కడప

స్వచ్ఛంద సంస్థలకు గుడ్‌హార్ట్ వృద్ధుల అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 24: కడప పాతరిమ్స్‌లోని గుడ్‌హార్ట్ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న వృద్ధులను రిమ్స్ ఆసుపత్రికి తరలింపుచేసి వారి బాగోగులు చూడటం జరుగుతోందని, 51 మంది వృద్ధులను జిల్లాలోని వివిధ స్వచ్చంధ సేవా సంస్థలు, వృద్ధాశ్రమాల్లో చేర్పించేందుకు సోమవారం కలెక్టర్ చాంబర్‌లో సేవాసంస్థల ప్రతినిధులతో కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడారు. జమ్మలమడుగు మండలం గురిగనూరు లోని చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ, జమ్మలమడుగు శ్రీరామనగర్ లోని శ్రీకృష్ణదేవరాయ యువజన సంఘం, మైలవరం మండలం దొమ్మరనంద్యాలలోని ఖాదీ సిల్క్ గ్రామోద్యోగ సమితి, కడప పట్టణం శంకరాపురంలో ఉన్న పద్మావతి మహిళా మండలి ప్రతినిధులు ఒక్కొక్కరు 10మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు సమ్మతిని తెలపడం జరిగింది. ఇందుకు కలెక్టర్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వృద్ధులకు జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన సహాయ సహకారాలతోపాటు బియ్యం పంపిణీకి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వృద్ధులకు ప్రభుత్వం తరపున వృద్ధాప్య పెన్షన్‌ను ఇవ్వడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఉచిత బియ్యం పంపిణీకి అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు పంపాలన్నారు. అలాగే మానసిక స్థితి సరిగా లేని మిగిలిన 11 మంది వృద్ధుల బాగోగులను చూసేందుకు వివిధ సేవా సంస్థలతో మాట్లాడాలని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవరావును కలెక్టర్ ఆదేశించారు. వృద్ధులను ఆదుకసనేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు వాణి, జిల్లా సఫ్లై అధికారిణి విజయవాణి, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
గండికోట నిర్వాసితులకు
అన్యాయం జరగదు - కలెక్టర్‌గండికోట పరిహారం పంపిణీలో నిజమైన నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగదని కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వాసితులు ఎటువంటి ప్రలోభాలకు లోనుకావద్దని, తప్పుడు ధృవీకరణలు, సర్ట్ఫికెట్లు సమర్పించి పరిహారం పొందడానికి ప్రయత్నించినట్లయితే అట్టివారిపై చట్టపరిధిలో క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అర్హులైన నిర్వాసితుల వివరాలతో జాబితా ఉందని, నకిలీ పత్రాలు సమర్పించి పరిహారానికి ప్రయత్నించే వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.

జిల్లా అభివృద్ధిపై మంత్రి సోమిరెడ్డి దృష్టి

కడప,జూలై 24: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జిల్లాపై దృష్టిసారించి ఓ పక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు సమీక్షిస్తూ మరోపక్క పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి, ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి నియోజకవర్గాల వారీగా పర్యటనలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపైనే దృష్టిసారించి ప్రజలతో మమేకం కావడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆయన ప్రతివారం జిల్లా పర్యటన నిమిత్తం రావడం, మంత్రి ఆదినారాయణరెడ్డిని వెంటపెట్టుకుని పర్యటనలు చేస్తున్నారు. మంత్రి ఆదితో పలువురు నేతలు పూర్తిస్థాయిలో సర్దుబాటు కాకపోవడం కారణంగా సోమిరెడ్డి అందర్నీ సర్దుబాటుచేసి అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఇరువురు మంత్రుల్లో సోమిరెడ్డి కడప పార్లమెంట్‌కు, ఆదినారాయణరెడ్డి రాజంపేట పార్లమెంట్‌కు ఇన్‌చార్జ్‌లు కావడంతో ఇరువురు మంత్రులు నియోజకవర్గాల వారీగా మండల వారీగా పర్యటనలు చేసి తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగించేందుకు కూడా మంత్రులు ఇరువురు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో పలువురిని నియామకం చేయడం, మరికొన్ని నియామకం చేయకపోవడంపై మంత్రులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నియోజకవర్గాల్లో రెండు గ్రూపుల నేతలు మధ్య ఆధిపత్యపోరు నడుస్తుండటంతో ఇరువర్గాల మధ్య సఖ్యత కుదుర్చేందుకు కూడా మంత్రులు చర్యలు తీసుకోనున్నారు. అయితే ఆ సఖ్యత అనేది ఎంతవరకు సాధ్యపడుతుందోనన్న అనుమానాలు మంత్రులకు లోలోపల లేకపోలేదు. అందుకుకారణం 2019 ఎన్నికలకు ఇరువర్గాల నేతలు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. వలస వచ్చిన నేతలకే పార్టీలో అధికప్రాముఖ్యత ఉండటంతో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధిష్ఠానం వర్గనేతలకు సమన్యాయం చేస్తామని ప్రకటించింది. ఆమేరకు న్యాయం జరిగినట్లయితే ఇరువర్గాలు ఏకమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో రెండుపార్లమెంట్ స్థానాలు వైసిపికి, 9 అసెంబ్లీస్థానాలు వైసిపికే లభించడం టిడిపి రాజంపేట అసెంబ్లీతోనే సర్దుకోవాల్సివచ్చింది. ఈపరిస్థితుల్లో 2019 ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుని జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజలతో మమేకమై వచ్చే ఎన్నికల్లో అధికస్థానాలు సంపాదించేందుకు కుల సామాజికవర్గాల వారిగానే నేతలను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు ఇరువురు మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జిల్లాపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది.
మత్తుకు బానిసవుతున్న యువత!

