కృష్ణ

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 23: శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ణ త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపటంతో పాటు అందుకు సహకరించేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. బెల్టు అమ్మకాలపై ఎక్సైజ్ శాఖాధికారులతో పాటు పోలీసులు కూడా జిల్లా వ్యాప్తంగా నిర్ధిష్ఠమైన ప్రణాళికతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ఎక్కడైనా బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్యానికి బానిసలై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మద్యం దుకాణాల్లో మైనర్లకు విక్రయాలు జరుపుతున్నట్లు తెలిస్తే సహించేది లేదన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా మద్యం సేవించే వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్ల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలన్నారు. తమ పిల్లలు ఎటువంటి పోకడలకు పోతున్నారని అణుక్షణం గుర్తించి సన్మార్గం వైపు నడిపించేలా కృషి చేయాలని కోరారు. ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మంది మైనర్లు ఉండటం బాధాకరమని ఎస్పీ త్రిపాఠి పేర్కొన్నారు.
ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు చర్యలు
కంచికచర్ల : త్వరలో నందిగామలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా ఎస్‌పి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందుకోసం ట్రాఫిక్ నియమాలపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. కంచికచర్ల, నందిగామ పోలీస్‌స్టేషన్‌ల పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి వి ఉమామహేశ్వరరావు, రూరల్ సిఐ సత్యకిషోర్, ఎస్‌ఐ ఈశ్వరరావులు పాల్గొన్నారు.

బొడ్డపాడు తరలి వచ్చిన జిల్లా అధికారులు
తోట్లవల్లూరు,జూలై 23: మండలంలోని బొడ్డపాడుకు ఆదివారం వివిధ జిల్లాస్థాయి అధికారులు తరలి వచ్చారు. ప్రజలు జ్వరాల బారిన పడుతుండటంతో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దాలని నివేదికలు ఇవ్వాలని కోరటంతో అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. సబ్‌కలెక్టర్ ఎస్ హరీష్‌రావు, డిఎంఅండ్‌హెచ్‌ఓ టివిఎస్‌ఎన్ శాస్ర్తీ, ఇన్‌చార్జి డిపిఓ ఎస్‌ఎల్ ఆనంద్‌బాబు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ టి శ్రీనివాసరావు, జిల్లా మలెరియా అధికారి ఆదినారాయణ, డిఎల్‌పిఓ కెపి చంద్రశేఖర్ ఆదివారం ఉదయం బొడ్డపాడును సందర్శించారు. రోగులకు వైద్యం అందిస్తున్న పీహెచ్‌సీ డాక్టర్లు గోపాలనాయక్, వేణుగోపాల్‌తో సమావేశమై జ్వరాలపై చర్చించారు. ఇప్పటి వరకు జ్వరాలకు గురైన బాధితుల వివరాలు, రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, ఇద్దరు వ్యక్తుల మృతికి కారణాలపై డాక్టర్ల నుంచి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ నిమ్మగడ్డ సీతారాంబాబు, తహశీల్దార్ భద్రు, ఈఓపిఆర్‌డి ఎ అరుణకుమారి, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ కనగాల వెంకట సత్యనారాయణ (చంటి), కార్యదర్శి