నెల్లూరు

చక్రం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండాకాలం వచ్చిందంటే సూరిగాడికి చేతినిండా పనే. వాళ్ల నాన్న చక్రం ముందు కూర్చుని కుండలు తయారుచేస్తుంటే వాటిని జాగ్రత్తగా ఎండబెట్టడం నాన్నకు కావలసిన బంకమట్టిన బాగా నీళ్లు పోసి పక్వంగా తొక్కి పెట్టడం ఇవన్నీ సూరిగాడికి చిన్నప్పట్నుంచి వెన్నతో పెట్టిన విద్య.
ఊరికి దూరంగా ఓ వంద పూరిపాకల మధ్య సూరిగాడు, వాళ్ల నాన్న ఉంటున్నారు. సూరిగాడి అమ్మ రెండో కాన్పులో బిడ్డ అడ్డం తిరగడంతో బిడ్డతో సహా చిన్నప్పుడే సచ్చిపోయింది.
సూరిగాడు నాన్నమాత్రం రెండో పెళ్లి చేసుకోకుండా కొడుకును ప్రేమగా పెంచుకొచ్చాడు. జీవితంలో ఆటుపోట్లు తరచిచూచిన అతను సూరిగాడి చదువును ఐదోక్లాసుతో నిలిపివేశాడు. తన కులవృత్తే తనకు అన్నమని అదే దైవమని అతనెరిగిన నిజం.
ఊర్లో పంతులు గారి కొడుకు, లాయరు గారి అబ్బాయి గొప్ప చదువులు చదివి కూడా ఉద్యోగాలు లేకుండా ట్యూషన్లు చెప్పుకుంటున్నారు. అందుకే తన బిడ్డకు కూడా చదువు చెప్పించలేదు.
సూరిగాడికి ఇప్పుడు ఇరవై ఏళ్ల వయసు వచ్చింది. వాడికి మనువు చేయాలి అని సూరిగాడి నాన్నకు అన్పించింది. ఇన్నాళ్లు ఆడతోడు లేక అన్ని కష్టాలు తనే పడ్డాడు. ఇకనైన కోడలొస్తే కొంచెం చెయ్యి తీరుబాటుగా వుంటుంది అనుకొన్నాడు.
సూరిగాడు నాన్న చక్రం తిప్పుతూ ఉన్నాడు. ‘‘ఒరేయ్ సూరిగా ఆ ముంతలో నీళ్లున్నాయి అందుకో రా’’ అన్నాడు.
సూరిగాడు ముంతలో నీళ్లు ఇచ్చాడు. నాన్న పెద్దవాడై పోతున్నాడు. ‘‘నాన్న ఇంకా ఎందుకు నాన్నా ఈ కష్టం నీకు లే అక్కడ కూర్చో, నేను తిప్పుతాలే ఇక మీదట ఈ చక్రం’’ అన్నాడు.
‘‘అట్లేగాని ఒరే నీకో మనువు సేసేస్తెగాని నా మనసు కుదుటపడదురా!’’ అన్నాడు. ‘‘ ఏంది నాన్న అప్పుడే మనువు మాట ఎత్తుతున్నావు’’ అన్నాడు.
‘‘అవున్రా. నీ వయస్సప్పటికే, నాకెప్పుడో మీ అమ్మతో మనువై పోనాది. మంచి పిల్ల దొరికితే నీకు మనువు సేసేస్తాను’’ అన్నాడు. సూరిగాడు పనిలో నిమగ్నపోయినాడు.
మరో ఆర్నెళ్లకి సూరిగాడికి మల్లితో మనువై పోయింది. లో లోపల రగులుకున్న నిప్పుల కాన్సర్ వ్యాధి సూరిగాడి నాన్నను ఎత్తుకపోయింది. కొన్నాళ్లు బాధపడ్డ మల్లి సాహచర్యంతో మనిషైనాడు. నాన్న లేక మల్లి లేకపోతే తన బ్రతుకు ఏమైపోయేదో అని బాధపడేవాడు.
మల్లికి ఎవరు లేరు. మేనమామ మల్లి భారం దించుకొన్నాక ఇక దాని మొఖం చూడలేదు. మల్లి అంటే సూరిగాడికి పంచ ప్రాణాలు. అసలే వయసు పొంగు అందులో కొత్త జంట సూరిగాడికి పనై పోయిందంటే మల్లితో సరసాలే.
సూరిగాడు పనిచేస్తున్నంత సేపు అవి ఇవి అందిస్తూ మాట్లాడి ఉడికిస్తూ అటు ఇటు తిరుగుతుంటే సూరిగాడు ఎన్ని కుండలు చేసేవాడో వాడికే తెలిసేది కాదు. సూరిగాడి చేతిలో చక్రం తిరుగుతున్నంత సేపు ఇంట్లో డబ్బులకు కొరవుండేది కాదు. ఏరోజుకారోజు ఖర్చులు పోను ఏదో నాలుగైదు రూపాయలు మిగిలేవి వాటితో మల్లి అడిగే బుల్లిబుల్లి కోర్కెలు తీర్చగలిగే వాడు. మల్లికి ఉన్నట్టుండి ఓ కోరిక పుట్టింది. అది అందమైన పట్టుచీర కొనాలని అదివాళ్ల తాహత్తుకు మించిన కోరిక.
