చిత్తూరు

కుప్పంను స్మార్ట్‌గా మారుస్తా: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతీపురం, జూలై 21: కుప్పంను స్మార్ట్‌గా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. శుక్రవారం కుప్పం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాలుపంచుకున్నారు. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుప్పంలో ఎలాంటి సౌకర్యాలు లేవని, ఈ 30 సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తానని, ఈ దిశగానే చర్యలు చేపడుతామన్నారు. ముఖ్యంగా ఇక్కడ భూమిలో బంగారు పండించవచ్చని, ఇందుకోసం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తనపై కుప్పం ప్రజలు ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, నిరంతరం కుప్పం అభివృద్ధిపై తన ధ్యాస ఉంటుందన్నారు. సెప్టెంబర్ నాటికి హంద్రీ-నీవా నీళ్లు వస్తే కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. ఈ నీళ్లు తీసుకు రావడానికి చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలోనే భగీరథ ప్రయత్నం చేయనున్నామన్నారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు అందచేసే అంగీకారాన్ని తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో గ్రామీణ యువతకు ఉపాధిలో నైపుణ్యం పెంపొందించేందుకు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మునిరత్నం, సత్యేంద్రకుమార్, పలువురు జడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, ఇతర నేతలు పాల్గొన్నారు.

జిల్లాలో పార్టీ పరిస్థితులపై ఆరా...!
చిత్తూరు, జూలై 21: జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితులపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరా తీసారు. కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా పార్టీ నేతలతో పాటు కుప్పం నియోజకవర్గ నేతలతో పార్టీ ప్రటిష్టతపై సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని స్థానిక నేతల తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందులో భాగంగానే కుప్పం కోర్ కమిటీలో కూడా నియోజకవర్గంలోని పార్టీ స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప, జిల్లా పార్టీ అధ్యక్షులు నాని, ఎమ్మెల్యేలు సత్యప్రభ, చిత్తూరు మేయర్ హేమలత, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పార్టీ నేతలు నరసింహ యాదవ్, కుప్పంతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన నియోజకవ్గ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధిపై సిఎం సమీక్ష
చిత్తూరు, జూలై 21: జిల్లా అభివృద్ధిపై శుక్రవారం ఉదయం కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమల స్థాపన, హంద్రీ-నీవా కాలువ నిర్మాణం, తదితర కార్యక్రమాల తీరుతెన్నులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ఇందుకు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హంద్రీ-నీవా పనులు వేగవంతం చేయాలని సూచించారు. పంట సంజీవిని పనులపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి భూగర్భ జలాలు పెరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బర్క్‌లీ యూనివర్శిటీ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు. కుప్పం నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలపై శిక్షణ, ప్రజల ఆదాయ వనరుల పెంపు తదితర అంశాలపై బర్క్‌లీ యూనివర్శిటీ ప్రతినిధులతో సిఎం చర్చించారు. జిల్లాలో పలు శాఖల పరంగా అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అందే ప్రతి సంక్షేమ ఫలం లబ్ధిదారులకు చేకూరాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప, కలెక్టర్ ప్రద్యుమ్న, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

స్కూల్ వ్యాన్ ఢీకొని విద్యార్థిని దుర్మరణం
నాగలాపురం, జూలై 21: ఇంటి ముందుకు వచ్చి ఆగిన స్కూల్ బస్సు నుంచి నవ్వుతూ కిందికి దిగిన ఆ చిన్నారి మరో నాలుగు అడుగులు వేసి ఉంటే తల్లి ఒడిలోకి చేరేది. అయితే తాను వచ్చిన స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఆ చిన్నారి పాలిట మృత్యుపాశంగా మారింది. బస్సు దిగి కుడిపైపున రోడ్డు పక్కనే నిలబడి ఉన్న అమ్మ వద్దకు బస్సు ముందు నుంచి నడిచి వెళుతున్న చిన్నారిని గుర్తించని బస్సు డ్రైవర్ ఆ చిన్నారిపై నుంచి బస్సును నడపడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అందరినీ ఆవేదనకు గురిచేసింది. నాగలాపురం మండలం బీరకుప్పంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీరకుప్పంకు చెందిన అను, అరుణ్‌ల కుమార్తె ప్రియ (4) విఘ్నేష్ విద్యామందిర్‌లో ఎల్‌కెజి చదువుతోంది. శుక్రవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం స్కూల్ బస్సులో వచ్చింది. బస్సులో నుంచి రోడ్డు పక్కన తనకోసం వేచి ఉన్న తన అమ్మను చూసి నవ్వుతూ బస్సు కిందికి దిగింది. బస్సును దాటి అమ్మ వద్దకు వెళుతున్న ఆమెను స్కూల్ బస్సు డ్రైవర్ గమనించలేదు. బస్సును ముందుకు నడపడంతో బస్సు ముందు నడిచి వెళుతున్న ప్రియ తలపై బస్సు చక్రం ఎక్కిదిగడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనను చూసిన ప్రియ తల్లి అక్కడే కుప్పకూలి పోయింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆమెను చూసి స్థానికులు తల్లడిల్లిపోయారు. బిడ్డ శవంపై పడి రోధిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అప్పటికే బస్సు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు నాగలాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ మల్లేష్ యాదవ్ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

