కర్నూల్

కాలువ వెంట కాలి నడకన..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 21:నంద్యాల ఉపఎన్నికను వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 3 వారాల్లో రెండో దఫా శనివారం నంద్యాలకు వస్తున్నారు. ఈ సారి ఆయన చామ కాలువ, కుందూ నదుల వెంట కాలి నడకన తిరిగి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించనున్నారు. అంతేగాకుండా పట్టణంలో చేపట్టిన రహదారి విస్తరణ పనులను కూడా ఆయన పరిశీలించనున్నారు. ఆయన నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం కోసం స్వయంగా రంగంలోకి దిగారు. సాధారణ పరిస్థితుల్లో ఒకటి, రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే పార్టీ అధినేతల స్పందన పెద్దగా కనిపించదు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ అధినేత సాదాసీదా సమీక్షలు నిర్వహించి స్థానిక నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తారు. ఎన్నికల సమయంలో ఏదో ఒక సందర్భంలో ప్రచారంలో భాగంగా వచ్చి వెళ్లడం, పోలింగ్‌కు ముందు మరోమారు స్థానిక అధికారులతో చర్చిస్తారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలు ఇందుకు భిన్నంగా జరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆ కుటుంబం వారికి ఉప ఎన్నికల్లో అవకాశమిచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆ కుటుంబంలోని సభ్యుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి వైకాపా అంగీకరించకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. తనను కాదని వ్యతిరేక పార్టీలో చేరి తననే సవాల్ చేసిన శిల్పా మోహనరెడ్డి ఓటమే లక్ష్యంగా చంద్రబాబు స్వయంగా ఎన్నికలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి వాటిని చేపడుతూనే 3 వారాల్లో రెండో దఫా నియోజకవర్గంలో పర్యటనకు వస్తున్నారు. గత నెల 28న వచ్చిన చంద్రబాబు రంజాన్ ప్రార్థనల్లో ముస్లింలతో కలిసి పాల్గొని ప్రభుత్వం తరఫున వారికి పండుగ విందు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన నంద్యాలలో అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడంతో పాటు చామ కాలువ, కుందూ నదుల వెంట, పట్టణంలో రహదారుల విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కాలి నడకన తీరును పరిశీలిస్తారు. అంతేగాకుండా నియోజకవర్గంలోని గోస్పాడు, నంద్యాల పట్టణాల్లో బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరనున్నారు.
మోసం చేయడానికే అభివృద్ధి జీఓలు..
నంద్యాల, జూలై 21: తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు దాటిపోయిన అనంతరం నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఆ పార్టీకి పట్టణ ప్రజలపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకువచ్చిందని, దీంతో అభివృద్ధి పనులకు జారీ చేస్తున్న జీఓలు ప్రజలను మోసగించడానికేనని వైకా పా నాయకులు, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నంద్యాల అభివృద్ధికి విడుదల చేస్తున్న జీఓలు లోప భుయిష్టంగా ఉన్నాయని, వీటిని నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే గెలుపొందిన అనంతరం అభివృద్ధి అకస్మాత్తుగా కుంటుపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్దాల పుట్టగా మారిపోయాడని, ప్రతీది ప్రజలను మోసగించేందుకే వాగ్దానాలు ఇబ్బడి ముబ్బడిగా ఇస్తున్నాడని, మాయల మరాఠికంటే గొప్ప మేథావి చంద్రబాబు అన్నారు. సిఎం చంద్రబాబునాయుడు దోపిడీ ముఠా నాయకుడు అని, ఆయన మంత్రులు దోపిడీ దొంగలు అని తీవ్రంగా ఆరోపించారు. గృహ నిర్మాణంలో భారీ దోపిడీకి పథకం రచించారన్నారు. నంద్యాల లాంటి పట్టణంలో గృహ నిర్మాణం చేపట్టాలంటే చదరపు అడుగుకు 13 నుండి రూ.1500 వరకు తీసుకుంటారని, అయితే ప్రభుత్వం నిర్మిస్తున్న అపార్టుమెంట్లకు చ.అ.కు రూ.2300లు తీసుకొనేందుకు ఒప్పందం చేసుకొని గుత్తేదారుల నుండి భారీ మొత్తంలో వసూలు చేసేందుకే గృహ నిర్మాణం చేపట్టి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. 