తూర్పుగోదావరి

పునరావాసానికి పది ఏళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 23: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు పునరావాసం ప్రక్రియపై నీలినీడలు అలుముకుంటున్నాయి. పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి పది గ్రామాలకు పునరావాసం కల్పించేందుకు పదేళ్లు పట్టింది. ఇంకా మిగిలివున్న 50 గ్రామాల పునరావాసం ఎప్పటికి పూర్తయ్యేనో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం 41 మీటర్ల కాంటూరు స్థాయిలోనే ఇపుడు పునరావాస చర్యలు చేపట్టారు. ఇందులో దేవీపట్నం మండలంలో ముంపు గ్రామాలు మొత్తం 44 కాగా ఇపుడింకా 38 గ్రామాలు ఖాళీ చేయించాల్సి వుంది. పోలవరం రిజర్వాయర్ లెవెల్ ఎఫ్‌ఆర్‌ఎల్ 45.72 మీటర్లు కాగా దానిని ఇపుడు 41.15 మీటర్ల కాంటూరు స్థాయికి మాత్రమే నిర్మిస్తున్నారు. అంటే మూడవ కాంటూరు స్థాయిలోనే నిర్మాణం జరుగుతోంది. ఈ మూడవ కాంటూరు స్థాయిలో 50 గ్రామాలు ముంపునకు గురవుతాయి. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మొత్తం ముంపు గ్రామాలు 234 అయితే 50 గ్రామాలు ఇపుడు మునుగుతుంటే, నాల్గవ కాంటూరులో మిగిలిన 184 గ్రామాలు ఖాళీ చేయాల్సి వుంటుంది. ఈక్రమంలో దేవీపట్నం మండలంలో 38, కూనవరంలో ఒక గ్రామం, విఆర్ పురం మండలంలో 11 గ్రామాలు ఈ కాంటూరు లెవెల్‌లో ఖాళీ చేయాల్సివుంది. ఇప్పటికి కేవలం 10 గ్రామాలు మాత్రమే ఖాళీ చేయించేందుకు సామాజిక సర్వే పూర్తయింది. ఇందుకోసం దాదాపు పదేళ్లు పట్టింది. ఇక మిగిలిన గ్రామాలను ఖాళీ చేయించేందుకు ఇంకెంత కాలం పడుతుందో అనేది సందేహంగానే వుంది. దీనికి తోడు పునరావాస చర్యలు చేపట్టేందుకు నిర్లక్ష్యం వహించడంలో ఇపుడపుడే ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదనే భావం అధికార యంత్రాంగంలో ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని, శాస్ర్తియ విధానంలో సామాజిక సర్వే నిర్వహించలేదని పలు ప్రాజెక్టులను ఉటంకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కోర్టులో కేసు వేసినట్టు తెలిసింది. ఈమేరకు పునరావాసం ప్రక్రియ కూడా ఆరోపణలకు గురవుతోందని తెలుస్తోంది. భూముల నష్టపరిహారం చెల్లింపు ఇపుడు కొత్త ఆర్‌అండ్‌ఆర్ చట్టం 2013 ప్రకారం చేపట్టారు. జనవరి 1, 2014 నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటికి ఐదేళ్ల ముందు అవార్డు ఇవ్వకపోతే అటువంటి భూములకు మళ్ళీ ఫోర్ వన్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిందే. అయితే పోలవరం విషయంలో అటువంటి పరిస్థితిలో వున్న భూములు లేవని అధికారులు స్పష్టంచేస్తున్నారు. అప్పట్లో అవార్డు ఇచ్చిన వారికి కూడా కొత్త చట్టం ప్రకారం బేసిక్ విలువను బట్టి పరిహారం చెల్లించే ప్రక్రియ జరుగుతోంది. పోలవరం భూ సేకరణలో ఎకరా రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలు అందుకున్న భూములు కూడా వున్నాయి. పాత చట్టం ప్రకారం పరిహారం అందుకున్నవారు దురదృష్టవంతులన్నట్టుగా అదే నోటిఫికేషన్‌లో పరిహారం ఇవ్వకుండా పెండింగ్‌లోవున్న వారందరికీ ఇపుడు కొత్త చట్టం ప్రకారం సరాసరిగా మూడు రెట్లు పెంపుదలతో ఇపుడు ఏడెనిమిది లక్షల వరకు పరిహారం చెల్లిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పది గ్రామాల పునరావాసం పంపిణీకి దాదాపు పదేళ్లు పట్టింది. ఇందులో కూడా పూర్తి స్థాయిలో పునరావాస కాలనీలు పూర్తికాలేదు. అరకొర సదుపాయాల వల్ల పునరావాస కాలనీల్లో తలదాచుకోలేని స్థితి నెలకొంది. ఈ క్రమంలో పునరావాసం పొందకుండానే నిర్వాసితులు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా చెల్లాచెదురైపోయారు.
దేవీపట్నం మండలంలో మొదటి దశలో అంగుళూరు, నేలకోట, పరగసానిపాడు, నాగళ్ళపల్లి, పి గొందూరు, బోడిగూడెం, డి రావిలంక గ్రామాలను ఖాళీ చేయించాల్సివుంది. రెండవ దశలో వీరవరం లంక, మూలమెట్ట, పెనుకులపాడు, మంటూరు, సిహెచ్ రమణయ్యపేట, దండంగి, అగ్రహారం, మూలపాడు, మడిపల్లి, కచ్చులూరు, కొండమొదలు, మెట్టగూడెం, తాటివడస, ఎ వీరవరం, కె గొందూరు, గంగపాలెం, గుబ్బలంపాడు, సీతారం, ఏనుగులగూడెం, దేవీపట్నం, తొర్రేరు, గానుగులగొంది, సుద్దకొండ, గండివాక గ్రామాలను ఖాళీ చేయించాల్సివుంది. మూడో దశలో తాళ్లూరు, తెలిపేరు, నందిపూడి, సోమర్లపాడు, కొక్కింగూడెం, పెద్దగూడెం, పూడిపల్లి, కె వీరవరం, కొత్తగూడెం, కేతనపల్లి గ్రామాలు, నాల్గవ దశలో దామనపల్లి, లింగవరం గ్రామాలు ముంపునకు గురవుతాయి. అయితే ఈ గ్రామాలన్నింటికి ఇంకా పునరావాస ప్రక్రియ పూర్తిచేయాల్సి వుంది. దేవీపట్నం మండలం మొదటి ఫేజ్ ఏడు గ్రామాల్లో 899 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి వుండగా కేవలం 200 ఇళ్లు మాత్రమే ఇప్పటి వరకు నిర్మించారు. పదేళ్లయినా పట్టుమని వెయ్యి ఇళ్లు కూడా నిర్మించలేదు. మొదటి దశలోనే ఇంకా దాదాపు 50 వేల ఇళ్లు కట్టాల్సి వుంది. దీనికి ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి. అందుకే పునరావాసం తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా పూర్తవకుండా 2019 నాటికి పోలవరం నుంచి గ్రావిటీపై నీరెలా ఇస్తారో దేవుడికే ఎరుక.