రాజంపేట, జూలై 24: హై సొసైటీలో డ్రగ్స్ వాడకంకు అలవాటు పడితే.. లో సొసైటీలో మత్తు పదార్థాలకు యువత అలవాటు పడుతుంది. మొత్తానికి యువత మత్తుకు బానిసలవుతుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం డ్రగ్స్ అమ్మకాలు, సేకరణ, వాడకం తదితర అంశాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న అంశం తెలిసిందే.. రాజంపేట ప్రాంతం నుండి అయితే గంజాయి, హెరాయిన్ తదితర మత్తు పదార్థాలు కువైట్ లాంటి గల్ఫ్ దేశాలకు సరఫరా అవుతున్నాయి. ఇందుకు సంబంధించి పలు సందర్భాల్లో మత్తు పదార్థాలను చేరవేసే వ్యక్తులను రాజంపేట పోలీసులు పట్టుకొని అరెస్టు చేయడం కూడా జరిగింది. మత్తు పానీయాలు సేవించడం ఓ స్టేటస్‌గా భావించి నేటి యువత మత్తుకు బానిసలై తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. మత్తుకు బానిసకావడం వల్ల అటు ఆరోగ్యానికి ఇటు ఆర్థికపరంగా నష్టం వాటిల్లుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికి రోజు, రోజుకు యువకులు పెడద్రోవ పడుతూనేవున్నారు. హై సొసైటీలో డ్రగ్స్ వాడకమున్నా వారికి ఆర్థికపరమైన సమస్యలుండవు. లో సొసైటీలో మాత్రం మత్తు పదార్థాలకు అలవాటుపడడం వల్ల వారు సంపాదించే డబ్బు మొత్తం మత్తుకు ఖర్చుపెడుతుండడంవల్ల వారి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. అంతేకాక నేడు గుట్కా సంస్కృతి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గుట్కా తింటే గుటుక్కుమంటారని వైద్యులు ఒకవైపు ఎంతగానో ఘోషిస్తున్నప్పటికి ఫలితం లేకపోగా, రోజు, రోజుకు గుట్కాప్రియుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గుట్కా తినేవారిలో నూటికి ఎనబై శాతం మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు అంటున్నారు. గుట్కా తినడం ప్రారంభించిన కొద్ది రోజులకే నాలుక కింది భాగంలో మచ్చలు ఏర్పడి అనారోగ్యమేర్పడుతుందని వైద్యులు అంటున్నారు. అయినప్పటికి ఈ సూచనలు పాటించేవారు కరవయ్యారు. ఇటీవల కాలంలో గుట్కా ప్రియుల సంఖ్య మరింత పెరిగిందని గుట్కా వ్యాపారులు అంటున్నారు. వ్యాపారం పెరుగుతుండటంతో గుట్కా ప్యాకెట్లను బడ్డీ కొట్లలో అందంగా అలంకరించి అకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గుట్కా ప్యాకెట్లపై ఆరోగ్యానికి హానికరమనే ప్రకటనలు ఉన్నప్పటికి వినియోగదారులు దీనిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గుట్కా నిషేధమున్నప్పటికీ ఎక్కడ పడితే అక్కడ అవి లభిస్తుండడం విశేషం. చిన్నపిల్లలు, మహిళలు, యువతతోపాటు వృద్ధులు కూడా తమలపాకులో గుట్కాలను ఉపయోగిస్తున్నారని పలువురు అంటున్నారు. గుట్కాలతోపాటు హాన్స్, చైనీఖైనీ తదితర మత్తు పదార్థాలకు మంచి గిరాకి ఉందంటే ఆశ్యర్యం వేయకమానదు. క్లీనర్లుగా పనిచేసేవారు, చదువులేని వారు కేవలం 10 సంవత్సరాల నుంచి మత్తుకు బానిసవుతున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలసి మద్యం సేవించే విదేశీ సంప్రదాయం కూడా కొన్ని కుటుంబాల్లో చోటుచేసుకుంటుండటం శోచనీయం. మద్యం సేవించి తూలుతూ ఇంటికి వచ్చే పిల్లలను మందలించే తల్లిదండ్రులతో పాటు గర్వంగా చూసుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేయకమానదు. బీరువద్ద నుంచి కల్లువరకు యువకులు ఏది వదలకుండా సేవిస్తుండటం దురదృష్టకరం. మద్యంకు బానిసవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నకొద్దీ రోజు, రోజుకు ఘర్షణలు, వివాదాలు అధికమవుతున్నాయి. మత్తుకు అలవాటుపడి పెడత్రోవలో నడుస్తున్న యువత ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచించి వారిని సక్రమ మార్గంలో నడిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా వారిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రగ్స్‌పై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినట్టే గుట్కా, హాన్స్, చైనీఖైనీ లాంటి మత్తు పదార్థాల అమ్మకాలు కూడా సాగకుండా నియంత్రించాల్సిన అవసరముంది. లేకుంటే హై సొసైటీలో డ్రగ్స్ వాడకం వల్ల వారి ఆరోగ్యాలే చెడిపోతాయి తప్ప ఆర్థికంగా వారికి ఎలాంటి సమస్యలుండవు. లో సొసైటీలలో వాడే మత్తు పదార్థాల వల్ల వారి ఆరోగ్యాలతో పాటు కుటుంబాలు కూడా ఆర్థికంగా చితికిపోతుండడం జరుగుతుంది.

