రంగారెడ్డి

గుట్కా తయారీ కేంద్రంపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జూలై 23: గుట్కా తయారు చేస్తున్న కేంద్రంపై దాడులు నిర్వహించి రూ.30 లక్షలు విలువ చేసే ముడిసరుకు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ జోన్ డిసిపి పద్మజ వెల్లడించారు. ఆదివారం కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామం వద్ద మూతబడిన తుల్జా భవానీ రిఫైనరీ పరిశ్రమలో గుట్కా తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, శనివారం ఈ కేంద్రంపై ఎస్‌వోటి, సిసిఎస్ దళాలు దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. గతంలో రిఫైనరీ నిర్వహించిన ఈ పరిశ్రమ మూతపడిన అనంతరం హైదరాబాద్‌లోని బహదూర్‌పురకు చెందిన మహమద్ ఇలియాస్ అనే వ్యక్తి దీన్ని కేంద్రంగా గుట్కా తయారు చేయడాన్ని మూడు నెలల క్రితం ప్రారంభించాడని వివరించారు. దాడుల్లో 111 సంచుల జర్దాను, 40 బస్తాల గుట్కా ప్యాకెట్లను, 40 బస్తాల తయారీ ముడిసరుకులతోపాటు కారుతోపాటు దాదాపు రూ.30లక్షల విలువైన పలు వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. గుట్కా తయారీకి వినియోగించే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. క్రైం నంబర్ 231/2017గా ఐపిసి సెక్షన్‌లు 273,188, 420, 374, ఫుడ్ సెఫిటీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 59సెక్షన్, సివోటిపి 2003 ప్రకారం 75,79 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కేంద్రం నిర్వాహకుడు మహ్మద్ ఇలియాస్‌తోపాటు పరిశ్రమలో పనిచేస్తున్న మరో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. షాద్‌నగర్ రూరల్ సిఐ మధుసూదన్, ఎస్సై శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.

ఐకమత్యంగా హక్కులను సాధించుకోవాలి
మేడ్చల్, జూలై 23: రెడ్డిలు ఐకమత్యంగా హక్కులను సాధించుకోవాలని తెలంగాణ రెడ్డి ఐక్య వేదిక సంఘం రాష్ట్ర కన్వీనర్ ఏనుగు సంతోష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పంగారి రాంరెడ్డి, సీనియర్ నాయకులు ఎస్.హరివర్దన్ రెడ్డి, నందారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మేడ్చల్ జిల్లా రెడ్డి సంఘం సమావేశాన్ని తెలంగాణ రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని నవభారత్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. రాష్ట్రంలో గ్రామ గ్రామాన రెడ్డి సంఘాలను పటిష్టపర్చాలని అన్నారు. అగ్రవర్ణాలలోనూ నిరుపేదలు ఉన్నారని, రెడ్డి కులంలోని పేదరెడ్డిలకు సంక్షేమ పథకాలు వర్తింపజేసే విధంగా ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. కొంత మంది నాయకులు తమ స్వార్ధం కోసం ఓటు రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. రెడ్డి సమాజంలోని మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు.. సామాజిక సమస్యలపై నిర్వహించే సమావేశాలకు ముఖం చాటేయడం బాధకరమని చెప్పారు. రిజర్వేషన్‌లతో రెడ్డి విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని పలువురు నాయకులు వాపోయారు. గ్రామాల్లో రెడ్డి రైతుల పరిస్థితి దీనంగా ఉందని అన్నారు. పొట్టచేత పట్టుకుని వలసలు పోతున్నారని, అలాంటి వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లా రెడ్డి సంఘం కమిటీ
మేడ్చల్ జిల్లా రెడ్డి సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్‌గా యాటవల్లి రాజశేఖర్‌రెడ్డి, సలహాదారుడిగా నారెడ్డి రాంరెడ్డి, జిల్లా యూత్ కన్వీనర్‌గా కందాడి హన్మంత్‌రెడ్డిని ఎన్నుకున్నారు. మేడ్చల్ మండల కన్వీనర్‌గా నారెడ్డి సుదర్శన్‌రెడ్డి, యూత్ కన్వీనర్‌గా అకిటి నవీన్‌రెడ్డిని మేడ్చల్ పట్టణ కన్వీనర్‌గా సింగిరెడ్డి బాగిరెడ్డిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ధనుష్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాజమల్లారెడ్డి, నరేందర్‌రెడ్డి, భాగ్యరెడ్డి, జగన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సద్ది సంజీవ రెడ్డి, వరదా రెడ్డి, బొక్క శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, పద్మారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