సాయంత్రం అవగానే సూరిగాడికి చెప్పింది.
సూరిగాడి మనస్సులో రాయిపడ్డ గాని, మల్లికంటే ఈ లోకంలో తనకేముంది అనుకొని సరే ఈసారి ఎండకాలంలో కొనిపెడతాలే అన్నాడు. మల్లి లెక్కేసుకొంది. ఎండాకాలం అంటే ఇంకెన్నాళ్లు ఇంకో మూనె్నళ్లు అంతేకదా! అనుకొంది.
ఈసారి ఎండాకాలం వచ్చేసరికి సూరిగాడు, మల్లి ఉత్సాహంగా పనిచేశారు. కుండలన్ని పెద్ద మార్కెట్‌లో వేశారు. వెయ్యి రూపాయలు అదనంగా వచ్చాయి. మల్లికి పట్టుచీర కొన్నాడు. గుడిసెను బాగా చేయించుకొన్నాడు. మల్లి పట్టుచీర కట్టుకొని సూరిగాడి దగ్గరకొచ్చింది. చిలక పచ్చబొట్టు చీరలో తెల్ల మల్లెపువ్వులా వుంది మల్లి. ‘‘మల్లి ఎలా వున్నాదో తెలుసా? అచ్చం బొండుమల్లె పువ్వులా వున్నావు - ఎండాకాలంలోనే కదా మల్లెపూలు పూచేది అందుకే ఈ సూరిగాడికి ఈ మల్లి దక్కింది’’ అన్నాడు మల్లి సిగ్గుల మొగ్గైయింది.
కొన్నిరోజులకి మల్లి పండంటి మగబిడ్డను ప్రసవించింది. సూరిగాడి ఆనందానికి హద్దులు లేవు. సూరిగాడికి మునుపటి కన్న ఎక్కువ ఉత్సాహంతో చక్రం తిప్పి కుండలు చేస్తున్నాడు. చక్రంతో పాటే కాలచక్రం తిరిగిపోయింది. సూరిగాడి కొడుక్కి ఇప్పుడు నాలుగేళ్ల వయసు వచ్చింది. బాగా ఆడుకొంటున్న పిల్లవాడు ఒక రోజు హఠాత్తుగా పడిపోయాడు. అలా వున్నట్టుండి ఎందుకు స్పృహ తప్పి పడిపోయాడో అర్ధం కాలేదు. వెంటనే డాక్టరు దగ్గరకి తీసుకెళ్లారు. పెద్ద డాక్టరు దగ్గరకు తీసుకెళ్లమన్నాడు చిన్నడాక్టరు. మల్లి కన్నీళ్లు సూరిగాడు గుండెనిండ దిగులు భయం పెనవేసుకొన్నాయి. పెద్ద డాక్టరు దగ్గరకి తీసుకెళితే ఇది చాలా పెద్ద జబ్బు నూటికి ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది. అయినా మీలాంటి వాళ్లకి ఇది రావటం చాలా కష్టం. నాకు తెలిసినంత వరకు కొంత సహాయం చేయగల్ను పై ఖర్చులు, మందులు వీటికి ఓ ఐదువేలు ఖర్చవుతుంది. లేకుంటే మీ బిడ్డ మీకు దక్కడు అని చెప్పాడు సూరిగాడికి. మల్లికి పై ప్రాణాలు పైనే పోయినాయి. అయ్యో తమ వద్ద అంత డబ్బు లేదు పైగా గుడిసెమ్మినా అంత డబ్బు రాదు. ఎవరు సహాయం చేసే వాళ్లు లేరు. ఎలా ఈ గండం గడిచేది.తన పిల్లవాడు బ్రతికేది. రెండురోజులు ఫర్వాలేదు. ఆపైన మీ ఇష్టం. అని డాక్టరు వెళ్లిపోయాడు. అప్పుడు ప్రారంభమైంది సూరిగాడిలో చలనం. తనకు తెలిసిన వాళ్లందరి దగ్గరికి వెళ్లి బ్రతిమాలుకొన్నాడు. ఎవరు అసలు సూరిగాడ్ని పట్టించుకోలేదు. వాడి మాటలు విని విననట్టూరుకున్నారు. చివరకు డాక్టరు దగ్గరకే వచ్చి బ్రతిమాలుకొన్నారు. మల్లి, సూరి గోడు కొద్దిసేపే విన్నాడు. ఛా ఏంది ఈ న్యూసెన్స్ అనుకొన్నాడు. చూడు సూరీగా డబ్బున్నప్పుడే పొదుపు చేసుకోవాలి. తాగి తందనాలాడితే ఇలాగే వుంటాయి పరిస్థితులు. ఇకనైన జాగ్రత్తగా వుండండి రేపు మీ అబ్బాయికి ఆపరేషన్ చేస్తాను. పై ఖర్చులకి డబ్బులు చూసుకోండి అని వెళ్లిపోయాడు. సూరిగాడు అక్కడే బొమ్మలా నిలబడిపోయాడు. తన డబ్బులు జల్సా చేస్తున్నా తిరుగుతున్నాడు. ఒకోసారి గంజి తాగేందుకే డబ్బులుండని ఓటికుండలాంటి తమ బ్రతుకులని ఇంక డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకొనేది. ఈ జీవితంలో ఇంత నికృష్టమైన రోజు వస్తుందని తను అనుకోలేదు భగవంతుడా ఏమిటో ఈ శిక్ష. నీ బొమ్మలు వేసి సృష్టించే ననే్న ఈ విధంగా వుండాలని శాసిస్తున్నావా! సూరిగాడి మనసు బాధపడింది. అప్పుడు గుర్తుచేసింది మల్లి. బాబుకి డాక్టరు ఆపరేషన్ చేస్తానన్నారు గదా! పద ఇంటికి పోయి అన్ని ఏర్పాట్లు చేసుకొద్దాం అని గబగబ గుడిసెకొచ్చారు.
