విజయనగరం

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 23: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భశాఖామంత్రి ఆర్.సుజయ్ కృష్ణ రంగారావుఅన్నారు. పట్టణంలో కాకతీయ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. ముఖ్యంగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. మున్సిపల్ పాఠశాలలో తెలుగు, ఆంగ్లమాధ్యమాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, సమాచార లోపంవల్ల అధికారులు ఆంగ్ల మాధ్యమానే్న కొనసాగిస్తున్నారని తెలిపారు. రెండు మాధ్యమాలు కొనసాగేలా కృషి చేస్తామన్నారు. మోడల్ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి రెగ్యులర్‌గా జీతాలు వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందని చెప్పారు. సమాజానికి ఉపాధ్యాయుడే మార్గనిర్థేశమన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన ఎపిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సదాశివరావు దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు, జిల్లా ప్రధానకార్యదర్శి జెసి రాజు పాల్గొన్నారు.

ప్రయాణికుల కోసం ఆర్టీసీ రాయితీ పథకాలు

విజయనగరం (్ఫర్టు), జూలై 23: ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రవేశపెట్టిన స్నేహ పూర్వక రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం డిపోమేనేజర్ ఎన్‌విఎస్ వేణుగోపాల్ కోరారు. ప్రయాణికుల ప్రాధాన్యత పక్షోత్సవాలలో భాగంగా ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ అమలు చేస్తున్న స్నేహ పూర్వక రాయితీ పథకాలను ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రూ.250 రూపాయల విలువైన నవ్యక్యాట్‌కార్డును కొనుగోలు చేస్తే ఒక ఏడాది కాలపరిమితికి రాష్ట్ర, అంతర్రాష్ట్ర సర్వీసులలో ప్రయాణఛార్జీలో పదిశాతం రాయితీ పొందవచ్చునని చెప్పారు. ఎసి బస్సులు మినహా సిటీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లతోపాటు అన్నిరకాల బస్సులలో ప్రయాణం చేయవచ్చునన్నారు. అదేవిధంగా ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న కుటుంబాల వారు తక్కువ ఛార్జీతో భద్రత లేని ప్రైవేటు వాహనాలలో చేసే ప్రయాణాన్ని నిరోధించేందుకు, సామాజిక బాధ్యతగా తెల్లరేషన్‌కార్డు ఉన్న వారందరికీ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేలా ప్రయాణఛార్జీలో పదిశాతం రాయితీ కల్పిస్తూ వనిత ఫ్యామిలీ కార్డులను ప్రవేశపెట్టిందని వేణుగోపాల్ తెలిపారు. రెండు సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ కార్డు ధర కేవలం 100 రూపాయలు మాత్రమేనని చెప్పారు. రేషన్‌కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరికీ అన్ని తెలుగువెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ప్రయాణఛార్జీలో పదిశాతం రాయితీ ఉంటుందన్నారు. అలాగే 600 రూపాయలు చెల్లించి విహారి కార్డు తీసుకుంటే ఏడురోజుల పాటు అన్ని రాష్ట్ర, అంతరాష్ట్ర సర్వీసులలో ప్రయాణపుఛార్జీలో 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చునని తెలిపారు. అందువల్ల ఆర్టీసీ అందిస్తున్న స్నేహపూర్వక ప్రయాణ రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిపోఅసిస్టెంట్‌మేనేజర్ శర్మ, నాయుడు పాల్గొన్నారు.

రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం

విజయనగరం (్ఫర్టు), జూలై 23: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తున్నామని సిపిఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత సూరిబాబు తెలిపారు. పట్టణంలో అమర్‌భవన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ ఒక బూటకంగా మారిందని ఆరోపించారు. కోనేరు రంగారావుసిఫార్సులను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరం విఫలమైందన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఆచరణలో అమలు కాలేదని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఇతర వృత్తులలోకి వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా 26వతేదీన ఎంఆర్‌ఒ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ సందర్భంగా జైల్‌భరో వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అప్పరబోతు జగన్నాథం, పొందూరు అప్పలరాజు, రంగరాజు, రమణ పాల్గొన్నారు.

