విజయనగరం

ఉపాధ్యాయులకు కౌనె్సలింగ్ కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 24: ఉపాధ్యాయ బదిలీల కౌనె్సలింగ్ అస్తవ్యస్తంగా మారింది. ఏ రోజు బదిలీలు ఉంటాయన్నదీ ముందుగా స్పష్టం చేయకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఉపాధ్యాయ బదిలీలకు ముందుగా షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో ఏరోజు కౌనె్సలింగ్ ఉంటుందో తెలియక ఆందోళనకు గురవుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న జరిగిన ప్రధానోపాధ్యాయుల కౌనె్సలింగ్ అలాగే జరిగింది. తాజాగా సోమవారం జెడ్పీలో నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ల కౌనె్సలింగ్‌లో కూడా ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ కౌనె్సలింగ్ తమకు వద్దంటూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం మాన్యువల్ కౌనె్సలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని ఆదేశించిన విషయం విధితమే.
సోమవారం జరిగిన కౌనె్సలింగ్‌లో తెలుగు స్కూల్ అసిస్టెంట్లు 94, హిందీ స్కూల్ అసిస్టెంట్లు 74, ఒరియా ఒకటి, సంస్కృతం ఒక ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహించారు. డిఇఒ అరుణకుమారి నేతృత్వంలో బదిలీలు జరిగాయి. ఏయే పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయా లేదా అన్నదీ పవర్‌పాయింట్ ప్రజంటెషన్ ద్వారా ఉపాధ్యాయులకు ఖాళీలను చూపుతున్నారు. వీటిలో కోరుకున్న స్థానం ఖాళీ లేకపోవడంతో అనేకమంది ఉపాధ్యాయులు పాత స్థానంలోనే కొనసాగడానికి మొగ్గు చూపారు. ఏయే సబ్జెకులకు ఏ రోజు కౌనె్సలింగ్ ఉంటుందన్నదీ ప్రభుత్వం ముందుగా షెడ్యూల్ ఖరారు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ట్రెజరీలో నిలిచిపోయిన బిల్లులు!
విజయనగరం, జూలై 24: పెద్ద నోట్ల రద్దు అనంతరం కూడా ఆర్థిక ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి. బ్యాంకుల్లో తరచూ నగదు కొరత ఏర్పడటంతో ఖజానాశాఖలో బిల్లులు పేరుకుపోతున్నాయి. ఈ నెల 10వ తేదీ తరువాత ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించడంతోపాటు ఉద్యోగుల జీతాలతోపాటు ఇతర బిల్లులు కూడా నిలిచిపోయాయి. కొన్ని పద్దులకు ఫ్రీజింగ్ తొలగించడం వల్ల కొన్నింటిని మాత్రమే చేయగలుగుతున్నామని ట్రెజరీ శాఖ డిడి దామోదరరావు తెలిపారు. దీనివల్ల రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక సంవత్సరంలో మధ్యలోనే చెల్లింపులు నిలిచే పరిస్థితులు ఏర్పడటంపై ఆయా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన వారం రోజులుగా జిల్లాలో దాదాపు రూ.10 కోట్ల మేర చెల్లింపులు నిలచిపోయాయి.
సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు నెలలో వివిధ సర్దుబాట్ల కోసం ఆర్థిక లావాదేవీలను కొద్ది రోజులపాటు నిలిపివేయడం సాధారణమే. ప్రభుత్వ ఖజానాలో లోటు ఉన్న సందర్భాల్లో ఇటువంటి ఆంక్షలు విధిస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వౌఖిక ఆదేశాలతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. కాగా, ప్రభుత్వ రాబడి, వ్యయాల్లో చోటుచేసుకున్న వ్యత్యాసం వల్లనే ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నారన్న భావన ఉద్యోగుల్లో వ్యక్తం అవుతోంది. జిల్లాలో దాదాపు ప్రతి నెల 300 కోట్ల మేరకు లావాదేవీలు ఖజానాల ద్వారా జరుగుతుంటాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడింది. ఒక పక్క రాబడిలో లోటు ఏర్పడుతున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ప్రభుత్వానికి ప్రతినెలా ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర చెల్లింపులు అధిగమించడం ప్రభుత్వానికి పరీక్షగా మారింది.
