విశాఖ

హడలెత్తిస్తున్న హి(సి)ట్ లిస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 24: సిట్.. ఈ పేరు వింటే అధికార పార్టీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. భూ కుంభకోణంలో జోక్యం ఉన్న ఎంతటివారినైనా వదిలేది లేదని సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే, ఇది మామూలే.. అని స్వపక్షీయులే భావించారు. విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని విపక్షాలన్నీ డిమాండ్ చేసినా, చంద్రబాబున నాయుడు మాత్రం సిట్ వేశారు. అధికార పార్టీలో ఉన్నాం కదా! సిట్ మమ్మల్నేం చేయగలదన్న అభిప్రాయంతో ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. చంద్రబాబు ఇచ్చిన భరోసాతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు కుంభకోణం మూలాలను కదుపుతున్నారు. ఇందులో ఫస్ట్ వికెట్ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ. రామవరం భూ కబ్జాలో ఎ8గా పీలా గోవింద్‌ను ఫిక్స్ చేశారు. అతని పైన, కింద కూడా పీలా కుటుంబీకులే ఉండడం గమనార్హం. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా సిట్ అధికారులు కేసు నమోదు చేయడాన్ని చూస్తే, సిట్‌కు అధికారాలు, ఆశీస్సులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పీలా కేసులో సిట్ అధికారులు లోతుకు వెళ్లాలని భావిస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని కుంభకోణాలు వెలుగు చూస్తే పీలాకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా నరవ భూ కుంభకోణాన్ని సిట్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నరవ వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. దీనికి సంబంధించిన నివేదికను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ నివేదికను అనుసరించి సిట్ అధికారులు చర్యలు చేపడతారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇందులో ఎవరెవరు బయటకు వస్తారో వేచి చూడాలి.
తాజాగా సిట్‌కు మరో తెలుగుదేశం పార్టీ నాయకుడు దొరికిపోయాడు. నీలయ్యమ్మ సత్రం భూముల కబ్జాపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొలగాని సన్యాసరావును పిఎం పాలెం పోలీసులు మంగళవారం ప్రశ్నించనున్నారు. నీలయ్యమ్మ సత్రం భూముల్లో 2.7 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గొలగానితో పాటు, మరో ఇద్దరిని కూడా పిఎం పాలెం పోలీసులు విచారించనున్నారు. సిట్ అధికారుల ఆదేశాల మేరకు పీఎం పాలెం పోలీసులు వీరిని విచారిస్తున్నారు. ఈలోగా గొలగాని కబ్జాపై వచ్చిన ఆరోపణలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. అవి రుజువైతే, వీరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
సిట్ హిట్ లిస్ట్‌లో ఇప్పటి వరకూ దొరికిపోయింది అధికార పార్టీ నేతలే. ఇంకా వీరి జాబితాలో ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. 20వ తేదీ తరువాత సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వచ్చే నెల మొదటి వారంలో సిట్ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది.
అయ్యన్న వెనుకంజపై విమర్శలు
మంత్రి అయ్యన్న పాత్రుడు సిట్ ముందుకు వచ్చి వివిధ భూ కుంభకోణాలకు సంబంధించి సాక్ష్యాధారాలను ఇస్తామని చెప్పారు. 19న ఆయన సిట్ ముందుకు రావల్సి ఉంది. అయితే, ఆయన రాకపోవడంతో విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఆయన పెదవి విప్పితే, పార్టీలోని కీలక నేతలు కటకటాలు లెక్కపెట్టే ప్రమాదం ఉందని భావించి, అథిష్ఠానం ఆయనను వెనక్కు తగ్గమని కోరినట్టు భోగట్టా. ఏదియేమైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై సిట్ ఫోకస్ పెట్టడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు.

రేపు నగరంలో సిఎం పర్యటన
విశాఖపట్నం, జూలై 24: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నగరంలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3.10 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ప్రగతి మైదానానికి 3.30 గంటలకు చేరుకుంటారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి అక్కడి నుంచి బయల్దేరి 5.50 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి గన్నవరం వెళతారు.

సిఎం ఏర్పాట్లను పరిశీలించనున్న గంటా
జగదాంబ, జూలై 24: మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1.90 కోట్ల రూపాయలతో 12 గదులతో సింహాచలంలో నిర్మించనున్న స్కూల్ భవనానికి ఉదయం 11 గంటలకు ఆయన శంఖుసస్థాన చేస్తారు. 2.45 గంటలకు ప్రగతి మైదాన్‌కు చేరుకుని ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫార్మాసిట్‌లో కొత్త ఫార్మా యూనిట్‌ను మంత్రి గంటా ప్రారంభించనున్నారు. 4.30 గంటలకు డ్రగ్స్ వినియోగం వలన వచ్చే ప్రమాదాలపై వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగే అవగాహన సదస్సులో మంత్రి పాల్గొంటారు.
