రంగారెడ్డి

శివార్లలోనూ కిక్కే కిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూలై 21: అక్రమంగా శివారు ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా, ఇతర ప్రాంతాల నుండి దిగుమతులకు పాల్పడుతున్నారా? లేదా? అనే విషయంపై ప్రత్యేక బృందాలు నిఘా పెట్టినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, కేశంపేట మండలాల పరిధిలోని గ్రామాల్లో రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులతోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమలకు చెందిన వారి ఫాంహౌస్‌లు అధికంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ శంషాబాద్ విమానాశ్రయం ఉన్నందున ఈ ప్రాంతంలో డ్రగ్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు ఎమైనా జరిగాయా? లేవా? అనే కోణాల్లో సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. డ్రగ్స్‌కు సంబంధించిన వ్యవహరంలో సంబంధం ఉన్న వారి జాబితాలో ఉన్నవారికి ఈ ప్రాంతంలో ఫాంహౌస్‌లు ఉన్నట్లు సమాచారం సేకరించారు. అయినప్పటికీ ఈ ఫాంహౌస్‌లలో వినోదాలతోపాటు అక్రమ డ్రగ్స్‌కు సంబంధించిన కార్యకలపాలు జరిగాయా..లేవా, ఫాంహౌస్‌లలో జరిగిన విందు కార్యక్రమాలల్లో ప్రముఖులు ఎవరెవరు హాజరయ్యారనే సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో ఫాంహౌస్‌లతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పెద్దపెద్ద ఫాంహౌస్‌లు ఏర్పాటు చేశారని, ఇందులో కూడా అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇందులో రాష్ట్ర స్థాయి ప్రముఖులు అధికంగా పాల్గొంటారని, గతంలో కూడా కోళ్ల పందాలు పెద్దఎత్తున జరిగిన సమయంలో పోలీసులు దాడులు చేసి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు, పేకాట కార్డులు స్వాధీన పరుచుకొని కేసులు పెట్టారు. కానీ పలుకుబడి గల నాయకుల కుమారులు, స్నేహితులు ఉన్నందున ఆ కేసులు విచారణ ముందుకు సాగలేదు. ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారంలో ‘సిట్’ అధికారులు జరుపుతున్న గాలింపు చర్యల వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జరిగిన ఫాంహౌస్‌లలో జరిగిన విందు, ఇతర కార్యక్రమాలలో డ్రగ్స్ ఉపయోగించారా..లేదా అనే కోణాల్లో సమాచారం సేకరిస్తున్నారు. ఇక్కడ జరిగిన విందుల కార్యక్రమాలకు ఇతర ప్రాంతాల నుండి ప్రముఖులు ఎవరెవరు హాజరయ్యారనే సమచారం సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక సార్లు మందు, విందు కార్యక్రమాలు జరిగాయని, ఇందులో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖుల బందువులు హాజరయ్యారని సిట్ అధికారులకు సమాచారం అందింది. సిట్ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి సమాచారం సేకరిస్తునందున కొంతమంది ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

విద్యాసంస్థల బంద్ విజయవంతం
మేడ్చల్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మేడ్చల్‌లో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ప్రభుత్వం విద్యార్థి హక్కుల ఉద్యమాలపై ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తోందని.. నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించినట్లు ఆయా విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. బంద్ పిలుపు మేరకు ప్రైవేటు, కార్పొరేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు తెరుచుకోలేదు. కొన్ని తెరుచుకున్నప్పటికీ ఆందోళనకారులు బలవంతంగా మూయించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో మేడ్చల్ 44వ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలోని బస్సుడిపో జాతీయ రహదారిపై విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రశ్నించే విద్యార్థి గొంతుకపై క్రిమినల్, కిడ్నాప్ కేసులు పెడతామని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం లాంటి చర్యలు బాధ్యాతారాహిత్యమైనవని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్ జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం మానేసి విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు సూచించారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, విద్యా వ్యాపారీకరణను అరికట్టాలని, ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని కోరారు. అదేవిధంగా ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌లకు సరిపడే బడ్జెట్‌ను కేటాయించాలచి నిధులు విడుదల చేయాలని, మేడ్చల్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తే విద్యార్థి ఉద్యమాలు పెరిగి టిఆర్‌ఎస్ సర్కార్‌ను గద్దె దింపుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి బాలకిరణ్, నాయకులు పవన్‌కళ్యాణ్, శ్రీకాంత్, ప్రవీణ్, శ్రావణి, పూజ, రాణి, స్వాతి, డివైఎఫ్‌ఐ నాయకులు అరవింద్, ప్రశాంత్, నర్సింగ్‌రావు, సాయిచరణ్, పాల్గొన్నారు.
