నిజామాబాద్

వరద కాలువకు జలకళ రావాలంటే కాళేశ్వరం రివర్స్ పంపింగే శరణ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, జూలై 23: శ్రీరాంసాగర్ మిగులు జలాలను ప్రాజెక్ట్‌లకు మళ్లించేందుకు చేపట్టిన వరద కాలువకు జలకళ రావాలంటే కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ఏకైక శరణ్యంగా కనిపిస్తోందని ఆయకట్టు రైతులు అంటున్నారు. ఎస్సారెస్పీ రెండవ దశ కార్యక్రమంలో భాగంగా వరద కాలువను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాని పివి.నర్సింహారావు హయాంలో శంకుస్థాపనకు నోచుకున్న ఈ కాలువ నిర్మాణం పనులు దశాబ్ద కాలం క్రితం పూర్తి అయ్యాయి. అయితే ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో వరదకాలువ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు కేవలం రెండు పర్యాయాలే వరద కాలువ ద్వారా నీటిని వదిలారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముందస్తుగానే వరదకాలువ ద్వారా నీటిని వదిలిన సందర్భం వివాదస్పదం అయ్యింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండితే తప్ప వరద కాలువ నీటిని వదిలే అవకాశం లేకుండాపోయింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అనేక ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడంతో ఇన్‌ఫ్లో దాదాపుగా తగ్గిపోయింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతీ సంవత్సరం బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేస్తూనే వున్నా, ఎగువ ప్రాంతం నుండి గోదావరి వరద ప్రవాహం లేకపోవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో రావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో వరద కాలువకు నీటి విడుదల అన్న విషయం ఎండమావిలా మారింది. వరద కాలువ నిర్మాణంలో పాత మండలాలైన బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల రైతులు తమ విలువైన పంట భూములను అందించారు. ఇందులో మూడు పంటలు పండే భూములే ఎక్కువగా వుంటాయని భాదిత రైతులు ఇప్పటికీ వాపోతుంటారు. భూములు కోల్పోయిన రైతులను ఆదుకుంటామని, వారికి ఇతర మార్గాలలో లాభాలను చేకూర్చుతామని పాలకవర్గాలు ప్రకటించాయి. అందులో భాగంగానే వరదకాలువకు ప్రత్యేక తూములను ఏర్పాటు చేసారు. వరద కాలువ నిండుగా ప్రవహించిన సందర్భంలో తూముల నుండి విడుదల అయ్యే జలాలు డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా చెరువులకు చేరేలా ఏర్పాట్లు చేసారు. బాల్కొండతో పాటుగా మోర్తాడ్ మండలంలోని దొన్‌కల్, పాలెం, కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ల వద్ద ఈ తూములను ఏర్పాటు చేసారు. ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఈ తూములు రైతులకు వరదకాలువ జలాలను అందించాయి. వరదకాలువలో రైతులు పంపుసెట్లను ఎర్పాటు చేసుకుని పంట పొలాలకు నీటిని మళ్లించుకుంటున్నారు. వరదకాలువలో నీటి ప్రవాహం కొనసాగినన్ని రోజులు ఈ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పెరిగి పాతాళగంగలా పైకి ఉబికి వచ్చింది. దీనిని గమనించిన రైతులు భూములు కోల్పోయిన తమ ప్రాంతంలో వరద కాలువలో నీటిని నిలిపి వుంచేలా చర్యలు చేపట్టాలని, దానికి గాను జిల్లా సరిహద్దులో క్రాస్‌రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల డిమాండ్ మేరకు వరదకాలువలో క్రాస్‌రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన గత ప్రభుత్వం దీని కోసం నిధులు కేటాయించింది. కమ్మర్‌పల్లి మండలం నాగాపూర్ వద్ద వరద కాలువలో ఇటీవలే క్రాస్‌రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేసారు. అయితే రైతుల కోరినట్లుగా అన్నీ జరిగినప్పటికీ, వరద కాలువలో నీటి ప్రవాహం లేకపోవడం వల్ల ఏ ఒక్క పథకం కూడా ప్రస్తుతం ఉపయోగపడని పరిస్థితి. గత రబీ సీజన్‌లో వరద కాలువకు నీటిని వదలాలని ఆయకట్టు రైతులు కోరినప్పటికీ ఫలితం మాత్రం రాలేదు. శ్రీరాంసాగర్ పూర్తిగా నిండే పరిస్థితి వస్తే తప్ప వరదకాలువకు జలకళ రాని పరిస్థితి ప్రస్తుతం నెలకొని వుంది. ఇలాంటి పరిస్థితులలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను నింపడానికి కాళేశ్వరం జలాలు మళ్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆయకట్టు రైతుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలువకు నీటిని అందించి దాని నుండే ప్రాజెక్ట్‌కు నీరు చేరేలా ప్రభుత్వం నిధులను కేటాయించింది. వరద కాలువలో మూడు చోట్ల పంప్‌హౌస్‌లను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక టిఎంసి నీటిని పంపించే విధంగా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఈ పథకం పక్కాగా అమలు చేస్తే వరద కాలువకు పూర్తి స్థాయిలో జలకళ వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అరవై రోజుల పాటు వరద కాలువలో నీటి ప్రవాహం ఉండటం వల్ల దాని పరిధిలో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, తద్వారా బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాలలో నీటి ఇక్కట్లు దూరమవుతాయని రైతులతో పాటు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన వరద కాలువ ద్వారా కాళేశ్వరం పథకాన్ని త్వరితగతంగా చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. దీనివల్ల కేవలం వరద కాలువనే కాకుండా అనేక ఎత్తిపోతల పథకాలకు కూడా జీవం లభించినట్లవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.