గుంటూరు

నీచ రాజకీయాలకు చిరునామా వైసిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జూలై 23: రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నా దాని కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెడుతూ నీచ రాజకీయాలకు వైసిపి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా, పర్చూరు మండలం, దేవరపల్లి గ్రామంలోని చెరువు భూములకు సంబంధించిన వ్యవహారంలో వైసిపి రాజకీయాలు చేస్తుందని, ఆ గ్రామంలో చెరువుపూడిక తీయడం వలన తాగునీటి సౌకర్యం అందుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం మంచి పనికి శ్రీకారం చుడితే, ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో వైసిపి నాయకులు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అక్కడ సాగు చేసుకుంటున్న దళితులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడుతుందన్నారు. దళితుల ముసుగులో కులాల కుంపట్లు రాజేసేందుకు వైసిపి ప్రయత్నిస్తుందని, దళితుల భూములను లాక్కున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి ఇడుపులపాయలకు రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు. రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి, జగన్మోహనరెడ్డిలు దళితుల భూములను అప్పనంగా కాజేయడం కోసమే అధికారం కోసం తాపత్రయ పడ్డారే తప్ప ఏనాడూ ప్రజాసంక్షేమం కోరి కాదన్నారు. భూములు కాజేయడం మూడు తరాల నుండి వారికి సంస్కృతిగా కొనసాగుతుందని విమర్శించారు. ఇడుపులపాయలో మూడు వేల ఎకరాల దళితుల భూమిని కాజేసినట్లు తమ పార్టీకి చెందిన నేతలు కోర్టును ఆశ్రయించడంతో కొంతభూమిని వైఎస్ పేదలకు పంచారని గుర్తుచేశారు. వైకాపాకు వామపక్షాలకు చెందిన కొందరు నాయకులు తొత్తులుగా వ్యవహరించి వ్యాఖ్యలు చేస్తున్నారని, సిపిఎం పార్టీకి చెందిన రాఘవులు ఆరోపణలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సంక్షేమం కోసం అంబేద్కర్ విద్యోన్నతి, చంద్రన్నబాట, గోరుముద్దలు, విద్యుత్ రాయితీలు,తక్కువ వడ్డీకే రుణాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. దళితుల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి దళితులను దూరం చేయాలన్న దురుద్దేశంతో వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా దళితులు టిడిపిని అంటిపెట్టుకునే ఉంటారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.
కాపుల కదలికలపై నిఘా
మంగళగిరి, జూలై 23: కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన చలో అమరావతి పాదయాత్ర నేపధ్యంలో మంగళగిరి ప్రాంతంలో కాపుల కదలికలపై పోలీసు యంత్రాంగం నిఘా పెట్టింది. పాదయాత్ర సందర్భంగా ముద్రగడకు మద్ధతుగా ఎవరైనా కార్యక్రమాలు చేస్తారేమోనని పోలీసు, ఇంటిలిజెన్స్, స్పెషల్‌బ్రాంచ్ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసం మంగళగిరి నియోజకవర్గంలోనే ఉండటంతో కాపులు ఎటువంటి చర్యలకు దిగుతారోనని పోలీసు యంత్రాంగానికి కంటిమీద కునుకు కరువైంది. ఈనెల 7వ తేదీన మాదిగ కురుక్షేత్ర సభకు అనుమతి ఇవ్వక పోయినప్పటికీ పెద్దసంఖ్యలో మాదిగ యువకులు ఊహించని విధంగా 16వ నెంబర్ జాతీయ రహదారిపైకి చేరి ట్రాఫిక్ నిలిపివేసి ఆందోళన జరిపిన సంగతి తెలిసిందే. మాదిగల ఆందోళన పోలీసు, నిఘా వర్గాల వైఫల్యంవల్లే జరిగిందని ప్రభుత్వం నుంచి అక్షింతలు పడటంతో ముద్రగడ పాదయాత్ర విషయంలో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ముద్రగడ ఆందోళన జరిపినప్పుడు పళ్లాలు, గంటెలు మోగించిన కాపుల పేర్లు సేకరించి వారి కదలికలపై నిఘా పెట్టారు. కొంతమంది నేతలకు పోలీసులు హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ముద్రగడ పాదయాత్రకు అనుకూలంగా ఎటువంటి కార్యక్రమాలు చేసినా కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. అడుగడుగునా వాహనాల తనిఖీ చేస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలోకి వచ్చే ఇతర ప్రాంతాల వాహనాలు తనిఖీచేసి అందులో ప్రయాణిస్తున్నవారి ప్రాంతం, కులం ఆరా తీస్తున్నారు. తుని ఘటన నేపధ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు హెచ్చరికల నేపధ్యంలో కొందరు కాపులు వెనక్కు తగ్గుతున్నా మరికొందరు పాదయాత్ర ఆగబోదని చెప్తున్నారు.

