల, ఎస్‌ఎల్‌పి ప్రమోషన్, 15సంవత్సరాలు సర్వీస్ పూర్తిచేసిన కార్మికులకు అదనపు ఇంక్రిమెంట్, ట్రాన్స్‌పోర్ట్ సబ్సిడీ రూ.19.74 నుండి 50వరకు పెంపుదల, సిహెచ్‌పి, సిఎస్‌పి, ఓసిపిలలో పనిచేస్తున్న కార్మికులకు డస్ట్ అలవెన్స్ రూ.28.20 నుండి రూ.60 పెంపుదల ఉండేలా కృషి చేయాలని కోరారు. ఇంటిఅద్దె 2శాతం నుండి 10శాతం, క్యాజ్‌వల్ లీవు 11 నుండి 15 వరకు ఎల్‌టిసి, ఎల్‌ఎల్‌టిసికి 750కిలోమీటర్ల నిబంధన లేకుంగా 1 క్లాస్ ఎసీ వర్తింపు చేయాలని, డిపెండెంట్ ఉద్యోగులకు వయోపరిమితి పెంచాలని, కుటుంబ సభ్యులకు కార్పోరేట్ వైద్యం అందించాలని, పెన్షన్ 40 శాతం పెంచాలని డిమాండ్ చేసారు. కార్మిక పిల్లలకు కార్పోరేట్ చదువులు, మ్యారేజీలకు 20లక్షలు ఆడ్వాన్స్ ఇవ్వాలని, పెర్క్స్‌పై ఇన్‌కంటాక్స్ రద్దు చేయాలని డిమండ్ చేసారు. కార్యక్రమంలో టిబిజికెఎస్ నాయకులు కోటి లింగం, సురేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, సిహెచ్, అశోక్, వీరబద్రయ్య, బంటు సారయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, లింగారావు, రాఘవరెడ్డి,చంద్రయ్య, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

23న జరిగే టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
దివ్యనగర్, జూలై 21: ఈనెల 23న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నిర్మల్ జిల్లా డిఈవో టి.ప్రణీత తెలిపారు. పరీక్ష వ్రాసే అభ్యర్థుల హాల్‌టికెట్‌పై ఫోటో లేదా సంతకం సక్రమంగా లేకపోతే ఇటీవల తీయించిన ఫోటోను అతికించి గజిటెడ్‌అధికారితో దృవీకరించి గుర్తింపుకార్డులు జతచేసి ఈనెల 22న డిఈవో కార్యాలయంలో అందజేయాలని ఆమె పేర్కొన్నారు. హాల్‌టికెట్‌ను పరీక్షించిన తర్వాత అభ్యర్థులు పరీక్ష రాయడానికి అర్హత పొందుతారని తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని, చిరునామాలను ఒక్కరోజు ముందుగానే చూసుకుని నిర్ధారించుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌పైఉన్న సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్షలకు అభ్యర్థులు పరీక్ష ప్యాడ్ తీసుకుని రావాలన్నారు. 23న ఉదయం 9.30 గంటల నుండి 12 గంటల వరకు జరిగే పరీక్షకు 2324 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, ఇందుకోసం 10 కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5 గంటల వరకు జరిగే పరీక్షకు 5032 అభ్యర్థులు హాజరవుతున్నారని, ఈ పరీక్షకు 22 కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. పరీక్ష పరిశీలకుడిగా సత్యనారాయణరెడ్డి వ్యవహరిస్తారని, నలుగురు రూట్ అధికారులు, 32 మంది చీఫ్ సూపరిండెంట్‌లు, 32 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 32 మంది పరిశీలకులు, 150 మంది సూపర్‌వైజర్లు, 330 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు.