13 వేల మంది నిరుపేదల నుండి రూ.400 కోట్లు దోచుకొనేందుకు పక్కాగా పథకాన్ని రూపొందించారని అన్నారు. పట్టిసీమ ద్వారా భారీగా దోచుకున్నారని, విశాఖలో భూదందా ద్వారా దోపిడీ చేసింది చాలక రాజధాని లోను భారీగా దోచుకుంటున్నారని, తాత్కాలిక సచివాలయం నిర్మించి అందులో కూడా దోపిడి పర్వానికి తెరతీసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. చంద్రబాబునాయుడు ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అందులో నుండి కొంత దోచుకొని దాచుకుంటున్నారని బొత్స ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల అనంతరం నంద్యాలలో రోడ్ల విస్తరణ చేయాలని ఆఘమేఘాల మీద దుకాణాలను కూలగొట్టడం అన్యాయమన్నారు. దుకాణాదారులకు నష్టపరిహారం చెల్లించిన అనంతరమే రోడ్ల విస్తరణ ప్రారంభించాలని హితవు పలికారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా సంఘాలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి వారికి మొండి చేయి చూపించి శనివారం నంద్యాలకు వచ్చి ఏ మొఖం పెట్టుకొని పొదుపు సంఘాలతో సమావేశం అవుతున్నారని ప్రశ్నించారు. విశాఖపట్నంలో హుదుద్ తుఫాన్ అనంతరం భారీగా టిడిపి దోచుకుందని, ఆ కారణం చూపించి రికార్డులను మాయం చేసి భారీ భూదందాకు తెరతీశారని, అన్నారు. హుదుద్ తుఫాన్ ద్వారా తెలుగుదేశం పార్టీ రెండు విధాలుగా దోచుకొని భారీగా లబ్ధిపొందిందన్నారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసే కెల్విన్‌తో చంద్రబాబును పోల్చుతూ లక్షమంది కెల్విన్‌లతో చంద్రబాబు సమానమని తీవ్రంగా ఆరోపించారు. తమ జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి నాలుగు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా దొడ్డిదారిన ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి పదవి దక్కించుకొని పసుపు కుంభకోణంలో కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారన్నారు. విద్యార్థులతో కాపీలు కొట్టించే నారాయణ నీతులు చెబితే ప్రజలు నమ్మరన్నారు. ఎలాగైనా నంద్యాల సీటును కైవసం చేసుకొనేందుకు అధికార తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. వైకాపా అధినేత జగన్ ప్లీనరీ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ పేరిట నవరత్నాలను ప్రకటించారని, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, ఆ నవరత్నాల్లాంటి పథకాలను రాష్ట్రంలో అమలు చేసి ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి స్వర్ణ యుగాన్ని తలపించేలా అభివృద్ధి చేస్తారని, అందుకే నంద్యాలలో వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి బివై రామయ్య, నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాపరెడ్డి, సంజీవయ్య, నెల్లూరు జడ్పీ చైర్మన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
చాతుర్మాస దీక్ష చేపట్టిన పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు
మంత్రాలయం, జూలై 21: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు శుక్రవారం 5వ చాతుర్మాస దీక్షలు చేపట్టారు. సంస్థాన పూజలలో భాగంగా ముందుగా పీఠాధిపతి శ్రీమూల రామ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. 41రోజులు పాటు చేపడుతున్న చాతుర్మాస దీక్ష సందర్భంగా ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనం, శ్రీవాజీంద్ర తీర్థుల బృందావనాలతో ప్రారంభమై, మఠంలో కొలువు తీరిన పూర్వ పీఠాధిపతుల బృందావనాలకు కాషాయ వస్త్రాలతో అలంకరించి దీక్షను మొదల పెట్టటం ఆనువాయితీ. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీసుభుదేంద్ర తీర్థులు చాతుర్మాస దీక్షను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి రాజా ఎస్ గిరియాచార్యులు, ఎఓ రొద్దం ప్రభాకర్, ఎఎఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాస్‌రావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, ప్రిన్సిపాల్ వాదిరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాష్ స్వామి తదితర పండితులు, మఠం అధికారులు పాల్గొన్నారు.