కాపులను చులకన చేస్తున్న ముద్రగడ
మంగళగిరి, జూలై 23: కాపుల సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే ఓర్వలేని ముద్రగడ పద్మనాభం లాంటివారు అల్లరి చేస్తూ కాపులను చులకన చేస్తున్నారని, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. మండల పరిధిలోని ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్ ప్రాంగణంలో కాపు కార్పొరేషన్, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన స్వయం ఉపాధి పొందే కాపులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి కార్లు కొనేందుకు రుణాలు మంజూరు చేసిన సందర్భంగా ఇచ్చిన శిక్షణ ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవితో కలిసి రామానుజయ సర్ట్ఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చైర్మన్ రామానుజయ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం తనకు దగ్గిర బంధువని, ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున ఆయనను చూసేవాడ్నని, ఐతే ముఖ్యమంత్రి కాపులకు చేస్తున్న మంచి పనులన్నీ తనవల్లే వచ్చాయని చెప్పుకునే స్థితికి ముద్రగడ దిగజారాడని ఆరోపించారు. ముద్రగడ రిజర్వేషన్లు అడుగుతున్నాడని, అవి ఇచ్చేందుకు చంద్రబాబే సిద్దంగా ఉన్నాడని, మంజునాధ కమిటీని వేయటం జరిగిందని, ఈ ఏడాది చివరికల్లా కాపులను బీసీలుగా చూస్తామని రామానుజయ అన్నారు. కార్పొరేషన్ ద్వారా 80 వేల మందికి రుణాలు మంజూరు చేసి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించామని, ఈ ఏడాది మరో 64 వేల మందికి రుణాలిస్తున్నామని, 400 మందిని విదేశాలకు పంపించామని, ఈ ఏడాది వెయ్యి మందిని విదేశాలకు పంపేందుకు సిద్దంగా ఉన్నామని ఆయనన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు 5 వేల మందికి పరిశ్రమలు పెట్టుకునేందుకు చంద్రబాబు దయతో రుణాలు మంజూరు చేశామన్నారు. 25 వేల మంది కాపు నిరుద్యోగ యువతకు స్ట్ఫైండ్ ఇచ్చి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించామన్నారు. 65 వేల మంది మహిళలకు స్ట్ఫైండ్ ఇచ్చి కుట్టు శిక్షణ, మగ్గాల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నామని రామానుజయ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో కాపుభవన్‌లు నిర్మిస్తున్నామని, ఇన్ని చేస్తున్నా తెలుగుదేశం కమ్మపార్టీ అనే భావనలో కాపులు టిడిపికి వ్యతిరేకంగా ఉన్నారని, కాపులు చేస్తున్న అల్లరి చూసి ఇతర కులాలు కామెంట్లు చేయడం వలన చులకన అవుతున్నామని రామానుజయ అన్నారు. టిడిపి వచ్చాక రాష్ట్రంలో లాభపడింది ఎక్కువగా కాపులేనని, కాంగ్రెస్ పాలనలో నోరు మెదపని ముద్రగడ చంద్రబాబు పాలన వచ్చాక గొడవలు సృష్టిస్తున్నాడని రామానుజయ ధ్వజమెత్తారు. స్వయంగా కారు నడుపుకుంటూ జీవనం పొందే కాపులు లక్షమంది వచ్చినా రుణాలు మంజూరు చేసేందుకు కాపు కార్పొరేషన్ సిద్ధంగా ఉందని రామానుజయ అన్నారు. కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, భారతి, నళిని, లక్ష్మీపతి, వై నాగేశ్వరరావు, శివరాం , రమణ, శ్రీపాద తదితరులు పాల్గొన్నారు.

