సాహితి

సినిమా వ్యామోహంలో పడని సామాన్య యువతి (శీవిరించీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదరాసు మహానగరంలో వుండి వచ్చాడు. నారాయణ ఒక పల్లెటూరులో స్నేహితుని యింట ప్రవాసం చేస్తున్నాడు. సినిమా కోసం చదువు పాడుచేసుకుని, సినిమా పత్రిక ప్రారంభించి సినిమా తీయాలనే ఆర్భాటంలో ఎనిమిది నెలలు గడిపి, ఆస్తి అంతా కరరావుడు చేసుకుని యిక్కడికి చేరాడు. అయినా సినిమా తీయాలనే ఆరాటం ఆగలేదు. ఏ మనిషితో మాట్లాడినా సినిమా కళను గురించి, ప్రయోగాల గురించి ప్రస్తావిస్తూ వుంటాడు. అతని వాగ్ధోరణిలో కొట్టుకుపోకుండా బయటపడుతూ వుంటారు ఆ గ్రామంలో అతన్ని పరిచయం చేసుకున్నవాళ్లు.
పరిస్థితులతో ఎప్పటికప్పుడు రాజీపడుతూ తన ఆశావాదాన్ని చంపుకోకుండా కాలక్షేపం చేస్తూ వుంటాడు నారాయణ. అతని అంతరంగం ఒకటే మూలుగు: ‘అంత త్వరలో కంపెనీ దివాలా తీస్తుందని అతను ........ అనుకోలేదు. కంపెనీ దివాలా మాట దేవుడెరుగు కాని, అందుమూలంగా తన పత్రిక కూడా పడుకుంది. అంతేకాదు, అంతటి మహాపట్నంలో తన వంటి ప్రతిభాశాలికి ఉద్యోగం దొరక్కపోవడమేమిటి? అయితే అదీ ఒకరకంగా అదృష్టమే. లేకపోతే తానీసరికి ఏదో ఒక క్షుద్రమయిన నౌకరీలో ఇరుకుకొని ఉందును. అంతకంటే నిరుద్యోగిగా వుండడం వెయ్యి రెట్లు నయం’.
నారాయణ ప్రవాసం చేస్తున్న ఆ కుగ్రామంలో పల్లె జీవనం తప్ప మరేం అవకాశం లేదు. కనీసం ఒక సినిమా హాలైనా లేకపోవడం అతనికి దుఃఖకారణం అయింది. అయితే ఒక్కటే ఒక్క ఆశ. అతనికి మెదడులో గట్టిగా ప్రవేశించింది. అదేమిటంటే, రాధ అనే యువతి అతి సామాన్యమైన స్ర్తి- ఫొటోజెనిక్‌గా కనపడడమే కాక తెలుగు, హిందీ భాషలు అనర్ఘళంగా మాట్లాడుతుంది. ఇంగ్లీషు ఫర్వాలేదు. తర్ఫీదు ఇచ్చి వాడుకోవచ్చును అని ఊహచేస్తాడు.
పత్రికలో పేరుపడడం, రేడియోలో గొంతు వినబడడం, సినిమాలో ముఖం కనపడడం- అనే మూడు కోరికలకు పెనవేసుకొని యువతీ యువకులు ఆశలు పెంచుకుంటున్న ఆ రోజులలో సినిమా అంటే ఏమాత్రం వ్యామోహం చూపకపోగా, తనను ఇప్పటిలాగే కిళ్లీ దుకాణం నడుపుకుంటూ ఉండనివ్వమని అతన్ని మాత్రం విపరీతంగా సినిమాలు తీసి పేరు గణించమని కోరుకునే రాధలాంటి పాత్ర, బహు అసామాన్యంగా, చదువరులకు శ్రీపంతుల శ్రీరామశాస్ర్తీ (1922) గారి కథానిక ‘కిల్లీ దుకాణం’లో కనబడుతుంది. శ్రీ శాస్ర్తీగారు ఒరిస్సా రాష్ట్రంలో వుండి అనేక తెలుగు కథలు వ్రాసి, భారతి- ఆంధ్రపత్రిక ఇత్యాది పత్రికలలో మంచి ప్రచారం పొందారు. ఈయన కథలు ‘ఊహాబలంతో సంఘటనలను సంభవింపజేసి రకరకాల తరహాలకు చెందిన మనుషులు ప్రాపంచిక సత్యాలను వెల్లడించేస్తాయని’ విమర్శకులు చెబుతారు.
