చిత్తూరు

రైల్వే అధికారుల తీరుతో మరుగున పడ్డ ఎపి టూరిజం సమాచార కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 23: పుణ్యక్షేత్రాలకు నిలయమైన చిత్తూరు జిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చాలని సిఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిసారిస్తున్న విషయం విధితమే. ఈక్రమంలో పర్యాటక శాఖను అభివృద్ధిపరచాలని అందుకు సంబంధించి ప్రభుత్వం కూడా అనేక ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపధ్యంలో సుదూర ప్రాంతాల నుంచి 98 రైళ్లు వచ్చే తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎపి టూరిజం శాఖ ఒక సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని రైల్వేశాఖ అధికారులు, ప్రయాణికులకు అందుబాటులో ఉండేవిధంగా కాకుండా మరుగున ఒక గదిని కేటాయించారు. అసలే ఎన్నో రకాల ఒత్తిళ్లతో వస్తున్న ప్రయాణికులు ఈ కార్యాలయాన్ని గుర్తించి తమకు అవసరమైన సమాచారాన్ని పొందడం అసాధ్యమనే చెప్పాలి. ఇదే విషయాన్ని టూరిజం శాఖ అధికారులు రైల్వే అధికారులకు వౌఖికంగాను, రాత పూర్వకంగాను తెలియజేశారు. వాస్తవానికి గతంలో ఈ సమాచార కేంద్రం రైల్వేస్టేషన్ ముఖద్వారం వద్దే ఉండేది. అయితే రైల్వేస్టేషన్ ముఖ ద్వారాన్ని మూసివేశారు. అటు తరువాత రైల్వే అధికారులు స్టేషన్లో ఓ మూలవున్న గదిని టూరిజం శాఖ సమాచార కేంద్రానికి కేటాయించారు. దీనిని మార్చి ప్రయాణికులకు కనిపించేలా ఒక గదిని కేటాయించాలని టూరిజం శాఖ అధికారులు రైల్వే అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతున్నారు. ఇందులో భాగంగా తొలగించిన ప్రీపెయిడ్ టాక్సీ కేంద్రం స్థానంలో టూరిజం శాఖకు ఒక స్టాల్ కేటాయించాలని కోరారు. దీనిని పరిశీలించి ఇది అసాధ్యమని రైల్వే అధికారులు తేల్చి చెప్పడంతోపాటుగా మరో రెండు ప్రదేశాలను గుర్తించి ప్రతిపాదించాలని సూచించారు. ఈ నేపథ్యంలో మొదటి ప్లాట్‌ఫాంలో వాడని జిఆర్‌పిఎఫ్ బూత్‌ను, లేకుంటే పార్శిల్ ఆఫీస్ వద్ద ఉన్న కార్యాలయాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన రైల్వే అధికారులు ఇంజినీర్ల ద్వారా సమాచార కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి ఉన్నతాధికారులకు పంపారు. ప్రస్తుతం ఉత్తర ప్రత్యుత్తరాలతో కాలయాపన జరుగుతోంది. ప్రస్తుతం టూరిజం సమాచార కేంద్రంలో ఒక ఉద్యోగి నిరుపయోగంగా కొనసాగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై టూరిజం డివిఎం సురేష్‌ను వివరణ కోరగా, ఆయన స్పందిస్తూ త్వరలోనే రైల్వే అధికారులు తమకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని, అది రాగానే తిరుపతికి వచ్చే ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

2020కి పారిశ్రామిక నగరంగా రాష్ట్రంలోని తొలి రెండు స్థానాల్లో తిరుపతి
తిరుపతి, జూలై 23: ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పారిశ్రామికంగా కూడా దినదినాభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరం 2020 నాటికి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నగరాల్లో తొలి రెండు స్థానాల్లో ఉంటుందని ప్రముఖ పారిశ్రామిక వేత్త అమరరాజా బ్యాటరీస్ అధినేత డాక్టర్ గల్లా రామచంద్రనాయుడు పేర్కొన్నారు. తిరుచానూరులోని ఆర్కే కల్యాణ మండపంలో ఆదివారం తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వితీయ వార్షికోత్సవం, జనరల్ బాడీ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తిరుపతి