డి రమాదేవి గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య చర్యలను అధికారులకు వివరించారు. అనంతరం విలేఖరులతో సబ్ కలెక్టర్ హరీష్‌రావు, డిఎంఅండ్‌హెచ్‌ఓ శాస్ర్తీ మాట్లాడుతు గ్రామంలో జ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. కొందరు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. డెంగీవ్యాధి, స్క్రబ్ టైఫీన్ జ్వరాలు లేవని శాస్ర్తీ స్పష్టం చేశారు. అయితే జ్వరం సోకిన వారికి డెంగీ ప్రాథమిక పరీక్ష (ఎస్‌ఎస్‌ఓ 1) బొడ్డపాడు సబ్ సెంటర్‌లో చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు, అందుచేత ఎవరూ భయపడి విజయవాడ వెళ్ళవద్దని డిఎం అండ్ హెచ్‌ఓ సూచించారు. ఎస్‌ఎస్‌ఓ 1 పరీక్షలో డెంగీ పాజిటీవ్ వస్తే అపుడు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని సబ్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

అపరిశుభ్రత.. అంటువ్యాధులు
విజయవాడ (కార్పొరేషన్), జూలై 23: అంటువ్యాధులు వ్యాప్తికి ఆలవంగా ఉన్న నగర పరిసరాలలో ప్రజారోగ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. రోజు రోజుకూ నమోదవుతున్న జ్వర పీడుతుల సంఖ్యను పరిశీలిస్తే నగర పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం పరిరక్షణతోపాటు జ్వరాల వ్యాప్తికి ప్రధాన కారణమైన దోమల నియంత్రణ చర్యలు సత్ఫలితాలివ్వడం లేదు. దీంతో నగరంలో రోజు రోజుకూ దోమ కాటుకు గురై అనారోగ్యం పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్స్‌లో నమోదవుతున్న సంఖ్యను పరిశీలిస్తే దోమ కాటు ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు. వైరల్ జ్వరాలే కాకుండా ప్రాణాంతకమైన డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు కూడా అక్కడక్కడా నమోదవుతున్నాయి. దోమల నుంచి తప్పించుకోలేక లక్షలాది ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. సాయంత్రం, రాత్రి వేళల్లోనే కాక పట్టపగలు సైతం ఇళ్లలోనూ, ఆరు బయట పరిసరాల్లోనూ తిరుగాడుతున్న దోమలు ప్రజారోగ్యానికే కాక అధికారులు చేపడుతున్న దోమల నిర్మూలనా చర్యలకు సవాల్‌గా నిలుస్తున్నాయి. ఏటా విఎంసికి జమ అయ్యే వార్షిక ఆదాయంలో ఉద్యోగుల జీతాల చెల్లింపుల తరువాత అత్యధికంగా ఖర్చు చేసేది ప్రజారోగ్యానికే. పరిసరాల పరిశుబ్రత, సైడ్ డ్రైన్లల శుబ్రం, రోడ్ల శుభ్రంతోపాటు గ్యాంగ్ వర్క్‌తో సామూహిక చర్యలు చేపట్టడం ఈశాఖ ముఖ్యమైన పని. దోమల నియంత్రణకు మలేరియా విభాగం కూడా ప్రత్యేకంగా ఉంది. మలేరియా విభాగంలో అపాయింట్ అయిన సిబ్బంది సంఖ్య, పనిచేసే సిబ్బందిని పోల్చితే మొత్తం సిబ్బంది సంఖ్య కన్నా పనిచేసే సంఖ్యకు చాలా వ్యత్యాసముంటుంది. పలువురు సిబ్బంది మురుగుకాల్వల్లో పనిచేయడానికి ఇష్టం లేక తమ పలుకుబడితో డెప్యూటేషన్‌పై ఇతర విభాగాల్లో పనిచేస్తూ కాలక్షేపం చేస్తున్నారంటే అతిశయోక్తిగా ఉంటుంది. మలేరియా విభాగంలో ప్రధానమైన పని కాల్వలో దోమలు మందు చల్లడం, సాయంత్రం వేళల్లో ఫాగింగ్ చేయడం, తోపాటు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో స్పెషల్ డ్రైవ్ కింద ఎక్కడైన