పశ్చిమగోదావరి

మన పల్లెలకు తగ్గిన వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 21: ఒకప్పుడు ప్రభుత్వం పల్లెవెలుగు సర్వీసులతో పల్లెలకు రవాణా వెలుగులు అందించాలని ఫలితంగా ఆ గ్రామాల్లో వచ్చే మార్పు అద్వితీయంగా ఉంటుందని భారీగా ప్రచారం చేసుకుంది. అయితే ప్రభుత్వం మారింది, మరీ ఏ పరిస్దితులు మారాయో తెలియదుకాని ఈ పల్లెవెలుగులతో ఆర్టీసీ దీపం కొడిగడుతోందన్న వాదనను తెరపైకి తీసుకువచ్చి ఆ సర్వీసులకు మంగళం పాడేస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగానే గుట్టుచప్పుడు కాకుండా అమలైపోతున్న ఈవిధానంలో జిల్లా కూడా చేరింది. తాజాగా జిల్లాలో మొత్తం ఏడు పల్లె వెలుగు బస్సులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం నుండి వయా తాళ్లపూడి మీదుగా రాజమండ్రి వెళ్లే బస్సు, జంగారెడ్డిగూడెం-్భద్రాచలం, జంగారెడ్డిగూడెం-గోగుమిల్లి, తాడేపల్లిగూడెం-్భద్రాచలం రెండు బస్సులు, కొవ్వూరు నుండి దొండపూడి, కొవ్వూరు నుండి భద్రాచలం వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ఈ బస్సు సర్వీసుల్లో ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) గణనీయంగా పడిపోయిందని వారు పేర్కొంటున్నారు. కనీసం 50శాతం కూడా ఓఆర్ ఉండటం లేదని, దీనివల్ల వీటి నిర్వహణ కష్టతరంగా మారిందన్న వాదనను తెరపైకి తీసుకువచ్చి ఈబస్సులను ఏకంగానే రద్దు చేసేశారు. అయితే ఆర్టీసీలో ఉన్న పరిస్ధితులు చూసుకుంటే ఇది ఆరంభమే అన్న అభిప్రాయం కలగకమానదు. ఓఆర్ పేరుతో రానున్న రోజుల్లో మరికొన్ని బస్సులకు మంగళం పాడే పరిస్ధితులు కన్పిస్తున్నాయి. ఇవేకాకుండా సూపర్‌లగ్జరీ విభాగంలో భీమవరం నుండి జీడిమెట్ల వెళ్లే రెండు బస్సులు, తాడేపల్లిగూడెం నుండి బిహెచ్‌ఇఎల్‌కు వెళ్లే రెండు బస్సులు రద్దు చేశారు. అలాగే ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు సంబంధించి భీమవరం-ఖమ్మం, భీమవరం-్భద్రాచలం, నరసాపురం-్భద్రాచలం బస్సులను కూడా రద్దు చేశారు. అవిధంగా చూస్తే పశ్చిమరీజియన్ ఆర్టీసీ ఎంతోకాలంగా నష్టాల్లో ఉందని అధికారులు ప్రచారం చేస్తూనే వస్తున్నారు. అనేపధ్యంలోనే ఒకటొకటిగా బస్సులను, సర్వీసులను రద్దు చేస్తూ ముందుగా సేవపేరుతో వస్తున్న భారాన్ని తగ్గించుకునేందుకు కార్పోరేషన్ ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది. వాస్తవానికి ప్రైవేటు ట్రావెల్స్ మాదిరిగా ఆర్టీసీ సర్వీసులు, బస్సుల వారీగా లాభాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈసేవ చేస్తుంటే ఇప్పుడు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు సమంజసమేనని భావించవచ్చు. కానీ ప్రజలంతా కలిసి కడుతున్న పన్నులు, ఆర్టీసీ ద్వారా వస్తున్న ఆదాయంతో నడుస్తున్న ఈకార్పోరేషన్ రవాణా సదుపాయాన్ని పల్లె జనానికి, అవసరమైన ప్రయాణీకులకు అందించటమే లక్ష్యంగా పనిచేయాలని తొలిదశలో లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ రానురాను ఆలక్ష్యం నుంచి పూర్తిగా వైదొలగుతూ ప్రైవేటు ట్రావెల్స్ మాదిరిగా సర్వీసులు, బస్సులకు ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ ఆ సర్వీసులు గ్రామస్ధాయిలో చేస్తున్న సేవలను పట్టించుకోకుండా ఏకమొత్తంగా రద్దు ఆయుధాన్ని ప్రయోగించటం మాత్రం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. ఆర్టీసీ సంఘాలు కూడా ఈపరిణామాలను జీర్ణించుకోలేక తమవంతు వ్యతిరేకతను ఉన్నతాధికారుల వద్ద వ్యక్తం చేస్తున్నాయి. ఏదీఏమైనా సర్వీసులు, బస్సుల రద్దు వ్యవహారం ఇక్కడనుంచి ఆరంభం అన్నట్లుగా పరిస్దితి కన్పిస్తోంది. రానున్నరోజుల్లో ఆర్టీసీ మరిన్ని సర్వీసులు, బస్సులను రద్దు చేస్తూ మరింత అప్రదిష్ఠను మూటగట్టుకునే పరిస్దితే కన్పిస్తోంది.