దొంగనోట్ల వ్యాపారమే ప్రాణం తీసిందా?
పార్వతీపురం (రూరల్), జూలై 23: దొంగనోట్ల వ్యాపారమే పట్టణంలోని సుమిత్రా డిపార్ట్‌మెంటల్ వ్యాపారి పట్నాన మురళి ప్రాణం తీసిందా? లేక పార్టనర్స్ మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల గొడవలు ప్రాణాలు తీశాయా? అనే అనుమానాలను పట్టణ ప్రజలు, పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పొట్ట చేతబట్టుకొని బతుకు తెరువు కోసం పార్వతీపురం వచ్చిన పట్నాన మురళి పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తులతో చేతులు కలిపి అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. సుమిత్రా డిపార్ట్‌మెంటల్ స్టోర్స్, సుదర్శన్ రెడీమేడ్, ఫుడ్ గార్డెన్ వ్యాపారాలతోపాటు రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలను నలుగురైదుగురు కలిసి చేస్తూ వాటి ముసుగులో దొంగనేట్ల వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చిన విభేదాల వల్లే ఒడిశాకు చెందిన హైరిస్క్ గ్యాంగ్ చేతిలో మురళి హతమయ్యాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టనర్స్ మధ్య ఆర్థిక లావాదేవీలపై గొడవలు వచ్చినట్లు, అందులో ఎవరైనా మురళి హత్యకు పధకం రచించారా? అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా వ్యాపారాలలో భాగస్వాములైన బిజెపి వాణిజ్య విభాగపు జిల్లా నాయకుడు కొత్తకోట ప్రసాద్(గుడ్ల ప్రసాద్), బుడంకాయల శ్రీనివాస ప్రసాద్, కోరాడ కుమారరాజులతో పాటు కొత్తకోట ప్రసాద్ మేనల్లుడు గుడ్ల సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై దొంగనోట్ల వ్యాపారానికి సంబంధించిన ఆరోపణలు పట్టణంలో గుప్పుమన్నాయి. వీరిని అదుపులోకి తీసుకోగానే వీరితో వ్యాపార సంబంధాలున్న వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగులిడుతున్నాయి. వ్యాపారి హత్య పార్వతీపురం ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఎక్కడెక్కడ నుండో వచ్చిన కొంతమంది వ్యక్తుల దురాశ వలన పార్వతీపురం పేరు పాడవుతోందని, ఎప్పుడూ లేని గన్ కల్చర్ పార్వతీపురంలో నెలకొందని పలువురు పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరాదని, తగిన శిక్షపడాలని కోరుతున్నారు.

ప్రొఫెషనల్ కిల్లర్స్ పనే..!
పార్వతీపురం (రూరల్), జూలై 23: పార్వతీపురంలోని సుమిత్రా డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ పార్టనర్ పట్నాన మురళి హత్యలో ప్రొఫెషనల్ కిల్లర్స్ పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చామని జిల్లా ఎస్పీ జి.పాలరాజు అన్నారు. ఆదివారం ఆయన ఎస్.ఎన్.పి.కాలనీలోని సంఘటన స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా క్లూస్ టీమ్, పార్వతీపురం డిఎస్పీ జి.త్రినాథ, బొబ్బిలి డిఎస్పీ పి.సౌమ్యాలత, సిఐ జి.రాంబాబు, అధికారులతో మాట్లాడి శనివారం రాత్రి జరిగిన హత్యా ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసు దర్యాప్తును ఎస్పీ వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వ్యాపారి హత్యలో ఒడిశాకు చెందిన హైరిస్క్ గ్యాంగ్ పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. ఈ హత్యలో ఇద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్ పాల్గొన్నారన్నారు. వారు హెల్మట్ ధరించి మోటారుసైకిల్‌పై వచ్చి దాదాపు 5 అడుగుల దూరంలో 7.65 కంట్రీమేడ్ గన్‌తో తలపై కాల్పులు జరిపారన్నారు. ఈ హత్యకు సర్వీస్ తుపాకి వాడలేదన్నారు. కంట్రీమేడ్ గన్, తపంచా లాంటివి వాడారన్నారు. హత్యకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆర్థిక లావాదేవీలు, టెక్నికల్ పాయింట్లు, హత్యకు పాల్పడిన వారిని గుర్తించేందుకు, స్థానిక విషయాల కోసం రెండు బృందాలు మొత్తం ఐదు బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. అలాగే వ్యాపారి గత 24 గంటల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఫోన్ సంభాషణ, వ్యాపారికి సంబంధించిన గత చరిత్ర వాటిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. గత కొంతకాలంగా పార్టనర్స్ మధ్య ఆర్థిక గొడవలు జరుగుతున్నాయన్నారు. నోట్లు రద్దు నుండి జరిగిన సంఘటనల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఐదుగురు వ్యాపార భాగస్వాములను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా భావిస్తున్నామన్నారు. త్వరలో హంతకులను పట్టుకుంటామన్నారు. పార్వతీపురంలో జనరల్ పోలీసింగ్ వ్యవస్థను మారుస్తున్నామని, సీసీ కెమెరాల ఏర్పాటును పెంచుతున్నామన్నారు. ఆగస్టులో దీనికి శ్రీకారం చుడుతున్నామన్నారు. పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో పోలీసు పహారా పెంచి వైద్యులు, సిబ్బందికి భద్రత కల్పిస్తామన్నారు.