కేంద్ర బిందువు కానుందన్నారు. ఒకప్పుడు ఇక్కడ దేవాలయాలు తప్ప మరేమీలేవని, నేడు తిరుపతి రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పారు. ఇప్పటికే విద్యాకేంద్రంగా మారిన తిరుపతి పరిసరాల్లో వివిధ పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, హోటల్స్, రిక్రియేషన్ మాల్స్ ఇలా పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో నగరంలో వ్యాపారాభివృద్ధికి ఎన్నో కొత్త అవకాశాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుండటం గుర్తించాలన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు తమ నైపుణ్యాన్ని మారుతున్న కాలానుగుణంగా మార్చుకోవడం అవసరమని చెప్పారు. అభివృద్ధి చెందే క్రమంలో సమస్యలు తప్పవని, అటువంటి సమయంలో వ్యాపారులకు ఒక సంఘం ఉండటం ఎంతైనా అవసరమన్నారు. తిరుపతిలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవిష్యత్తులో ఎపిలోని ముఖ్యమైన సంఘాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. టిసిసి అధ్యక్షులు మంజునాథ్ మాట్లాడుతూ వ్యాపార పరంగానే కాకుండా నగరంలో సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే వచ్చే ఏడాదిలోగా ఆధ్యాత్మిక క్షేత్రం, స్మార్ట్‌సిటీ అయిన తిరుపతిని గ్రీన్‌సిటీగా మార్చేందుకు టిసిసి కృషి చేస్తుందన్నారు. జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులతో చర్చిస్తున్నామన్నారు. తిరుపతిలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యతను టిసిసి తీసుకుంటుందన్నారు. దుకాణాల్లో పనిచేస్తున్న గుమస్తా సిబ్బంది పిల్లలు ప్రతిభావంతులైతే వారి ఉన్నత చదువుల కోసం స్కాలర్‌షిప్‌లు కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నగరంలో చెత్తను రామాపురంకు తరలించే సమయంలో ఎదురైన సమస్యను పరిష్కరించడానికి నగరంలోని అన్ని పార్టీలను, మేధావులను, ప్రముఖులను, అధికారులను ఒక్క వేదికపైకి తీసుకువచ్చిన ఘనత తమదేనన్నారు. దీనిని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకువెళతామన్నారు. ఈ సమావేశంలో టిసిసి కార్యదర్శి పి.మధుసూదన్‌రావు వార్షిక నివేదికను ప్రవేశపెట్టి వ్యాపారుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరించారు. కోశాధికారి కె.వి.చౌదరి మాట్లాడుతూ సభ్యుల అభ్యున్నతి కోసం తాము పాటుపడుతున్నామని నిజాయితీగా, పారదర్శకంగా కార్యవర్గం సేవలందిస్తోందని చెప్పారు. టిసిసిలో పాట్రన్‌గా సభ్యత్వం తీసుకున్నవారిని, తిరుపతి నుంచి ఐపిఎస్‌కు ఎంపికైన చిత్తూరు డిఎస్పీ వెంకయ్య తనయుడు వెంకట్ అశోక్‌ను ఈసందర్భంగా శాలువాకప్పి సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఆర్కే కల్యాణ మండపంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో దాదాపు 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈకార్యక్రమంలో టిసిసి ఉపాధ్యక్షులు మల్లిశెట్టి రవిక, బై అండ్ సేవ్ మధు, కృష్ణయ్య, సప్తగిరి రాజు, సంయుక్త కార్యదర్శులు జిత్తు, వాసుదేవన్, అయ్యప్ప, సభ్యులు హేమచంద్రారుడ్డి, విఆర్‌ఎల్ శ్రీ్ధర్, చక్రపాణి, శ్యామ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మెటర్నటీ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ అధికారిణి డాక్టర్ హరిత, ల్యాబ్ టెక్నీషియన్లు కృష్ణమూర్తి, సతీష్, హౌస్‌సర్జన్లు ధర్మేంద్ర, జ్ఞానేశ్వర్, హాసిన, స్ట్ఫా నర్సులు సునీత, భానుప్రియ తదితరులు పాల్గొన్నారు.