ఇదిలా ఉండగా ఆర్థిక సంవత్సరం జనవరి నుంచే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన కూడా కొంత ఆందోళనకు కారణం అవుతోంది. ఇదిలాఉండగా ఫ్రీజింగ్ గురించి ఖజానాశాఖ డిడి దామోదరరావు వద్ద ప్రస్తావించగా ఖజానాకు వచ్చే బిల్లులను పాస్ చేస్తున్నాము. ఈ నెల 10వతేదీ తరువాత పాసైన బిల్లుల్లో కొన్నింటికి ఆర్థిక శాఖ క్లియరెన్స్ లభించలేదన్నారు. మరికొద్ది రోజులు ఫ్రీజింగ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనధికార కబేళాలు మూసివేయాలి
విజయనగరం, జూలై 24: జిల్లాలో అనధికార కబేళాలను మూసి వేయాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన గో-సంరక్షణ చట్టం అమలుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1977లో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఆవుల స్లాటర్ జంతు పరిరక్షణ నిషేధ చట్టం ప్రకారం ఆవులు, దూడలు, గేదెలు, దున్నపోతులు ఇతర జంతవులను అక్రమంగా కబేళాలకు తరలించడం, వధించడం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లాలో కబేళాలు, మాంసం దుకాణాలకు అనుమతులు తప్పనిసరి అన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా ఉండి పశువైద్యుని ధ్రువీకరణ పత్రం మేరకు వధపై చర్యలు తీసుకోవాలన్నారు. కబేళాల వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగరాదన్నారు. మాంస దుకాణాలు రోడ్డు పక్క మురుగు కాలువల దగ్గర ఏర్పాటు చేయరాదన్నారు. భద్రత గల స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మాంసం వ్యాపారులు విధిగా ఫుడ్ సేఫ్టీ అధారిటీ నుంచి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ లైసెన్సు పొందకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. చట్టంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పట్టణ, గ్రామ ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా కబేళాలు ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలన్నారు. కబేళాలకు తరలిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు శిక్షణ చేపడతామన్నారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రతినిధులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించగా మైనార్టీ ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, దుల్హాన్ పథకం, బ్యాంకు రుణాలు, స్కాలర్‌షిప్పులు, షాదిఖానాల నిర్మాణం, శ్మశాన వాటికల నిర్మాణంపై మండల, గ్రామ స్థాయిలో ముస్లింలకు పూర్తి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వక్ప్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎఎస్పీ ఎవి రమణ, ఆర్డీఒ శ్రీనివాసమూర్తి, పశుసంవర్థకశాఖ జెడి డాక్టర్ సింహాచలం, జిల్లా మైనార్టీ కార్పొరేషన్ ఇడి నారాయణ, మున్సిపల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, తహశీల్దార్ గోవింద్, ఆహార భద్రత అధికారి కరీముల్లా, ఆహార తనిఖీ అధికారి వెంకటరత్నం, ఖాదర్ భాషా, అబ్ధుల్ ఫరూఖ్, అబ్థుల్ సబూర్ పాల్గొన్నారు.

