నల్గొండ

హరితహారంలో చురుకుగా పాల్గొనాలి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూలై 23: జాతీయ ఉపాధి హామీ సిబ్బంది హరితహారం కార్యక్రమంలో చురుకుగా పాల్గొని గ్రామపంచాయతీల వారిగా నిర్ధేశించిన లక్ష్యం మేరకు 40 వేల మొక్కలు నాటాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. ఆదివారం ఉపాధి హామీ క్షేత్ర స్ధాయి సిబ్బంది పనితీరుపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు తీసిన గుంతలకు మస్టర్ పేమెంట్ వెంటనే చేయాలని, కూలీలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వెంటనే చెల్లింపులు జరగాలన్నారు. నాటిన ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని తొలగిస్తామన్నారు. డిఆర్‌డివో ఆర్.అంజయ్య మాట్లాడుతూ కూలీల సంఖ్యను పెంచాలని, ఆధార్ సీడింగ్ అందరి కూలీలకు జాబ్‌కార్డ్ వారిగా నమోదుచేయాలని తెలిపారు. ఇళ్లల్లో నాటే మొక్కలకు రవాణా ఛార్జీలు ప్రతీ మొక్కకు 80 పైసలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ దఫా 2.20 కోట్ల మొక్కలు నాటాలని, ఇందుకు ఉపాధి హామీ సిబ్బంది కృషి చేయాలన్నారు. పంచాయతీలలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఏడు రకాల రికార్డులు తప్పనిసరిగా రాయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో స్టేట్ టెక్నికల్ ఆఫీసర్ అబేద్ ఖాన్, ఏపిడిలు బి.నర్సింహరావు, వి.ముత్తయ్య, బి.రవీందర్, ఇంజినీర్లు శివకుమార్, నర్సింహచారి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉప ఎన్నిక హామీలను నెరవేరుస్తా
మర్రిగూడ, జూలై 23: మండలంలోని శివన్నగూడ గ్రామ ఎంపిటిసి ఉప ఎన్నికలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తానని మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం శివన్నగూడ గ్రామంలో టిఆర్‌యస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిటిసి ఉప ఎన్నికలో గెలుపునకు కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని, 2019 ఎన్నికల్లో కూడా మనదే అధికారమన్నారు. గత పాలకుల మాదిరిగా గెలిచిన తర్వాత గ్రామాలను మరిచిపోయే పార్టీ కాదని, ప్రజాప్రతినిధులం అంతకంటే కాదని, గ్రామంలోని ప్రతీ సమస్యను మన సమస్యగా స్వీకరించి పరిష్కరిస్తామన్నారు. వార్డుల వారీగా గ్రామంలోని పారిశుధ్యాన్ని, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్ధను మెరుగుపర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్ధానిక సర్పంచ్, ఎంపిటిసిల సమక్షంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు శివన్నగూడ గ్రామ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. గ్రామంలోని ప్రతీ ఒక్క పేద కుటుంబం ప్రభుత్వ ఫలాలను అందుకునేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని, అనంతరం అన్ని పార్టీలతో కలిసి తగు నిర్ణయాలు తీసుకోవాలని, అభివృద్ధిలో మిగతా పార్టీలు కూడా భాగస్వామ్యమై సహకరించాలని ఆయన కోరారు. అకారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై, తనపై దుష్ప్రచారాలు చేసే రాజకీయ పార్టీల వైఖరి మానుకోవాలని హితవు పలికారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటుచేసిన మొక్కలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. నాటిన ప్రతీ మొక్క ఎండిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. హరిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ బాధ్యతతో చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌యస్ మండల అధ్యక్షులు దంతు జగదీశ్వర్, సర్పంచ్ దేశిడి శ్రీలత సురేందర్‌రెడ్డి, ఎంపిటిసి మాదగోని ముత్తమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి లపంగి నర్సింహా, జిల్లా నాయకులు రాములుగౌడ్, చింతకుంట్ల రామిరెడ్డి, సర్పంచులు మునగాల అంజిరెడ్డి, పాశం సురేందర్‌రెడ్డి, రాజునాయక్, ఎంపిటిసి మారగోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా టెట్