నిలకడగా గోదావరి
పోలవరం, జూలై 21: గోదావరి నది వరద నెమ్మది నెమ్మదిగా పెరిగి శుక్రవారం సాయంత్రానికి నిలకడగా ఉంది. మండలంలోని కొత్తూరు కాజ్‌వేపై మూడడుగుల మేర వరద నీరు చేరడంతో గిరిజన గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం కల్గింది. పోలవరం నుంచి టేకూరు వెళ్లే ఆర్టీసీ బస్సును తాత్కాలికంగా నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల వారు ఇబ్బందులు పడుతూనే ప్రయాణాలు సాగిస్తున్నారు. కాజ్‌వే వరకూ ఒక ఆటోలో వచ్చి, కాజ్‌వేను దాటి, అక్కడ నుంచి మరో ఆటోలో పోలవరం చేరుకుంటున్నారు. వాహనదారులు తమ వాహనాలను రూ.50లు ఇచ్చి కూలీలతో కాజ్‌వేను దాటించి ప్రయాణం సాగిస్తున్నారు. పోలవరం సిడబ్ల్యూసి కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం 11.16 మీటర్ల రీడింగ్ నమోదైంది. శనివారం నుంచి వరద తగ్గే అవకాశం ఉందని, ప్రస్తుతానికి ప్రమాదం ఏమీలేదని సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు.

ఎఆర్ అదనపు ఎస్పీగా మహేష్‌కుమార్
ఏలూరు, జూలై 21 : జిల్లాలో నూతనంగా వచ్చిన ఎ ఆర్ అదనపు ఎస్‌పి ఎన్ మహేష్‌కుమార్ శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో పనిచేస్తున్న ఎ ఆర్ ఓ ఎస్‌డి బి రామకృష్ణ పదోన్నతిపై విశాఖపట్నం సి ఎ ఆర్ అదనపు ఎస్‌పిగా వెళుతున్న నేపధ్యంలో ఆయన నుంచి మహేష్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

కాపులను మోసం చేసింది వైఎస్సారే
భీమవరం, జూలై 21: రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గీయులను మోసం చేసింది వైసిపి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని టిడిపి జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆరోపించారు. మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి వైఎస్సార్ మోసం చేశారన్నారు. ఆమె శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. ఆ విధంగా మోసంచేసిన వారి వెంట ముద్రగడ ఉంటూ కాపు సోదరులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జగన్ డైరెక్షన్‌లో ముద్రగడ పాదయాత్ర యాక్షన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కాపులకు మేలుచేసే తెలుగుదేశం ప్రభుత్వంపై ముద్రగడ దాడి చేయడం విద్రోహ చర్యకు నిదర్శనం అన్నారు. గడచిన 30 ఏళ్లల్లో ఎవ్వరికీ చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తుచేశారు. ముద్రగడ హింసను ప్రేరేపించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని తోట పేర్కొన్నారు. రిజర్వేషన్ అంశంపై టిడిపి ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వచ్చి ఇచ్చిన హామీలు అమలుచేస్తూ కాపులను బీసీల్లో చేర్చేందుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులను ఆదేశించారన్నారు. రాష్ట్రంలో 65వేల మందికి రుణాలు, అర్హులైన యువ పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షల రుణం అందజేసినట్టు చెప్పారు. చంద్రన్న వెయ్యి రోజుల పాలనలో కాపుల కోసం 34 పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తోన్న ప్రభుత్వం టిడిపి మాత్రమేనన్నారు. ఉన్నత చదువుల కోసం 400 మందిని విదేశాలకు, 80వేల మందికి స్వయం ఉపాధి కింద రాయితీ రుణాలు, ఇంకా 600 మంది ఇంటర్వ్యూలు పూర్తిచేసుకుని విదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ముద్రగడ చేసే కాపు వ్యతిరేక చర్యలను కాపు సోదరులందరూ గమిస్తున్నారని, ఇప్పటికైనా ప్రజలను రెచ్చగొట్టే చర్యలు ముద్రగడ మానుకోవాలని టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి హితవు పలికారు.