విద్యార్థుల ధర్నాలో అపశ్రుతి
విజయనగరం (్ఫర్టు), జూలై 24: ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎండ వేడిమిని తట్టుకోలేక ఇద్దరు విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోగా, టూటౌన్ ఎఎస్‌ఐ అప్పారావు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తేరుకొని వారికి సపర్యలు చేయడంతో ఆరోగ్యపరిస్థితి కుదుటపడింది. ఒక విద్యార్ధిని ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్ధుల సమస్యలపై పలు పాఠశాలలు, కళాశాల నుంచి సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో విద్యార్థినులు వచ్చారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలామంది విద్యార్థినులు తట్టుకోలేకపోయారు. అయినప్పటికీ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాను కొనసాగించారు. ఇదే సమయంలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఇద్దరు విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. సహచర విద్యార్థినులు వారిద్దరికి సపర్యలు చేశారు. అదేవిధంగా కలెక్టరేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎఎస్‌ఐ ఎండ తీవ్రతను తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పోలీసులు తేరుకొని ఆయనకు సపర్యలు చేయడంతో ఆరోగ్యం కుదుటపడింది.

పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు
విజయనగరం (్ఫర్టు), జూలై 24: పట్టణంలో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో పలు అభివృద్ధి పథకాలకు సోమవారం ఆమె శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయని, వాటి ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం నిధులద్వారా కాలువల నిర్మాణం, పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే పట్టణంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్ గణపతిరావు, మున్సిపల్ కౌన్సిలర్లు బొబ్బాది త్రినాథరావు, పిన్నింటి కళావతి, టిడిపి నాయకుడు పిన్నింటి సూర్యనారాయణ పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
విజయనగరం (్ఫర్టు), జూలై 24: పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించేందుకు మున్సిపల్‌గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. సోమవారం జరిగిన మున్సిపల్ గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా గ్రీవెన్స్‌సెల్‌లో వచ్చిన వినతులు, అర్జీలపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, మేనేజర్ ఆనందరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు వి.శోభన్‌బాబు, కె.హరిదాస్, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్లు మత్స్యరాజు, వంశీకృష్ణ, మున్సిపల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, మెప్మా ప్రాజెక్టు అధికారి సరోజిని పాల్గొన్నారు.

రాజీవ్ క్రీడామైదానం అభివృద్ధికి చర్యలు
విజయనగరం (్ఫర్టు), జూలై 24: విజయనగరం పట్టణం నడిబొడ్డులో ఉన్న రాజీవ్ క్రీడామైదానం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బుగత సూరిబాబు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో జిల్లా జాయింట్‌కలెక్టర్ శ్రీబాలాజీ లఠ్కర్‌కు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ రాజీవ్‌క్రీడా మైదానానికి ప్రతిరోజూ వేయి మందికి పైగా క్రీడాకారులు, వాకర్స్ వస్తుంటారని తెలిపారు. క్రీడామైదానం ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల వారంతా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హుదూద్ తుఫాన్ వల్ల శిథిలమైన స్టేడియంను మళ్లీ అభివృద్ధి చేయాలన్న ఆలోచన పాలకులకు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయవల్సిన నిధులను ఊరికి చివరిలో ఉన్న విజ్జీస్టేడియంను సుందర వనంలా తీర్చిదిద్దడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు. నిధులు ఉన్నా రాజీవ్ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధికి చేయడానికి అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఎంతోమంది క్రీడాకారులను తయారు చేస్తున్న రాజీవ్ స్టేడియంను నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పొందూరు అప్పలరాజు, బొట్ట రమణ, గొలగాన పైడిరాజు, కరుమజ్జి సన్యాసిరావు, పిసిని త్రినాధ, పొందూరు రమణ పాల్గొన్నారు.

ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల భిక్షాటన
విజయనగరం (్ఫర్టు), జూలై 24: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు మెస్, కాస్మోటిక్స్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భిక్షాటన జరిగింది. ముందు ధర్నా నిర్వహించిన విద్యార్థులు తర్వాత భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ జిల్లాకమిటీ సభ్యుడు ఎన్.నాగభూషణ్ మాట్లాడుతూ ప్రభుత్వ వసతిగృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వసతులు లేకపోవడం వల్ల, పౌష్టికాహారం అందకపోవడం వల్ల విద్యార్ధులు మృత్యవాత పడుతున్నారని తెలిపారు. అయినప్పటికీ పాలకులు కనీసం పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. ముఖ్యంగా మెస్‌చార్జీలు 750 నుంచి 1500 రూపాయలకు పెంచాలని, హస్టల్ విద్యార్థులకు పెట్టెలు, దుప్పట్లు, దోమతెరలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి హాస్టల్‌కు నెలకు రెండుసార్లు మెడికల్ క్యాంపులను నిర్వహించాలన్నారు. వసతిగృహాలను మూసివేసే ప్రక్రియను మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ నాయకులు ఎస్.తేజ, బి.సీతారాం, కె.తరుణ్, బి.సత్యనారాయణ, పి.అచ్యుతరావు, ఎం.మురళి పాల్గొన్నారు.