ఆటాపోటీ

సాదాసీదా ఆటకు అసాధారణ ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కబడ్డీ..
పరిచయం అవసరం లేని ఆట. మారుమూల పల్లెల్లోనూ విస్తరించిన అసలు సిసలైన భారతీయ క్రీడ. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎనె్నన్నో మార్పులకు గురైనప్పటికీ, వౌలిక సూత్రాలను, ప్రాథమిక లక్షణాలను ఇప్పటికీ కొనసాగిస్తున్న ఏకైక ఆట. ఇది మన దేశంలో ఎన్నో శతాబ్దాలుగా ప్రచారం ఉంది. కబడ్డీ ఆడడానికి పెద్దపెద్ద మైదానాలు అవసరం లేదు. హంగులు, ఆర్భాటాలు, భారీ పరికరాలు ఉండవు. సాదాసీదా ఆట కాబట్టే జన బాహుళ్యంలోకి సులభంగా విస్తరించింది. పైసా ఖర్చు లేదు. వయసుతో సంబంధం లేదు. ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఆడుకోవచ్చు. అన్నింటినీ మించి ఇది ఎంతో మంచి వ్యాయామం. కబడ్డీలో అన్నీ సుగుణాలే తప్ప ఒక్క సమస్య కూడా లేదనడం అతిశయోక్తి కాదు. అంతమాత్రం చేత, దీనిని ఆషామాషీ క్రీడగా భావిస్తే, భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. కబడ్డీ ఆడాలంటే, అత్యుత్తమ అథ్లెట్‌కు ఉండే ఫిట్నెస్‌తోపాటు చురుకుదనం, వేగం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు ఉండాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా గాయాలు తప్పవు. ఒక్కోసారి శాశ్వత అంగవైకల్యానికి దారితీసే ప్రమాదాలు కూడా జరుగుతాయి. అందుకే, అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆడాలి. ఒక రకంగా చెప్పాలంటే, ఇది ఇంటి ఆట. అందుకే, ఎన్నో శతాబ్దాలుగా కబడ్డీ ప్రచారంలో ఉన్నప్పటికీ, దీనిని ఒక వృత్తిగా ఎవరూ తీసుకోలేదు. ప్రో కబడ్డీ సీజన్ మొదలైన తర్వాతే కబడ్డీని కూడా ప్రొఫెషన్‌గా మార్చుకోవచ్చన్న సత్యం అందరికీ తెలిసింది. ఉన్నత ప్రమాణాలతో కూడిన నైపుణ్యం, ఫిట్నెస్ ఉంటే, అంతర్జాతీయ స్థాయికి ఎదగడమేకాదు.. భారీగా సంపాదించుకునే అవకాశాలున్నాయి. చాలా సాధారణంగా కనిపించే అసాధారణ క్రీడ ఇది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కబడ్డీపై ఆసక్తి చూపుతున్నాయి. రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. నిన్నమొన్నటి వరకూ గ్రామాల్లో సరదాగా ఆడుకునే కబడ్డీ ఇప్పుడు ప్రొఫెషనల్ క్రీడగా రూపాంతరం చెందింది. వరల్డ్ కప్, ప్రో కబడ్డీ వంటి టోర్నీలు విశేష గుర్తింపు సంపాదించుకున్నాయి. వివిధ టోర్నీలు, సిరీస్‌ల్లో ఆడితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది కాబట్టే ఎంతో మంది కబడ్డీని ఒక వృత్తిగా తీసుకుంటున్నారు. కబడ్డీని అనామక క్రీడగా కొట్టిపారేసే రోజులకు తెరపడింది. మన దేశంలో క్రికెట్, ఫుట్‌బాల్ తర్వాత అత్యధికంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్న క్రీడగా కబడ్డీ ఎదిగింది.