రాజేంద్రనగర్: ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వ పాఠశాలలను విస్మరిస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు బంద్ పాటించారు. సర్కిల్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు శుక్రవారం విద్యార్థి నాయకులు బంద్ చేయించి నిరసన తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లు స్వచ్ఛందంగా బంద్ చేయగా, కొన్నింటిని విద్యార్థి నాయకులు బంద్ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూస్తోందని, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎర్రతివాచీ పరిచి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్న ప్రైవేట్ పాఠశాలల ఆగడాలను అడ్డుకుంటామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.
ఉప్పల్: విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ దమన నీతిని నిరసిస్తూ విద్యాసంఘాల పిలుపు మేరకు శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా నిర్వహించిన బంద్ విజయవంతం అయింది, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యాసంఘాల పిలుపు మేరకు ఉప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్, చిల్కానగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, ఉప్పల్ బస్‌డిపో ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఎఐఎస్‌ఎఫ్ నాయకులు విశాల్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో నాయకులు ధర్మేంద్ర, దుర్గాప్రసాద్, హరికృష్ణ పాల్గొన్నారు.
కేశంపేట: విద్యావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు సూచించారు. శుక్రవారం కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌కాంగ్రెస్ నాయకులు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకు చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీనాథ్, సాజిత్, నేదునూరు శ్రీను, నరేష్, ప్రవీణ్, రాజు, అర్జున్, గణేష్, సంతోష్ పాల్గొన్నారు.

రైతులు సహకరిస్తేనే గోదాములకు రహదారి
కొందుర్గు, జూలై 21: నూతనంగా నిర్మించిన మార్కెట్ గోదాములకు వెళ్లాలంటే సమీప రైతులంతా సహకరించాలని షాద్‌నగర్ ఆర్‌డిఓ ఎం.కృష్ణ వివరించారు. శుక్రవారం కొందుర్గు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ గోదాములకు వెళ్లేందుకు నక్షబాట కోసం సమీప రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఓ మాట్లాడుతూ కోట్ల రూపాయల ఖర్చుతో మార్కెట్ గోదాములను నిర్మించారనీ.. వాటి వద్దకు వెళ్లేందుకు రహదారి లేకపోవడం సమస్యగా మారిందని, రైతులంతా సహకరించి బాటను వదలితే సులువుగా ఉంటుందని వివరించారు. రైతులంతా ఆలోచించి చెబుతామని చెప్పారని ఆర్‌డివో తెలిపారు. జిల్లేడు చౌదరిగూడ మండలం ఇంద్రానగర్‌లో సర్వే నంబర్ 61లో రెండు ఎకరాల 21గుంటల ప్రభుత్వ భూమిని గతంలో శ్మశాన వాటిక కోసం ఇచ్చారని వివరించారు. ఒకే వర్గానికి ఇంత భూమి ఇస్తే మిగతా వారు ఎక్కడికి వెళ్లాలని, స్థానిక తహశీల్దార్ బాల్‌రాజ్‌కు వినతిపత్రం ఇచ్చారని ఆర్డీవో తెలిపారు. సర్వే నంబర్ 61లో మరోమారు సర్వే చేసి పూర్తి వివరాలను తమకు అందజేయాలని కొందుర్గు సర్వేయర్‌ను అదేశించినట్లు పేర్కొన్నారు. పూర్తి సమాచారం వచ్చిన తరువాతే అన్ని వర్గాల ప్రజలకు సమానంగా కేటాయించేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ తహశీల్దార్లు ప్రమీలరాణి, బాల్‌రాజ్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్‌పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హఫీజ్, లింగారం పెంటయ్య, విఆర్‌ఓ మల్లేష్, గోపాలకృష్ణ ఉన్నారు.