పూర్తిస్థాయి డిఇవో పోస్టులను మంజూరు చేయాలి

వికారాబాద్, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాలకు పూర్తి స్తాయి డిఇవో, సహాయ సంచాలకులు, సూపరింటెండెంట్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్‌లను నియమించాలని టిఎస్‌యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వెంకటరత్నం, కోశాధికారి ఎన్.బాబూరావులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడుతూ 92 జివో ఉపాధ్యాయుల సర్వీస్‌కు అడ్డంకిగా మారినందున దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా విద్యాధికారులు, సిబ్బందిని నియమించకపోవడంతో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు వివిధ సమస్యల పరిష్కారానికి డిఇవో కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని, కార్యాలయం సిబ్బందికి పని ఒత్తిడి పెరిగి సకాలంలో పనులు పూర్తి చేయలేకపోతున్నారని వాపోయారు. 92 జివోను రద్దు చేసి ప్రస్తుత డిఇవోలకే పూర్తి అధికారాలు ఇవ్వాలని అన్నారు. సమావేశంలో టిఎస్‌యుటిఎఫ్ నవాబ్‌పేట మండల అధ్యక్షుడు రాములు, నాయకులు మాణిక్యం, ఉమేష్, శేఖర్, వినోద్‌లు పాల్గొన్నారు.
సాధ్యం కాని రికార్డుల నవీకరణ

షాద్‌నగర్, జూలై 23: రెవెన్యూ రికార్డులు, భూసర్వే రికార్డులు ఏ విధంగా సరిచేయగలమోనని ఆ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉన్నత స్థాయి సమావేశంలో రెవెన్యూ రికార్డుల పరిస్థితి సరిగ్గా లేదని ఆందోళన వ్యక్తం చేసినప్పటి నుండి అధికారుల గుండెళ్లో రైలు పరుగెత్తుతున్నాయి. షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని ఫరూఖ్‌నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన తహశీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ రికార్డులు అసంపూర్తిగా, అయోమయంగా రికార్డులు ఉన్నాయి. కొన్ని రికార్డులు కనిపించడం లేదు. ఉన్న రికార్డులను మాత్రమే కంప్యూటరైజ్ చేశారు. పాత రికార్డులు అధిక శాతం నిజాం పాలన హయాంలో సంబంధించినవి. ఇందులో కొన్ని ముఖ్యమైన కీలకమైన రికార్డులు చినిగిపోయి రిజిస్టర్‌లో కనిపించడం లేదు. మరికొన్ని గల్లంతు అయ్యయి.