వ్యవసాయంలో కుప్పం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలి
కుప్పం, జూలై 21: వ్యవసాయంలో కుప్పం నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని డిప్యూటీ సిఎం నిమ్మకాయల చిన్నరాజప్ప స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్కెట్ యార్డును ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సిఎం చిన్నరాజప్ప మాట్లాడుతూ, వాతావరణంలో ప్రత్యేక మార్పులు ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఇరిగేషన్ పనుల ద్వారా బిందు సేద్యంతో అత్యధిక వ్యవసాయ దిగుమతులను సాధించి రాష్ట్రానికే తలమానికంగా నిలవాలన్నారు. ఇందులో భాగంగానే కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా, సుజల స్రవంతి కాలువను తీసుకువచ్చి అనునిత్యం సాగునీటి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి అన్ని చర్యలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయపరంగా కుప్పం వాతావరణ భిన్నంగా ఉందని, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కుప్పంలో వాణిజ్య పంటలు రైతులు అత్యధికంగా పండిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యవసాయ దిగుమతుల కోసమే మార్కెట్ యార్డును నిర్మించారని, దీనిని రైతులందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీలోని శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన సివిఎస్‌ఓ
తిరుపతి, జూలై 21: దేశ రాజధాని న్యూఢిల్లీలోని టిటిడి ఆధ్వర్యంలోని శ్రీవారి ఆలయాన్ని శుక్రవారం టిటిడి సివిఎస్‌ఓ ఎ.రవికృష్ణ సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయ భద్రతా సిబ్బందితో సమావేశమయ్యారు. ఈసందర్భంగా సివిఎస్‌ఓ మాట్లాడుతూ ఆలయ భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని చెప్పారు. ఆలయాన్ని ప్రముఖులు సందర్శించేటప్పుడు భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. త్వరలో ఆలయంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుమునుపు కేంద్ర హోంశాఖకు చెందిన నేషనల్ పోలీస్ మిషన్ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
నాక్‌పై వేద విశ్వ విద్యాలయ సిబ్బందికి అవగాహన
తిరుపతి, జూలై 21: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బందికి, అనుబంధ కళాశాలల అధ్యాపకులకు నేషనల్ అసిస్మెంట్ అండ్ అక్రిడిటేషన్‌పై రెండురోజుల శిక్షణ, అవగాహన సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. వర్శిటీ సెమినార్ హాల్లో ప్రారంభమైన ఈకార్యక్రమంలో విసి ఆచార్య కెఇ దేనాథన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయిందన్నారు. నాక్ గుర్తింపు పొందడం ఎంతైనా అవసరమని, అందుకే నాక్ పరిధిలోకి ఏ యే అంశాలు వస్తాయో వాటిపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలని తెలిపారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఏవి రాధేశ్యామ మాట్లాడుతూ వర్శిటీలో అందరూ కష్టపడి పనిచేస్తున్నారని, అందరి కష్టానికి నాక్ వర్శిటీకి ఇచ్చే గుర్తింపే ప్రతిఫలమని చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్ ఆచార్య మల్లాది వెంకటనరసింహ శర్మ కరికులమ్ విద్యావ్యవస్థ గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు విరూపాక్ష జడ్డిపాల్ బోధన, అధ్యయన, మూల్యాంకన అంశాల గురించి వివరించారు. ఎస్వీయూ విశ్రాంత ఆచార్యులు కెవిఎస్ శర్మ వౌలికాంశాలు, గ్రంథాలయ భవనాలు తదితర అంశాల గురించి తెలియజేశారు. ఈకార్యక్రమంలో డీన్లు శ్రీనివాసాచార్యులు, సుబ్రహ్మణ్యశర్మ, తారకరామశర్మ, ఎఫ్‌ఓ శ్రీనివాసులు నాయక్, పిఆర్వో బ్రహ్మాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతిలోనూ మాదకద్రవ్యాల వినియోగం
తిరుపతి, జూలై 21: ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలోనూ మాదక ద్రవ్యాల వాడకం చాపకింద నీరులా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా వుందని ఐఎంఎ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంలు సూచించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము వైద్య విద్యార్థులుగా ఎస్వీ మెడికల్ కళాశాలలో వైద్య వృత్తి కొనసాగిస్తున్నప్పుడే కొందరు గంజాయిని విక్రయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికీ దీని ప్రభావానికి గురైన వారు తిరుపతి రుయా ఆస్పత్రిలోని డి అడిక్షన్ సెంటర్‌లో చికిత్స కూడా పొందుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాజాగా బయటపడ్డ డ్రగ్ మాఫియా విస్తృతి ప్రమాదకరంగా ఉందని తెలిపారు. ఇది చివరికి కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల వద్దకు కూడా చేరుతుండటం దారుణమైన సంఘటన అన్నారు. కళాశాలలకు వెళుతున్న పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇంటి నుంచి తీసుకువెళుతున్న డబ్బుతో ఏం కొంటున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, భావోద్వేగాలు ఎలా ఉన్నాయి వంటి అంశాలను నిశితంగా గమనించాలని చెప్పారు. ఒకవేళ వారి ప్రవర్తనపై అనుమానం కలిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఎంతైనా అవసరమన్నారు. మాదకద్రవ్యాలకు అలావాటు పడితే దాని నుంచి బయటపడటం కష్టమని, అయితే దీనికి చికిత్స ఉందని తెలిపారు. మాదకద్రవ్యాలను ఒక్కసారి వాడితే దానికి బానిసలవుతారని, దీంతో వారు క్రిమినల్స్‌గా, సంఘ విద్రోహక శక్తులుగా మారిపోతారని తెలిపారు. అదే సమయంలో ఆత్మహత్యలకు పాల్పడం వంటి దారుణాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. విపరీతమైన అనారోగ్యానికి గురికావడంతో పాటు మానసిక రుగ్మతలకు లోనవుతారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఐఎంఏ తరపున విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఈసందర్భంగా మాదకద్రవ్యాలపై రూపొందించిన గోడపత్రికలను వారు ఆవిష్కరించారు. ఈ విలేఖరుల సమావేశంలో ఐఎంఏ కోశాధికారి డాక్టర్ యుగంధర్, కుషి హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆర్.రాజారెడ్డి పాల్గొన్నారు.