కేసులు నమోదైతే ఆయా ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దోమల నిర్మూలన చేయడమే. నగరంలో దోమల నియంత్రణకు గాను సంవత్సరానికి ఖర్చు చేసేది రమారమి కోటి వరకూ ఉంటుందని అంచనా. దోమను గుడ్డుస్థాయిలోనే నిర్మూలించేందుకు గాను చేపట్టే యాంటి లార్వా ఆపరేషన్‌కు వినియోగించే ఎబేట్, ఎంఎల్ ఆయిల్‌కు రూ.46లక్షల 60వేలు కాగా ఎగిరే దోమల నియంత్రణకు వినియోగించే ఎంఎల్‌టి టెక్, పైరత్నం మందులకు రూ.40లక్షల 41వేలు ఖర్చవుతుందన్నది అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇవి కాక ప్రతి సంవత్సరం అవుట్ ఫాల్ డ్రైన్లలో మురుగు పూడికతీత కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి నీటి పారుదల ఉంటే దోమ ఉత్పత్తి జరగదు. కానీ కోట్లు ఖర్చు చేసి డ్రైన్లలో పూడికలు తీయించినా మురుగునీటికి ఎక్కడా సక్రమ పారుదల కనిపించదు. దోమల నియంత్రణకు లక్షలు కాదు కోట్లు ఖర్చు చేసినా ఒక్క శాతమైనా దోమల ఉత్పత్తి తగ్గదు. చేస్తున్న ఖర్చుకు తగిన ఫలితాలను చూడాలనుకోవడం అత్యాశేఅవుతుంది. నగర వ్యాప్తంగా ఉన్న 59 డివిజన్లు, వాటిలో పనిచేసే పారిశుద్ధ్య, మలేరియా సిబ్బంది, వారిని పర్యవేక్షించే అధికారిక బృందం తదితర అంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యమేస్తుంది. కోట్లు ఖర్చవుతున్నా ఫలితం సున్నా అంటే అది ప్రజారోగ్యశాఖ పనేనని చెప్పవచ్చు. ఆశ్చర్యమేమిటంటే కార్పొరేషన్‌లో అత్యున్నత స్థాయి ఉద్యోగమైన కమిషనర్ జీతం కన్నా రోడ్లు, మురుగు కాల్వల శుభ్రం చేసే కొంతమంది సిబ్బంది జీతమే ఎక్కువ. అంత పెద్ద మొత్తంలో జీతాలు తీసుకునే సిబ్బంది క్షేత్రస్థాయి విధులలో కనిపించరు. అడుగడుగునా అవినీతి అక్రమ చర్యల కారణంగా నగరం మురికి పట్టిపోతోంది. ఇదిలావుండగా నగరపాలక సంస్థ కమిషనర్ నివాస్ ప్రజారోగ్యశాఖాధికారులతో కలిసి ప్రతిరోజూ చేపట్టే నగర పర్యటనలో పరిసరాల పారిశుద్ధ్య పరిశీలనే ప్రధాన అంశం. ఈ సందర్భంగా కమిషనర్ ఇచ్చే సూచనలు, ఆదేశాలు ఏమాత్రం అమలు కావన్నది జగమెరిగిన సత్యం. హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లోనే పారిశుద్ధ్యం, మురుగుపారుదల, వర్షం నీటి ముంపు తదితరాలు ఉంటుండగా ఇక నగర పరిస్థితికి ఇంతకన్నా చేసేది లేదంటూ బహిరంగంగానే ప్రజారోగ్యశాఖాధికారులు చేస్తున్న వాదన గమనార్హం. ప్రధాన రాహదారులు సైతం గంటల తరబడి వర్షం నీటి ముంపునకు గురవుతుంటే ఇక లోతట్టు ప్రాంతాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. లోతట్టుగా ఉండే ఖాళీ స్థలాల్లో దోమల వృద్ధిని నియంత్రించడం సాధ్యం కాదంటూ గట్టిగా చెబుతున్న అధికారుల తీరుతో నగర ప్రజలు దోమ కాటు నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఏటా విఎంసి ఖర్చు చేసే దాని కన్నా 10 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తూ నగర ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణకు మస్కిటో కాయిల్స్, దూబ్ స్టిక్స్‌తోపాటు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులను వినియోగించుకొంటూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు.