వేరుశనగ పంటపై ఆశలు వదులుకున్న రైతులు
చిత్తూరు, జూలై 23 : జిల్లాలో ఈ ఏడాది కూడా వేరుశనగ రైతులకు చేదు అనుభవమే మిగిలింది. గత నాలుగేళ్లుగా వర్షాభావంతో వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది కూడా వరుణదేవుడు కనికరించకపోవడంతో వేరుశనగ రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో కొంతవరకు తొలకరి వర్షం కురవడంతో పలువురు రైతులు విత్తనాలను విత్తారు. మరికొందరు వర్షం కోసం ఆశగా ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది. మరోపక్క అదును తప్పిపోవడంతో విత్తనాలను విత్తలేని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలో వేరుశనగ రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట వేరుశనగే. అందులోను జిల్లాలో నదులు లేకపోవడంతో వర్షాధారంపైనే ఈ పంటను సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా వేరుశనగ వాణిజ్య పంట కావడంతో రైతులు ఆర్థిక పరిస్థితులను ఈ పంటే నిర్ణయిస్తుంది. అయితే గత నాలుగేళ్లుగా పంట సాగుకు అనుకూలంగా వర్షం కురవకపోవడంతో రైతులకు కనీసం పంట సాగు కోసం పెట్టిన పెట్టుబుడులు కూడా అందని పరిస్థితి నెలకొంది. ఈ సారైనా వరుణ దేవుడు కనికరించి తమ కష్టాలు తీరుతాయని ఆశించిన రైతులకు చుక్కెదురైంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1.29 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంటను సాగు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం సుమారు 72 వేల క్వింటాళ్ల విత్తన కాయలను రైతులకు సరఫరా చేశారు. సీజన్ ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి సుమారు 80వేల హెక్టార్లలో విత్తనాలు విత్తారు. అయితే తదుపరి వర్షం కురవకపోవడంతో మరోపక్క అదును తప్పిపోవడంతో మిగిలిన రైతులు విత్తనాలు విత్తడానికి మొగ్గు చూపలేకపోయారు. పంట సాగు చేసిన 80 వేల ఎకరాల్లో సుమారు 70 శాతం వర్షం లేక మొలకల దశలోనే పంట ఎండిపోయింది. ప్రస్తుతం వర్షం కురిసినా ఈ పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేదు. దీంతో పంట సాగు కోసం సర్వం సిద్ధం చేసుకున్న రైతులు ఈ సారి సాగుకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కూడా జిల్లాలో వేరుశనగ పంటపై రైతులు ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మదనపల్లి డివిజన్‌లో ఎక్కువ మంది రైతులు ఈ పంటపైనే ఆధారపడతారు. ఈ ప్రాంతంలో నీటి వసతి లేకపోవడంతో వర్షాధారంపైనే ఆధారపడి పంటను సాగు చేస్తారు. అందులోను ఇదే వారికి ముఖ్య వాణిజ్య పంట కావడంతో ఈ ఏడాది కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో తీవ్ర నష్టం అనివార్యమైంది. ప్రస్తుతం వర్షం పడినా సాగు చేసిన విస్తీర్ణంలో సగం కూడా చేతికి రాని పరిస్థితి నెలకొంది. గత ఏడాడి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పంటకు అనుకూలంగా వర్షం కురవడంతో అధిక సంఖ్యలో రైతులు పంట సాగు చేశారు. అయితే పంట చేతికి వచ్చే సమయానికి వరుణ దేవుడు కనె్నర్ర చేయడంతో పంట తుడిచిపెట్టుకుపోయింది. దీంతో పంటను కాపాడాలని ప్రభుత్వం వినూత్నంగా అధికార యంత్రాన్ని రంగంలోకి దింపి రెయిన్ గన్స్ ద్వారా పంటకు నీటిని అందించినా ప్రయోజనం లేకపోయింది. ఈ సారి ఇందుకు భిన్నంగా సీజన్ ప్రారంభంలోనే వేరుశనగ పంట తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం నెలకొంది. దీంతో రైతుల్లో అందోళన నెలకొంది. మరోపక్క వేరుశనగ పంటకు అంతర్ పంటలపై కూడా వర్షాభావ పరిస్థితుల ప్రభావం పడటంతో ఈ పంటలు కూడా చేతికి రాని దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ సారి కూడా వేరుశనగ రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య రద్దీ