తిరుగులేని భారత్
కబడ్డీలో మన దేశానికి తిరుగులేదు. అంతర్జాతీయ వేదికలపై భారతీయులు చూపుతున్న ప్రతిభ అనన్యసామాన్యం. కబడ్డీకి ప్రాచుర్యం పెరుగుతూ, ఎన్నో దేశాలు పోటీకి దిగుతున్నప్పటికీ, భారత్ ఆధిపత్యం కొనసాగుతునే ఉంది. ప్రపంచాన్ని మన దేశం శాసిస్తున్న ఏకైక క్రీడ ఇదే. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఇంత వరకూ ఒక్కసారి కూడా పరాజయాన్ని ఎదుర్కోలేదంటే, మన ఆటగాళ్ల సత్తా ఏమిటో స్పష్టమవుతుంది. అటు అధికారులు, ఇటు కార్పొరేట్ దిగ్గజాలు గతంలో మిగతా క్రీడలకు కొమ్ముకాసి, కబడ్డీని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మిగతా ఆటల్లో పరాజయాలు, పరాభవాలు ఎదురవుతుంటే, దేశ ప్రతిష్ఠను నిలబెట్టే బాధ్యతను కబడ్డీ క్రీడాకారులు స్వీకరించారు. వీరి ప్రతిభను గుర్తించిన అధికారులు కబడ్డీని ప్రోత్సహించే పనిలో పడ్డారు. కార్పొరేట్ సంస్థలు కూడా అండగా నిలుస్తున్నాయి. ప్రో కబడ్డీ టోర్నమెంట్ ఆరంభానికి కూడా ఈ మార్పే మూలం. అందరి అంచనాలకు తగినట్టుగానే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు తిరుగులేని పట్టును కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రో కబడ్డీలో ఆడుతూ, ఈ క్రీడకు దేశంలో విశేష ఆదరణను సంపాదించి పెడుతున్నారు. హాకీలో ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినప్పటికీ భారత్ పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉంది. హాకీలో ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ వంటి మెగా టోర్నీలకు అర్హత సంపాదించడమే మహాభాగ్యం అనుకునే దుస్థితి దాపురించింది. ఇక, కోట్లాది మంది ఒక మతంలా ఆరాధిస్తున్న క్రికెట్‌లో జవాబుదారీ కరవైంది. తమవల్లే దేశ ప్రజలు బతుకుతున్నారన్న రీతిలో క్రికెటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఉదాహరణలు ఎన్నో. అభిమానులు భుజాలపై మోస్తున్న క్రికెట్‌లో భారత్ నిలకడగా రాణించలేకపోతున్నది. మన వీరులు చెలరేగుతారో, ఎప్పుడు డీలాపడతారో తెలియని పరిస్థితి. ఇటీవలే ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ లీగ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను లీగ్ దశలో చిత్తుచేసి, కీలకమైన ఫైనల్‌లో చావుదెబ్బతినడం టీమిండియా నిలకడలేమికి ఉదాహరణ. జట్టులో కొనసాగుతున్న ఆధిపత్య పోరాటాలు, పరస్పర విమర్శలు, స్పాట్ ఫిక్సింగ్ కేసులు, అవినీతి భాగోతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోచ్‌గా ఎంపికైన మరుక్షణమే రవి శాస్ర్తీ వ్యవహార శైలి భారత క్రికెట్ మొత్తం కొంత మంది వ్యక్తుల చేతిలో బందీగా మారిందనడానికి నిదర్శనం. బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను క్రికెట్ సలహా మండలి (సిఎసి) ఎంపిక చేసినప్పటికీ అతనిని కాదని భరత్ అరుణ్‌ను బిసిసిఐ నియమించడంలో రవి శాస్ర్తీ కీలక పాత్ర పోషించడం జగమెరిగిన సత్యం. ఇలాంటి సంఘటనలే క్రికెట్ ప్రతిష్ఠను దిగజార్చేస్తున్నాయి. మొత్తం మీద అన్ని క్రీడల్లోనూ తిరోగమనంలో పరిగెడుతున్న భారత్ కబడ్డీలో మాత్రం విశ్వవిజేతగా కొనసాగుతున్నది. 2004 నుంచి ఇప్పటి వరకూ పురుషుల విభాగంలో 7, మహిళల విభాగంలో ఒకసారి వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ జరిగితే, అన్నింటిలోనూ భారత్‌కే టైటిల్ లభించింది. ప్రో కబడ్డీలోనూ భారత ఆటగాళ్లదే ఆధిపత్యం. ప్రపంచ కబడ్డీకి వేదికగా ప్రో కబడ్డీ లీగ్ వెలిగిపోతున్నది. ఈ టోర్నమెంట్ రంగ ప్రవేశంతో స్వర్ణ యుగం మొదలైంది. 