మరికొన్ని రికార్డులు కనిపించడం లేవని అధికారులు స్వయంగా తెలుపుతున్నారు. ఎన్‌టిఆర్ హయాంలో మండల వ్యవస్థగా మార్చి మండలాలకు తాలుకా కేంద్రాల నుండి ఆ గ్రామాలకు సంబంధించిన రెవిన్యూ రికార్డులను పంపించడం జరిగింది. ఆ సమయంలో అప్పటి భూస్వాములు, పలుకుబడి గల నాయకులు, సిబ్బంది మాకుమ్మడిగా వివాదాలకు సంబంధించిన కీలక రికార్డులను తారుమారు చేసి గల్లంతులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రెవిన్యూ శాఖలో రక్షిత కౌల్‌దారు, 1954,1955ఖాస్రా పహాణి, పహాణి పత్రిక, ఆర్‌ఓఆర్, వసూల్‌బాకీ, పైసలపట్టి, 1971, 1951కు పహాణి పత్రికకు సంబంధించిన కీలక రికార్డులు దాదాపు 30శాతం రికార్డులు తహశీల్దార్ కార్యాలయాల్లో కనిపించడం లేదని షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, తిమ్మాపూర్, నందిగామ, మేకగూడ, చటాన్‌పల్లి, లింగారెడ్డిగూడ, రాయికల్, ఫరూఖ్‌నగర్, రామకృష్ణాపూర్, చిల్కమర్రి, దూసకల్, బూర్గుల, కొందుర్గు, కేశంపేట గ్రామాలాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. రికార్డులు సక్రమంగా లేనందున సామాన్య, పేద వర్గాల, పలుకుబడి లేని సామాన్యుల వ్యవసాయ పొలాల భూములకు రక్షణ లేకుండా పొయింది. బలవంతులైన పలుకుబడి గల ధనిక వర్గాల వారు భూములకు వివాదాలు సృష్టించి అమాయకుల భూములను రకరకాలుగా స్వాధీన పరుచుకొని చట్టపరంగా సరిదిద్దుకున్నారు. మరికొంతమంది భూ వివాదాలు సృష్టించి రెవిన్యూ, జుడిషియల్, న్యాయస్థానాలలో పిటిషన్లు వేశారు. ఆ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నైజాం హయాంలో 1942వ సంవత్సరం వ్యవసాయ పొలాల సర్వే గ్రామాలలో సర్వే నంబర్ ప్రకారం హద్దుబందులు నిర్వహించారు. దాదాపు 80సంవత్సరాలు గడిచినా ఇంతవరకు తిరిగి సర్వే నిర్వహించలేదు.
గ్రామాలలో వ్యవసాయ పొలాల సర్వే నంబర్‌కు గల నాలుగు వైపుల సరిహద్దు రాళ్లను అధిక శాతం తొలగించి బలవంతులైనా పక్క వ్యవసాయ పొలాల వారు బలహీన రైతుల నుండి కబ్జాపెట్టారు. ప్రతి గ్రామంలో ఇలాంటి సంఘటనలు అధికంగా ఉన్నాయి. అందువల్ల గ్రామాలలో ఘర్షణలు, వివాదాలు ఏర్పడి పోలీస్ కేసులు, జుడిషియల్ న్యాయస్థానాలకు గ్రామస్తులు వెళ్లినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు గల ఎకరాలు రికార్డు ప్రకారం ఉన్న మొత్తం ఎకరాలు, గ్రామాలలో ఉన్న భూమి మొత్తం రెండింటికి పొంతన లేకుండా పోయింది. .
రికార్డులను పరిశీలిస్తాం
ఫరూఖ్‌నగర్ మండలం చటాన్‌పల్లి, లింగారెడ్డిగూడ, కసాబ్‌గూడ, సోలీపూర్, చిల్కమర్రి, రాయికల్, బూర్గుల తదితర గ్రామాలకు సంబంధించిన రక్షిత కౌలుదారు, 1954, 9155ఖాస్రాపహాణి, వసూల్‌బాకీ, పహాణిపత్రికలు కీలకమైన రికార్డులు కొంతశాతం చినిగిపోయాయని, మరికొన్ని గల్లంతు అయ్యాయని ఆరోపణలపై పూర్తి స్థాయిలో రెవిన్యూ రికార్డులను పరిశీలించిన తరువాత వివరాలు తెలుపగలమని షాద్‌నగర్ తహశీల్దార్ రామారావు తెలిపారు.