నారాయణ ప్రవాసం చేస్తున్న ఆ పల్లెటూరు మీదుగా రైలు దారి వుంది. అక్కడికి రాత్రిపూట వచ్చే ఒక రైలు సమయాలు అతను రాధ కిల్లీ దుకాణానికి రావటానికి, తిరిగి వెళ్లటానికీ సూచికలుగా వుంటాయి. అతను మరచిపోకుండా ప్రతిసారీ కిల్లీ తయారు చేయించుకుంటాడు ఆమె చేతులమీదుగా. నిజానికి మీరు వస్తారనే ఇప్పటివరకూ (దుకాణం తెరిచి) వుంచడం అంటుంది రాధ. ఆ ప్రదేశంలో వున్న సినిమా హాలు మూతపడిపోవడంతో దానిని ఆశ్రయించుకువున్న దుకాణాలన్నీ ఇతర స్థలాలకు వెళ్లిపోయాయి. రాధ ఒక్కతేమటుకు ఇక్కడ రుూ యింటినీ, రుూ పువ్వుల మొక్కలను విడువలేక ఉండిపోయింది. సినిమా హాలు వున్నప్పుడు ఆమె పది పనె్నండు సినిమాలు మాత్రం చూసింది అక్కడ. ఆమె దృష్టిలో అన్నీ ఒక్కలాగే వుంటాయి. పైగా దుకాణం పని చూసుకోవాలి కనుక ఎక్కువ సమయం దొరకదు. ‘ఇంటిదగ్గర సినిమా హాలు వుండి కూడా, సినిమాలంటే మీకు సరదా కలగలేదన్నమాట’ అన్న నారాయణ ప్రశ్నకు- ఆమె తనకు ‘మధ్యన పచ్చరాయి వేసిన బంగారు ఉంగరం అంటే ఎంతో వెర్రిగా ఉండేదనీ’ తీరా ఆ వస్తువు చేతికి చిక్కాక- తతిమ్మా బంగారు వస్తువులతోపాటు అమ్ముడయిపోయిందనీ ఓ ఉదంతం చెబుతుంది. ‘నియరర్ ది చర్చ్ - పార్ టు గాడ్’ అని చదువురికి గుర్తువస్తుంది.
రాధ భర్త జెయిలుకు వెళ్లాడు. మూడేళ్ళ శిక్షలో రెండేళ్లు గడిచిపోయాయి. నేడో రోపో బయటికి వస్తాడని ఆమె నిరీక్షణ. అట్లాగే అతను తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యంలో మునిగిపోతుంది. అయితే అతను తప్పించుకువచ్చాడు, దారిలో ఒక దొంగతనం కూడా చేశాడు. అతన్ని పోలీసులు అతి వేగంగా పట్టుకోగలిగారు కూడా అతని ఇంటిలోనే. అతను వచ్చిన సమయానికి నారాయణ కూడా అక్కడే వున్నాడు. తెల్లవారు జామున రైలుకు రాధను తీసుకుని మదరాసు వెళ్లిపోయి, తన ఆశలన్నీ నెరవేర్చుకోవాలని గాలివానను కూడా లెక్కచేయకుండా వచ్చాడు అతను. ఆ చిన్న యిల్లే అతనికి ఆ క్షణంలో దివ్యభవనంలా కనిపిస్తుంది. పాత జీవితం రుూ గాలివానతో సమాప్తం అయిపోయి, కొత్త సినిమా జీవితం ఆరంభం అవుతుంది- అతని ఊహాలోకంలో. అతను చెప్పే మాటలన్నీ ఆమె ఉదాసీనంగా వింటుంది. ‘ఇంతవరకు ఎంతో స్పష్టంగా మాట్లాడకపోవడం నా పొరపాటే’ అని ఆమె తనకు సినిమా వ్యామోహం లేదనీ, నరసింగు జెయిలు నుంచి వచ్చిన తర్వాత రుూ ప్రస్తుత జీవితానే్న సుఖంగా కొనసాగించితే చాలనీ స్పష్టం చేస్తుంది.
నరసింగుతో దెబ్బలు తిని నారాయణ ఆ యింటి నుంచి బయటపడతాడు. నరసింగు మళ్లీ అరెస్టయి, జైలు పాలయి, అక్కడే ఆత్మహత్య చేసుకున్న సమాచారం రాధ అందుకుంటుంది. నారాయణ మళ్లీ స్వాస్థ్యం చిక్కించుకుని, స్నేహితుడి దగ్గర యాభై రూపాయలు అప్పు తీసుకుని మదరాసు చేరుకుని ఒక ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో అసిస్టెంట్ మానేజర్‌గా ఉద్యోగస్థుడవుతాడు. రాధ మనసులో మార్పు వచ్చి ఈసారి నారాయణ పంతులుగారు వస్తే ఆయనతో పాటు ఏ సముద్రంలో దూకమన్నా తాను సిద్ధమేనని స్థిరపడుతుంది. కానయితే నారాయణ దృష్టిలోని ఊర్వశి, వారానికి ఒక రోజయినా దుకాణం కట్టకుండా, రోజుకు రెండు రూపాయలు మించని కిల్లీ దుకాణం బేరసారాలు సాగిస్తోంది.
మనుషుల ఆశలు వేరు, అసలు జరిగే సందర్భాల తీరు వేరు అని ఈ కథానిక తెలుపుతుంది.

విరించి, 9444963584