గోదావరికి తగ్గుతున్న వరద ఉద్ధృతి
రాజమహేంద్రవరం, జూలై 23: గత వారం రోజులుగా ధవళేశ్వరం బ్యారేజి నుంచి లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. గోదావరి నదికి వరద తాకిడి తగిలి వారమైంది. రోజుకు ఇంచుమించు సరాసరిగా మూడున్నర లక్షల క్యూసెక్కుల చొప్పున వరద జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఆదివారం వరద ఉద్ధృతి తగ్గింది. ఆదివారం ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొత్తం 175 గేట్లకు గాను కొన్ని అర మీటరు, కొన్ని గేట్లను మీటర్ చొప్పున ఎత్తి వేసి మొత్తం 3.52 లక్షల క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజి వద్ద 8.90 అడుగుల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద 24.3 మీటర్ల మట్టం నమోదు కాగా కాళేశ్వరం వద్ద 5.11 మీటర్లు, పేరూరు వద్ద 7.00, దుమ్ముగూడెం వద్ద 7.57, కూనవరం వద్ద 9.06, కుంట వద్ద 4.97, కొయిదా వద్ద 12, పోలవరం 8.58, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.02 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజి పాండ్ లెవెల్ 13.38 మీటర్లు. కాగా ఈస్ట్రన్ డెల్టాకు 4,500 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టా 2,000, వెష్టన్ డెల్టాకు 6,500 క్యూసెక్కుల జలాలను విడుదల చేశారు.