క్రయవిక్రయాలను విధిగా నమోదు చేసుకోవాలి
అమఠావతి, జూలై 23 : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నూతనంగా ప్రవేశపెట్టిన జిఎస్‌టి చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా అమ్మకాలు, కొనుగోళ్లను పుస్తకాల్లో నమోదు చేసుకోవాలని, ఖాతాదారుని వద్ద వసూలు చేసిన పన్ను ప్రభుత్వానికి చెల్లించాలని వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, జిఎస్‌టి రిసోర్స్‌పర్సన్ డాక్టర్ వి బదరీనాధ్ సూచించారు. ఆదివారం శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి కళ్యాణ మండపంలో అమరావతి వర్తక సంఘం ఆధ్వర్యంలో జిఎస్‌టి అమలుపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి మద్ది ధాత్రినారాయణ అధ్యక్షత వహించారు. గతంలో ఉన్న వ్యాట్‌ట్యాక్స్ మాదిరిగానే కొన్ని స్వల్పమార్పులతో జిఎస్‌టిని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 2017 జూలై 1వ తేదీ నుండి అమలులోకి వచ్చిన జిఎస్‌టి చట్టం ప్రకారం 17 రకాల పన్నులు చెల్లించాలని సూచించారు. గతంలో ఒకే రకమైన వ్యాపారానికి ఒకే రకమైన పన్ను ఉండేదని, ప్రస్తుతం సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్‌గా విభజించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక పరిపుష్టిసాధించేందుకు ఈ పన్ను దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ జిఎస్‌టి నిబంధనల ప్రకారం వ్యాపారవర్తకాన్ని నిర్వహించక పోతే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టం పరిధిలో తమ తమ వ్యాపార లైసెన్సులను కొత్త చట్టం ప్రకారం మార్చుకోవాలన్నారు. ఆల్కహాల్, పెట్రోల్, డీజిల్ వంటి కొన్ని పదార్ధాలు జిఎస్‌టి పరిధిలోకి రావన్నారు. గతంలో ఒకే టిన్ నెంబర్ మీద దేశవ్యాప్తంగా వ్యాపారం చేసుకునే అవకాశం ఉండేదని, ఈ చట్టం ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా లైసెన్సులు పొంది ఉండాలని తెలిపారు. స్థానిక వ్యాపారస్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పి సందేహాలను నివృతిచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ వ్యాపార సంఘ నాయకులు బాలనాగు కృష్ణప్రసాద్, ఆతుకూరి శ్రీనివాసరావు, డాక్టర్ సుబ్బారావు, గండవరపు మాధవరావు, నాగేశ్వరరావు, ఆడిటర్ మద్ది మురళి, వ్యాపారవేత్త చేకూరి జాజిబాబు, ఈదర శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కోడెల శివరామ్ అవినీతి దందాపై బహిరంగ చర్చకు సిద్ధం
నరసరావుపేట, జూలై 23: నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తనయుడు డాక్టర్ కోడెల శివరామ్ సాగిస్తున్న అవినీతి దందాను నిరూపించేందుకు బహిరంగ చర్చకు సిద్ధమని వైయస్సార్‌సీపీ నాయకులు సవాల్ విసిరారు. ఆదివారం స్థానిక వైయస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. త్రికోటేశ్వరుని సాక్షిగా అవినీతి చేయలేదని ప్రమాణం చేయగలరా అని అన్నారు. అవినీతికి పాల్పడినట్లు తాము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు సవాలు చేశారు. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకుల వద్ద 20నుండి 25లక్షల రూపాయలు వసూలు చేయడం నిజంకాదా అని ప్రశ్నించారు. వనం-మనం కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులతో మొక్కలు నాటించి ఉపాధి హామీ పధకంలోని నిధులు 2.50కోట్ల రూపాయలకు పైగా దోచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది నిజంకాదా అని ప్రశ్నించారు. తమ నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైద్యశాలకు ప్రభుత్వం అనుమతించిన ఎన్టీఆర్ వైద్యసేవను కుట్రపూరితంగా, ఆర్ధికంగా దెబ్బతీసేందుకు రద్దుచేయించింది మీరు కాదా అని అన్నారు. స్పీకర్ కోడెల తనయ విజయలక్ష్మీ వైద్యశాలకు ఫైర్ సర్ట్ఫికెట్ ఉందా అని ప్రశ్నించారు. రైల్వే కాంట్రాక్టర్లు కమిషన్ ఇవ్వలేదని వారిపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టించింది నిజంకాదా అన్నారు. రొంపిచర్ల మండలం అన్నారం గ్రామం వద్ద పవర్‌గ్రిడ్ పనులు చేస్తున్న వారు కమిషన్లు ఇవ్వలేదని అమాయకులైన ఎస్సీ, ఎస్టీలచే కేసు పెట్టించింది నిజం కాదా అని ప్రశ్నించారు. పవర్ గ్రిడ్ వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తే ఆ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పోలీసులకు ఫోన్ చేసి విడిపించింది