2014లో ప్రారంభమైన ప్రో కబడ్డీకి ఆరంభంలోనే విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒకొక్కటీ ఒక్కో నగరాన్ని హోం గ్రౌండ్‌గా చేసుకొని ఎనిమిది ఫ్రాంచైజీలు రంగంలోకి దిగాయి. ప్రతి జట్టూ అన్ని కేంద్రాల్లోనూ మ్యాచ్‌లు ఆడే రీతిలో షెడ్యూల్‌ను రూపొందించారు. ఆనంద్ మహీంద్ర చైర్మన్‌గా, చారూ శర్మ డైరెక్టర్‌గా ఏర్పాటైన మషాల్ స్పోర్ట్స్ సంస్థ ఈ ఈవెంట్‌ను ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నది. తొలి ప్రో కబడ్డీకి ఆటగాళ్ల వేలం 2014 మే 20న జరిగింది. జాతీయ కబడ్డీ జట్టు కెప్టెన్ రాకేష్ కుమార్‌కు అత్యధిక ధర పలికింది. పాట్నా పైరేట్స్ జట్టు అతనిని 12.80 లక్షల రూపాలకు కొనుగోలు చేసింది. ఆగస్టు 31న ముంబయిలో జరిగిన ఫైనల్‌లో యు ముంబాను 35-24 పాయింట్ల తేడాతో ఓడించిన జైపూర్ పింక్ పాంథర్స్ టైటిల్ కైవసం చేసుకుంది. రెండో సీజన్ ప్రో కబడ్డీ 2015 జూలై 18న మొదలై, ఆగస్టు 23వ తేదీతో ముగిసింది. లీగ్ దశలో మొత్తం 60 మ్యాచ్‌లు జరిగాయి. యు ముంబా జట్టు 36-30 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించి, టైటిల్‌ను అందుకుంది. మూడో స్థానానికి జరిగిన పోరులోవ తెలుగు టైటాన్స్ గెలిచింది. 2016లోనే మూడు, నాలుగు ప్రో కబడ్డీ టోర్నీలు జరిగాయి. మూడో సీజన్ జనవరిలో జరగ్గా, పాట్నా పైరేట్స్ మూడు పాయింట్ల తేడాతో యు ముంబాపై విజయం సాధించి టైటిల్ స్వీకరించింది. అదే ఏడాది జూన్‌లో నాలుగో విడత ప్రో కబడ్డీ టోర్నీ జరిగింది. పాట్నా పైరేట్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్‌లో ఆ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. కాగా, అదే ఏడాది మహిళల కబడ్డీ చాలెంజ్ టోర్నీ కూడా జరిగింది. ఐస్ దివాస్, ఫైర్ బర్డ్స్, స్టార్మ్ క్వీన్స్ జట్లు ఈ టోర్నీలో పోటీపడ్డాయి. హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో ఫైర్ బర్డ్స్‌పై నెగ్గిన స్టార్మ్ క్వీన్స్ జట్టు విజేతగా నిలిచింది.
ఐదో ప్రో కబడ్డీకి రంగం సిద్ధమైంది. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈనెల 28 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో 12 జట్లు ఢీ కొంటున్నాయి. ఇవన్నీ ప్రైవేటు వ్యాపారవేత్తలు లేదా వ్యాపార సంస్థలకు చెందినవే. దీని ఫార్మాట్ మొత్తం ఐపిఎల్‌నే పోలి ఉంటుంది. మ్యాచ్ మొత్తం 45 నిమిషాలు జరుగుతుంది. ప్రథమార్ధంలో 20 నిమిషాల ఆట ఉంటుంది. ఐదు నిమిషాల విరామం తర్వాత ద్వితీయార్ధంలో మరో 20 నిమిషాల ఆట కొనసాగుతుంది. మ్యాచ్ చాలా త్వరగా పూర్తవుతుంది కాబట్టి, ప్రేక్షకులు ఏ దశలోనూ విసుగు చెందరు. ప్రతి నిమిషం ఎంతో కీలకమైనది కాబట్టి, ఆటగాళ్లంతా సర్వశక్తులు ఒడ్డి పోరాడతారు. దీనితో ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్‌ను తలపిస్తుంది. సాధ్యమైనంత వరకూ ఎక్కువ మందిని అవుట్ చేయాలని రైడర్ ప్రయత్నిస్తే, తమ ఆవరణలోకి వచ్చిన ప్రతి రైడర్‌నూ పట్టుకొని చిత్తుచేయాలని ప్రత్యర్ధి జట్టులోని డిఫెండర్లు శ్రమిస్తారు. ఈ సంకుల సమరమే కబడ్డీకి తిరుగులేని ఆదరణను సంపాదించిపెట్టింది. జయాపజయాలు ఎలావున్నా, ప్రతి మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒక గొప్ప పోరాటాన్ని, మహా సంగ్రామాన్ని చూస్తున్నామనే అనుభూతిని కలిగిస్తాయి. ఎన్నో విలక్షణమైన లక్షణాలను అందిపుచ్చుకున్నది కాబట్టే, సాధారణ నేలపై ఆడే ఆటకు ఆకాశమంత ఆదరణ లభిస్తున్నది. భవిష్యత్తులో కబడ్డీ, ప్రత్యేకించి ప్రో కబడ్డీ మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకుంటుందనడంలో సందేహం లేదు.

- బిట్రగుంట