ఖమ్మం

అప్పుల ఊబిలో రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 24: వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నామని చెబుతున్న పాలకులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. లక్షకోట్ల రూపాయలతో వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు నిధి ఏర్పాటు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పెవిలియన్ గ్రౌండ్‌లో సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడి ఆధారంగా గిట్టుబాటు ధర కల్పించాలని అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నప్పటికీ అధికారంలో ఉన్నవారు విస్మరిస్తున్నారన్నారు. గద్దెనెక్కే వరకు రైతు పాట పాడి గద్దెనెక్కిన తర్వాత రైతు నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు ఆందోళన చేసిన ప్రతిసారి కమిషన్ వేయడం, కమిషన్ వేసి ఆందోళనలను చల్లార్చడం, కమిషన్ సిఫార్సులు వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం సాధారణమైందన్నారు. ఫజల్ బీమా యోజన అంటూ కేంద్రం మోసం చేస్తుంటే అప్పుల రద్దు, వ్యవసాయ రంగ యాంత్రీకరణ, రైతు సంఘాల ఏర్పాటు పేరుతో కెసిఆర్ మాయ చేస్తున్నారని దుయ్యబట్టారు. పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల అప్పుగా ఇచ్చే బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేందుకు మాత్రం ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. యుపిఏ, ఎన్‌డిఏ ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయల రుణాలు రద్దు చేశాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం కల్తీలు, నకిలీలు, లీకేజీలతో పాటు భూ మాఫియాలకు అడ్డాగా మారిందని, ఆయన బంధువులే భూ ఆక్రమణలు చేస్తే చర్యలు తీసుకోవడం లేదన్నారు.
దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతోందని, ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన విధానం మీద దాడులు జరుగుతున్నాయని సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు ఆరోపించారు. మోడీ సర్కార్ తప్పులను ఎత్తి చూపకుండా కెసిఆర్, చంద్రబాబు కొమ్ము కాయడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, మాఫియాలు విజృంభిస్తున్నాయన్నారు.
రైతులను దేశ ద్రోహులుగా చూస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి పతనం తప్పదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు కమ్యూనిస్టు కోట అయిన ఖమ్మం నుంచే ఉద్యమం ప్రారంభం అవుతుందన్నారు.
అనంతరం సిపిఐ శ్రేణులు భారీ ప్రదర్శన ద్వారా జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళనకు సిద్ధపడ్డారు. పోలీసులు ముందుగానే భారీగా మోహరించి వారందరిని అదుపులోకి తీసుకుని రెండో టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేతలను పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో కార్యకర్తలంతా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించి నాయకులను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, నాయకులు టివి చౌదరి, పోటు ప్రసాద్, వౌలానా, కళావతి, జితేందర్‌రెడ్డి, జానిమియా, క్లైమెంట్, కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనులను వేగవంతం చేయండి

* పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కొత్తగూడెం, జూలై 24: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల లక్ష్యాలను అధిగమించటంతోపాటు, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారుచెలక సమీపంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ పంపు సెట్లను సోమవారం మంత్రి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని 14 మండలాల్లో ఉపాధిహామీ పథకం పనులు అసంపూర్తిగా జరుగుతున్నాయన్నారు. ఉపాధి పనుల్లో నూరు శాతం పూర్తి స్థాయిలో పనులు జరుగకున్నా కనీసం 60శాతం పనులనైనా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి అధిక నిధులు మంజూరీ చేస్తున్నట్లు తెలిపారు. చండ్రుగొండ మండలంలో ఉపాధిహామీ పథకం ద్వారా రూ.20 కోట్లతో పనులు చేయటం కోసం 16800 మందికి జాబ్ కార్డులు అందజేయగా కేవలం రూ.66లక్షల పనులు మాత్రమే నిర్వహించటం జరిగిందని అన్నారు. దుమ్ముగూడెం, దమ్మపేటలతోపాటు అనేక మండలాల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. ఇంకుడు గుంటలు, మరుగుదొడ్ల నిర్మాణాలతోపాటు ఉపాధిహామీ పనులను 50 రకాలుగా విభజించామని, ఆ పనులన్నింటినీ పూర్తి చేసేందుకు అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధిహామీ పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదని, జిల్లాలో 1.25లక్షల మంది ఉపాధి కూలీలకు పని కల్పించాలని, ఇందు కోసం డిఆర్‌డివోలు, ఎంపిడివోలు, ఎపివోలు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు సమిష్టి కృషి జరపాలన్నారు. ప్రత్యేకంగా జనరల్ బాడీ సమావేశాలను ఏర్పాటు చేసుకుని, పనులు చేపట్టి కూలీలకు ఉపాధి చూపాలన్నారు. గ్రామస్థాయిలో ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా, పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులు, సిబ్బందిని తొలగించాలన్నారు. వాట్సప్ గ్రూపులను ఏర్పాటుచేసి పనుల వివరాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. ఏడాది పొడవునా ఉపాధిహామీ పథకం పనులు కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం శాసన సభ్యుడు జలగం వెంకటరావు, జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గడిపెల్లి కవిత, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డిఆర్‌డివో పిడి జగత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం

భద్రాచలం టౌన్, జూలై 24: ‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు ఏజెన్సీ ప్రాంతాలే కాకుండా మైదాన ప్రాంతా లు సైతం వర్షాకాలంలో సీజనల్ జ్వరాలతో మంచాన పడేవారు. వేలాదిమంది ప్రజలు జ్వరాలతో పిట్టల్లా మృతి చెందేవారు. పోరాడి సాధించి తెలంగాణ తెచ్చుకున్నాక ఈ మూడేళ్లలో వైద్యసేవల్లో ఎంతో ప్రగతి సాధించాం. విష జ్వరాల విషయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంతో మార్పు వచ్చింది. ఏడాదికేడాది జ్వరాల తీవ్రత తగ్గుముఖం పడుతోంది. వైద్య సదుపాయాలు మెరుగుపర్చుతున్నాం. అంతా కలిసికట్టుగా ముందుకు సాగితే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుంద’ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యసేవలు మెరుగుపరుస్తుందని, వైద్యాధికారులు మెరుగైన సేవలు అందించి ఆరోగ్య తెలంగాణాను నిర్మించాలని ఆయన కోరారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో మంత్రి మాట్లాడారు. మీ ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నా చెప్పండని పేర్కొన్న మంత్రి, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు రోగాలతో ప్రాణాలు పోగొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇవి గత ప్రభుత్వాలు కావని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. మూడేళ్లకాలంలో వైద్యసేవల్లో పెనుమార్పులు వచ్చాయని, వాటిని అందిపుచ్చుకుని వైద్యులు సేవలందిస్తున్నారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో గతం మాదిరిగానే పరిస్థితి ఉందని ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి విషజ్వరాలను మటుమాయం చేయాలన్నారు. జ్వరాలు వస్తే చికిత్స అందించడం ఒక పద్ధతి అని, అసలు జ్వరాల వ్యాప్తికి ఏఏ పరిస్థితులు కారణమవుతున్నాయో తెలుసుకుంటే రోగాన్ని ఆదిలోనే తుంచేసే వీలుంటుందని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, కొన్ని చోట్ల సదుపాయాలు కల్పించాల్సి ఉందని, త్వరలోనే అన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంత్రగాళ్లను నమ్మవద్దని, వ్యాధులు వస్తే ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయనే నమ్మకాన్ని వైద్యులు కల్పిస్తే పరిస్థితిలో పూర్తి మార్పు వస్తుందన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాతాలు ఏర్పాటు చేస్తున్నామని, మూడేళ్లలో ఆ కార్యక్రమాల వల్ల ఎంతో మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు అనేవి కంటికి కనిపించకూడదని, ఆ దిశగా ప్రభుత్వం ఏది కావాలన్నా చేస్తుందన్నారు. వర్షాకాలం ఇప్పటికే ప్రారంభమైందని, గతేడాది కంటే ఈ ఏడాది వ్యాధులు భద్రాద్రి జిల్లాలో సగం వరకు తగ్గాయన్నారు. రానున్న ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వైద్యులకు అత్యంత కీలకమని, ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు వైద్యసేవలు అందించాలన్నారు. పారిశుద్ధ్య సమస్యతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి కూడా వైద్యశాఖ సంబంధిత శాఖల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. జిల్లాలో యువ వైద్యులే అధికంగా ఉన్నారని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. భద్రాద్రి జిల్లాలో వ్యాధుల గణాంకాలు పరిశీలించానని, 6 పీహెచ్‌సీల పరిధిలో గతేడాదిలాగే గణాంకాలు ఉన్నాయని, సంబంధిత మండలాల వైద్యులు పరిస్థితిని అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. ఫలనా కష్టం ఉంది, ఏదైనా సమస్య ఉందని చెబితే పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, పనిచేస్తున్న ప్రాంతంలో స్థానికంగా ఉంటే ప్రజలకు భరోసాతో పాటు సకాలంలో వైద్యం అందించేందుకు వీలుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గతేడాదికి, ఈ ఏడాదికి ఎంతో ప్రగతి సాధించిందని, వ్యాధుల నిర్మూలనలో విశేష కృషి చేస్తుందన్నారు. హైరిస్క్ మండలాలు జిల్లాలో 24 ఉన్నాయని, ఇక్కడి వైద్యులకు వాహన సదుపాయం కల్పిస్తే వ్యాధుల నిర్మూలన 100 శాతం సాధ్యమయ్యే అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ మాటలకు మంత్రి కలగజేసుకొని వైద్యులకు వాహన సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రుల్లోని ల్యాబ్‌లో పరికరాలు సమకూరుస్తామని, కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయనే నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మొక్కను నాటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపడుతుందని, ప్రతిఒక్కరూ మొక్కను నాటి కాలుష్యం నుంచి తమను తాము రక్షించుకోవాలని మంత్రి తెలిపారు. సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఎస్‌ఎంఎస్‌డీసీ ఛైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, ట్రైకార్ ఛైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ సీఈ లక్ష్మణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏం గురూ ఏంది సంగతి