రైతులకు సకాలంలో పంట రుణాలు అందచేయాలి
ఆసిఫాబాద్, జూలై 21: రైతులకు సకాలంలో పంట రుణాలు ఇవ్వాలని కుమరం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ బ్యాంకర్లకు సూచించారు. అలా కాదని రుణాలు ఇవ్వకుండా రోజుల తరబడి రైతులను తిప్పుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ పరిపాలన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా కన్సల్టెన్సీ కమిటి సమావేశంలో కలెక్టర్ పాల్గొని బ్యాంకు అధికారులనుద్దేశించి మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజుల కావస్తుండడంతో ప్రతి రైతుకు క్రాప్ రుణాలు ఇవ్వడంతోపాటు పంట భీమా కల్పించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 90 వేల మందికి పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 20 వేల మందికి మాత్రమే క్రాప్ లోన్లు అందాయన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలోని అడ, దహగాం బ్యాంకు మేనేజర్లు రుణాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని కలెక్టర్ పేర్కొన్నారు. తప్పని సరిగా స్టాండఫ్ రుణాలు, ముద్ర రుణాలు చెల్లించాలన్నారు. రుణాలు ఇచ్చే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆర్‌బిఐకి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నుండి అందే సబ్సిడీ రుణాలను సైతం వీలైనంత త్వరగా ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. డిజిటలైజేషన్‌లో భాగంగా ప్రతి బ్యాంకు ఖాతాదారుడికి తప్పని సరిగా డెబిట్ కార్డు ఇవ్వాలన్నారు. అలాగే నెలలో ఐదు రోజులు డిజిటల్ లావాదేవీలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ చంపాలాల్ సూచించారు. బ్యాంకుల పనితీరును తెలుసుకునేందుకు అకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఆ సమయాల్లో ఎలాంటి ఫిర్యాదులు అందినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎస్‌బిఐ ద్వారా నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు స్వయం ఉపాధిలో భాగంగా ఉచిత శిక్షణ తరగతులను ఆసిఫాబాద్‌లో ఆగష్టు 15నుండి నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈసమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రసాద్, డిడిఎం పురోహిత్, ఆర్‌బిఐ మేనేజర్ అనీల్ కుమార్, డిఆర్‌డిఏ పిడి శంకర్, ఆయా శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

శ్మశానవాటికల అభివృద్ధికి కృషి
తలమడుగు, జూలై 21: ఏళ్ళ తరబడిగా గ్రామీణ ప్రాంతాల్లో స్మశాన వాటికల వద్ద సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అన్ని సదుపాయాలతో శ్మశానవాటికలను అభివృద్ధిపర్చేందుకు తన వంతు కృషి చేస్తానని డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ.10లక్షలతో నిర్మించే శ్మశాన వాటికకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా లోక భూమారెడ్డి మాట్లాడుతూ మండలంలోని కుచులాపూర్, బరంపూర్, కజ్జర్ల, రుయ్యాడి గ్రామాల్లో మొదటి విడతగా శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దశలవారీగా అన్ని గ్రామాల్లో స్మశాన వాటికలను అభివృద్దిపరుస్తామన్నారు. శ్మశానవాటికల వద్ద దహన సంస్కరాలకు రెండు ప్లాట్‌ఫాంలు, ఒక స్టోర్ రూం. ప్రజలు నిల్చూనేందుకు ఒక షెడ్, పురుషులు, మహిళలకు రెండు బాత్‌రూంలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడీవో సునీత, తహసీల్దార్ అతికొద్దిన్, ఏపివో మేఘమాల, ఈ జీ ఎస్ అధికారి వెంకటరమణ, టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు బాబన్న, పోతారెడ్డి, భూమారెడ్డి, వెంకటేష్, విష్ణు వర్దన్ రెడ్డి, బోజారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఉట్నూరు, జూలై 21: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటిడి ఏ ఇంచార్జి పివో ఆర్‌వి కర్ణన్ అన్నారు. శుక్రవారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో ఏజెన్సీలోని వైద్యాధికారులు, ఎంపిడీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి గ్రామాల్లో పారిశుద్ద్యం, క్లోరినేషన్ కార్యక్రమాలు తప్పకుండా నిర్వహించాలని అన్నారు. దోమలు వ్యాప్తిచెందకుండా ఐ ఆర్ ఎస్ పిచికారి చేయాలని, ప్రతి ఒక్క పేద కుటుంబానికి దోమ తెరలు పంపిణీ చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు పరిక్షలు జరిపిన అనంతరం గ్రామాల్లో పర్యటించాలన్నారు. అదే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా మలేరియా అధికారి అల్హాం రవి, అదనపు జిల్లా వైద్యాధికారి బాలు, సహాయ వైద్యాధికారి వసంత్‌రావు, కోఅర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి
ఆసిఫాబాద్, జూలై 21: ప్రజలకు ఇబ్బందులు సృష్టించే అసాంఘీక కార్యకళాపాలు, కల్తీ మోసాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని కుమరం భీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏర్పాటు చేసిన నెలవారీ నేరసమీక్షా సమావేశంలో ఎస్పీ పాల్గొని జిల్లా పోలీసులకు పలు సూచనలు, సలహాలు అందించారు. శాంతిబధ్రతల పరిరక్షణలో నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా తినే ఆహారం, హోటల్స్‌లో జరిగే కల్తీ మోసాలను ఓ కంట కనిపెడుతుండాలని ఆయన సూచించారు. అలాగే నిషేధిత గుట్క, పాన్‌మసాలా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానం వచ్చిన వెంటనే తిను బండారాల షాంపిల్స్‌ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని సూచించారు. నూతనంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్, ఎఎఫ్‌ఐఎస్ క్లూస్ టీంల సహకారంతో కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఒంటరి మహిళలు, గ్రామీణ ప్రాంత యువతులను మోసం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. తల్లి తండృల నిరక్షరాస్యత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు పాఠశాలలకు వెల్లడం లేదన్నారు. అలాంటి డ్రాప్ అవుట్ల వివరాలు సేకరించి వారి తల్లి తండృలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని జిల్లా పోలీసులకు ఎస్పీ సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పోలీసు మీకోసం నిర్వహించి యువతకు మరింత చేరువ కావాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ బహిష్కరణలు విధించే వారి పట్ల క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సన్‌ప్రీత్ సింగ్ ఆదేశించారు. ప్రధానంగా ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హరితహారంలో జిల్లా పోలీసులు భాగస్వాములై, విరివిగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఇందుకోసం అన్ని గ్రామాల్లో విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. మొక్కల ప్రాముఖ్యత గురించి చిన్నారులకు వివరించాల్సిన అవసరం ఉందని ఎస్పీ అభిప్రాయ పడ్డారు. హరితహారం విజయవంతం కోసం సబ్‌డివిజన్, సర్కిల్ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఈసమావేశంలో డిఎస్పీ హబీబ్ ఖాన్, ఎస్‌బి సిఐ వెంకటేశ్వర్లు, ఆసిఫాబాద్ ఎస్‌హెచ్‌ఓ సతీష్, డిఆర్‌బి ఎస్‌ఐలు రాణాప్రతాప్, ఎస్‌పి సిసి శ్రీనివాస్, ఎస్‌బి ఎస్ ఐలు శివకుమార్, శ్యాంసుందర్, సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్, పోలీసు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సూర్యకాంత్, ఎండి ఇంతియాజ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రహ్లాద్, పాస్‌పోర్టు అధికారి మురళి, క్యాంపు కార్యాలయ సిబ్బంది కిరణ్, వామన్, పిఆర్‌ఓ మనోహర్, జిల్లాలోని సిఐలు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

40లక్షల మొక్కలను లక్ష్యంగా ఎంచుకున్నాం
శ్రీరాంపూర్ రూరల్, జూలై 21: తెలంగాణ ఉద్యోగులగా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యాంగా ఎంచుకున్నామని రాష్ట్ర బెవరీజ్ కార్పొరేషన్ చైర్మన్ గుండవరపు దేవిప్రసాద్ రావు తెలిపారు. శుక్రవారం నస్పూర్ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎన్.దివాకర్ రావులతో కలసి మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడారు. మూడో దఫా హరిత హారంలో బాగంగా రాష్ట్రం మొత్తం 40కోట్ల మొక్కలను నాటాలని, అందులో ఉద్యోగ సంఘాలు 40లక్షల మొక్కలను నాటాలని కోరారు. ప్రతి ఉద్యోగి 60 మొక్కలను నాటాలని తెలిపారు. ఉద్యోగ సంఘాలు ఉద్యమంలో కీలక పాత్రపోషించారని అన్నారు. ఉద్యమంలోనే కాకుండా ప్రజా సంక్షేమా కార్యక్రమాలు చేపట్టాడం జరుగుతుందని తెలిపారు. చిన్న రాష్టల్రతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన కెసిఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పెన్షన్, పాఠశాలల్లో సన్నభియ్యం, ప్రభుత్వ పాఠశాలల ఆదునీకరణ తదితర అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి రవీందర్ రెడ్డి, మామిల్లరాజు, టిఎన్‌జివో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద అశోక్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సూరేష్, కార్యదర్శి శ్రీహరి, డిఎఫ్‌వో ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీపతిబాపురావు, కార్యదర్శి సుభాష్, పంచాయతీ కార్యదర్శి అజ్మిత్ అలీ, సత్యనారాయణ, నాగేందర్, చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.