వచ్చే సంవత్సరం నుంచి పొగాకుకు కనీస గ్యారంటీ ధర
దేవరపల్లి, జూలై 21: పొగాకుకు వచ్చే సంవత్సరం నుండి కనీస గ్యారంటీ ధర నిర్ణయిస్తామని పొగాకు బోర్డు డైరెక్టర్ పి సత్యనారాయణ తెలిపారు. స్థానిక పొగాకు వేలం కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి, అనంతరం రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. పొగాకు వేలం నిర్వహణాధికారి హనుమంతురావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో పొగాకుకు ముందస్తు రేట్లు నిర్ణయించే అవకాశం ఉండేది కాదని, ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రేడును బట్టి ముందస్తు రేట్లను నిర్ణయిస్తున్నట్టు తెలిపారు. అత్యధిక, అత్యల్ప ధర, మీడియం, బ్రైస్ గ్రేడులకు ధర నిర్ణయిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను తాము నిర్ణయించిన ధర తగ్గదని, దానినిబట్టి రైతులు పొగాకు పంట వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పొగాకు బోర్డు అదనంగా పండించిన పొగాకుకు అపరాధ రుసుకు వేస్తామని ప్రకటించిందని, తాము కేంద్ర మంత్రితో చర్చలు జరిపిన తర్వాత అపరాధ రుసుము రద్దుచేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, మరో నాలుగు రోజులలో కేంద్ర వాణిజ్యమంత్రి నుంచి ఉత్తర్వులు వస్తాయన్నారు. బ్యారన్‌కు అదనంగా అయిదు క్వింటాళ్లు అదనంగా పొగాకు ఉత్పత్తిచేయడానికి ఎన్‌ఎల్‌ఎస్ రైతులు కోరుతున్నారని, వారి డిమాండ్లను పొగాకు బోర్డు డైరెక్టర్ల సమావేశంలో తెలియజేస్తామన్నారు. బ్యారన్ లైసెన్సులు వదులుకునే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని గత అయిదు సంవత్సరాలుగా రైతులు డిమాండు చేస్తున్నారని, ఈ డిమాండు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అంతకు ముందు ఆయన పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించారు. సమావేశంలో రైతు నేతలు ఆచంట గోపాలకృష్ణ, ఈలపోలు చిన్ని, కాట్రు సత్యనారాయణ, పరిమి రామకృష్ణ, ఎం సత్యనారాయణ, కె రాంబాబు, ఎస్ జగదీశ్వరరెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్లు హేమస్మిత, ప్రభాకరరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఏలూరు, జూలై 21: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల వసూళ్లను వేగవంతం చేసి పంచాయితీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయితీల్లో పనుల ప్రగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 77కోట్ల రూపాయల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా నేటివరకు ఒక్కశాతం కూడా వసూలు చేయలేదన్నారు. పంచాయితీలలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు పన్నుల వసూళ్లపై దృష్టి కేంద్రీకరించి పంచాయితీలకు ఆదాయం సమకూర్చుకోవాలన్నారు. ఇప్పటినుండే ఇళ్ల పన్నులు, నాన్ టాక్సెస్‌లు వసూలు చేయటం వేగవంతం చేయకపోతే సంవత్సరం ఆఖరున వత్తిడులకు గురవుతారన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, పందులు, మురుగునీరు