నిజం కాదా అన్నారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే కొల్లి ఆంజనేయులు అనే వ్యక్తిని గతంలో పనిచేసిన తహశీల్దార్ బ్రోకర్ పనులు చేస్తున్నావని అనడం నిజంకాదా అని అన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డిని విమర్శించే అర్హత తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదన్నారు. ఇకనైనా వళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ నాయకులను హెచ్చరించారు. ఈ సమావేశంలో పిల్లి ఓబుల్‌రెడ్డి, ఎన్‌కె ఆంజనేయులు, సుజాతాపాల్, రామిశెట్టి కొండా, టవటం శ్రీనివాసులు, గాలం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ పటిష్టతే ధ్యేయంగా పనిచేయాలి : ఎమ్మెల్యే శ్రీ్ధర్

పెదకూరపాడు, జూలై 23: మండలంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు పార్టీ పటిష్ఠతే ప్రధాన లక్ష్యంగా కృషిచేయాలని పెదకూరపాడు శాసనసభ్యుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీ్ధర్ కోరారు. మండల తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం ఆదివారం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యాలయంలో జరిగింది. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బెల్లంకొండ రామగోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ్ధర్ మాట్లాడుతూ ఇటీవల జిల్లా, మండల అనుబంధ సంఘాలకు ఎన్నికైన వారు గ్రామ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషిచేయాలన్నారు. గత కాంగ్రెస్ హయాంలో టిడిపి కార్యకర్తలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పది సంవత్సరాల్లో లక్ష కోట్లు దుబారా చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిందని, అకుంటిత దీక్ష కల్గిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్రాన్ని ముందంజలో ఉంచేలా శ్రమిస్తూ, కార్యకర్తలను కాపాడుతూ అభివృద్ధియే పరమావధిగా పనిచేస్తున్నారన్నారు. కొంతమంది గ్రామాల్లో కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని ఈ మూడేళ్లలో తెలుగుదేశం చేసి చూపిందన్నారు. మండలంలో 113 పనులను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. 8 కిలోమీటర్ల మేర రోడ్డునిర్మాణం, పదికిలోమీటర్ల అంతర్గత రోడ్ల నిర్మాణం, కొన్ని గ్రామాల్లో నూరుశాతం రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరిస్తూ పార్టీకి పూర్తిస్థాయిలో సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగురైతు కార్యదర్శి భాష్యం ఆంజనేయులు, జిల్లా తెలుగు మహిళ కార్యదర్శి ముంతాజ్, మాజీ ఎంపిపి గల్లా బాబురావు, ఎంపిపి శివమ్మ, డిసి చైర్మన్ వడ్లమూడి అప్పారావు, జిల్లా బిసి నాయకులు మువ్వా పోలురాజు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి వాసు, వేమూరి వెంకటప్పయ్య, యార్డు డైరెక్టర్ ఏటుకూరి బ్రహ్మయ్య, చెరుకూరి పుల్లయ్య, తాళ్లూరి సుబ్బారెడ్డి, యార్డు డైరెక్టర్ ఆంజనేయరెడ్డి, వేమారెడ్డి, సాయిరెడ్డి, పాటిబండ్ల సుభాని, మాబు, ఎంపిటిసి కొండమీది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

హజ్ యాత్రికులకు అన్ని సౌకర్యాలు
గుంటూరు, జూలై 23: హజ్ యాత్రకు వెళ్తున్న వారికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కెకెఆర్ సమావేశ మందిరంలో గుంటూరు నిదా హజ్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రికులకు శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హిదాయత్ మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా 2800 మంది హజ్‌కు వెళ్తున్నారని, వీరికి కావాల్సిన సదుపాయాల కల్పన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 3 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ప్రతి 200 మంది హజ్‌లకు మక్కా, మదీనాలో సహాయకారులుగా ఉండటం కోసం వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్రం నుండి పంపిస్తున్నామని చెప్పారు. దేశ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం హజ్‌లో దువా (ప్రార్థన) చేయాలని హిదాయత్ కోరారు. ఈ సందర్భంలో హజ్ యాత్రలో పాటించాల్సిన నియమాలను హాజీలు రహంతుల్లా, సైఫుల్లాబేగ్, హజ్ కమిటీ ఇఒ లియాఖత్‌లు వివరించారు. ముఫ్తీ జావీద్, ఖలీలుల్లా, ఆజామ్ సాహెబ్, అన్వర్‌బాషా, ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.