విశాఖ

రెవెన్యూ ప్రక్షాళన అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 23: జిల్లాలో రెవెన్యూ శాఖ మొద్దుబారిపోయింది. ఈ శాఖలో పనిచేసే సిబ్బందిలో చాలా మంది పూర్తిగా లంచాలకు అలవాటుపడి, వారి జేబులు నింపుకొని, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం తెచ్చారన్నది విశాఖ భూ కుంభకోణంలో తేలిపోయింది. ఏళ్ల తరబడి జిల్లాలో భూ కుంభకోణాలు జరుగుతున్నా, ఒక్క జిల్లా కలెక్టర్‌కి కూడా తెలియదా? తెలిసినా, తమకెందుకులే అనుకున్నారా? కేవలం తహశీల్దార్లను, ఆర్డీఓలను నమ్మి, వీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వలనే ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయన్నది వాస్తవం. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా, రెవెన్యూ రికార్డులు తారుమారైనా అందులో ప్రథమ ముద్దాయి తహశీల్దారే! ప్రభుత్వ భూమిని స్వాహా చేస్తున్నారని కానీ, తమ భూముల రికారులను మార్చేశారని కానీ జిల్లా కలెక్టర్లకు ఏళ్ల తరబడి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రైవేటు భూముల విషయంలో జోక్యం చేసుకోడానికి ఇష్టపడని తహశీల్దార్లు, ఆర్డీఓలు, డిఆర్‌ఓలు, కలెక్టర్లు ఆ ఫిర్యాదులను బుట్ట దాఖలు చేస్తున్నారు. ఒకవేళ కలెక్టర్‌కు ఫిర్యాదు అందినా, సదరు భూ రికార్డులను తారుమారు చేసిన తహశీల్దారుకే ఆ ఫిర్యాదును పరిశీలించమని ఆదేశిస్తున్నారు. దీంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే కబ్జాదారులనే కోర్టుకెక్కమని సలహా ఇచ్చేది మన రెవెన్యూ సిబ్బంది. చట్టంలోని లొసుగులను చక్కగా వివరించి, వారికి వెన్నుదన్నుగా నిలిచి, ఆ భూమిని ఎలా కొట్టేయాలో కుటిల సలహాలు ఇచ్చి, తమ జేబులు నింపుకునేవారు రెవన్యూ శాఖలో ఎక్కడపడితే అక్కడే కనిపిస్తుంటారు. ఆక్రమిత భూమి తమదీ అంటూ కోర్టులో అఫిడవిట్ వేయరు. ఒకవేళ వేసినా, వాయిదాలకు అటెండ్ అవరు. దీంతో సదరు భూమి కబ్జాదారుకే చెందుతుందని కోర్టు తీర్పు ఇవ్వాల్సి వస్తోంది. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ఈ సంఘటన రుజువు చేస్తోంది. మాధవధారలోని సర్వే నెంబర్ 13/3లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి ఆక్రమించుకున్నాడు. 2013లో ఈ ఆక్రమణపై కేసు నమోదై, కోర్టువరకూ వెళ్లింది. అయితే, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు 2015లో ఈ కబ్జాపై ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. భూమిని కబ్జా చేసిన వ్యక్తి అందులోని కొంత భాగాన్ని విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడన్న విషయాన్ని సాక్ష్యాలతో సహా విష్ణుకుమార్ రాజు ప్రభుత్వానికి తెలియచేశారు. అయినా గవర్నమెంట్ ప్లీడర్ ఈ కేసు గురించి పెద్దగా స్పందించలేదు. ప్రస్తుతానికి ఈ భూమి ఇంకా, కబ్జా దారుని చేతుల్లోనే ఉండడం గమనార్హం. అలాగే పాయకరావుపేటలో 145 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు టాంపరింగ్ అయ్యాయని, భీమిలి మండలం చిట్టివలసలో 40 ఎకరాలకు సంబంధించిన రికార్డులు టాంపర్ అయ్యాయని విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు ఇప్పటికీ పట్టించుకోలేదంటే రెవెన్యూ అధికారుల అవినీతి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. అందువలన విశాఖ జిల్లాలో రెవెన్యూ శాఖను కింది నుంచి పై వరకూ ప్రక్షాళణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ప్రభుత్వానికి మరింత అపప్రద తప్పదు!