శ్రీకాళహస్తి, జూలై 23: ఆదివారం అమావాస్య కావడంతో శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తజనం పోటెత్తింది. తెల్లవారుజామునుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. రాహు-కేతు పూజలకు కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. రాహు-కేతు పూజలు చేయించుకోవడానికి భక్తులు క్యూలైన్‌లలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. శనివారం నుంచే ఆలయంలో రద్దీ ఉన్నప్పటికీ ఆదివారం అమావాస్యతోడు కావడంతో భక్తులు మరింత పెరిగారు. ఉదయం మొదటగా రాహు-కేతు పూజ చేయించుకోవడానికి భక్తులు వేలమంది చేరిపోయారు. దీంతో రాహు-కేతు పూజల క్యూలైన్లు నిండిపోయి బాలజ్ఞానాంబ గోపురం, భిక్షాల గాలిగోపురంలు దాటి సన్నిధివీధిలోని భారతీయ స్టేట్ బ్యాంక్ వరకు క్యూలైన్ వచ్చింది. రూ.300 క్యూలైన్‌లో రాహు-కేతు పూజ చేయించుకోవడానికి భక్తులు కనీసం 5 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. అంతేకాకుండా గంటల తరబడి నిలబడ్డారు. మంచినీళ్లు కూడా దేవస్థానం సరఫరా చేయలేకపోయింది. అదేవిధంగా ఆలయంలో కూడా రద్దీ ఏర్పడింది. స్వామివారి సన్నిధిలో మరింత రద్దీ ఏర్పడింది. అభిషేకాల వల్ల దర్శనం మరింత ఆలస్యమైంది. దేవస్థానం ఇఓ భ్రమరాంబ, జెఇఓ చిట్టెమ్మలు క్యూలైన్‌లను పరిశీలించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 5500 మంది రాహుకేతు పూజలు చేయించుకున్నారు. ఆదివారం సెలవురోజు, అమావాస్య పర్వదినాల్లో రాహు-కేతు పూజలకు ఎక్కువమంది వస్తున్నా వారికి సదుపాయాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు శ్రద్ధచూపడం లేదు. క్యూలైన్‌లలో గంటల తరబడి నిలబడి పూజలు చేయించుకోవాల్సి వస్తుంది. అధికారులు స్పందించి త్వరగా పూజలు జరిగేవిధంగా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
తిరుపతి, జూలై 23: హమాలీ కార్మికులకు పనిభారం తగ్గించాలని, సంక్షేమ బోర్డులో ప్రతి ఒక్కరిని సభ్యులుగా చేర్చి ఇఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక బైరాగిపట్టెడలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం హమాలీ కార్మికుల జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నేడు అన్ని రంగాల్లో వెనుకబడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గంపై దాడి చేసే విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు, పెట్టుబడిదారీ అనుకూల విధానాలకు పాల్పడుతున్నాయన్నారు. దీనిపై కార్మిక వర్గం రాజీలేని పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలన్నారు. ఆదివారం సెలవుదినమైనా కూలీలను బలవంతంగా పనులకు పిలిపిస్తున్నారని, ఇది సరికాదన్నారు. అటు మోదీ, ఇటు చంద్రబాబు నాయుడులు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఒక్క కార్మిక అనుకూల నిర్ణయాన్ని ప్రకటించలేదని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, నగర కార్యదర్శి పెంచలయ్య, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.హరికృష్ణ, నాయకులు పి.మురళి, పిఎల్ నరసింహులు, చంద్రశేఖర్ నాయుడు, రవిక, జెవి చలపతి, సత్తివేలు, జయన్న తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ఒత్తిడికి దూరం
తిరుపతి, జూలై 23: మానసిక ఒత్తిళ్లతోనూ, మత్తు పదార్థాలతో ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితులపై అవగాహన లేకండా నేటి యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారని, అలాంటి వారిని అధ్యాత్మిక చింతనతో ఇలాంటి దురలవాట్లకు దూరం చేయవచ్చని ఐపిఎస్ అధికారి లక్ష్మీనారాయణ సూచించారు. ఆదివారం కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. యువతకు ప్రేరణ ఇచ్చే ఉద్దేశంతో ఎస్వీయూలో ఏర్పాటు చేసిన యువత సాధికారత కార్యక్రమానికి వచ్చానన్నారు. ప్రణాళికాబద్దంగా పనులు చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు. పిల్లల ప్రవర్తన, అలవాట్లపట్ల తల్లిదండ్రులు కూడా నిశితంగా గమనిస్తూ దురలవాట్లకు బానిసలు కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

పాకాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
పాకాల, జూలై 23: పాకాల పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఎన్‌వి రాజశేఖర్ బాబు ఆదివారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాత్రిళ్లు గస్తీలను ముమ్మరం చేయాలని, నేరాల అదుపునకు చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఎస్పీ వెంట చిత్తూరు డి ఎస్పీ సుబ్బారావు, సిఐ రామలింగమయ్య,ఎస్‌ఐ వంశీధర్, సిబ్బంది ఉన్నారు.