మున్సిపాలిటీలో ‘్భతా’ళుడు!
విజయనగరం, జూలై 23: విజయనగరం మున్సిపాలిటీలో ఏ పని కావాలన్నా ఆ ‘బేతా’ళుడిని ఆశ్రయించాల్సిందే... అతగాడే వసూలురాజా... మున్సిపాలిటీలో పన్నులు, ఇంజనీరింగ్ విభాగం, పట్టణ ప్రణాళికా ఇలా ఏ రకమైన పనికోసం మున్సిపాలిటీకి ఎవరు వచ్చినా ద్వారపాలకుని మాదిరిగా ప్రధాన ద్వారంవద్ద తిష్టవేసి కూర్చొంటాడు. మీరెవరు? ఎందుకోసం వచ్చారు? ఏ పని చేయాలి? అని ప్రశ్నిస్తాడు. తాము ఫలానా పనికోసం వచ్చానంటే చాలు.. నా చేతిలో మొత్తం పెట్టండి నేను పని పూర్తి చేస్తానని బేరసారాలు చేస్తాడు. ఇక మున్సిపాలిటీలో గత్యంతరం లేక అతనినే ఎక్కువమంది ఆశ్రయిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీతో సంబంధం లేని వ్యక్తి అక్కడ చక్రం తిప్పుతున్నా అధికారులు, పాలకవర్గం అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. దీంతో ఆయన ఆడిందే ఆటగా పనులు సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వేళ మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కార్యాలయానికి వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు అతని కంట పడకుండా పక్కకు తప్పుకోవడం అతని నైజం. అక్కడకు ఎవరు వెళ్లినా వంగి వంగి దణ్ణాలు పెట్టడం, తరువాత వారికి పంగనామాలు పెట్టడం అతని నైజం. అతని రోజువారీ మామూళ్లు ప్రభుత్వ ఉద్యోగి నెలవారి జీతం కంటే ఎక్కువగా ఉంటుందన్నదీ నమ్మలేని నిజం. రోజువారీ కలెక్షన్ రానిదే ఆ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లడని అక్కడ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీలో అటువంటి దళారుల బెడద లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