పొలిటికల్ గేమ్‌లో ఇరుక్కున్న పీలా
విశాఖపట్నం, జూలై 23: విశాఖ భూ కబ్జాలో ఎన్నో మలుపులు చూడబోతున్నాం. కబ్జాలను అడ్డంపెట్టుకుని పొలిటికల్ గేమ్ ప్రారంభమైంది. పీలాపై కేసు నమోదు చేయడంతోనే ఈ గేమ్ ప్రారంభం కావడం విశేషం. విశాఖలో భూ కుంభకోణం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత అందులో భాగస్వాముల్లో ఎక్కువమంది అధికార పార్టీకి చెందిన వారే! ప్రభుత్వ భూములనే కాదు, రోడ్లను కూడా బ్యాంకులకు తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నట్టు సాక్షాత్తూ మంత్రి అయ్యన్నపాత్రుడే ప్రకటించారు. ఇంతటి చతురత తమ వర్గీయులకే ఉందన్నది అధికార పార్టీ నాయకులే ఒప్పుకొంటున్నారు. 1995లోనే పీలా గోవింద్ సత్యనారాయణ కుటుంబీకులు ఆనందపురం మండలం రామవరంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమికి రెండు సార్లు రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా తెలుస్తోంది. అప్పటి సబ్ రిజిస్ట్రార్లు ఈ భూమిని ఎలా రిజిస్టర్ చేశారు. రెవెన్యూ అధికారులు దేనికి కక్కుర్తిపడి ఈ భూమిని ధారాదత్తం చేశారు. 1995లోనే భూమిని కబ్జా చేసినా, 2013లో రికార్డుల టాంపరింగ్ జరిగిందని తెలుస్తోంది. ఈ తతంగమంతా గత ప్రభుత్వంలనే జరిగిపోయిందన్నమాట! తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క విశాఖ జిల్లాలోనే భారీ భూ కుంభకోణాలు జరిగాయి. ఇందులో ప్రముఖుల పరోక్ష హస్తం లేకపోలేదు. ఈ కేసులన్నింటికన్నా ముందుగానే పీలా కేసు బయట పడడం వెనుక రాజకీయ వైషమ్యాలు ఉన్నాయన్నది అర్థమవుతోంది. సిట్ దర్యాప్తును ఎవ్వరూ అనుమానించక్కర్లేదు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలంటే అధికారులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. పీలా భూ కుంభకోణానికి సంబంధించ వివరాలు ఇవ్వడానికి కలెక్టర్‌కు 10 రోజులు పట్టిందని తెలుస్తోంది. ఆ తరువాత కలెక్టర్ నివేదిక ఇవ్వడం, ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణపై కేసు నమోదు చేయడం వెనుక రాజకీయ జోక్యం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. పీలా వ్యవహారాన్ని ముందుగా మీడియాకు అందించింది ఓ ప్రముఖ ప్రజా ప్రతినిధే అన్న ప్రచారం జరుగుతోంది. పీలాను భూ కుంభకోణంలో ఇరికించి, వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. కబ్జా పేరుతో పీలాపై వేటు వేయాలన్నది ఈ పొలిటికల్ గేమ్ సారాంశమని తెలుస్తోంది.