చమురు, గ్యాస్ నిక్షేపాలకై సీమలో సర్వే
చాగలమర్రి, జూలై 21 : రాయలసీమలో ప్రప్రథమంగా చమురు, గ్యాస్ నిక్షేపాలకై సర్వే చేపట్టినట్లు భారత ప్రభుత్వ ఓఎన్‌జిసి అధికారులు ఉమేష్‌కుమార్, మనోజ్‌సింగ్, విఆర్‌ఓ సత్యనారాయణలు తెలిపారు. శుక్రవారం ఓఎన్‌జిసి అధికారుల బృందం మండలంలోని రాజోలి, గొట్లూరు, మల్లెవేముల గ్రామాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల నిర్ధారణకై పెద్ద ఎత్తున సర్వే చేపట్టారు. ఈసందర్భంగా ఓఎన్‌జిసి అధికారులు మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం హెలికాఫ్టర్ ఏరియల్ సర్వేలో రాయలసీమ ప్రాంతంలో చమురు, గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్లు వెల్లడైందన్నారు. ఆ సర్వేకు ఆధారంగా అనంతపురం నుండి కర్నూలు, కడప జిల్లాలో సర్వే చేస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలోని రాజోలి నుండి చాగలమర్రి, మల్లెవేముల, గొట్లూరు, పెద్దవంగలి వరకు ఈ సర్వే చేస్తామని తెలిపారు. 100 మీటర్లకు దూరంలో ఒక బోరు వేసి పరీక్షలు చేస్తామన్నారు. చమురు, గ్యాస్ భూగర్భంలో ఉన్నట్లు నిర్ధారణ అయితే రాయలసీమ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వడమేకాకుండ నిక్షేపాలు పడితే ఆ గ్రామ పంచాయతీలకు 20 శాతం రాయల్టీగా ఇస్తామని వివరించారు. ఈ ప్రాంత ప్రజలు సహకరించాలని, నిక్షేపాలు పడితే వారి అదృష్టమే మారిపోతుందని అధికారులు వివరించారు.
నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్‌పై వేటు
నంద్యాల, జూలై 21: నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదినారాయణను ఆశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులు అందినట్లు తెలిసింది. ఈయనపై పలు అవనీతి ఆరోపణలు ఉన్న కారణంగా శాఖాపరమైన విచారణ నిర్వహించిన అనంతరం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ రమేష్ ధ్రువీకరించారు.
సిఎం పర్యటకు భారీ బందోబస్తు
కర్నూలు, జూలై 21: సిఎం చంద్రబాబు ఈ నెల 22వ తేదీ జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిఎం జిల్లాలో పర్యటించే నంద్యాల, గోస్పాడు, తదితర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు బందోబస్తు పర్యవేక్షణ బాధ్యతలను ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్‌కు అప్పగించారు. బందోబస్తుకు 10 మంది డీఎస్పీలు, 23 మంది సిఐలు, 86 మంది ఎస్‌ఐలు, 254 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 54 మంది కానిస్టేబుళ్లు, 6 ప్లాటూన్ల ఏఆర్ బలగాలు, 3 ప్లాటూన్ల ఏపిఎస్పీ బలగాలు, 46 మంది మహిళా పోలీసులు, 300 మంది హోంగార్డులు, 6 స్పెషల్ పార్టీ బృందాలను కేటాయించారు. పోలీసు జాగిలాలు, బాంబుస్క్వాడ్ బృందాలతో సిఎం పర్యటన ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలోని పలుచోట్ల పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. బహిరంగసభలో ప్రత్యేక మఫ్టీ పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
నంద్యాలలో సిఎం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి
నంద్యాల : నంద్యాల పట్టణానికి ఈ నెల 22వ తేదీ శనివారం సిఎం చంద్రబాబునాయుడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పట్టణంలోని ఎస్పీజీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు కావాల్సిన వేదికను, ప్రజలు వర్షం వచ్చినా తడవకుండ కూర్చొనేందుకు పక్కా పైకప్పుతో భారీ టెంట్లు వేశారు. బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపినాధ్ జెట్టిలతోపాటు జిల్లాస్థాయి అధికారులు పరిశీలించి పలుసూచనలు చేశారు. బహిరంగ సభ సమీపంలోనే పలు స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి పనులకు అవసరమైన పైలాన్‌లను కూడా సిద్ధం చేస్తున్నారు.