నల్లగొండ, జూలై 23: ఉపాధ్యాయ అర్హత టెట్ పరీక్షలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆదివారం ప్రశాంతంగా సాగాయి. అభ్యర్థులు నిర్ణీత వ్యవధిలో పరీక్షా కేంద్రాలకు చేరుకోగా ఎలాంటి సమస్యలు లేకుండా మూడు జిల్లాల్లో పరీక్షలు సజావుగా నిర్వహించడంలో అధికార యంత్రాంగం విజయవంతమైంది. నల్లగొండ ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, డిఈవో చంద్రమోహన్‌లు పరిశీలించి పరీక్షల నిర్వాహణ తీరుతెన్నులను పరిశీలించారు. నల్లగొండ జిల్లాలో ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 6202మందికి 5390మంది పరీక్షలకు హాజరుకాగా 812మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2పరీక్షలకు 19,646మందికిగాను 17,500మంది హాజరుకాగా 2,146మంది గైర్హాజరయ్యారు.
సూర్యాపేట జిల్లాలో పేపర్-1పరీక్షకు 2314మందికి 2196మంది హాజరుకాగా 118మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2పరీక్షకు 5240మందికిగాను 4980మంది హాజరుకాగా 260మంది గైర్హాజరయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో పేపర్-1పరీక్షకు 300మందికి గాను 284మంది పరీక్షకు హాజరవ్వగా 16మంది గైర్హాజరయ్యారు. పేపర్-2పరీక్షకు 1248మందికిగాను 1207మంది హాజరవ్వగా 41మంది గైర్హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాలకు పలువురు మహిళా అభ్యర్థులు తమ చిన్నారులతో వచ్చి పిల్లలను భర్తలకు, బంధువులకు అప్పగించి మరి పరీక్షలు రాశారు. కొంతమంది చివరి నిమిషాల్లో హడావుడిగా పరీక్ష కేంద్రాలకు పరుగులు తీశారు. పలువురు దివ్యాంగులు, అంధులు టెట్ పరీక్షకు హాజరుకాగా అంధులు తమ సహాయకుల ద్వారా పరీక్షలు రాశారు.

ఘనంగా కాళికామాత బోనాలు
నకిరేకల్, జూలై 23: పట్టణంలోని సంతోష్‌నగర్‌లోని కాళికామాత ఆలయంలో ఆదివారం ఆషాడమాస బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 6గంటలకు అమ్మవారికి అభిషేకం, అలంకరణ, 8 గంటలకు భక్తులచే అమ్మవారి మూలవిరాట్టుకు పూజలు, సర్వదర్శనం, ఉదయం 10.30 గంటలకు భక్తులచే అమ్మవారికి బోనాలు, 11.30 గంటలకు స్థానిక శివాలయం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బాజా భజంత్రీలతో, ఆట పాటలతో ఆలయానికి తీసుకుచ్చారు. మహిళలు పెద్దఎత్తున బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

పేటలో మాతశిశు కేంద్రం, సిక్ నర్సరీల ఏర్పాటు
సూర్యాపేట, జూలై 23: తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సిఎం కెసిఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించే విధంగా తీసుకున్న చర్యలు సత్పలితాలను ఇస్తున్నాయని దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అంటే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సి కులాల అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీచేసి హడలెత్తించారు. ఆసుపత్రి అంతా కలియతిరిగి పలు వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రసూతి విభాగంలో ఫ్యాన్ తిరగడం లేదని మహిళలు మంత్రి దృష్టికి తీసుకురాగా అధికారులపై మండిపడ్డారు. పేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయాలను మంజూరీ చేస్తుంటే వౌళిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ఆసుపత్రి లోపలి భాగంలో అపరిశుభ్రతను గమనించి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. బాలింతల కోసం కెసిఆర్ కిట్ల పథకం ప్రవేశపెట్టడంతో ప్రసవాల సంఖ్య పెరుగుపోతున్నందున స్థానిక ఏరియా ఆసుపత్రిలో మరో 50 పడకలతో మాతశిశు కేంద్రాన్ని, అదే విధంగా శిశు మరణాలను తగ్గించేందుకు సిక్ నర్సరీ యూనిట్‌ను మంజూరీచేయిస్తానని ప్రకటించారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కెసి ఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో చర్చించి త్వరలోనే సాధిస్తామని చెప్పారు. ఆసుపత్రిలో అపరిశుభ్రతపై అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇకనుండి ప్రతి పక్షంరోజులకు ఒకసారి ఆసుపత్రిని తనిఖీచేస్తానన్నారు. తెలంగాణలోని పేద ప్రజలు ఎవ్వరు అప్పులు చేసి ప్రైవేట్ అసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సకల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపడడంతో నెలనెలా రోగుల సంఖ్య పెరుగుతుండడం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం నింపిదన్న విషయానికి నిదర్శమన్నారు. కెసిఆర్ కిట్‌లతో పాటు ఆసుపత్రులను ఆధునీకరించడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. జిల్లాకేంద్రాలు ఏరియా ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోను ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల కోసం చుట్టుప్రక్కల జిల్లాల నుండి కూడా గర్భిణీలు వస్తున్నందున మరో 50పడకలతో మాతశిశు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని సంకల్పిచినట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్, మార్కెట్ చైర్మన్ వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు గండూరి ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్, మొరిశెట్టి శ్రీనివాస్, ఉప్పల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామిని దర్శించుకున్న సర్పంచ్‌లు
యాదగిరిగుట్ట రూరల్, జూలై 23:యాదాద్రి లక్ష్మీనారసింహ్మస్వామి వారి కృపతో నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసుకుంటు వారికి ప్రతి విషయంలో అండగా ఉంటు సర్పంచ్‌గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ్మస్వామిని దర్శించు కున్నామని సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కసావు శ్రీనివాస్ తెలిపారు.
ఆదివారం యాదాద్రి కొండపైన శ్రీ లక్ష్మీనారసింహ్మస్వామిని దర్మించుకున్న అనంతరం గుట్ట గ్రామపంచాయతి ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నికైన సర్పంచ్‌లము అందరము తెలంగాణ కోసం తమ పదవులను త్యాగం చేసేందకుసైతం ముందుకు వచ్చామని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసి ఆర్ తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశారని తెలంగాణ సాధించాక బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని అన్నారు.గుట్ట సర్పంచ్ బూడిద స్వామి మాట్లాడుతూ గు అభివృద్దికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్‌రెడ్డి, ఎంపి బూర నర్సయ్యగౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నమిలె పాండు, కాల్నె అయిలయ్య, భీమగాని మాధవి, గుజ్జక ఎల్లుభాయి,మాటూరి వెంకటేష్, కందాల రంగారెడ్డి,కొక్కల కొండ అరుణ, చంద్రగాని నిరోషా, ఇమ్మడి మాధవిరాంరెడ్డి, స్వర్గం పరమేశ్వరి, నమిలె ఉపేంద్ర, తొడిమె రవీందర్‌రెడ్డి, బుడిగె గూతమి,పులెపాక స్వరూప, బోగ బాగ్యమ్మ,కాంత లక్ష్మ,సూదగాని సత్తయ్య పాల్గొన్నారు.