రేషన్ పరేషాన్

కొత్తూరు, జూలై 23: అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల్లో ఈపాస్ యంత్రాలను తీసుకువచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఈపాస్ యంత్రాలు మొరాయిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ దుకాణాల్లో గతంలో తొమ్మిది సరుకులు ఇచ్చేవారు. ప్రస్తుతం బియ్యం మాత్రమే ఇస్తుండటంతో దీనికోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపాస్ యంత్రాలు వస్తే మేలు జరుగుతుందని ఆశించినప్పటికీ నిరాశే మిగులుతుందని పేర్కొంటున్నారు. దీంతో షాపుల చుట్టూ నిత్యం ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలోని 18 గ్రామ పంచాయతీల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 65వేల మంది జనాభా ఉన్నారు. నందిగామ మండలంలో మొత్తం 12 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఇందులో బిపిఎల్ కార్డులు 7556, ఆహార భద్రత కార్డులు 6997, ఏఎఫ్‌ఎస్‌సి కార్డులు 558, ఏఏపి కార్డులు ఒకటి చొప్పున ఉన్నాయి. కొత్తూరు మండలంలో 13రేషన్ దుకాణాలు ఉండగా మొత్తం 7879కార్డులు ఉన్నాయి. ఇందులో ఎఫ్‌ఎస్‌సి కార్డులు 5997, ఏఎఫ్‌ఎస్‌సి కార్డులు 1882 ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. జూలై 1వ తేదీ నుండి బయోమెట్రిక్ విధానం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో రేషన్ డీలర్లు బయోమెట్రిక్ విధానం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈపాస్ యంత్రాలు మొరాయిస్తుండటంతో ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి 15నుండి 20నిమిషాల సమయం పడుతుండటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందిగామ మండల కేంద్రంలోని మొదటి రేషన్ దుకాణంలో 978 కార్డులు, రెండవ రేషన్ దుకాణంలో 911 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ బియ్యం సరఫరా చేసేందుకు పది నుండి 15రోజుల సమయం పట్టే అవకాశం ఉందని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. ఈపాస్ యంత్రాలు అందుబాటులోకి రాకముందు వారం రోజుల్లో పూర్తి చేసేవారమని, ప్రస్తుతం సమయం ఎక్కువ పడుతుందని అంటున్నారు. ఈపాస్ యంత్రంలో ఒకే అని వస్తేనే లబ్ధిదారుడికి బియ్యం పంపిణీ చేయనున్నట్లు, లేని పక్షంలో సిగ్నల్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందేనని డీలర్లు వివరించారు. అసలే పనుల సమయం.. ఆపై బియ్యం కోసం రేషన్ దుకాణాల వద్ద రోజుల తరబడి క్యూలైన్‌లో నిలబడాలంటే ఎలా? అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని త్వరగా నిత్యావసర సరుకులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బియ్యం కోసం నాలుగు రోజులు తిరిగాం
* రేషన్ కార్డు లబ్ధిదారులు యాదమ్మ
పౌరసరఫరాల శాఖ సరఫరా చేసే బియ్యం కోసం రేషన్ దుకాణం చుట్టూ నాలుగు రోజులుగా తిరిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని కొత్తూరు గ్రామానికి చెందిన రేషన్ లబ్ధిదారులు యాదమ్మ వివరించారు. ఈపాస్ యంత్రాలను ఏర్పాటుచేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పనులు వదులుకొని రేషన్ దుకాణాల వద్దనే క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తోందని పేర్కొన్నారు. పాత పద్ధతిలోనే ఇచ్చే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఆన్‌లైన్ సేవలు మెరుగుపరిస్తేనే త్వరగా పనులు
* రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు యాదయ్య
ఆన్‌లైన్ సేవల్లో స్పీడ్ పెంచితే లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు త్వరగా పంపిణీ చేసే అవకాశాలు ఉంటాయని కొత్తూరు, నందిగామ మండలాల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు యాదయ్య వివరించారు. ఈపాస్ యంత్రంలో సర్వర్ పనిచేయకపోవడంతోనే ఆలస్యం అవుతుందని, ఈపాస్ టైవౌట్ అనే సందేహం రావడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఒక్కొక్క కార్డు లబ్ధిదారుడికి 15 నుండి 20 నిమిషాలు అవుతుందని అన్నారు. ప్రస్తుతం 3జీ ఆన్‌లైన్ సేవలు ఉన్నాయని, 4జీ ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తే త్వరగా పనులు అవుతాయని పేర్కొన్నారు.

అంతర్జాతీయ ధ్యాన సదస్సు ప్రారంభం
కొత్తూరు రూరల్, జూలై 23: శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ హర్ట్ఫుల్‌నెస్ సహాజ మార్గ ధ్యాన సదస్సు ప్రారంభమైంది. ఆదివారం నందిగామ మండలం చేగూరులోని శ్రీ రామచంద్ర మిషన్‌కు చెందిన కాన్హా శాంతి వనంలో మూడు రోజుల పాటు సాగనున్న అంతర్జాతీయ హర్ట్ఫుల్‌నెస్ సహాజ మార్గ ధ్యాన సదస్సు శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు, మార్గదర్శి కమలేష్ డి పటేల్ (దాజీ) ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ సదస్సు ప్రారంభ దినోత్సవమైన ఆదివారం వివిధ దేశాలకు చెందిన సుమారు 30వేల మంది ధ్యానంలో పాల్గొన్నారు. సదస్సు జరిగే మూడు రోజుల పాటు ప్రతి రోజు మూడు సార్లు 30వేల మంది సామూహికంగా ఒకేసారి ధ్యానం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా గృహస్తుల కోసం నిర్ధేశించిన హార్ట్ ఫుల్‌నెస్ సహాయ మార్గ ధ్యాన విధానంలో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి వస్తున్న వారికి అన్ని సదుపాయాలను కాన్హా శాంతి వనంలో నిర్వాహకులు అందిస్తున్నారు. వీరందరికి మూడు రోజుల పాటు ఉండే విధంగా వసతి, భోజన సదుపాయాలను అక్కడే అందిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా పుస్తక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు పుస్తక ఆవిష్కరణలకు కూడా ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.