రాష్టప్రతిగా కోవింద్ ఎన్నికతో సంబరాలు
మేడ్చల్, జూలై 21: ఎన్‌డిఎ కూటమి బలపర్చిన రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ విపక్ష అభ్యర్థి మీరాకుమార్‌పై ఘనవిజయం సాధించడంతో శుక్రవారం మేడ్చల్ బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. పట్టణంలోని ప్రధాన కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలను అంబరాన్నంటే విధంగా ఘనంగా జరుపుకొన్నారు. తొలిసారిగా బిజెపి బలపర్చిన అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ దేశ 14వ రాష్టప్రతిగా ఎన్నిక కావడం హర్షణీయమని పలువురు నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు జగన్‌గౌడ్, ఎంపిటిసిలు శ్రీనివాస్, విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ మహేందర్, నాయకులు సర్వేశ్వర్‌రెడ్డి, దాత్రిక లక్ష్మణ్, ప్రభాకర్‌రెడ్డి, రమేశ్, కిషన్‌రావు, వంశీవంజరి, అవినాశ్‌చారి, కిషన్, నవీన్, గణేశ్, సత్యనారాయణ, చీర్లరమేశ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఘట్‌కేసర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చలువతోనే దళితుడు భారత రాష్టప్రతిగా ఎన్నిక అయినట్లు రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు నానావత్ బిక్కునాధనాయక్ తెలిపారు. భారతదేశానికి 14వ రాష్టప్రతిగా రామ్‌నాధ్‌కోవింద్ ఎన్నిక కావటం పట్ల మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొనింటి బుచ్చయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సంబరాలు జరుపుకొన్నారు. మిఠాయిలు పంచుకున్నారు. గ్రామంలోని జాతీయ రహదారిపై విజయోత్సవ ర్యాలీ జరిపారు. దేశ ప్రగతే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న ప్రధాని మోదీకి దేశప్రజలు జేజేలు పలుకుతున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పూర్తి స్థాయిలో రాష్టప్రతిగా రామ్‌నాధ్‌కోవింద్ మద్దతు తెలిపారన్నారు.
కొందుర్గు: రాష్టప్రతి ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింగ్ గెలుపుతో స్థానిక బిజెపి శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మరి భూపాలచారి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కోనేరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కుర్మయ్యతోపాటు చంద్రశేఖర్, హరిష్, నర్సింలు, రాజు, అనిల్, శేఖర్, లడ్డూ పాల్గొన్నారు.
కీసర: భారత రాష్టప్రతిగా రామ్‌నాథ్ కోవింద్ గెలుపు పట్ల కీసర మండల బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేసారు. కీసర అంబేద్కర్ చౌరస్తాలో కార్యకర్తలతో కలిసి మిఠాయిలు పంచారు. మండల బిజెపి అధ్యక్షుడు ఏనుగు రాజిరెడ్డి మాట్లాడుతూ దళిత నాయకుడిని రాష్టప్రతిగా ఎన్నుకోవటం హర్షనీయమని అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపగల సత్తా కోవింద్‌కు ఉందని చెప్పారు. కార్యక్రమంలో బిజెపి నేతలు ఎస్.వెంకట్‌రెడ్డి, జి.తిరుమల్‌రెడ్డి, అశోక్, మెట్టు మహేందర్, బి.శ్రీనివాస్, వెంకటేశ్, ఎల్లప్ప, రాంరెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
తాండూరు: రాష్టప్రతిగా రామ్‌నాథ్ కోవింద్ విజయం సాధించటంతో శుక్రవారం తాండూరులో బిజెపి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. రాష్టప్రతి హాదాలో కోవింద్ కొలువుదీరడం యావత్ దేశానికి శుభసూచకమని పట్టణ బిజెపి అధ్యక్షుడు బంటారం భద్రేశ్వర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సమర్థవంతమైన పాలనకు దర్పణంగా కోవింద్ సునాయాసంగా విజయం సాధించారని రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి అంతారం లలిత అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు బొప్పి సురేష్, పూజారి పాండూ, జి.మల్లేశం, వైద్యలింగం, కె.్భరప్ప, డి.సుధాకర్ రెడ్డి, విఠల్, చంద్రశేఖర్, ఎ.శ్రీనివాస్, లింగప్ప, బాలప్ప పాల్గొన్నారు.