హరితహారం అందరి బాధ్యత
సూర్యాపేట, జూలై 23: హరితహారం కార్యక్రమం అంటే అటవీశాఖకే పరిమితమైందన్నట్లుగా భావించకుం డా సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సి కులాల అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మూడవ విడత తెలంగాణకు హరితహారంలో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని 10వ వార్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవాళి మనుగడ కోసం జీవనాధారమైన మొక్కలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విచ్చలవిడిగా అడవుల నరికివేత వల్ల పర్యావరణ సమతుల్య ం దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. అడవుల శాతం ఎక్కువగా ఉన్నట్లు అయి తే వర్షాలు పడుతాయని అందువల్ల ఆక్సిజన్ శాతం కూడా పెరుగుతుందని చెట్లతోనే మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. ప్రతి వ్యక్తికి 350చొప్పున చెట్లు ఉండాల్సి ఉండగా నేడు 27చొప్పున మాత్రమే ఉన్నాయన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు. హరితహారంలోను తెలంగాణను దేశంలోనే నెంబర్-1గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్ జ్యోతికరుణాకర్, టిఆర్‌ఎస్ నాయకులు గండూరి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

సాగర్ జలాశయం నీటిపై ప్రొక్లెయినర్లు
* నేటి నుంచి అప్రోచ్ కెనాల్ తవ్వకం పనులు
పెద్దఅడిశర్లపల్లి, జూలై 23: హైద్రాబాద్, నల్లగొండ జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏఎమ్మార్పీ పుట్టంగండి మోటార్లకు సరిపడి నీరందించేందుకు నాగార్జున సాగర్ జలాశయంలో పుట్టంగండి జీరో పాయింట్ వద్ధ అప్రోచ్ కెనాల్ పొడగింపు పనులను నేడు సోమవారం ప్రారంభించనున్నారు. అప్రోచ్ కెనాల్ జలాశయం నీటిలోపల త్రవ్వేందుకు అవసరమైన భారీ ప్రొక్లెయినర్‌ను ఫోంటాన్ బాక్సులతో కూడిన బల్లకట్టుపై చేర్చి జలాశయం నీటిపైకి చేర్చారు. జలాశయం మధ్యలో బల్లకట్టుపై ప్రొక్లెయినర్ తేలియడుతుందా లేదా అన్న అంశాన్ని ఆదివారం ట్రయల్ చేశారు. నీటిపై ప్రొక్లెయినర్ బల్లకట్టు తేలియడుతు ఉండటంతో ఇక నేటి నుండి అప్రోచ్ కెనాల్ త్రవ్వకం పనులు ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. అప్రోచ్ కెనాల్‌ను సాగర్ జలాశయం నీటిలోపల కనీసం కిలోమీటర్ వరకు త్రవ్వడం ద్వారా ఎమర్జన్సీ మోటార్లు పదింటిని పూర్తిగా నడిపి ఏఎమ్మార్పీ పుట్టంగండి సిస్టర్న్ రెండు ప్రధాన మోటార్లు నడిపించి హైద్రాబాద్, నల్లగొండలకు మరో నెల రోజుల పాటు కూడా సమృద్ధిగా తాగునీరిందించే లక్ష్యంతో ఇరిగేషన్, మోట్రోవాటర్ వర్క్స్‌లు మూడున్నర కోట్ల వ్యయంతో ఈ పనులను చేపట్టారు. ఏఎమ్మార్పీ పుట్టంగండి మోటార్లు ఇనే్నళ్లలో తొలిసారిగా నీటి కొరత ఎదుర్కోంటుండటంతో జలాశయంలోపలకు అప్రోచ్ కెనాల్‌ను పొడగిస్తున్నారు. కృష్ణా నదికి వరదలు వచ్చి సాగర్ జలాశయం నిండితేనే తాగునీటి కష్టాలు తప్పుతాయని భావిస్తున్నారు.