సాంకేతిక విద్య పట్ల విద్యార్థులు శ్రద్ధచూపాలి
చోడవరం, జూలై 24: డిగ్రీలకే పరిమితం కాకుండా సాంకేతిక విద్యపట్ల కూడా విద్యార్థులు శ్రద్ధచూపాలని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సోమవారం ఇక్కడి పాఠశాల శతాబ్ధి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక శాతం నిధులు కేటాయిస్తుందన్నారు. పిల్లల తల్లిదండ్రులు కానె్వంట్ విద్య పట్ల మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన సూచించారు. ప్రధానంగా ప్రతీ ఒక్కరూ ప్రస్తుతం డిగ్రీల చదువులకే పరిమితం కాకుండా సాంకేతిక విద్య పట్ల కూడా శ్రద్ధచూపితే భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకు బాధ్యతతో కూడిన పర్యవేక్షణ అవసరమన్నారు.
రోడ్లు భవనాల శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోను లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పనుల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో సైతం సిసిరోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. 80శాతం గ్రామీణ రహదారుల నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రతీ ఇంటికి తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. గత ప్రభుత్వం పదిశాతం నిధులు కేటాయిస్తే ప్రస్తుతం ప్రభుత్వం 17వేల కోట్ల లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ అధిక శాతం నిధులను విద్యాభివృద్ధికి సమకూరుస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాల ఏర్పాటుకు 4250కోట్ల రూపాయలను ఇటీవల కేటాయించడం జరిగిందన్నారు. విశాఖడెయిరీ ఈ ప్రాంత రైతులకు అందజేస్తున్న సదుపాయాల మూలంగా రాష్ట్రంలో కరువుప్రభావం ఉన్నప్పటికీ కూడా విశాఖడెయిరీ సేవల మూలంగా జిల్లాలో ఆ ప్రభావం కనిపించలేదని ఆయన కితాబునిచ్చారు. హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ విశాఖడెయిరీని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత డెయిరీ చైర్మన్ తులసీరావుకే దక్కుతుందన్నారు. కోటిన్నర రూపాయలకు పైగా చోడవరం ప్రాంతంలోని పాఠశాలల అభివృద్ధికి డెయిరీ నిధులు అందజేయడం హర్షదాయకమన్నారు. ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విద్యాపరంగానే కాకుండా అన్నిరంగాల్లో ప్రణాళికాబద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బాబూ జగజ్జీవన్‌రామ్ సుజల స్రవంతి పథకాన్ని 2142 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసి చోడవరం, అనకాపల్లి, కశింకోట తదితర ప్రాంతాల్లోని లక్షన్నర ఎకరాల పంట భూములకు సాగునీటిని అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. విశాఖడెయిరీ చైర్మన్ తులసీరావు ఇక్కడి పాఠశాలల అభివృద్ధికి నిధులు అందజేయడం పట్ల ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌రాజు తులసీరావుకు కృతజ్ఞతలు తెలియజేసారు. అంతకుముందు గోవాడ సుగర్ ఫ్యాక్టరీ వద్ద నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై భారీ ప్రదర్శనగా చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు తరలివచ్చారు. ఈ ప్రదర్శనతో చోడవరంలో నూతన శోభ సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం పెల్లుబుకింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సభ్యులు పప్పల చలపతిరావు, పివిఎన్ మాదవ్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, బండారు సత్యనారాయణ, యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి, ఈర్లె శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఉనికి కోసమే కాపు ఉద్యమనేత ముద్రగడ పాదయాత్ర
చోడవరం, జూలై 24: రిజర్వేషన్‌ల పేరుతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమాల్లో చిత్తశుద్ధి లేదని కేవలం రాజకీయ లబ్ధికోసమే కాపులను రెచ్చగొట్టే కార్యక్రమాలు ముద్రగడ చేపడుతున్నారని ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడి తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనుమతి లేని ఎటువంటి పాదయాత్రలైనా శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేసారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన రెడ్డి సైతం ఆయన చేపట్టదలచిన కార్యక్రమాలకు ముందుగా ప్రభుత్వానికి తెలియజేసి అనుమతి తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. అటువంటిది ముద్రగడ ప్రభుత్వ అనుమతి లేకుండా పాదయాత్రల పేరిట ఆందోళనలు చేపడితే అంగీకరించేది లేదని ఆయన అన్నారు. ధైర్యముంటే ప్రభుత్వ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పేదవర్గాల వారికి ప్రతీ నియోజకవర్గంలో 3500 గృహాలు నిర్మించాలని, రాష్ట్రం మొత్తం మీద పదిలక్షల గృహ నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రతీనెలా పార్టీ కార్యక్రమాలను, సమీక్షా సమావేశాలను నిర్వహించడానికి సమన్వయ కమిటీ తీర్మానం చేసిందన్నారు. ఏజెన్సీలో మండల కమిటీల నియామకం జరగాల్సి ఉందన్నారు. అలాగే ఆయా కమిటీలు 15రోజుల్లోగా నియామకం చేసేందుకు కూడా తీర్మానం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలుచేస్తున్న రేషన్ కార్డులు, పించన్లు తదితర ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారందరికీ అందేవిధంగా కమిటీలను ఏర్పాటు చేసి సర్వేలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతికి తావులేని విధంగా పథకాలన్నీ అమలు చేయనున్నట్లు తెలియజేసారు. పార్టీ పరంగా కార్యకర్తలకు, నాయకులకు నామినేటెడ్ పదవుల భర్తీని త్వరలో చేపడతామన్నారు. పారదర్శక పాలన ప్రజలకు అందించాలన్నది ప్రభుత్వ ధ్యేయమన్నారు. జిల్లాలో భూ కుంభకోణాలపై అడిగిన ఒక ప్రశ్నకు బదులుగా ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా జిల్లాలో చోటుచేసుకున్న భూ కుంభకోణాలను వెలికితీసి బాధ్యులు ఎంతటి వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు. అలాగే రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఎక్కడికక్కడ గంజాయి అక్రమ రవాణాను నియంత్రిస్తున్నామని తెలియజేసారు. బెల్టుషాపులు, ఇసుక అక్రమ రవాణాపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలియజేసారు. అంతకుముందు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పంఛకర్ల రమేష్‌బాబు, వాసుపల్లి గణేష్ తదితరుల సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీపరంగా చేపట్టాల్సిన పనులు, క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి అనుసరించాల్సిన విధివిధానాలు, నామినేటెడ్ పోస్టుల నియామకాలు తదితర విషయాలపై క్షుణ్ణంగా సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సభ్యులు పప్పల చలపతిరావు, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లాదేశం కార్యదర్శి బుద్ద నాగజగదీశ్వరరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించాలని తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
అనకాపల్లి(నెహ్రూచౌక్), జూలై 24: రైతులు, కౌలురైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్న కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు సోమవారం ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక తహాశీల్ధార్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేసారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు వైఎన్ భద్రం మాట్లాడుతూ బిజెపి పాలిత రాష్ట్రాలలోనే రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ శాంతియుతంగా పోరాటం చేస్తున్న తరుణంలో నిర్ధాక్షిణ్యంగా పోలీసులుచేత కాల్పించి రైతుల హత్యలకు ప్రభుత్వం పూనుకుందని ఆయన అరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటుధర కల్పించడంలోనూ, స్వామినాధన్ కమీషన్ సిపార్సులు, కోనేటి రంగారావు సిపార్సులు అమలుచేయడంలో ప్రభుత్వాలు తీవ్రంగా విఫలం అయినందునే రైతులకు ఈ దుస్థితి ఏర్పాడిందన్నారు. రైతులకు సమగ్ర చట్టం తీసుకువచ్చి ఆత్మహత్యలు నివారించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాధాలు చేస్తూ ధర్నా చేస్తున్న నేపద్యంలో పట్టణ సిఐ విద్యాసాగర్ తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని అందోళన కారులను సుమారు 20మందిని అరెస్టుచేసి బలవంతంగా లాక్కెల్లి జీపులో ఎక్కించి పోలీస్టేషన్‌కు తరలించారు. అరెస్టు ఆయినవారిలో సిపిఎం మండల కార్యదర్శి ఆడారి అప్పారావు, ఎంఎ మాదవరావు, ఆర్ దొరబాబు, తాకాశి వెంకటేశ్వరరావు, కర్రి సూరిఅప్పారావు, కోన లక్ష్మణ, కోరిబిల్లి శంకర్రావు, విత్తనాల పోతురాజు, కర్రి సూర్యనారాయణ, సిహెచ్ నాగరాజు, శ్రీరాందాసు అబ్బులు, వియ్యపు రాజు తదితరులు ఉన్నారు.