‘హక్కులపై అవగాహనతోనే ఆత్మ స్థైర్యం’
తిరుపతి, జూలై 21: హక్కులపై అవగాహన కలిగి ఉన్పప్పుడే అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ఆత్మ స్థైర్యం లభిస్తుందని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం న్యాయశాస్త్ర విభాగం, విద్యార్థి వ్యవహరాల డీన్ ఆచార్య చంద్రకళ అన్నారు. మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నర్సింగ్ విభాగంలో మహిళా హక్కులపై అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడితూ రాజ్యాంగం మహిళల కోసం రూపొందించిన ప్రత్యేక హక్కులపై ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలన్నారు. అప్పుడే మహిళలపై కొనసాగుతున్న దౌర్జన్యాలు, లైంగిక దాడులు, వేధింపులు, అన్యాయాలును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. వరకట్న నిషేధం, భారతీయ విడాకుల చట్టం, ప్రసూతి సదుపాయాల చట్టం, మహిళల అసభ్యకర చిత్రీకరణ నిరోధక చట్టం, పనిప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక దాడులు, సమాన వేతన చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళ అధ్యయన కేంద్రం అధ్యాపకురాలు డాక్టర్ రాణి, నర్సింగ్ విభాగం ప్రిన్సిపాల్ గంగాభవానీ, సుమలత, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.

కోదండ రామాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుపతి, జూలై 21: స్థానిక శ్రీ కోదండరామాలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిసాయి. ఉదయానే్న స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్ర నామార్చన నిర్వహించాక 9 నుంచి 11 గంటల మధ్య యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 12.30 గంటల వరకు ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు పూర్ణాహుతి, ఉత్సవ మూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభావాహన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డిప్యూటీ ఇఓ బి.మునిలక్ష్మి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.