దర్శనమిస్తున్నాయని, పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోతే అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. గ్రామాల్లో చెత్తను తొలగించేందుకు పంచాయితీలకు అప్పగించిన స్ధలాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణాలు త్వరితగతిని పూర్తి చేయాలని కలెక్టరు ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించేందుకు ప్రతిరోజు ఉదయం 5.30గంటలకు వెళ్లాలని చెప్పానని, కొంతమందిలో మార్పు వచ్చిందని, ఉదయం 5.30గంటలకే వారు బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారని, మిగిలినవారు కూడా ఉదయమే గ్రామాల్లో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. మినీ మీసేవా కేంద్రాలను ఏర్పాటుచేసి గ్రామీణ ప్రజలకు అన్నిరకాల పౌరసేవలు అందించాలన్నారు. సమావేశంలో డిపిఓ కె సుధాకర్, డివిజనల్ పంచాయితీ అధికారులు శ్రీరాములు, సూర్యనారాయణ, అమ్మాజీ, అపర్ణ, ఇఓఆర్‌డిలు పాల్గొన్నారు.

పూర్తయిన భూసేకరణ: ఐటిడిఎ పిఒ షణ్మోహన్
బుట్టాయగూడెం, జులై 21: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా జిల్లాలోని నిర్వాసితుల కోసం సుమారు ఏడాది క్రితం మొదలుపెట్టిన భూసేకరణ పూర్తయిందని ఐటిడిఎ పివో, కుక్కునూరు సబ్ కలెక్టర్, భూసేకరణ అధికారి ఎస్ షణ్మోహన్ తెలిపారు. కెఆర్ పురం ఐటిడిఎ పివో ఛాంబర్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పివో షణ్మోహన్ మాట్లాడుతూ నిర్వాసితుల కోసం జిల్లాలో ఇప్పటివరకు రూ.2,300కోట్లతో 28వేల ఎకరాల భూసేకరణ జరిగినట్లు చెప్పారు. ఈ భూములను నిర్వాసితులకు భూమికి భూమి, ఇళ్ల నిర్మాణం, గ్రామాల ఏర్పాటుకు అప్పగించినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వాసితుల కోసం 3,600 ఎకరాలు సేకరించవలసి ఉందని అన్నారు. దీనికోసం నిమ్మలగూడెం, రెడ్డిగణపవరం, పి.రాజవరం, తాటియాకులగూడెం, తదితర గ్రామాల్లో భూములను సేకరించడానికి గుర్తించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని గిరిజనేతరుల నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి వద్ద వెయ్యి ఎకరాలను సేకరించినట్లు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులు 439మందికి బ్యాంకు ఎక్కౌంట్లలో తలెత్తిన సాంకేతిక కారణాల వలన వారి ఖాతాలకు సొమ్ములు జమ కాలేదని, సమస్యను పరిష్కరించి, త్వరలో వారి ఖాతాలకు సొమ్ములు జమ అయ్యేందుకు చర్యలు చేపడతామని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఏజన్సీలో 12 ఎఎన్‌ఎం, నాలుగు స్ట్ఫానర్స్ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని, దళారులను నమ్మి, సొమ్ములు నష్టపోవద్దని హెచ్చరించారు. సర్వీస్‌లో ఉన్న సెకండ్ ఎఎన్‌ఎంలకు ఈపోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. తమకు అందిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం లిస్ట్‌ను ప్రకటిస్తామని, అనంతరం రెండురోజులు అభ్యంతరాల స్వీకరణ, తదుపరి గైడ్‌లైన్స్ అనుసరించి, మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించి, ఈనెల 28వతేదీన ఇంటర్వ్యూలు నిర్వహించి, అదేరోజు సాయంత్రం ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలను అందిస్తామని అన్నారు. ఈ పోస్టులను జివో నెం.3 ప్రకారం స్థానిక గిరిజనులతో భర్తీచేస్తున్నట్లు స్పష్టంచేశారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పోస్టుల