భద్రాచలం టౌన్, జూలై 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్యుల పనితీరు సంతృప్తికరంగా ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో వ్యాధులు నియంత్రించలేకపోవడం తనకు అసంతృప్తిగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో జిల్లాలోని 6 హైరిస్క్ పీహెచ్‌సీల పరిధిలో వ్యాధులు గత ఏడాది మాదిరిగానే ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారిణి చెప్పడంతో మంత్రి కలుగజేసుకున్నారు. ఏందమ్మా మంచిగా ఉన్నవి పదే పదే చెబుతున్నావు, పరిస్థితిలో మార్పు లేని ప్రాంతాల గురించి మాత్రం తీసివేత ధోరణితో మాట్లాడుతున్నావు, ఇలా అయితే ఎలా అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. పినపాక పీహెచ్‌సీ వైద్యాధికారిని ఉద్దేశిస్తూ ‘ఏం గురువు.. ఏంది సంగతి’ అంటూ ఛలోక్తిగా పిలిచారు. కుర్రోడివి.. నీకేమి అయింది అన్న తుమ్మల మీ ప్రాంతంలో గతేడాదికి, ఈ ఏడాదికి పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని, దీనికి నీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. తడబాటుకు గురైన వైద్యుడిని సున్నితంగా మందలిస్తూ నీవు మెరుగైన వైద్యం అందిస్తున్నా వ్యాధులు ప్రబలుతున్నాయా? లేక వ్యాధులు అరికట్టడంలో నీవు విఫలమవుతున్నావా అని అడిగారు. పరిస్థితిలో మార్పు రాకుంటే కష్టమని, మీరు మారకపోతే మిమ్మల్ని మార్చే పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రభుత్వం వైద్యాశాలలకు అన్ని వసతులు కల్పిస్తుందని, జిల్లాలోని మూడు ముఖ్యమైన ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసిందన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులను తలదనే్నలా ప్రభుత్వ వైద్యశాలలు జిల్లాలో ఉన్నాయని, మీవంతుగా మీరు ప్రజలకు సేవ చేస్తే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందన్నారు. వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని, ఏ అవసరమొచ్చినా సంబంధిత మంత్రికి చెప్పుకునే వెసులుబాటు ఉందన్నారు. హైరిస్క్ పీహెచ్‌సీలపై జిల్లా వైద్య ఆరోగ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో వ్యాధులను తరిమికొట్టేందుకు కృతనిశ్చయంతో పనిచేయాలని సూచించారు. పెద్ద పెద్ద ఆసుపత్రులకే సౌకర్యాలు కల్పిస్తున్నామని భావించవద్దని, దశలవారీగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా వైద్యులు కూడా సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. ఒకప్పుడు భద్రాచలం మన్యం విషజ్వరాలతో అల్లాడేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ విషజ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుంటే మంచిదన్నారు. మారుమూల మండలాల్లో పనిచేస్తున్న వారు ఏం చేసినా సరిపోతుందనే ధోరణి ఉండకూడదని, ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని, అటువంటి విధానాన్ని మానుకోని ప్రజల కోసం పని చేస్తున్నామనే నమ్మకాన్ని వైద్యులు కల్పించాలన్నారు.