నేటి నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
వలిగొండ, జూలై 23: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆన్‌లైన్ పద్దతిలో పబ్లిక్ డాటా ఏంట్రీ విధానం నేటి నుండి అమలు కానుంది. వెబ్‌సైట్ ద్వారా లేదా అందుబాటులో ఉన్న మీసేవా కేంద్రాల్లో సర్వీస్ నెంబర్.93వ ప్రకారం వివరాలు నమోదు చేసుకొని ఆన్‌లైన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తరువాత కార్యాలయానికి వచ్చి ఫోటో, ఫింగర్ ప్రింట్‌తో రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. అనంతరం నిర్థేశించిన తేదీ నాడు డాక్యుమెంట్లను కార్యాలయంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు డాక్యుమెంట్ రైటర్లను కలిసి వారితో చేయించుకునేవారు. దీనితో రైటర్లు చాలన్, స్టాంపుల కొనుగోలు, ఫీజు, ఆఫీసు ఖర్చులు వంటివి పెద్ద మొత్తంలో వసూలు చేసేవారు. కాగా నూతన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానంతో రిజిస్ట్రేషన్ విధానం త్వరగా, తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఏర్పడనుంది.
చేనేత పరిశ్రమను పరిరక్షించాలి
భూదాన్‌పోచంపల్లి, జూలై 23: చేనేత పరిశ్రమను పరిరక్షించుకొని, తెలంగాణ అస్ధిత్వాన్ని కాపాడుకోవాలని చేనేత స్వరాజ్య వేదిక కన్వీనర్ తడక కల్పన కుమారి అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆగష్టు 7న ఉదయం 7 గంటలకు హైద్రాబాద్ నెక్లస్‌రోడ్డులో నిర్వహించే మిలియన్ల గొంతుకలతో వీవత్ జిందాబాద్ హ్యాండ్లూమ్ వాక్ కార్యక్రమానికి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అన్ని మండల కేంద్రాల్లో చేనేత దుస్తులు ధరించాలని, అన్ని వర్గాలతో కలిసి హ్యాండ్లూమ్ వాక్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె వెంట నాయకులు తడక యాదగిరి, పట్నం కృష్ణకుమార్‌లున్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహించాలి
భూదాన్‌పోచంపల్లి, జూలై 23: కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులకు పనిభధ్రత, ప్రమాద బీమా, కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియూ జిల్లా కమిటీ సభ్యుడు గడ్డం వెంకటేశ్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను పాలకులు సవరణ పేరుతో కాలరాస్తున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు ఆనంద్, బాలయ్య, యాదయ్య, బిక్షపతి, నర్సింహా, బాలచంద్రం, మల్లేష్, మాధవ్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల నమోదును పరిశీలించిన తహశీల్దార్
వలిగొండ, జూలై 23: ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేములకొండ, అరూర్, తుర్కపల్లి(ఎం), సంగెం గ్రామాల్లో ఆదివారం నాడు తహాశీల్థార్ భీంపాక యాదయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును పొందాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో సంగెం సర్పంచ్ కాసుల కృష్ణ, విఆర్వో నూనె వెంకటేశం పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
చౌటుప్పల్, జూలై 23: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో హరితహారం మూడవ విడత కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కను నాటి పెంచాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మొక్కలు పెంచితేనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు హరితహారంలో భాగస్వాములు కావాలన్నారు. అడవులు అంతరించిపోవడం వల్లే కరువుకాటకాలు నెలకొన్నాయన్నారు. పచ్చటి పంటపొలాలు బీళ్లుగా మారుతున్నాయన్నారు. పోయిన వానలు తిరిగి కురవాలంటే చెట్లు పెంచాల్సిందేనన్నారు. మొక్కలు నాటడంతోనే సరిపెట్టకుండా సంరక్షించే బాధ్యత తీసుకున్నప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్ ముటుకులోజు దయాకరాచారి, పట్టణ కమిటీ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ఊడుగు మల్లేష్, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, ఎం.డి.బాబాషరీఫ్, హనుమంతు, శంకర్, వెంకట్‌రెడ్డి, సత్తయ్య, నరసింహా తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో టిఆర్‌ఎస్‌విది కీలకపాత్ర