సోలార్ రైతులకు న్యాయం చేయండి

గాలివీడు, జూలై 24: తూముకుంట, వెలిగల్లు గ్రామాల్లో సోలార్ ప్లాంటుకు భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని తూముకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కడప ఆర్డీవో చినరాముడుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ ప్లాంటు భూములు కోల్పోతున్న రైతులందరికీ న్యాయం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి అవినీతికి తావు లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కొందరు రైతులు పాసుపుస్తకాలు ఉండి ఆన్‌లైన్‌లో లేకుండా ఉంటాయని, వీటన్నింటినీ రెవెన్యూ అధికారులు గుర్తించి వారికి న్యాయం చేయాలన్నారు. రైతులకు నష్టపరిహారం అందించేంత వరకు సోలార్ పనులను ఆపేయాలన్నారు. సోలార్ ప్లాంటులో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ఆయన సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ భవానీ, ఆర్‌ఐ యునీత్‌కుమార్‌రెడ్డి, సోలార్ ఎండీ శివశంకర్‌నాయుడు, మండల వైసీపీ నాయకుడు యధుభూషణరెడ్డి, మాజీ సర్పంచ్ బయారెడ్డి, రైతులు ఆంజనేయులురెడ్డి పాల్గొన్నారు.

భక్తుల కల్పతరువు శ్రీవిజయదుర్గాదేవి..

