ఉత్తర తెలంగాణ

సాహిత్య అకాడమీతో తెలంగాణ భాషా పరిమళాలు విశ్వవ్యాప్తం (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్య అకాడమీ ఏర్పాటుతో తెలంగాణ భాషా పరిమళాలు విశ్వవ్యాప్తి చెందుతాయని అభిప్రాయపడే ప్రముఖ కవి, సమీక్షకులు రమణ వెలమకన్ని గారి జన్మస్థలం సికింద్రాబాద్‌లోని జీరా. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో నలుబది సంవత్సరాలు పనిచేసి.. చీఫ్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ‘రమణ వెలమకన్ని’ కలం పేరు.. అసలు పేరు వెలమకన్ని సత్యనారాయణ మూర్తి.. ప్రసిద్ధ కవి ఆచార్య ఎన్.గోపిగారి ప్రోత్సాహంతో నలభై ఏళ్ల విరామం తరువాత మళ్లీ కవిత్వ సృజనను కొనసాగిస్తున్నారు. 2012లో ‘జీవన సందర్భాలు’ నానీల సంకలనాన్ని వెలువరించారు. 2015లో ‘నా చిరునామా’ కవితా సంపుటిని ప్రకటించారు. త్వరలో మరో కవితా సంపుటి వెలుగు చూడనుంది.
150 వరకు కవితలు, 450 వరకు గ్రంథ సమీక్షలు రాసిన అనుభవం ఆయనకుంది. రంగస్థల నటునిగా రేడియో, టివి నాటకాల్లో నటించారు. సినిమాలకు..టివి సీరియళ్లలో నటించడమే కాకుండా గాత్రదానం చేశారు. ఈమధ్యే విడుదలైన ‘ఘాజీ’ చిత్రంలో మహానటుడు ఓంపురి పెదాల కలయికకు మాటల్ని అద్దింది ఆయన కంఠమే కావడం విశేషం! సాహితీ పురస్కారాలు టానిక్ వంటివి అని భావించే ఆయనతో మెరుపు ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే..
ఆ మీరు ఎన్నో ఏట రచనా వ్యాసంగాన్ని
ప్రారంభించారు?
నాకు చిన్నప్పట్నుంచి సాహిత్యమంటే మక్కువ. డాక్టర్ సినారె గారి కవిత్వాన్ని చాలా యిష్టంగా చదివేవాన్ని. కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పట్నుంచి కవితలు రాసేవాన్ని. 1966-70 మధ్య నేను రాసిన కవితలు విశ్వరచన, నేత, చుక్కాని, పొలికేక వంటి పత్రికలల్లో దాదాపు 100 దాకా ప్రచురితమైనాయి.
ఆ రచనల పట్ల ఆసక్తి చూపడానికి ప్రోత్సహించింది ఎవరు?
అధ్యయనమే. 1971లో బ్యాంకు ఉద్యోగిగా చేరినతర్వాత దాదాపు 40 సంవత్సరాలు సాహిత్య సృజనకు దూరంగా ఉన్నాను. కానీ అధ్యయనం మాత్రం కొనసాగుతూనే వున్నది. కవిత్వానికి వయస్సుతో నిమిత్తం లేదు.. మళ్లీ రాయమని పదవీ విరమణ తర్వాత మిత్రులు డాక్టర్ ఎన్.గోపి ప్రోత్సహించారు. అప్పటి నుంచి మళ్లీ సాహిత్య సృజన చేస్తున్నాను.
ఆ వచన కవిత్వం అంటే ఏమిటి?
ఏ నిబంధనలు లేని వచన కవిత్వం ఇదమిద్ధంగా యిదీ అని ఎవరు నిర్ధారించలేరు. కె.శివారెడ్డి గారు తన ‘పీఠికలు’ గ్రంథంలో 150కి పైగా నిర్వచనాలు చెప్పారు. కవిత్వమంటే కవికి ఏమిటోనన్న స్పృహ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వుంటుంది. అలాగే కవిత్వానికి తనేమిటోనన్న అవగాహన కవికి చాలా అవసరం. కుందుర్తి ఆంజనేయులు గారు ‘వచనమైనా పరువాలేదు గాని కవిత్వం పాఠకులకు అర్థం కాబడాలి’ అన్నారు. అర్థం కాబడటమంటే పాఠకుడు చదివితేనే కదా తెలిసేది. అంటే కవిత్వం చదివించేదిలా వుండాలి. ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు కొత్తగా వుంటేనే పాఠకుడు ఆసాంతం ఆస్వాదిస్తాడు. దానికి కవితాశక్తి తప్పనిసరి. వస్తువును దాచడం కాదు. పొరలు పొరలుగా విప్పుతూ పద బంధాలతో, భావ చిత్రాలతో పాఠకుల్ని తన్మయుడ్ని చేసేదే మంచి కవిత్వం.
ఆ ఇప్పుడొస్తున్న వచన కవిత్వంపై