విద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలని అర్డీవో కార్యాలయం ముట్టడి
అనకాపల్లి(నెహ్రూచౌక్), జూలై 24: విద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలంటూ భారత విద్యార్ధి ఫెడరేషన్ అధ్వర్యంలో సోమవారం వసతిగృహల్లో ఉంటున్న విద్యార్ధులు ర్యాలీగా వచ్చి అర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ శివాజీ, భవాని మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహల్లో ఉంటున్న విద్యార్దులకు కనీస వౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. స్వంత భవనాలు లేక శిధిలమైన భవనాల్లో బిక్కుబిక్కుమంటూ ఉండడంతో తాగునీరు, మరుగుదొడ్లు లేకపోవడం, దోమలతో నానా అవస్థలు పడుతున్నామని వారు ఆరోపించారు. అన్ని అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి, కశింకోట, చీడికాడ, మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని, నియోజక వర్గంలో డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో విద్యార్ధినిలు సుదూర ప్రాంతాలకు వెళ్ళి ప్రైవేట్ కార్పొరెట్ కళాశాలల్లో చదువుకునే స్థోమత లేక చదువును మధ్యలోనే నిలిపివేసిన విద్యార్ధినిలు ఎంతో మంది ఉన్నారన్నారు. అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్టీలను ఇవ్వకపోవడంతో విద్యార్ధులకు నాణ్యమైన బోజనం పెట్టడంలేదని వారు అవేధన వ్యక్తం చేసారు. వసతి గృహాల్లో విద్యార్ధులు ఎదుర్కుంటున్న అనేక సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవో సత్యనారాయణకు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి జి సురేష్, సిఐటియుసి నాయకులు దాకారపు శ్రీనివాసరావు అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.

రహదారికి ఇరువైపులా పూలు, పండ్ల మొక్కలు
కొయ్యూరు,జూలై 24: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలో ఉన్న బోడి కొండల్లో వివిధ రకాల మొక్కలు రహదారికి ఇరువైపులా పూలమొక్కలను ఉపాధి పథకంలో నాటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డ్వామా అదనపు పి.డి. ఆనందరావు తెలిపారు. స్థానిక వెలుగు సమావేశ మందిరంలో చింతపల్లి, గూడెం, కొయ్యూరు మండలాల ఉపాధి సిబ్బందికి రికార్డుల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో అడవుల శాతం తగ్గిపోతున్న తరుణంలో అడవులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పంచాయతీల పరిధిలోని రహదారులకు ఇరువైపులా పూలు, పండ్ల జాతి మొక్కల పెంపకానికి ఆయా సర్పంచ్‌ల తీర్మానంతో చర్యలు చేపడుతున్నామన్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో పెంపకం చేపట్టే వాటి నుండి వచ్చే ఆదాయం వాటికే సమకూరుతుందన్నారు. జిల్లాలో ఈ ఏడాది 20 వేల పంట కుంటలు తవ్వకం లక్ష్యం కాగా ఇప్పటికి 10వేల పంట కుంటలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రస్తుతం రోజూ రెండున్నర లక్షల మంది ఉపాధి కూలీలు పని చేస్తున్నారని తెలిపారు. పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏడు రకాల రికార్డలను నిర్వహించాల్సి ఉందన్నారు . ఉపాధి కూలీలంతా విధిగా బ్యాంకు ఖాతాలు తెరవాలని , కూలీ సొమ్ము వారి ఖాతాలకు నేరుగా జమ అవుతుందన్నారు. జిల్లాలో ఉన్నత చదువులు చదివిన ఫీల్డ్ అసిస్టెంట్ , సి. ఓ.ల్లో 50 మందిని డి. ఎ.లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో చింతపల్లి ఎ.డి. రవీంధ్రనాధ్, ఎం.పి.డి. ఓ. ఇమ్మాన్యూయేల్, ఎ.పి. ఓ.కొండబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

పన్ను విధానంలో బ్రిటిష్ జాడలు
విశాఖపట్నం, జూలై 24: బ్రిటిష్ వారు నిర్మించిన పన్నుల మూల స్వరూపం ఆధారంగానే నేడు పన్నుల వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయని ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్ మహింతి అన్నారు. ఆదాయపన్ను దినోత్సవాన్ని సోమవారం విశాఖ వుడా చిల్డ్రన్ ఎరీనాలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ ఆదాయ పన్ను విభాగం భారత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 50 శాతం ఆదాయ పన్ను ద్వారానే వస్తోందని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు తొమ్మిది లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చిందని చెప్పారు. పన్ను చెల్లింపుదారులతో స్నేహపూర్వక వాతావరణంలో మెలిగేందుకు ఆదాయ పన్ను శాఖ అధికారులు కృషి చేస్తున్నారని మహంతి తెలియచేశారు. ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పన్ను చెల్లించే ఈ ఫైలింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని అన్నారు. చెల్లించిన పన్నును ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం కల్పించామని అన్నారు. సకాలంలో రిఫండ్‌ను పొందేందుకు ఈ ఫైలింగ్ ప్రోసెసింగ్‌ని ఏర్పాటు చేశామని చెప్పారు.