కడప,(కల్చరల్)జూలై 24: చేరికొలచిన వారికి కొండంత అండగా భక్తులను కష్టాల నుంచి కాపాడే కల్పతరువు శ్రీవిజయదుర్గాదేవి అమ్మవారుగా జిల్లాలో ప్రసిద్ధి. గత 16సంవత్సరాలుగా వైభవంగా వెలుగొందుతున్న దేవి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా ఉంది. కడప -కర్నూలు జాతీయ రహదారిలో బిల్టప్ సమీపంలో అత్యంత ప్రకాశవంతంగా నిర్మించిన శ్రీవిజయదుర్గాదేవి ఆలయం కడప నగరానికే తలమానికంగా నిలిచింది. డబ్బులిస్తే ఖర్చుఅవుతాయి, సహాయం చేస్తే మరచిపోతారు, ఒక గొప్ప ఆలయం నిర్మిస్తే తరతరాలుగా ప్రజల్లో భక్త్భివం పెంపొందుతుందన్న ఆలోచనతో నిర్మించిన శ్రీవిజయదుర్గా అమ్మవారి ఆలయం అమ్మవారి అనుగ్రహంతో భక్తుడు సుధామల్లికార్జునరావు మహోన్నత ఆశయం నుంచి ఉద్భవించిందే ఈ అమ్మవారి దేవస్థానం. తన అభివృద్ధికి దోహదపడిన అమ్మవారు ప్రజలకు తరతరాలుగా గుర్తుండేలా దేవస్థానాన్ని నిర్మించాలనే ఆలోచన నుండి విజయవాడ శ్రీకనకదుర్గమ్మ అమ్మవారిని కడపకు తీసుకురావడంలో సుధామల్లికార్జునరావు ఆశయం నెరవేరిందని చెప్పవచ్చు. ఆలయం నిర్మించిన వేలావిశేషం ఏమిటోకానీ అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని ఎంతచూసినా తనివి తీరదు. ఎన్నికష్టాలున్నా ఇబ్బందులు ఎదురైనా అమ్మవారి చెంతకు వచ్చి సేదతీరే భక్తులు కోకొల్లలు. అమ్మ కరుణాకటాక్ష వీక్షణాలు భక్తులకు సోకగానే కష్టాలన్నీ పటాపంచలై పోతున్నాయన్న ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో నెలకొని వుంది. మొదట తక్కువ మంది భక్తులతో ప్రారంభమైన దేవాలయ దినచర్యలు నేడు భక్తులు తండోపతండాలుగా రావడంతో మండపం ప్రాంగణమంతా భక్తిప్రపత్తులతో విరజిల్లుతోంది. అమ్మవారి నిత్యనైవేద్యాలు సమర్పించడం దగ్గర నుంచి ఆగమశాస్త్రం ప్రకారం ఎంతో భక్త్భివంతో ఆలయ పూజారులు, ఉద్యోగులు అమ్మసేవలో పునీతవౌతున్నారు. ఆలయం శుచి, శుభ్రత విషయంలో మల్లికార్జునరావు ప్రత్యేక శ్రద్ధతోపాటు ఆలయ ఉద్యోగుల నిబద్దత దాగివుందని చెప్పవచ్చు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, సకల సౌభాగ్యాలతో ఉండాలని, పాడిపంటలతో రైతులు విరజిల్లాలని, వరుణయాగాన్ని ఎంతో వ్యయప్రయాసాలతో నిర్వహించడం ప్రతి ఏటా జరుగుతోంది. మండు వేసవిలోనైనా వరుణయాగం చేసిన రోజు విజయదుర్గా ఆలయంలో వర్షం రావడం గత 16సంవత్సరాలుగా సంభవిస్తోంది. ఇంతకంటే అమ్మవారి మహత్యానికి మరేది నిదర్శనం కాదు. అలాగే ప్రతి ఏడాది చండీయాగాన్ని ఆలయంలో నిర్వహిస్తున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏడాదికి రెండుమార్లు నిర్వహించడంతోపాటు దసరా ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నిర్వహించడంలో భక్తకోటి పట్టుదల నిదర్శనంగా చెప్పవచ్చు. దేవాలయ ప్రాంగణంలో అమ్మవారి పారాయణంతో తాము శుభిక్షంగా ఉంటున్నట్లు భక్తులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు ఆలయంలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు మహామంగళహారతులు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం 5గంటలకు సుప్రభాతసేవతో ప్రారంభమై 6.30గంటలకు సహస్తన్రామ మంత్రోచ్చారణలు నిర్వహించారు. 7గంటలకు అమ్మవారికి నైవేధ్యం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహానివేదన, సాయంత్రం 4గంటలకు భక్తుల దర్శనం కోసం ఆలయం తెరుస్తారు. మహామంగళ హారతులు, 9గంటలకు అమ్మవారి పవళింపుసేవతో కార్యక్రమాలు ముగుస్తాయి. అలాగే అమ్మవారి దయాదాక్ష్యిణాల వల్లే మా కుటుంబమంతా సుఖసంతోషాలతో గడుపుతున్నామని పట్టణానికి చెందిన ఎంతో మంది భక్తులు అమ్మ అనుగ్రహాన్ని కొనియాడుతున్నారు. ఈనేపధ్యంలోనే శ్రావణమాసోత్సవాలకు భక్తులకోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రాహుదోష పూజలు
శ్రీవిజయదుర్గాదేవి ఆలయంలో ప్రతి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రాహుదోష పూజలు నిర్వహిస్తారు. ఈపూజకు రాయలసీమ నలుమూలల నుంచి హాజరైన భక్తులు తొలుత ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుంటారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో పూజలు ప్రారంభిస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు మహిళలకు పూజా విధానాన్ని తెలుపుతూ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గంటపాటు జరిగే ఈ పూజల అనంతరం భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు.