కార్పొరేషన్ స్కూల్స్‌కు డిజిటల్ హంగులు
విజయవాడ (కార్పొరేషన్), జూలై 23: కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా కార్పొరేషన్ స్కూల్స్‌ను తీర్చిదిద్దుతామన్న రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానం నేడు కార్యరూపంలోకి రాబోతోంది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతో డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం సోమవారం ఉదయం నగరంలోని సివిఆర్ స్కూల్లో ఏర్పాటు చేసిన టీచింగ్ స్టూడియోను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన విజయవాడ నగరపాలక సంస్థ మొత్తం 28 హైస్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి 14 పాఠశాలలో ఈ క్లాస్ రూమ్‌లు సిద్ధం కాగా మరికొద్దిరోజుల్లో మిగిలిన స్కూల్స్‌లలో కూడా డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాట్ల పూర్తికి కసరత్తు చేస్తున్నారు. నిపుణులైన ఉపాధ్యాయుల కొరత ఉన్న నేపథ్యంలో విఎంసి పాఠశాలలో కూడా తెలుగు మీడియంను రద్దు చేసి ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుపుతున్న ప్రస్తుత తరుణంలో ఇంగ్లీష్ మీడియం బోధించే ఉపాధ్యాయుల కొరత మరింత ఎక్కువైంది. ఈ తరుణంలో డిజిటల్ క్లాస్ రూమ్‌లతో ఈ కొరత తీరనున్నదనే చెప్పాలి. పేద, మధ్యతరగతి, నిరుపేద విద్యార్థులు ఎక్కువగా విద్యాభ్యాసం చేసే విఎంసి పాఠశాలల్లో మెరుగైన విద్యను అందుబాటులోకి తెస్తున్న నగర పాలకులు ఇప్పటికే ఫౌండేషన్ కోర్సులను ప్రవేశపెట్టి ఉత్తమ ఫలితాలను సాధిస్తుండగా ప్రస్తుతం ప్రారంభిస్తున్న డిజిటల్ క్లాస్ రూమ్ మరింత మెరుగైన విద్యాబోధన అందుటులోకి వస్తుందనే చెప్పాలి. ఫౌండేషన్ కోర్సులు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటులో మున్సిపల్ మంత్రి నారాయణ కృషి నిరుపమానమన్నది అక్షర సత్యం.

చంద్రబాబు పాలనలో దమననీతి
విజయవాడ (కార్పొరేషన్), జూలై 23: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దమననీతి సాగుతోందని, కులా లు, వర్గాల వారీగా విభజించిన ఆయన ఒకే రాష్ట్రంలో 2 రకాల న్యాయాన్ని పా టిస్తున్న తీరు హేయమని తెలంగాణా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు పేర్కొన్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన చలో అమరావతి పాదయాత్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కాపు రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గాంధీనగర్‌లోని కందుకూరు విఎంసి కల్యాణ మండపంలో చేపట్టిన సంఘీభావ సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న హనుమంతరావు మా ట్లాడుతూ కాపు రిజర్వేషన్ల సాధనకై ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం చేపట్టిన చలో అమరావతి పాదయాత్రపై చంద్రబాబు అనుసరిస్తున్న అణిచివేత కార్యకలాపాలు అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. ఉమ్మడి రా ష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో చంద్రబా బు చేపట్టిన పాదయాత్రకు నాటి కాం గ్రెస్ ప్రభుత్వం అనుమతించకపోతే నిరాటంకంగా చేసేవాడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వివిధ పార్టీలు, వర్గా లు చేపడుతున్న యాత్రలు, కార్యక్రమాలకు అనుమతిస్తూ కేవలం ఒక్క కాపు ఉద్యమ పాదయాత్రకే అనుమతులివ్వకపోవడం ఆయన దమననీతికి నిదర్శనమన్నారు. కాపుల విషయంలో ఇప్పటికే తీరని అన్యాయం చేసిన చం ద్రబాబు ఇప్పటికైనా తన తప్పిదాన్ని తెలుసుకోకపోతే తగిన గుణపాఠం చెప్పకతప్పదని పిలుపునిచ్చారు. మాజీ ఎంపి హర్షకుమార్ మాట్లాడుతూ అగ్రకులాలకు తప్ప చంద్రబాబు మిగిలిన దళిత, బడుగ, బలహీన