వాళ్లుండే దగ్గరే చీటిపాట పాడే యాదగిరి వున్నాడు. అక్కడ వుండే వాళ్లంతా యాదగిరి దగ్గర చీటి పాటపాడి డబ్బులు దాస్తుంటారు. ఆ ప్రాంతమంత యాదగిరంటే భయంతో పాటు సహాయం చేస్తాడనే వినికిడి కూడా వుంది.
సూరిగాడు యాద్కిరి దగ్గరకు వెళ్లాడు ‘ఏమన్నా ఇట్లా వచ్చినావు అన్నాడు. సూరిగాడు పరిస్థితి అంతా చెప్పాడు అయితే నీ గుడిసె మీద ఏడు వేలిస్తాను. నీవిప్పుడే గుడిసె ఖాళీ చేసెయ్యాల అన్నాడు.
మల్లి మనసు విలవిల్లాడింది. ‘‘సరే అవసరమైన సామానునే తీసుకువెడతాను ముందు డబ్బు ఇయ్యి. నీవొచ్చి సామాను ఖాళీ చేయించే’’ అన్నాడు.
సూరిగాడి చేత నోటు వ్రాయించుకొని యాదగిరి తాళం తీసుకొని సూరిగాడికి డబ్బిచ్చి వాడి వెనకే బయలుదేరాడు. మల్లి ఇంట్లో కొన్ని సామాన్లు ట్రంకుపెట్టెలో చీరలు పెట్టుకుంది.
ట్రంకుపెట్టే అడుగున పాత పట్టుచీర కనిపించింది. మల్లి గుండె కలుక్కుమంది. బిడ్డ ప్రాణం గుర్తుకొచ్చి సూరిగాడ్ని తొందర చేసింది. గబగబ ఇద్దరు ఆసుపత్రికి వచ్చారు. కొంచెంసేపటి తరువాత డాక్టరు కనిపించాడు. సూరిగాడు డబ్బు మొత్తం డాక్టరు చేతికొచ్చి ‘నా బిడ్డని బ్రతికించండి డాక్టరిని వేడుకొన్నాడు. తెల్లవారుజామునే ఆపరేషన్ చేస్తామన్నారు. ఆ రాత్రి వరండాలోనే సూరిగాడు, మల్లి ఎదురెదురుగా నిద్రాహారాలు మాని కూర్చున్నారు. ఉదయం పది గంటలకు నర్సు వచ్చి పిలుచుకెళ్లింది. బాబు శవంగా మారాడు.. డాక్టరు కనిపించాడు. ‘‘నా శాయశక్తులా ప్రయత్నించాను లాభం లేకపోయింది. అన్నట్టు మీరిచ్చిన డబ్బు ఆపరేషన్‌కు సరిపోయింది. బాబును తీసుకుపోండి’’ అని వెళ్లిపోయాడు. ‘‘బాబు అంటు ఇద్దరు బాబుని తీసుకొని ఒళ్లో పెట్టుకుని కన్నీరుమున్నీరై విలపించసాగారు.
మల్లి పెట్టెలోంచి పట్టుచీర తీసి బాబుకు కప్పింది. వాళ్లిద్దరే శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశారు.
సూరిగాడి బతుకు చక్రం చేజారిపోయింది. వాడి ముఖంలో ఇప్పుడే మబ్బులు కదలాడుతున్నాయి. మళ్లీ ఎప్పుడు వెలుగొస్తుందో మల్లి మనసులో మల్లెతీగ వాడిపోయింది. చిగురులు వేసేదెన్నటికో. కాలమనే సూర్యుడు మాత్రం తన చక్రం తిప్పుతూనే వున్నాడు.

- అనురాధ రామకృష్ణ చరవాణి : 9394837563