నీటి గుంటలో పడి ఇద్దరు పిల్లలు మృతి

* రాఘవాపురంలో దారుణం
చింతకాని, జూలై 24: నిర్లక్ష్యం రెండు పసి ప్రాణాలను బలిగొంది. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కోసం తీసిన నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రాఘవాపురంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాఘవాపురం ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం గతంలో సదరు కాంట్రాక్టర్ గుంటలు తీశారు. ఆ ప్రదేశంలో వాటర్ ట్యాంక్ వద్దని నిలిపివేయడంతో తీసిన గుంటలను నిర్లక్ష్యంగా వదిలివేశారు. గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు నీటిగుంట వర్షపు నీటితో నిండిపోయింది. సోమవారం సాయంత్రం గ్రామానికి చెందిన పుట్టబంతి చరణ్ (9), చిన్నసత్తి రోహిత్ (7) ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందారు. పొలం పనులకు వెళ్ళి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు కానరాకపోవడంతో నీటిగుంటలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు కోసం తీసిన గుంటలో శవాలై కనిపించారు. పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. పాఠశాలకు వెళ్తున్న తమ పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో తమ పిల్లలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల మృతికి కారణం అధికారుల నిర్లక్ష్యమని, తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధికారుల నిర్లక్ష్యంతోటే పిల్లలు చనిపోయారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం అందించాలని బాగం హేమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