రణరంగం మొదలైనట్టే!
విజయనగరం, జూలై 23: మరో ఏడాదిన్నర కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ఎలాగైనా అధికారంలో కొనసాగాలన్న కాంక్షతో టిడిపి ఉండగా, తాము మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో వైకాపా నేతలు ఉన్నారు. ఇదిలా ఉండగా ఈసారి పొత్తు లేకుండానే బిజెపి ఒంటరిగా బరిలో దిగేందుకు అవసరమైన సైన్యాన్ని సన్నద్ధం చేసుకోవాలన్న ఆలోచనలో బిజెపి ఉంది. దీంతో అందరి దృష్టి పోలింగ్ బూత్‌లపై పడింది. గతంలో మాస్ క్యాంపయిన్ నిర్వహించగా, ఈ సారి అలాగాకుండా నేరుగా ఓటర్లను కలుసుకొని తమ వైపునకు తిప్పుకోవాలన్న యోచనలో పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇందులో బిజెపి ముందు వరుసలో ఉండగా తెలుగుదేశం, వైకాపాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి.
ఈసారి ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే విషయమై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇదిలా ఉండగా బిజెపి కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడలో నిర్వహించిన సమావేశంలో పార్టీ బూత్ కమిటీ ఇన్‌ఛార్జిలతో సమావేశం నిర్వహించి ఓటర్లను నేరుగా కలుసుకొని పార్టీ కార్యక్రమాలను వివరించడం ద్వారా వారిని పార్టీపట్ల ఆకర్షితులను చేయాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లోనూ పార్టీకి చెందిన ఓటర్లు కనీసం 50-100 తగ్గకుండా ఉండేలా చూడాలన్నారు. మొదటి దశలో పోలింగ్ బూత్‌కు 30 మందిని సభ్యులుగా చేర్పించాలన్నారు. వారందరికీ ఓటు హక్కు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వ పథకాలు అమలుచేస్తున్నా క్షేత్ర స్థాయిలో పార్టీకి ఆశించినంత పేరు లభించకపోవడం పట్ల పార్టీ అధినేత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందువల్లనే ప్రభుత్వంతోపాటు పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను గ్రామస్థాయిలో ప్రచారం చేపట్టాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా వైకాపా నేతలు అధికార పార్టీ వైఫల్యాలను వెలుగులోకి తెచ్చి ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవాలన్న ఆలోచనతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణలు ఎప్పటికపుడు విలేఖరుల సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. ఈవిధంగా జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. దీంతో ఇక్కడ రాజకీయం వేడెక్కింది.

అదును దాటుతున్నా అందని రుణాలు!
విజయనగరం, జూలై 23: జిల్లాలో ఖరీఫ్‌లో రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ పలుమార్లు కోరినా బ్యాంకర్లు మాత్రం పాత పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రైతులు ఇప్పటికే నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో రైతులకు రుణం మంజూరు చేస్తే పంటలు సాగు చేసుకునేందుకు వీలుఉంటుంది. సీజన్ దాటిన తరువాత రుణాలు మంజూరు చేసినా దానివల్ల ఫలితం ఉండదు. ఈ ఏడాది మొత్తం రూ.1850 కోట్లు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు కేవలం రూ.250కోట్లు మాత్రమే పంపిణీ చేశారని సమాచారం.
ప్రస్తుతం జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో రైతులకు రుణాలు మాఫీకాకపోవడం వల్ల దాదాపు లక్ష మంది రైతులు రుణాలు పొందడానికి అర్హత కోల్పోయారు. మిగిలిన వారితోపాటు, కౌలు రైతులకు కూడా రుణాలను అందజేయాలని బ్యాంకర్లకు సూచించారు. కౌలుదారులకు రుణ అర్హత కార్డులు ఉన్నప్పటికీ బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నాయి. మరోపక్క ఫసల్ బీమా యోజన పథకం కింద పంట రుణాలు తీసుకోని వారు ఈ నెలాఖరులోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకం వర్తించాలంటే పంట సాగుకు ఉపక్రమించిన దశలోనే చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు కొద్దిమంది మాత్రమే బీమా ప్రీమియం చెల్లించారు. వీరి సంఖ్య వందలలోనే ఉంది.
ఇటువంటి పరిస్థితిలో బ్యాంకర్లు రుణాల మంజూరుకు ముందుకు రాకపోతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది. ప్రతీయేటా రైతులకు వ్యవసాయ రుణాలు అందజేస్తున్నప్పటికీ, బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వాటిని కూడా వ్యవసాయ రుణాలుగా చూపడం వల్ల వారు పంట నష్టపరిహారం పొందడానికి వీలులేకుండా పోతుంది. మరోపక్క బ్యాంకర్లు మాత్రం వ్యవసాయానికి పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేశామని చెప్పుకునేందుకు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న మొత్తాన్ని రైతులకు పంట రుణాలుగా చూపుతున్నారు. ఈ విధంగా బ్యాంకర్లు రైతులకు రుణాలు మంజూరులో తమ చుట్టూ తిప్పుకోవడం తప్ప పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక దృష్టిసారిస్తే తప్ప రైతులకు పంట రుణాల సకాలంలో అందే పరిస్థితి కానరావడం లేదు.