డ్రగ్స్ వాడకంతో వ్యవస్థ నిర్వీర్యం
విశాఖపట్నం, జూలై 23: మత్తు పదార్ధాల వాడకం యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. జిల్లాలోని విద్యా సంస్థల యాజమాన్యాలతో ఆదివారం నాడిక్కడ ప్రభుత్వ అతిధిగృహంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్ధాలు తీసుకోవడం సరదాగా మొదలై, వ్యసనంగా మారుతుందన్నారు. భారతదేశంలో 7.2 కోట్ల మంది యువత ఇప్పటికే మత్తు పదార్ధాలకు బానిసైనట్టు గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. యువతకు మత్తు పదార్ధాలు అందుబాటులో లేకుండా చేయడంతో పాటు వీటి వినియోగం ఎంత ప్రమాదకరమో వివరించేలా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు తమ,తమ విద్యా సంస్థల్లో మత్తు పదార్ధాల అందుబాటులో లేకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని సూచించారు. చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీంల ద్వారా మత్తు పదార్ధాలను విద్యార్థులకు అలవాటు చేస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలలకు సమీపంలో ఉండే దుకాణాలపై నిఘా ఉంచాలన్నారు. పాఠశాల పరిసరాల్లో అపరిచిత వ్యక్తుల సంచారం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అలాగే పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థులకు ప్రతి వారం కౌనె్సలింగ్ ఇవ్వాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు విద్యా సంస్థల నుంచి నేరుగా ఇంటికి వస్తున్నదీ గమనించాలన్నారు. మత్తు పదార్ధాలపై సమాజంలో చైతన్యం కలిగించేందుకు సిగ్నేచర్ క్యాంపులు నిర్వహించాలన్నారు. డ్రగ్స్‌పై అవగాహన కోసం ఈ నెల 25న ఆంధ్రా యూనివర్శిటీలో కళాశాలలు, విద్యా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. అదేరోజు విద్యార్థులు, తల్లిదండ్రులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రాయూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జి నాగేశ్వర రావు, జిల్లా విద్యాశాఖ అధికారి జి నాగమణి, ఎక్సైజ్ సహాయ కమిషనర్ బాబ్జీరావు, డ్రగ్స్ నియంత్రణ సహాయ సంచాలకులు, సైకాలజిస్ట్ డాక్టర్ నాగరాజు, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరావు, పలు విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

వసతి సౌకర్యం కల్పించాలని విద్యార్థుల వినూత్న నిరసన
డుంబ్రిగుడ, జూలై 23: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆదివారం వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్.ఎఫ్.ఐ., గిరిజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో పాటు కాళీ కంచాలలో గడ్డి ఉంచి భుజించి నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ. మండల అధ్యక్షుడు మత్స్యరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ఆరో తరగతిలో చేరిన గిరిజన విద్యార్థులకు వసతి, భోజన సదుపాయాన్ని ఎత్తివేయడం సరికాదని అన్నారు.
వసతి సౌకర్యం లేకపోవడం వలన సుదూర ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు పాఠశాలలో ఏ విధంగా విధ్యనభ్యసిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనివలన విద్యార్థుల విద్యాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఎత్తివేయాలనే ఉద్ధేశ్యంతో ఆరో తరగతి విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాన్ని రద్దు చేసారని ఆయన అన్నారు.
ఇటువంటి చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేత యోచనను విరమించాలని కోరుతూ ఈ నెల 26వ తేదిన పాడేరు ఐ.టి.డి.ఎ. ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, ఎస్.ఎఫ్.ఐ. నాయకులు కె.దయానిధి, జగన్నాధం, విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానికుల చేతిలో భారీ కొండ చిలువ హతం
సీలేరు, జూలై 23: స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో మేకలు మేత మేస్తుండగా ఒక కొండ చిలువ ఆకస్మాత్తుగా వచ్చి మేకపై దాడి చేసి హతమార్చింది. దీనిని గమనించిన స్థానికులు కొండ చిలువను హతమార్చారు. ఇటీవల డ్వాక్రా మహిళలకు మేకలు లోన్ మంజూరు చేసారు. స్థానికంగా వంతల మీనా అనే మహిళ మేకలు మేపేందుకు పోలీస్ స్టేషన్ సమీపంలోకి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన కొద్ది సమయంలో కొండ చిలువ ఒక మేకపై దాడి చేసి, దానిని మింగే ప్రయత్నం చేసింది. దీనిని గమనించిన మీనా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు వచ్చి కొండ చిలువను హతమార్చారు. మేకను బయట తీసే సరికి చనిపోయింది. కొండ చిలువను చూసేందుకు స్థానికులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులు కొండ చిలువను స్వాధీనం చేసుకుని పాతిపెట్టారు.