జెఎసి నేతల కదలికలపై నిఘా
శంఖవరం, జూలై 23: కాపుల ప్రాబల్యం గల గ్రామాల్లోని జెఎసిల కదలికలపై పోలీసులు ఆరా తీస్తూ వారిపై డేగ కన్ను వేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ముద్రగడ ప్రాబల్యంగల ప్రాంతంకావడంతో పాటు, కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ముద్రగడను అభిమానించేవారు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కులాలకతీతంగా ముద్రగడ పాదయాత్రకు సంఘీభావం తెలిపే అభిమానుల సంఖ్య పాదయాత్ర సమయం సమీపించే కొద్దీ పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. శంఖవరం, రౌతులపూడి మండలాల గ్రామాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే గ్రామాల్లో పోలీసులు సివిల్ దుస్తుల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే గతంలో తుని సభలో ఉత్సాహంగా పాల్గొన్న కాపు యువత కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఉంచి, సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. అలానే జాతీయ రహదారుల వెంబడి ఆదివారం మరిన్ని చెక్‌పోస్టులను పెంచి సివిల్ పోలీసులతోపాటు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను దింపుతున్నట్టు సమాచారం. కత్తిపూడి జాతీయ రహదారిపై చిత్తూరు డిఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ చలో అమరావతి పాదయాత్రను విఫలం చేయాలనే ప్రభుత్వం, పోలీసుల ప్రయత్నంతో తమలో మరింత పట్టుదల పెంచుతుందని కాపు యువత పేర్కొంటోంది. ప్రశాంతంగా జరిపేందుకు తలపెట్టిన పాదయాత్రను ఉగ్రరూపం దాల్చేలా చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమేనని పలువురు కాపు యువకులు ఆరోపిస్తున్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం టిడిపి ప్రభుత్వం అమాయకత్వమని, ఎంత అణగదొక్కినప్పటికీ మరింత వేగంగా కాపు ఉద్యమం ఉద్ధృతమవుతుందని, వచ్చే ఎన్నికల్లో దీనికి బదులు తీర్చుకుంటామని కాపు యువకులు తమ మనోభావాన్ని వెల్లడించారు.

పాదయాత్ర జరిగి తీరుతుంది
ప్రత్తిపాడు, జూలై 23: ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్ర జరిగి తీరుతుందని కాపు జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, గౌతు స్వామి అన్నారు. కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహంలో ఆదివారం వారు విలేఖర్లతో మాట్లాడారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా గాంధేయ మార్గంలో ఉద్యమం చేస్తున్న నాయకుడ్ని అప్రకటిత ఎమర్జన్సీ ద్వారా ప్రజలను కలవనీయకుండా చేస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని వారు విమర్శించారు. కాపులకు రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 26 నుంచి పాదయాత్ర చేస్తానని ముద్రగడ ప్రకటించినా వారం రోజులు ముందుగానే కిర్లంపూడిలో పోలీసులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించారన్నారు. ప్రభుత్వంలోని కాపు నాయకులు అరువు రేపు అనే చందంగా చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్లు ఇస్తారని, చేస్తారని పదే పదే ప్రకటనలు చేస్తున్నారన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సభకు విఐపిగా హాజరైనప్పుడు ఇది రిజర్వేషను ఉద్యమమని ఆయనకు తెలియదా అని జెఎసి నాయకులు నిలదీశారు. అప్పట్లో జ్యోతుల వైసిపిలో ఉన్నారని, తరువాత టిడిపిలో చేరి వారి అబ్బాయికి జడ్పీ చైర్మన్ పదవి సాధించుకుని, కడుపు నింపుకొన్నారని జెఎసి నేతలు విమర్శించారు.
కాగా కిర్లంపూడిలోని ఏనుగు వీధిలో కాపు యువత ముద్రగడ ఫ్లెక్సీలను పెట్టుకుంటుండగా పోలీసులు వారిని అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాపు యువతకు కొద్దిపాటి ఘర్షణ జరిగింది. కిర్లంపూడిలో టిడిపి నాయకుల ఫ్లెక్సీలు కూడా తొలగించాలని కాపు యువత అనడంతో వాటిని కూడ తొలగించేందుకు పోలీసులు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. ఆదివారం కూడ కిర్లంపూడి పోలీసు వలయంలోనే ఉంది. ముద్రగడ ఇంటికి వెళ్లేవారిని ఆయన ఇంటి మెయిను గేటు వద్దే నిలిపివేసి వెనక్కు పంపించారు.