మీ అభిప్రాయం?
సదభిప్రాయమే. నేటి తరంలో మంచి కవిత్వం రాస్తున్న యువ కవులు చాలామంది ఉన్నారు. లబ్ధప్రతిష్ఠులకు ఏమాత్రం తీసిపోని కవిత్వం వీరిది. కొత్త భాషను తొడుగుతున్నారు. అభివ్యక్తిలో నూతన పోకడలకు తెర దీస్తున్నారు.
ఆ మీకు నచ్చిన కవి/రచయిత?
రచయితగా యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు, నాటకాలు, వ్యక్తిత్వ వికాస రచనలు బాగా యిష్టపడ్తాను. మహాకవి నారాయణ రెడ్డి గారి అభిమానిని నేను. ఏకలవ్య శిష్యుడ్ని. ఆయన మహోన్నత వ్యక్తిత్వం నాకు స్ఫూర్తిదాయకం. కె.శివారెడ్డి, గోపిగార్ల కవిత్వాన్నీ ఇష్టపడతాను.
ఆ ఇప్పటితరాన్ని సాహిత్యంవైపు మళ్లించాలంటే
ఏం చేయాలి?
బలవంతంగా మళ్లించడం ఎవరికీ సాధ్యం కాదు. చిన్నప్పట్నుంచే మంచి పుస్తకాన్ని స్నేహితుడిగా పరిచయం చేయాలి. ఆ స్నేహం అభివృద్ధి చెందేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలి. ముఖ్యంగా నేటి యువతరం సాహిత్యంవైపు దృష్టి సారించడం అవసరం. సమకాలీన సమస్యలు, సామాజిక రుగ్మతల అవగాహన గ్రంథ పఠనం ద్వారానే కలుగుతుంది.
ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
మరింత మంచిగా రాయాలని. కసిని పెంచే సాహితీ పురస్కారాలు టానిక్ వంటివి. అప్పుడప్పుడు యిలాంటి గుర్తింపు అవసరం కూడా.
ఆ తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా మీరు అశిస్తున్నదేమిటి?
అకాడమీని పునరుద్ధరించడం శుభపరిణామం. తెలంగాణ ప్రాంతంలోని సాహితీవేత్తలందరిని యిదో వరం. ప్రతిభ వున్నా గుర్తింపుకి నోచుకోని రచయితలు, వారి రచనలు వెలుగులోకి వస్తాయని ఆశించవచ్చు. డాక్టర్ నందిని సిధారెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ సాహిత్యాభివృద్ధి ఇనుమడిస్తుందని, తెలంగాణ భాషాపరిమళాలు విశ్వవ్యాప్తి చెందుతాయని నా గట్టి నమ్మకం. పల్లెల్లో పుట్టిన వారితో బాటు హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నాలాంటి సాహిత్యాభిలాషులకు ప్రోత్సాహం లభిస్తుందని నా ఆశ!
ఆ కవులు, రచయితలకు శిక్షణ అవసరమా?
సృజన అన్నది సహజాతి సహజ ప్రక్రియ. శిక్షణ ద్వారా పాండిత్యం అబ్బుతుందేమోగాని కవిత్వం ఉప్పొంగదు. మానసిక సంఘర్షణ నుండి ఎగిసిపడ్డ భావఝరికి ఊహల మడులు కట్టి మొక్కల్లా ఉండే అక్షరాలను పువ్వులుగా విరబూయించడమే కవిత్వం. భావసంపదను కవితా శక్తిగా మార్చడానికి శిక్షణ కొంతవరకు ఉపయోగపడొచ్చునని నా అభిప్రాయం.
ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
రాసిందల్లా మంచి కవిత్వం కాదు. అచ్చయినంత మాత్రాన ఉత్తమం కాదు. యువ కవులు సమాజాన్ని చదావాలి. సమాజంలో మెలగాలి. మన చుట్టూ కావాల్సినంత వస్తుసంపద వుంది. కవిత్వమంటే సదవగాహన పెంపొందించుకోవాలి. సీనియర్ కవుల రచనలను చదవాలి. అధ్యయనం తప్పనిసరి. మదిలో భావం మెదలగానే రచనకు పూనుకోవడం మానుకోవాలి. వస్తువుని మాగనివ్వాలి. ఒకటికి రెండుసార్లు వ్యక్తీకరణకు సానపట్టాలి. సాధన కవితాశక్తిని పెంపొందిస్తుంది. శైలి రాటు తేలుతుంది. కేవలం ఉత్సాహమే కాదు.. ఉద్వేగంతో రాసిందే మంచి కవిత్వమనిపించుకుంటుంది.

రమణ వెలమకన్ని
1-1-187/3, వివేక్‌నగర్,
చిక్కడపల్లి-500020
సెల్.నం.9866015040

- దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544