తుడా చైర్మన్ నరసింహయాదవ్‌కు ఘన సన్మానం
తిరుపతి, జూలై 23: తుడా చైర్మన్‌గా నియమితులైన నరసింహయాదవ్‌ను ఆదివారం గాండ్ల సంక్షేమ సంఘం ఘనంగా సన్మానించింది. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో సంఘం తిరుపతి కార్యదర్శి లెజెండ్ రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఈకార్యక్రమం జరిగింది. నరసింహయాదవ్‌ను గజమాలలతో సత్కరించి, శాలువాలు కప్పి వేద పండితుల చేత వేదాశీర్వచనం చేశారు. ఈసందర్భంగా లెజెండ్ రామచంద్రయ్య మాట్లాడుతూ నరసింహయాదవ్ పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి లభించిందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపి జెండాను మోసిన ఆయన, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారన్నారు. రాష్ట్రంలో టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొక్కవోని ధైర్యంతో పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన ఆయనకు ఈ పదవి ఇవ్వడం బిసిలకు గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు అండగా ఉంటుందనడానికి ఇదొక నిదర్శమని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సిఎం చంద్రబాబు నాయుడు బిసిలకు తగు న్యాయం చేస్తున్నారని, ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత నేడు బిసిలపై ఉందని చెప్పారు. తుడా చైర్మన్ నరసింహయాదవ్ మాట్లాడుతూ పార్టీలో పనిచేసే వారికి ఎప్పటికీ తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. నేడు రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీని కార్యకర్తలు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. టిడిపి ప్రభుత్వం బిసిలకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాండ్ల సంఘం నాయకులు మురళి, రామచంద్రయ్య, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుపతి, జూలై 23: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు విరామ సమయంలో దర్శించుకున్నారు. వీరిలో అనంతపురం రేంజ్ డిఐజి ప్రభాకర్‌రావు, రైల్వేబోర్డు అదనపు సభ్యులు సంజీవ్‌గార్గే, దక్షిణమధ్య రైల్వే చీఫ్ వాణిజ్య నిర్వాహకులు గుణశేఖరన్, అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్, కురుక్షేత్ర (కన్నడ) చిత్రబృందం, నిర్మాత మునిరత్నం, దర్శకుడు నాగన్న, రచయిత జెకె భారవి తదితరులు ఉన్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, టిటిడి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఘనంగా చక్రత్తాళ్వార్
తిరుపతి, జూలై 23: స్థానిక శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆదివారం చక్రత్తాళ్వార్, ప్రతివాద భయంకరన్ అన్నన్ శాత్తుమొరను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం నుంచి ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ వరదరాజస్వామివారు, శ్రీ ప్రతివాద భయంకరన్ అన్నన్ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు తిరుమల నుంచి వచ్చిన శ్రీవారి అప్పపడి ప్రసాదాన్ని కోదండరామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి శాత్తుమొర నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని, శ్రీచక్రత్తాళ్వార్‌ను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆండాల్ అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.
ప్రాశస్త్యం
శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలోని మొదటి గోపురంలో పవిత్రమైన పుష్యమి నక్షత్రం రోజున శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ప్రతిష్ఠించారు. స్వామివారి ప్రతిష్ఠాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ చక్రత్తాళ్వార్ సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ ప్రతివాద భయంకర అన్నన్ కాంచిపురంలో జన్మించారు. ఆయన సంస్కృత పండితులు, శ్రీవైష్ణవాచార్యులు. తిరుమల శ్రీవారిని మేల్కొలిపే సుప్రభాతాన్ని, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనాన్ని అద్భుతంగా రచించారు. శ్రీ్భష్యం, శ్రీ్భగవతం వంటి మహాగ్రంథాలకు వ్యాఖ్యానం రచించారు. వీరి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆరోజున శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీ. ఈకార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఇఓ వరలక్ష్మి, ఏఇఓ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.