అధిక వాడకం.. అనర్థమే..!

జమ్మలమడుగు, జూలై 24: అధిక దిగుబడులే లక్ష్యంగా మోతాదుకు మించి అధికంగా రసాయనాలు, ఎరువులు వాడకం వ్యవసాయం భారంగా మారుతోంది. ఇటువంటి తరుణంలో రసాయన ఎరువులు వాడకం తగ్గించినా మంచి దిగుబడులు సాధించవచ్చన్న నిపుణుల సూచలను పట్టించుకోవడం లేదు. కొంతమంది రైతులు మాత్రమే సేంద్రియ ఎరువుల వాడకంతో మంచి దిగుబడులను సాధిస్తున్నారు. రసాయన ఎరువులు అధికంగా వాడడంవల్ల మానవులు, జంతువుల జీవన విధానంతో పాటు వాతావరణంపై కూడా ప్రభావాన్ని చూపుతుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగు తరుణంలో ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయధికారులు సిద్దం అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 1.39 లక్షల హెకార్లుగా అంచనా కాగా, ఖరీఫ్, రబీ సీజన్‌లలో జిల్లావ్యాప్తంగా 1.92లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగం అవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పటికీ చాలామంది రైతులు రసాయన ఎరువులు అధికంగా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంవల్ల పురుగు నశించకపోగా యేటా కొత్తవి పుట్టుకొస్తున్నాయి. దీంతో యేటా అధికశక్తివంతమైన మందుల వాడకం పెంచుతున్నారు. దీనివల్ల భూమి, వాతావరణం కలుషితం అవడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా ఎకరాకు రెండు బస్తాల డిఎపి ఒకటిన్నర్ర బస్తా పొటాష్ సరిపోతుంది. అయితే విచక్షణ రహిత వినియోగం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. దిగుబడి ఆశించిన మేర లేకపోవడం, పెట్టుబడి పెరిగిపోవడం, మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభ్యం కాకపోవడం వంటి కారణాలతో అన్నదాతల జీవన స్థితి దయనీయంగా మారి ఆర్థికంగా చితికిపోతున్నారు.
వేపపూత యూరియా ఉత్తమం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో పూర్తిస్థాయిలో వేపపూత కలిగిన యూరియా విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. గతంలో సాధారణ యూరియా మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు వేపపూత ఉన్న యూరియా మాత్రమే వినియోగిస్తున్నందున వృథా కావడంలేదు. ఒక ఎకరం వరి సాగుకు 75కిలోల వినియోగిస్తే సరిపోతుంది. 110నుండి 150 కిలోల యూరియా వినియోగిస్తున్నారు. వ్యవసాయాధికారులు ఎన్నిమార్లు అవగాహన కల్పిస్తున్నా కాంప్లెక్సు ఎరువులు పైపాటుగా వినియోగిస్తున్నారు. సాధారణంగా దుక్కిలో లేదా 15 రోజుల్లోపు మాత్రమే వేసుకోవాలి. రైతులు పంట సాగులోనూ పైపాటుగా వేస్తున్నారు. దీనివల్ల ఎటువంటి ఫలితం లేకపోగా వృథాగా ఖర్చుచేసిన పెట్టుబడి పెంచుకుంటున్నారు. పంటల సాగులో రైతులు అవసరానికి మించి పురుగుమందులను వినియోగిస్తున్నారు. అనవసర వ్యయం పెరుగుతోంది. అంతేకాకుండా క్రిమికీటకాలకు పురుగు మందులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతోంది. వ్యవసాయ శాఖ సూచనలు పాటించకుండా విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగంవల్ల ఎకరానికి రూ.2వేల వరకు అధికంగా రైతులు వెచ్చించాల్సి వస్తోంది. దీనివల్ల దిగుబడులు అధికంగా రాకపోగా పంటలకు మరింత నష్టం వాటిల్లుతోంది. పొలాల్లో భూసారం కూడా తగ్గిపోతోంది. వ్యవసాయశాఖ నిపుణుల సూచనల మేరకు రైతులు తమ పొలంలో భూసార విలువలు తెలుసుకొని, తదనుగుణంగా ఎరువులు వినియోగించాలి.
ఎకరానికి 4టన్నుల పశువుల ఎరువును వినియోగిస్తే భూసారం పెరుగుతుంది. పశువుల ఎరువు లభ్యత లేనిపక్షంలో పచ్చిరొట్ట ఎరువులను వినియోగించి మంచి దిగుబడులను సాధించడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.