నా వల్లే నంద్యాల అభివృద్ధి!
కర్నూలు, జూలై 21 : నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైకాపా అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ తన కారణంగానే జరుగుతున్నాయని ఆయన ప్రచార కార్యక్రమంలో అస్త్రంగా వినియోగించుకుంటున్నారు. నంద్యాల శాసనసభా నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా టిడిపి పకడ్బందీగా వ్యూహాన్ని రచించింది. దాదాపు ప్రభుత్వ యంత్రాంగమంతా నియోజకవర్గంపై దృష్టి సారించి అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతో పాటు ప్రజల సమస్యలకు సంబంధించి వచ్చిన ప్రతి వినతిపత్రాన్ని, దరఖాస్తులను శరవేగంగా పరిశీలించి పరిష్కారం చూపుతున్నారు. ఒకవైపు ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న నంద్యాల పట్టణ రహదారుల విస్తరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి నిర్విరామంగా పని చేస్తున్నారు. మరోవైపు పట్టణంలోని పేదలు నివసించే కాలనీల్లో చామ కాలువ, కుందూ నదుల్లో వరద వస్తే ముంపునకు గురి కాకుండా ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. తద్వారా వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు పోయి పేదల కాలనీలు సురక్షితంగా ఉంటాయని అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవతో ఇబ్బంది పడిన వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి మరో వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. నంద్యా ల నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తుండటంతో ప్రభుత్వం ఆందోళనకు గురై అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసిందని ప్రచారంలో పేర్కొంటున్నారు. తాను టిడిపిలో ఉంటూ వారి మాటలకు రాజీ పడి ఎన్నికను ఏకగ్రీవం చేసి ఉంటే సమస్యలు పరిష్కారం కాకపోగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేదని ఆయన చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలపై ప్రేమ కన్నా ఎన్నికల్లో విజయం కోసమేనంటూ ఆయన వెల్లడిస్తున్నారు. ఎన్నికల తరువాత టిడిపి అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీకి చెందిన ఏ నాయకుడు పలకడని విమర్శిస్తున్నారు. తనను గెలిపిస్తే ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన కార్యక్రమాలు ఎన్నికల అనంతరం కూడా కొనసాగడానికి వత్తిడి తీసుకువస్తానని హామీ ఇస్తున్నారు. రహదారుల విస్తరణకు తాను ఆటంకం కాదని, అయితే దీని కారణంగా పేదలు పడే ఇబ్బందులను దృష్టి లో ఉంచుకుని అందరి అంగీకారంతో విస్తరించాలని తాను భావించానన్నారు. అయితే ప్రభుత్వం తొందరపాటుతో నిరుపేదల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తూ విస్తరణ చేపట్టిందని ప్రచారంలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనను గెలిపిస్తే నంద్యాలలో నిరంతరంగా అభివృద్ధి పనులు కొనసాగడంతో పాటు రహదారుల విస్తరణ కారణంగా నష్టపోయిన వారికి మద్దతుగా నిలిచి వారికి నష్టపరిహారం వచ్చేలా చూస్తానని హామీ ఇస్తున్నారు.