భర్తీలో కూడ షెడ్యూల్డ్‌ప్రాంతంలో జివోనెం.3 అమలవుతుందని తెలిపారు. అమరవరం, వింజరం, కోండ్రుకోట ఆసుపత్రుల్లో మందుల కొరత ఉందని, రెండురోజుల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతామని అన్నారు. దోమతెరల పంపిణీ 90శాతం పూర్తయిందని, ఒక్కొక్క దోమతెరకు రూ.50 వసూలు చేస్తూన్నారని, ఈసొమ్ములు ఆయా ఆసుపత్రుల్లో వౌలికవసతులు, ఇతర అవసరాల నిమిత్తం ఖర్చుచేయనున్నట్లు వివరించారు. నిర్వహణ సరిగాలేని జిసిసి చౌకదుకాణాలను సివిల్‌సప్లయిస్‌కు అప్పగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తనకు సిఆర్‌డిఎ ఉప కమిషనర్‌గా బదిలీ అయినప్పటికీ, మరికొన్ని రోజులు ఇక్కడే బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

తుందుర్రు ఘటనలో 23 మంది అరెస్టు
నరసాపురం, జూలై 21: తుందుర్రు ఆక్వాపార్కు యంత్రాలు తరలింపు సమయంలో వాహనాలు అడ్డుకోవడం, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు పోలీసులపై దాడికి పాల్పడిన 23 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయస్థానంలో హజరు పరిచారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ నిందితులకు ఆగస్టు 4 వరకు రిమాండ్ విధించారు. వీరిలో 22 మంది వ్యక్తులను నరసాపురం సబ్ జైలుకు, ఒక మహిళను తణుకు సబ్ జైలుకు తరలించినట్టు సిఐ సుబ్బారావు తెలిపారు.

వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యవహిస్తే కఠిన చర్యలు
ఏలూరు, జూలై 21: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్యసేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని డిసిహెచ్‌ఎస్ డాక్టరు శంకరరావు హెచ్చరించారు. స్ధానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఎమ్మెల్సీ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ రాము సూర్యారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టరు ఎవిఆర్ మోహన్‌తో కలిసి వివిధ విభాగాల్లో విస్తృతంగా పర్యటించారు. పలుచోట్ల సిబ్బంది సకాలంలో వైద్యసేవలు సక్రమంగా అందించటం లేదని, కొంతమంది బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారని పలువురు తమ దృష్టికి తీసుకువచ్చారని, భవిష్యత్‌లో ఇటువంటి విమర్శలు విన్పించకూడదన్నారు. రాష్ట్రప్రభుత్వం వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, రోగులకు సకాలంలో సేవలుల అందించినప్పుడే వారు అనందంగా ఉంటారని డాక్టరు శంకరరావు పేర్కొన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ రాము సూర్యారావు మాట్లాడుతూ కోట్లాది రూపాయలు వైద్యసేవలకోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, ఈపరిస్ధితుల్లో వైద్యులు, సిబ్బంది బాధ్యతగా రోగులకు సేవలు అందించకపోతే ఆసుపత్రికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఆసుపత్రిలో డాక్టర్లకు, సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించడంలో మాత్రం ఎక్కడ నిర్లక్ష్యం కన్పించినా ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టరు ఎవిఆర్ మోహన్ మాట్లాడుతూ ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ప్రతి శుక్రవారం విధిగా తనిఖీ నిర్వహిస్తామని, ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే మాట విన్పించకుండా సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో జాన్సీ, మనోజ్, కమిటీ సభ్యులు పాండు తదితరులు పాల్గొన్నారు.