తక్కువ మొక్కలు నాటడంపై కలెక్టర్ అసంతృప్తి
కీసర, జూలై 21: హరితహారం లక్ష్యాన్ని నిర్ణత సమయంలో పూర్తి చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో హరితహారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హరితహారంలో భాగంగా జిల్లాలో అనుకున్న లక్ష్యాన్ని చేరటంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రణాళికలు రూపొందించి మొక్కలు నాటాలని అన్నారు.
ఉపాధిహామీ కింద సైట్‌లను రిజిస్ట్రేషన్ చేసుకొని జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. అన్ని శాఖలు తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలు, విద్యార్ధులు, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. సహకరించని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, విద్యా సంస్థల్లో తప్పనిసరిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జియో ట్యాగింగ్, సైట్ రిజిస్ట్రేషన్‌లపై ప్రతి రోజు టెక్నికల్ అసిస్టెంట్‌లతో సమీక్షించాలని డిఆర్‌డిఒ కౌటిల్యను ఆదేశించారు. పంచాయతీరాజ్ రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసే బాధ్యతను ఆయా గుత్తేదార్లకు అప్పగించాలని అన్నారు. హరితహారం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, రాష్ట్ర స్థాయిలో హరితమిత్ర అవార్డులు 400 ఉన్నాయని, దీనిపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా హరితహారంపై కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో డిఎఫ్‌ఒ కృష్ణ, డిఆర్‌డిఒ కౌడిల్య, ఆర్డీఒ హన్మంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ఎడి శోభారాణి, ఉద్యానవన శాఖ ఎడి సత్తార్ పాల్గొన్నారు.

వేధింపులతో పారిపోయిన బాలుడు
వికారాబాద్, జూలై 21: పినతల్లి వేధింపులు భరించలేక ఇంటి నుండి పారిపోయిన బాలుడిని చైల్డ్‌లైన్ హోంలో చేర్పించింది. వికారాబాద్ రైల్వే ఎస్‌ఐ వెంకట్‌రాం నాయక్, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ ఎస్.రామేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ గాంధీనగర్‌కు చెందిన 14 సంవత్సరాల బాలుడి తల్లి మరణించడంతో తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. మొదటల్లో పిన తల్లి బాగానే చూసుకుంది. మూడు సంవత్సరాలుగా బాలుడిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతుండటంతో 15 రోజుల క్రితం ఇంట్లో నుండి పారిపోయి వచ్చి మిత్రుల వద్ద తల దాచుకున్నాడు. గురువారం రాత్రి వికారాబాద్ రైల్వే జంక్షన్‌లో బాలుడిని గమనించిన రైల్వే పోలీసులు 1098 చైల్డ్‌లైన్‌కు సమాచారమిచ్చారు. సిడబ్ల్యుసి ఆదేశం మేరకు శుక్రవారం బాలుడిని హోంలో చేర్పించారు.
నేలకొరిగిన భారీ వృక్షం
శంకర్‌పల్లి జూలై 21: శంకర్‌పల్లిలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్ళే రోడ్డులో ఎస్‌సి బాలికల హాస్టల్ ఎదురుగా ఉన్న భారీ వృక్షం శుక్రవారం మధ్యాహ్నం కూకటివేళ్లతో సహా నేలకొరిగింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పుడప్పుడు ఈ చెట్టు కింద ఆటోలు నిలిపి ఉంచుతారు. చెట్టు నేలకొరిగే సమయంలో ఆటోలు ఆ స్థలంలో లేవు. అయితే, చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది, చుట్టుపక్కల వారు కొమ్మలను నరికి దారికి అడ్డంగా ఉన్న వాటిని తొలగించారు.