కట్టంగూర్, జూలై 23: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌వీ ఆవిర్భావించి తెలంగాణ సాధించేత వరకు అలుపెరగని పోరాటాలను చేసిందని కట్టంగూర్ ఎంపిపి కొండా లింగస్వామి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్‌ఎస్‌వీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 2002లో తెలంగాణ రాష్ట్ర సాధన, విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా సంఘం ఆవిర్భావించిందన్నారు. తెలంగాణ ఉద్యమనేత కెసిఆర్ స్పూర్తితో ముందుకు సాగి తెలంగాణలో విద్యార్ధి లోకాన్ని ఏకం చేసిందన్నారు. బంగారు తెలంగాణ సాధనలోనూ భాగస్వామ్యం కావాలని విద్యార్ధులకు పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను చేపట్టి ప్రభుత్వ పథకాలను ముమ్మరంగా ప్రచారం చేయాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనిచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వసతులతో కూడిన గురుకుల పాఠశాలలను, కళాశాలలను ఏర్పాటుచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు గద్దపాటి దానయ్య, నాయకులు మర్రి రాజారత్న, పోగుల తిరుమలేష్, ఊట్కూరి నాగయ్య, టిఆర్‌ఎస్‌వీ మండల ఇంచార్జ్ మనె్నం మణిదీప్, టౌన్ అధ్యక్షుడు పెద్ది మహేష్, నాయకులు ఇంద్రకంటి కుమార్, సుంకరబోయిన రవీందర్, గుండాల ప్రశాంత్, దొంతం సాయికుమార్‌రెడ్డి, మండల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

గోవిందాపురంలో గంజాయి పట్టివేత ఇద్దరి అరెస్టు.. పరారీలో సూత్రధారి
హుజూర్‌నగర్, జూలై 23: హుజూర్‌నగర్ పట్టణంలోని గోవిందాపురం కాలనీలో ఆంధ్రా ప్రాంతం నుండి గంజాయి తెచ్చి సేవిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి 200 గ్రాముల గంజాయి, సిగిరెట్లు, సొంగ స్వాధీనం చేసుకున్నట్లు యస్‌ఐ జి రంజిత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం సాయంత్రం పత్రికల వారితో మాట్లాడుతూ గోవిందాపురంలో ఉండేటి కమలాకర్ ఇంటిలో లచ్చిమల్ల నాగరాజు, పాశం ప్రవీన్‌కుమార్ ముగ్గురు కలిసి గంజాయి సేవిస్తున్నట్లు శనివారం సమచారం అందటంతో పోలీసు సిబ్బందితో వెళ్లి దాడి చేసినట్లు యస్‌ఐ అన్నారు. పోలీసులు దాడికి ఉపక్రమిస్తున్న సమయంలో అసలు గంజాయి రవాణా చేస్తున్న కమలాకర్ పారిపోయాడని నాగరాజు, ప్రవీణ్‌కుమార్‌లను పట్టుకున్నామని అన్నారు. వీరు ముగ్గురు గంజాయిని సిగిరెటులో పెట్టుకుని త్రాగటానికి సిద్దంగా ఉన్న సమయంలో దాడి చేశామని, అనంతరం తహశీలుదారు సమక్షంలో ఇంటిని సోదా చేయగా ఇంటిలో 200 గ్రాముల గంజాయి, గంజాయి కూర్చిన సిగిరెట్లు, సొంగలు లభించాయని అన్నారు. గుంటూరు జిల్లా నుండి ఒక వృద్దురాలు (మహిళ) వీరికి గంజాయి అమ్ముతున్నట్లు విచారణలో తెలిసిందని కమలాకర్ ఏపని చేయకుండా పోకిరిగా తిరుగుతుంటాడని, నాగరాజు ఆటో డ్రైవర్ అని, ప్రవీణ్‌కుమార్ సుతారి పనిచేస్తుంటాడని యస్‌ఐ చెప్పారు. కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు తల్లి తండ్రులు తమ పిల్లల పట్ల గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాల భారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని యస్‌ఐ అన్నారు.