వర్గాలకు సిఎంగా లేడని, ఇందుకు గరికపర్రులో జరిగిన దళిత ఉదంతమే నిదర్శనమన్నారు. కాపు రిజర్వేషన్ కల్పన విషయంలో టిడిపి ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం తన హామీలను విస్మరించిన నేపథ్యంలోనే ఇటువంటి సామాజిక ఉద్యమాలు తలెత్తుతాయన్నారు. కులాలు, ప్రాంతాల వారీగా విభజించి పాలిస్తూ అదే రీతిగా రాయితీలు కల్పిస్తున్న చంద్రబాబు పాలనలో అట్టగుడు వర్గాల అభ్యున్నతి నానాటికీ దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నగర కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌కుమార్ మాట్లాడుతూ కాపుల అభ్యున్నతి కాంగ్రెస్ పాలనలో జరిగిందని, కాంగ్రెస్‌కు కాపులకు ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదన్నారు. రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న కాపునేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన చలో అమరావతికి నగర కాంగ్రెస్ తరఫున పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా పాదయాత్రలో భాగస్వామ్యమవుతుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కాపు సెల్ కన్వీనర్ లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ కాపులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత ఏ పార్టీలోనూ ఇవ్వలేదని, కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కాపుల చిరకాల కోరికైన రిజర్వేషన్ అమలు విషయం అనుసరిస్తున్న ద్వంద నీతి కాపులను మరింత కలచివేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపు రిజర్వేషన్ పై చంద్రబాబు ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు సాధించే వరకూ కాంగ్రెస్ కాపు సెల్ నిరంతర ఉద్యమం చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జ్ మస్తాన్‌వలీ, సెంట్రల్ నిజయోజకవర్గ ఇన్‌చార్జ్ వి గురునాథం, నరహరశెట్టి నరసింహరావు, గంగిశెట్టి బాబూరావు, మిరియాల రామకృష్ణ, పక్కాల సూరిబాబు తదితరులు పాల్గొన్న ఈ సభలో ముద్రగడ పాదయాత్రను సంపూర్ణ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నేడు సిఎంచే విద్యావాణి ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 23: ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు సోమవారం స్థానిక సివిఆర్ స్కూల్ ప్రాంగణంలో విద్యావాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని జలవనరుల శాఖ మంత్రి దే వినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాం తం, మేయర్ కోనేరు శ్రీ్ధర్‌లతో కలిసి విద్యావాణి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా వివరాలను తెలుపుతూ విద్యావాణిలో భాగంగా వర్చువల్ క్లాస్ రూమ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించడం జరుగుతుందన్నారు. 28 పాఠశాలలకు చెందిన విద్యార్థులతో వర్చువల్ క్లాస్ రూమ్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులతో సంభాషించడం జరుగుతుందన్నారు. రియల్ టైమ్ గవర్నెస్‌లో భాగంగా వర్చువల్ క్లాస్ రూంల విధానంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం జోడించి విద్యాబోధన జరుగుతుందన్నారు. కలెక్టర్ బి లక్ష్మీకాంతం మాట్లాడుతూ సిట్ కార్యక్రమాన్ని మున్సిపల్ మంత్రి పి నారాయణ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. విజయవాడ కోర్టు భవనాల ఎదురుగా గల సివిఆర్ స్కూల్ నందు ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటలకు నిర్వహించడంతోపాటు అనంతరం ముఖ్యమంత్రి ఇతర ప్రజాప్రతినిధుల ప్రసంగాలు ఉంటాయని కలెక్టర్ వివరించారు.

మంగళగిరిలో రైఫిల్ షూటింగ్ శిక్షణకు ఏర్పాట్లు
విజయవాడ (స్పోర్ట్స్), జూలై 23: మంగళగిరిలో రైఫిల్ షూటింగ్ శిక్షణకు షూటింగ్ రెంజ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ గౌతంసవాంగ్ హామీ ఇచ్చారు. హైదరబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 2నుండి 6వరకు రాష్టస్థ్రాయి షూటింగ్ పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆదివారం నగరంలోని హోటల్ ఫార్చూన్ మురళిలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్ర మం జరిగింది. ఈకార్యక్రమానికి అతిథులుగా నరసాపురం ఎంపీ జి గంగరాజు, సిపి గౌతం సవాంగ్‌లు పాల్గొని విజేతలకు పతకాలను అందజేశారు. ఈసందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ తాను హైదరాబాద్‌లో డిసిపిగా ఉన్నప్పుడు షూటింగ్ రెంజ్‌ను అభివృద్ధి చేయటంతో పాటు సెక్యూరిటీని అందజేయడం జరిగిందన్నారు. 2002 జాతీయక్రీడల నిర్వహణలో భాగంగా గచ్చిబౌలిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు షూటింగ్ రేంజ్‌ని ఏ ర్పాటు చేయడం జరిగిందని, షూటింగ్‌లో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం శుభపరిణామమన్నారు. మాజీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, ఎంపీ జి గంగరాజు మాట్లాడుతూ జిల్లాలో రైఫిల్ అసోసియేషన్‌కు రైఫిల్స్ అందుబాటులో ఉన్నాయని, జిల్లా మాజీ రైఫిల్ సంఘ కార్యదర్శి జిఎస్ రాజు కొనుగోలు చేసిన రైఫిల్ అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షుడు జివికె రంగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రైఫిల్ పోటీల నిర్వహణకు అనువైన ప్రదేశం లేకపోవడంతో హైదరాబాద్‌లో పోటీల నిర్వహణ చేయాల్సి వచ్చిందని, ముఖ్యమంత్రికి రైఫిల్ రెంజ్ ఏర్పాటు చేయాలని అసోసియేషన్ తరపున కోరడం జరుగుతుందని పేర్కొన్నారు.

రైతుబజార్లలో డిజిటల్ ధరల బోర్డులు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 23: రైతు బజార్లలో కూరగాయల ధరలను తెలిపే ఎలక్ట్రానిక్ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు అనుమతి లేకుండా ఎక్కు వ మొత్తంలో కూరగాయలను తరలించే వారిపై క్రిమినల్ కేసులు నమో దు చేయడం జరుగుతుందని కలెక్టర్ బి లక్ష్మీకాంతం హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 21 రైతు బజార్లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కూరగాయల ధరల వివరాలను తెలియజేసే విధంగా ఎలక్ట్రానిక్ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతుబజార్లలోని స్టాల్స్‌లలో ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇటీవల రైతుబజార్లలోని పెద్ద మొత్తంలో కూరగాయలు తరలి వెళుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని, వీటిపై సంబంధిత రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లు చర్యలు చేపట్టాలన్నారు. దళారీ వ్యవస్థను ఎటువంటి పరిస్థితుల్లో సహించేదిలేదని, అసలైన కార్డు కలిగిన అర్హుదారులు మాత్రమే అమ్మకాలు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు.