పివి సింధుకు ఘన సన్మానం
రాజమహేంద్రవరం, జూలై 23: బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్ పతక విజేత, అర్జున అవార్డుగ్రహీత పివి సింధును ఆదివారం కాస్మోపాలిటన్ క్లబ్‌లో ఘనంగా సన్మానించారు. క్లబ్ కార్యవర్గ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికి, గజమాల, పూల కిరీటం, ప్రత్యేక వెండి దండను వేసి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. బ్యాడ్మింటన్‌లో దేశపతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన పివి సింధు దేశానికే గర్వకారణమని, ఆమెను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా సింధు క్లబ్‌లో మొక్కను నాటారు. ఔత్సాహిక క్రీడాకారులకు పలు సలహాలు అందజేశారు. ప్రియదర్శిని బధిర పాఠశాల విద్యార్థులకు ఆమె బహుమతులు ప్రదానం చేశారు. క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి పరిమి వాసు, ఉపాధ్యక్షుడు బండారు మధు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

బాతుకాదు... బొప్పాయి!
ఆలమూరు, జూలై 23: సృష్టిలో అనేక వితంతలు కనిపిస్తుంటాయి. కోడిగుడ్డిలో మరో చిన్న గుడ్డు, కాయల్లో మరో కాయ వంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన రైతు కొత్తపల్లి వెంకటేశ్వరావు బొప్పాయి తోటలో ఓ చెట్టుకు అచ్చం బాతును పోలిన బొప్పాయి కాయ ఆదివారం కనిపించి అబ్బురపరుస్తోంది. ఆ కాయను రైతులు, ప్రజలు ఆశక్తిగా చూస్తున్నారు. మడికి అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్‌కు ఈ బొప్పాయి కాయను తరలించారు. దీనిపై రాజమహేంద్రవరం ఉద్యానవన శాఖ హెచ్‌ఒ శ్రీనివాసరావును వివరణ కోరగా కొన్ని సమాయాల్లో జన్యుపరమైన లోపాలు సంభవించినా, లేక అధిక పోషకాలు అందినా ఇటువంటి వింత ఆకారంలో కాయలు కాస్తాయని తెలిపారు.

మతోన్మాద శక్తులతో ముప్పు
అమలాపురం, జూలై 23: మనుషుల్ని ముక్కలు చేసి దేశాన్ని ఒక్కటి చేస్తామంటున్న మతోన్మాద శక్తులతో మానవ మనుగడకు ముప్పు పొంచి ఉందని ఉభయ తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి విఎస్ కృష్ణ అన్నారు. మానవ హక్కుల వేదిక 5వ జిల్లా మహాసభ స్థానిక వశిష్టా హోటల్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి వై రాజేష్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. సభలో కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మనుధర్మం నిరసించే వారిని దేశం వదిలిపోవాలని బెదిరిస్తున్న సంఘటనలు దేశంలో రాజ్యాంగ పాలన ఉందా అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఆదివాసీ హక్కుల కార్యకర్త పళ్లా త్రినాధరావు ఆదీవాసీ హక్కులు, చట్టాలపై వివరించారు. సభలో మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఎ రవి, ఆర్‌పిఐ నాయకుడు పి సుధీర్, దళిత నాయకుడు పెయ్యిల పరశురాముడు, రైతుకూలీ సంఘం నాయకుడు కొండా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కుల వేదిక నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. వేదిక అధ్యక్షుడిగా నామాడి శ్రీ్ధర్, ఉపాధ్యక్షులుగా మానుపాటి శ్రీనివాస్, దారా నాగేశ్వరరావు, సిహెచ్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా యేడిద రాజేష్, కార్యదర్శులుగా వి భాస్కరజోగేష్, ముత్యాల శ్రీనివాస్, సభ్యులుగా మరో తొమ్మిది మంది ఎన్నికయ్యారు.

డ్రోను కెమెరాలతో పహారా
అమలాపురం, జూలై 23: కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్ర సందర్భంగా ఏర్పడే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమాయాత్తం అవుతున్నారు. ఈ నెల 26 నుండి జరప తలపెట్టిన ముద్రగడ పాదయాత్రపై ఇప్పటికే పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అడ్మిన్ ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆధ్వర్యంలో సుమారు 2000లకు పైగా పోలీసు బలగాలతో ప్రధాన కూడళ్లలో పికెట్‌లు ఏర్పాటు చేశారు. పాదయాత్రకు తరలివెళ్లే నాయకుల కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అత్యాధునిక కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పహారా నిర్వహించేందుకు ఆదివారం రాత్రి అమలాపురం పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ట్రయల్ రన్‌లు నిర్వహించారు. పోలీసు వాహనాల సైరన్ శబ్దాలతో పట్టణ వీధులు మారుమోగుతున్నాయి.