గ్రంథాలయాన్ని యువత వినియోగించుకోవాలి
జగదాంబ, జూలై 24: గ్రంథాలయాలను ఉపయోగించుకోవడంలో యువత పోటీ పడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి ఉదయకుమార్ అన్నారు. విశాఖ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి వేడుకలురి సోమవారం ఘనంగా జరిగాయి. సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత అయ్యంకి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సొసైటీ అధ్యక్షుడు, స్టీల్ ప్లాంట్ గ్రంథాలయ మేనేజర్ పిఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ గ్రంథాలయాలు ప్రజలను చైతన్య వంతులను చేస్తాయని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు శ్రీదేవి, రామలక్ష్మి, ఎం శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛత లక్ష్యం కావాలి
విశాఖపట్నం, జూలై 24: స్వచ్ఛతతో కూడిన పరిసరాలను తీర్చిదిద్దడమే లక్ష్యం కావాలని జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ అన్నారు. స్వచ్ఛ భారత్ పక్షోత్సవాలను పురస్కరించుకుని హెచ్‌పిసిఎల్ విశాఖ రిఫైనరీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార రధాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్ర విశాఖ సాకారం నిమిత్తం ప్రజల్లో అవగాహన కోసం హెచ్‌పిసిఎల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ విశాఖ సాధనకోసం పరిశ్రమలు, స్వచ్ఛంధ సంస్థలు సహకరించడం హర్షణీయమన్నారు. స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ విశాఖ సాధనకు జివిఎంసి, హెచ్‌పిసిఎల్ సంయుక్తంగా రూ.5 కోట్లు వెచ్చించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. గెడ్డల్లో పూడికతీత పనులు, కంపేక్టర్ వాహనం, కంపేక్టర్ బిన్లు తదితర స్వచ్ఛ పరికరాల కొనుగోలుకు ఈ నిధులు వెచ్చిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ సంచుల వినియోగం, నివాస, వాణిజ్య సముదాయాలు, రహదార్లు పరిశుభ్రంగా ఉంచాలని, డ్రెయినేజీలు శుభ్రపరచాలని చెత్తను వేసేందుకు కుండీలను వినియోగించాలంటూ నినాదాలను రాసిన ప్రచార రధం నగరంలో ప్రచారం చేస్తుంది. శరీర పరిశుభ్రత, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత వంటి వాటిని ప్రచురించారు. స్వచ్ఛత, ఆరోగ్య నినాదాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. అంతకు ముందు స్వచ్ఛ నినాదాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్‌పిసిఎల్ జనరల్ మేనేజర్ రాజారావు, శ్రీరాములు, చీఫ్ మేనేజర్ శర్మ, సిఎంఓ డాక్టర్ ఎ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించండి
విశాఖపట్నం, జూలై 24: గ్రామ రెవెన్యూ సహాయకుల (విఆర్‌ఎ) సమస్యల పరిష్కారం కోరుతూ జవిఎంసి గాంధీ విగ్రహం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ రమేష్ మాట్లాడుతూ విఆర్‌ఎలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్‌ఎలుగా అధికారికంగా నియమించాలని, మండలాల్లో బకాయి పడిన జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన విఆర్‌ఎలను విఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించాలని, 010 పద్దుపై జీతాలు చెల్లించాలని, 10వ పీఆర్‌సి అమలు చేయడంతో పాటు రూ.500 డిఎ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్‌లు పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు వరకూ వివిధ రూపాల్లో నిరసన తెలపనున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు నాగేశ్వర రావు ,ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ టి సముద్రం తదితరులు పాల్గొన్నారు.