రైల్వేస్టేషన్‌లో ఉర్దూలో బోర్డులు
విజయవాడ (రైల్వేస్టేషన్), జూలై 23: రైల్వేస్టేషన్ నందు ముస్లిం ప్రయాణికులకు అర్థమయ్యేలా ఉర్దూలో బోర్డు ఏర్పాటు చేసినందుకు రైల్వేబోర్డు అధికారులకు టిడిపి మైనార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కేశినేని భవన్‌లో పలువురు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ముస్లిం సోదరులకు టిడిపి ఎప్పుడు వెన్నంటి ఉంటుందని, ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా కేశినేని నాని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇర్ఫాన్, మైనార్టీ ఫైనాన్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ మోహిద్దిన్, మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు ఫిరోజ్, కో-ఆప్షన్ సభ్యులు ఫతావుల్లా, నాయకులు అన్సార్, బాషి తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మకు ఆషాడం సారె సమర్పణ విజయవంతం
ఇంద్రకీలాద్రి, జూలై 23: దేవస్థానంలో మొట్ట మొదటిసారిగా ప్రారంభించిన అమ్మ వారికి ఆషాడం సారె సమర్పణ విజయవంతం కావడం అమ్మవారి కృపకు నిదర్శనమని, రెండు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో దుర్గమ్మను దర్శించుకున్నారని దుర్గగుడి కార్య నిర్వహణాధికారి ఏ సూర్యకుమారి అన్నారు. ఆదివారం సాయంత్రం సిబ్బంది అమ్మవారికి ఆషాడం సారె సమర్పించిన కార్యక్రమంలో ఇవో మాట్లాడారు. పాలపొంగళ్లు, పసుపు, కుంకుమలు, గాజులు, వస్త్రాలతో పాత మెట్లమార్గంలో కార్య నిర్వహణాధికారి దంపతులు, సిబ్బంది కుటుంబ సభ్యులు ఇంద్రకీలాద్రిని చేరుకుని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించారు. జూన్ 25నుండి వివిధ ప్రాంతాల నుండి అమ్మవారికి సారె రాగా, ఆదివారం ఆషామాసం ముగింపు సందర్భంగా దేవస్థానం నుండి అంగరంగ వైభవంగా సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు వెలగపూడి శంకరబాబు, కోడెల సూర్యలత, దేవస్థాన సహాయక కార్య నిర్వహణాధికార్లు అచ్చుతరామయ్య, రామమోహనరావు, ప్రసాద్, తిరుమలేశ్వరరావు, సూపరిండెంట్లు అనకాపల్లి ప్రసాద్, ఎన్ రమేష్, గుమస్తాలు బలరాం తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సిద్ధా రాఘవరావు సందర్శన
దుర్గమ్మ దర్శనార్థం ఆదివారం ఉదయం రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యులతో విచ్చేయగా సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో దుర్గమ్మ దర్శనం చేయించి, దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులచే ఆశీస్సులు, అమ్మవారి శేషవస్త్రం, అమ్మవారి చీరె, అమ్మవారి చిత్రపటం, అమ్మవారి లడ్డూ ప్రసాదం అందజేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు వెలగపూడి శంకరబాబు, కోడెల సూర్యలత, జి పద్మశేఖరరావు, ఈదే సాంబశివరావు, ఆలయ అభివృద్ధి గురించి మంత్రికి వివరించారు.

రాజరాజేశ్వరిపేటలో అనుమానితుల ఇళ్ల గాలింపు
పాయకాపురం, జూలై 23: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షణ మరియు వివిధ దొంగతనాల నివారణ చర్యలో భాగంగా చెడు నడత కలిగిన వ్యక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే వారిపై కార్డన్ సెర్చ్‌లను ఆయా పోలీసు స్టేషన్ల పరిధిల్లో నిర్వహించడం జరుగుతోంది. దీనిలో భాగంగా అజిత్‌సింగ్ నగర పోలీసు స్టేషన్ పరిధి రాజరాజేశ్వరిపేటలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించి చెడు నడత కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లు, పాత నేరస్థులు గురించి సమగ్ర సమాచారం సేకరించారు. అలాగే ప్రస్తుతం వారి నడవడిక, కార్యకలాపాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం జరిగింది. మొత్తం 464 మంది వ్యక్తులను విచారించిన క్రమంలో అందులో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 4 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. కార్డెన్ సెర్చ్‌లో లా అండ్ ఆర్డర్ డిసిపి-2 కాంతి రాణా టాటా ఆధ్వర్యంలో నార్త్‌జోన్ ఏసిపి కె శ్రావణి, సౌత్‌జోన్ ఏసిపి కె శ్రీనివాసరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.