త్వరలో 100 పడకల ఆసుపత్రి సేవలు

మణుగూరు, జూలై 24: సాధ్యమైనంత త్వరలో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పినపాక నియోజకవర్గ 100 పడకల ఆసుపత్రి అత్యంత ఆధునికంగా సిద్ధమవుతోందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ప్రకటించారు. సోమవారం 100 పడకల ఆసుపత్రి ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వైద్యం కోసం చేపట్టిన పలు పథకాలను వివరించారు. ఈ ప్రారంభోత్సవ వేదికకు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ప్రారంభ ప్రసంగంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గంలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను ప్రజల తరుపున రాష్ట్ర మంత్రులకు నివేదించారు. వైద్యసేవలు గతంకంటే మెరుగ్గా ఉన్నప్పటికీ స్థానికంగా వసతుల కల్పనలో వెనుకబడి ఉన్నందున అదే ప్రధాన సమస్యగా కనబడుతుందని మంత్రులకు వివరించారు. వైద్యులు స్థానికంగా ఉండేలా ప్రతి ఆసుపత్రి ప్రాంగణంలో సిబ్బందికి క్వార్టర్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి లక్ష్మారెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమే ప్రతి పేద, బడుగు, బలహీనవర్గాలకు ఉచిత వైద్యం, విద్యను అందించడమేనని, సాధ్యమైన ఎక్కువ నిధులు ఈ సంక్షేమ కార్యక్రమాలకే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి ఉమ్మడి జిల్లాల్లో వైద్యసేవలకు కేటాయించిన నిధులు రాష్ట్ర రాజధానికి ఏ ఒక్కరోజూ వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతిఒక్కరికీ పైసా ఖర్చు లేకుండా కార్పోరేట్ వైద్యాన్ని అందించగలుగుతుందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రెండు జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులు ఒకెత్తు అయితే ఒక్క పినపాక నియోజకవర్గానికే ప్రభుత్వం కేటాయించిన నిధులు ఆ స్థాయిలో అందుతున్నాయని అన్నారు. సాగు, తాగునీటి కల్పనలో ప్రతిఒక్క రైతుకు, ప్రతి ఎకరాకు రెండు పంటలకు సరిపడే నీటిని అందించడంతో పాటు ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యాలు అందించే భారీ మంచినీటి పథకం కూడా ఈ నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందని తుమ్మల పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక పర్ణశాల-చిన్నరావిగూడెం గోదావరి నదిపై వంతెన నిధుల అంచనా డిజైన్ మార్పు వల్ల ఆగిపోయిందని, అతి త్వరలో రద్దైన పాత టెండర్ల స్థానంలో కొత్త టెండర్లు పిలిచి బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ప్రకటించారు. గోదావరి పరివాహక ప్రాంతాలన్నింటిని కలుపుతూ బూర్గంపాడు నుంచి మొదలుకొని మణుగూరు, ఏటూరునాగారం, తుపాకులగూడెం మీదుగా కాళేశ్వరం వరకు మరో భారీ రోడ్డు కారిడార్ ఏర్పాటుకు జల, రోడ్డు రవాణా మార్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారని, దీని అమలుకు అహర్నిశలు కృషి జరుగుతోందని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ట్రైకార్ ఛైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, టీఎస్‌ఎండీసీ ఛైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరులో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యసేవల కోసం ప్రజలు పడే ప్రయాసను కచ్ఛితంగా తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఎంపిపి చిడెం అంజమ్మ, జడ్పిటిసి పాల్వంచ దుర్గ, సర్పంచి భారతి, అశ్వాపురం ఎంపిపి తోకల లత, ఏఎంసీ ఛైర్మన్ విజయలక్ష్మీతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ రంగానికి ప్రాధాన్యత

* పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
లక్ష్మీదేవిపల్లి, జూలై 24: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పేద ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారుచెలక సమీపంలో ఏర్పాటు చేసిన సోలార్ పంపులను ప్రారంభించారు. రైతులకు పత్రాలను అందించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. మారుమూల గిరిజన గ్రామాలైన బంగారు చెలక ప్రాంతంలో సోలార్ పంపుల ద్వారా రైతులు వ్యవసాయ పనులు చేయటం అభినందనీయమని అన్నారు. సోలార్ సిస్టం ద్వారా రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కొత్తగూడెం నియోజక వర్గంలో చేస్తున్న పనులు ఆదర్శనీయమని అన్నారు. వ్యవసాయ రంగం ద్వారా రైతులు ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు కూరగాయల సాగుపై దృష్టి సారించాలన్నారు. కొత్తగూడెం నియోజక వర్గంలో టూరిజం అభివృద్ధి, సోలార్ పంపుల నిర్మాణం, మినీ స్టేడియంల ఏర్పాట్లు వంటి రంగాలకు అగ్రగామిగా నిలుస్తుందన్నారు. రూ.4.73కోట్ల వ్యయంతో 96 సోలార్ బోరుభావులను ఏర్పాటుచేసి గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన కొత్తగూడెం శాసన సభ్యుడు జలగం వెంకటరావును అభినందించారు. ఉపాధి పథకం ద్వారా జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి పనులు చూపించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం పనులు పూర్తి స్థాయిలో జరగటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగూడెం శాసన సభ్యుడు జలగం వెంకటరావు మాట్లాడుతూ 96 సోలార్ వ్యవసాయ బోర్ల ద్వారా 210 లబ్ధిదారులు, 800 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండించి, ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు.