నిజామాబాద్

అటవీశాఖ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగంపేట్, జూలై 24: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ఖన్నాపూర్ తాండలో తాండవాసులు వద్దన్నప్పటికీ కందకాలు తవ్వి అదే కందకాల్లో ఇద్దరు చిన్నారుల మృతికి కారణం అయిన అటవిశాఖ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని శాసనమండలి ప్రతిపక్షనేత మహ్మద్ షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు. మండలంలోని ఖన్నాపూర్ తాండలో ఆదివారం మధ్యాహ్నం అటవిశాఖ అధికారులు తవ్విన కందకాల్లో పడి మృతి చెందిన శైలజా, కార్తీక్ కుటుంభాలను సోమవారం షబ్బీర్‌అలీ పరామార్షించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంభాలకు 50వేల రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించి కొంత నగదు మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆడుతూ పాడుతూ హాయిగా ఉండే అభం శుభం తెలియని పిల్లలు మృతి చెందడం దురదృష్టం అని చాలా బాధకరమైన విషయం అని అన్నారు. ఎంత మంది వచ్చిన సహాయం అందించడం తప్ప పిల్లల ప్రాణాలు తీసుకుని రాలేమని అన్నారు. పిల్లల తల్లితండ్రుల కడుపుకోత తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవిశాఖ అధికారులు పట్ట్భాముల్లో కందకాలు తవ్వడం దౌర్జన్యం అని అన్నారు. పేదవారి పొట్టకొట్టడం మంచిది కాదని అన్నారు. తాత ముత్తాతాల నుండి సాగుచేసుకుంటున్న భూముల్లోకి అటవిశాఖ అధికారులు ఏలా వస్తారని అన్నారు. అటవిశాఖ అధికారులు అటవిశాఖ భూముల్లో కాకుండా పట్ట్భాముల్లోనే కందకాలు తవ్వి పిల్లల ప్రాణాలు పోయేందుకు కారణం అటవిశాఖ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బాధిత కుటుంభానికి ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్‌గ్రెషియా మూడు ఎకరాల భూమి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు. ఆయన వెంట ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ జాజాల సురేందర్, జిల్లా మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జమునారాథోడ్, గాంధారి మాజీ ఎఎంసి చైర్మెన్ తాన్‌సింగ్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

పేదల అభివృద్ధికి పెద్దపీట
బోధన్ రూరల్, జూలై 24: పేదవారి అభివృద్ధికి తమ సర్కారు పెద్ద పీట వేస్తోందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకే ప్రభుత్వం ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు. నలభై కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని దీనిని బట్టి ఇక్కడి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రధాని నరేంద్రమోడి సైతం తెలంగాణ సంక్షేమ పథకాలను అభినందించారని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజలు సర్కారు పథకాలను సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని ఆయన సూచించారు. గ్రామాలలో సర్పంచ్‌లు, పట్టణ కేంద్రాలలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అలాగే సర్కారు పథకాలను వారికి చేరవేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, జిల్లా సహకార బ్యాంకు అద్యక్షుడు గంగాధర్‌రావ్ పట్వారీ, మున్సిపల్ కమిషనర్ స్వామినాయక్, తహశీల్దార్ గంగాధర్, తెరాస నాయకులు కరీం, ఆబిద్‌సోఫి, శరత్‌రెడ్డి, గుండేటి రాములు, బుద్దె రాజేశ్వర్, సంజీవ్‌కుమార్, ధూప్‌సింగ్, పాలవార్ సాయినాథ్, గుమ్ముల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ముట్టడి
కంఠేశ్వర్, జూలై 24: జాతీయ స్థాయిలో వ్యవసాయ సంక్షోభం నివారణకు లక్ష కోట్ల నిధులతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. సిపిఐ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు ర్యాలీగా తరలిరాగా, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సిపిఐ నాయకులకు మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. కలెక్టరేట్‌లోకి చోచ్చుకుని వెళ్లేందుకు యత్నించిన సిపిఐ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వన్‌టౌన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయం మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రైతాంగం భరించలేని సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని తమిళనాడు, కేరళ, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాల్లో కరవుతో పాటు తీవ్రమైన దుర్భిక్షం నెలకొందన్నారు. వాతావరణం అనుకూలించి సమృద్ధిగా పంటలు పండితే, వాటికి మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రైతన్న కుదేలైపోతున్నారని అన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడానికి కారణం మార్కెట్ శక్తులు, అధికారులు మిలాఖత్ కావడమేనని ఆరోపించారు. దీంతో ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతులు నిలువు దోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కనీసం పెట్టుబడులు కూడా చేతికందని రైతులు, అప్పుల ఊబిలో కూరుకుపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో బలన్మరణాలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు రైతాంగం పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి, మోసపూరిత తీరుకు ఇలాంటి సంఘటనలు అద్దంపడుతున్నాయని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్ కనుసన్నల్లో పాలన కొనసాగిస్తున్న ఎన్డీయే సర్కార్, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం గనులు, పరిశ్రమల అభివృద్ధి, ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ శక్తులకు లక్షలాది ఎకరాలను భూ సేకరణ పేరిట రైతుల నుండి బలవంతంగా లాక్కోని ధారదత్తం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనివల్ల ఇటీవల కాలంలో కోటి 50లక్షల మంది వ్యవసాయ కార్మికులుగా మారారని అన్నారు. క్రాఫ్ ఇన్సురెన్స్ వల్ల ఇన్సురెన్స్ కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయే తప్పా, రైతులకు ఒనగూరిందేమీలేదన్నారు. రైతులకు పంట రుణాలు ఇస్తున్న సమయంలో బ్యాంకర్లు ఇన్సురెన్స్ డబ్బులను కట్ చేసి ఇస్తున్నారని, అయితే ఇన్సురెన్స్ కంపెనీల నిబంధనల వల్ల మెజార్టీ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. రైతులు ప్రతి సంవత్సరం ప్రకృతి వైఫరీత్యాలకు గురవుతున్నారని, ప్రభుత్వాలు మాత్రం రైతాంగ శ్రేయస్సు కోసం కనీస మాత్రంగానైనా చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు వేసిన జయతీఘోష్, స్వామినాథన్ కమిషన్‌ల సిఫారసులు అమలు చేసి ఉంటే, ఈ పరిస్థితులు దాపురించేవి కావన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, రైతాంగ సంక్షేమం కోసం పాటుపడాలని, లేదంటే సిపిఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, సహాయ కార్యదర్శి సుధాకర్, బోసుబాబు, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

పోలీసు శాఖలో అవినీతిపై కొరడా!
బోధన్, జూలై 24: పోలీసు శాఖలో అవినీతి పై ఎట్టకేలకు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇన్నాళ్లు స్తబ్దంగా ఉన్న అధికారులు విచారణల ఆధారంగా ఒక్కొక్కరిపై కొరఢా జులిపిస్తున్నారు. గత వారం రోజుల క్రితం బోధన్ సబ్‌డివిజన్‌లోని రెంజల్ ఎస్సై రవికుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు తాజాగా సోమవారం బోధన్ రూరల్ సిఐ శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు వేశారు. వారం రోజుల కాల వ్యవధిలో ఇద్దరు అధికారులపై వేటు వేయడం పోలీసు శాఖలో కలకలం సృష్టించింది. ఒకే సబ్‌డివిజన్‌లో ఒక ఎస్సై, ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌లు సస్పెండ్ కావడం పోలీసు శాఖలో ఇదే ప్రథమమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇద్దరు కూడా ఒకే సర్కిల్‌కు చెందిన వారు కావడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాకు అన్ని విధాలుగా సహకరించారన్న ఆరోపణలు, ఇతర కేసుల విషయంలో నిందితుల తారుమారు వ్యవహారాలు అధికారులను ఇరకాటంలో పడేశాయి. అలాగే పోలీసు శాఖకు మచ్చతెచ్చిపెట్టే విధంగా పలు ఘటనలలో అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం ఉన్నతాధికారులను ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలం నుండి ఈ ఇద్దరు అధికారుల తీరుపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు గత పదిహేను రోజులుగా రహస్య విచారణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అనేక విషయాలు వెలుగు చూడటం, వచ్చిన ఆరోపణలను నిజమని తేలడంతో వీటి ఆధారంగా ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ సబ్‌డివిజన్‌లోని పోలీసు శాఖలో క్షేత్ర స్థాయి పరిస్థితి పూర్తిగా దారి తప్పింది. గత ఏడాది క్రితమే ఉన్నతాధికారులు ఈ సబ్‌డివిజన్‌లో క్షేత్ర స్థాయి అధికారుల తీరుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కొంతమంది ఎస్సైల బాగోతాలపై అప్పటి అడిష్నల్ ఎస్పీ ద్వారా విచారణ జరిపించారు. ఆ తర్వాత కొందరు ఎస్సైలకు స్థానభ్రంశం కల్పించగా వారు ఉన్నత స్థాయిలో తమ పలుకుబడిని ఉపయోగించి బదిలీ ఉత్తర్వులను రద్దు చేయించుకున్నారు. ఆ తర్వాత అధికారులు క్షేత్ర స్థాయి అధికారుల వ్యవహారంపై ఎటువంటి దృష్టి సారించలేక పోయారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు ఠాణాల వారీగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతి ఆరోపణలను మూటగట్టుకున్నారు. తమకు ఉన్నత స్థాయిలో అండదండలు ఉన్నాయి కదా అన్న ధీమాతోనో లేక ఉన్నతాధికారులు ఈ సబ్‌డివిజన్ గురించి పట్టించుకోవడం లేదు కదా అన్న ఉద్ధేశమో తెలియదు గానీ కొందరు క్షేత్ర స్థాయి అధికారులు అనుసరించిన తీరు ఆ శాఖలో ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. కాగా గత నెల రోజుల నుండి ఉన్నతాధికారులు ఎవ్వరూ ఊహించని రీతిలో పదును పెడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైలు, సిఐల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నిఘా వర్గాల ద్వారా పకడ్బందీగా విచారణలు సాగించి పూర్తి స్థాయి ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా ఇంటలిజెన్స్ అధికారులు సైతం రంగంలోనికి దిగి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వ్యవహారాలపై ఎంక్వయిరీలు చేసి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. ఈ నివేదికల ఆధారంగా పోలీసు ఉన్నత స్థాయి అధికారులు మొదటగా రెంజల్ ఎస్సైపై వేటు వేశారు. తాజాగా బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసులును విధుల్లో నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏది ఏమైనా పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఉన్నతాధికారులు తీసుకుంటున్న క్రమశిక్షణా చర్యలు క్రిందిస్థాయి అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఒకే వారంలో ఇద్దరిపై వేటు పడటంతో మునుముందు ఎటువంటి పరిస్థితి ఉంటుందోనన్న ఆందోళన మొదలయ్యింది.

ఈత వనాలను విరివిగా పెంచాలి
కామారెడ్డి, జూలై 24: ప్రధాన కాల్వలు, చెరువుగట్లపై ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో గౌడ కులస్తులతో పాటు ఎక్సైజ్ అధికారులు కలిసి విరివిగా ఈత వనాలు పెంచేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని బాన్స్‌వాడ డివిజన్ కేంద్రం పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ కట్టపై ఇరువైపుల ఈత మొక్కలను ఎక్సైజ్ అధికారులతో కలిసి మంత్రి నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఈత వనాలు పెంచితే నాణ్యమైన కల్లు లభ్యం అవుతుందని, తద్వారా ప్రజల ఆరోగ్యానికి స్వచ్ఛమైన కల్లు ఎంతో మంచిదని అన్నారు. విరివిగా ఈత చెట్లు ఉన్నరోజు స్వచ్ఛమైన కల్లు లభ్యం అవుతుందని అన్నారు. ఈత చెట్లను గౌడ కులస్తులు విరివిగా పెంచాలని కోరారు. హరతహారం మూడవ విడతలో భాగంగా ఈత మొక్కలను నర్సరీల్లో ఎక్కువ సంఖ్యలో ఈసారి పెంచడం జరిగిందని, ప్రతి ఒక ఈత మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతను ఎక్సైజ్ శాఖతో పాటు గౌడ కులస్తులు చూసుకోవాలని కోరారు. వీటితో పాటు పండ్లు, పూల మొక్కలు సైతం నాటాలని, మొక్కలు నాటే కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాలో వస్తున్న స్పందన చూస్తే సంతోషంగా ఉందన్నారు. ఇదే ఉత్సహంతో కష్టపడితే మొక్కలు పెరిగి చెట్లు అయి, మనకు ప్రాణవాయువు అందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్‌వాడ ఆర్డీఓ నాగేశ్వర్‌రావు, ఎక్సైజ్ శాఖ అధికారులు, గౌడ సంఘం సభ్యులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

బీడీ పరిశ్రమపై జిఎస్‌టి షురూ...!
నిజామాబాద్, జూలై 24: వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమల్లోకి వచ్చిన మూడు వారాల వ్యవధిలోనే పలు కీలక రంగాలపై దాని ప్రభావం కనబడుతోంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమ జిఎస్‌టి ప్రభావంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోవడం ఖాయమని స్పష్టమవుతోంది. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం ఇప్పటికే అనేక ఆంక్షలు అమలు చేస్తుండడం వల్ల బీడీ కార్మికులకు ఇదివరకటి తరహాలో చేతినిండా పని లభించడం దుర్లభంగా మారింది. ఇలాంటి తరుణంలో జిఎస్‌టి పరిధిలోకి చేర్చడం బీడీ పరిశ్రమ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. బీడీ కంపెనీల యాజమాన్యాలు కార్మికులకు నెలలో సగటున 20రోజుల పాటు పని కల్పించేవారు కాగా, ప్రస్తుతం జిఎస్‌టి అమలును సాకుగా చూపుతూ సగానికి పైగా కంపెనీలు పని దినాలను తగ్గించివేశాయని కార్మికులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. జిఎస్‌టి అమల్లోకి వచ్చి నెల రోజులు కూడా గడువకముందే పరిస్థితి ఇలా ఉంటే, మునుముందు తమ ఉపాధికి పూర్తిగా ఎగనామం పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించిన బీడీ కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి బీడీ పరిశ్రమను జిఎస్‌టి నుండి మినహాయించాలని కోరుతూ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ విషయమై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసింది. అయితే కేంద్రం నుండి మాత్రం సానుకూల దృక్పథం కానరాకపోవడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. బీడీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే సుమారు రెండున్నర లక్షల మంది వరకు బీడీ కార్మికులు ఉండగా, తెలంగాణ వ్యాప్తంగా 7లక్షల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనాలు వెళ్లదీస్తున్నారు. బీడీ పరిశ్రమ ద్వారా ప్రతిరోజు సుమారు మూడు కోట్ల రూపాయల లావాదేవీలు కొనసాగుతాయంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఇంతటి విస్తృత స్థాయిలో ఉపాధిని అందిస్తున్న బీడీ పరిశ్రమను జిఎస్‌టి పరిధిలోకి తేవడంతో యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. కొత్తగా అమలు చేస్తున్న వస్తు సేవల పన్నును అనుసరిస్తూ బీడీ కట్టలపై 28శాతం, తునికాకుపై 18శాతం పన్ను విధిస్తున్నారు. ఇలా ప్రస్తుతం అమలవుతున్న ధరపై ప్రతి వెయ్యి బీడీలకు 16రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి కింద వసూలు చేస్తుంది. దీంతో పెరిగిన పన్ను మొత్తాలను కలుపుకుని బీడీ యాజమాన్యాలు కూడా బీడీ కట్టల ధరలను గణనీయంగా పెంచడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండాపోయింది. ధరలు పెరిగిన కారణంగా మార్కెట్‌లో బీడీ కట్టలను కొనుగోలు చేసే వారి సంఖ్య పడిపోవడం, ఇది కాస్తా బీడీ కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే బీడీ కార్మికులకు పని దినాలు సగానికి పడిపోగా, మునుముందు వారు పూర్తిగా ఉపాధికి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని బీడీ కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. నిజానికి జిఎస్‌టి ప్రభావంతో బీడీ పరిశ్రమకు ఇప్పుడప్పుడే అంతగా నష్టం వాటిల్లే ప్రమాదం లేనప్పటికీ, దశాబ్దాల కాలం పాటు కార్మికుల శ్రమనే పెట్టుబడిగా మల్చుకుని కోట్లాది రూపాయలను కూడగట్టుకున్న యాజమాన్యాలు, ప్రస్తుతం పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడంతో తమ కంపెనీలను మూసివేయడమే ఉత్తమమని భావిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే సగానికి పైగా కంపెనీలు తమ బిచాణాను ఎత్తివేశాయి. కార్మిక సంఘాల బలవంతం మీద మరికొన్ని కంపెనీలు అయిష్టంగానే పనులు కల్పిస్తున్నాయి. అలాంటి కంపెనీలన్నీ ప్రస్తుతం జిఎస్‌టి అమలును సాకుగా చూపుతూ బీడీ పరిశ్రమ నుండి పూర్తిగా పక్కకు తప్పుకునే యోచనలో ఉన్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే బీడీ పరిశ్రమనే నమ్ముకుని మనుగడ సాగిస్తున్న లక్షలాది మంది ఉపాధికి దూరమై పనుల కోసం అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

దంపతుల ఆత్మహత్యాయత్నం
* భార్య మృతి
నందిపేట, జూలై 24: నందిపేట మండలం అయిలాపూర్ గ్రామంలో సోమవారం భార్యభర్తలు జంగం వౌనిక(25), జంగం మహేష్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. భార్య వౌనిక ఇంట్లో ఉరేసుకుని మృతి చెందగా, భర్త మహేష్ పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం అయిలాపూర్‌కు చెందిన జంగం మహేష్‌తో కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం రాంరెడ్డిపల్లికి చెందిన వౌనికతో గత నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా భార్యభర్తలు ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారని ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. అయితే సోమవారం ఉదయం భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని, అనంతరం భర్త మహేష్ బయటకు వెళ్లి ఇంటికి వచ్చి చూడగా, తలుపులు భిగించి ఉండటంతో కిటికిలోంచి చూడగా భార్య వౌనిక ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండటం గమనించాడన్నారు. దీంతో పక్కంటివారిని పిలిచి తలుపులు బద్దలుకొట్టి రక్షించే క్రమంలోనే వౌనిక ప్రాణాలు విడిచిందన్నారు. భార్య ఆత్మహత్యకు పాల్పడటంతో మనస్థాపానికి గురైన భర్త మహేష్ ఇంట్లో ఉన్న పినాయిల్ సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గమనించిన బంధువులు వెంటనే మహేష్‌ను నందిపేట ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతురాలు వౌనిక తండ్రి పెంటన్న తన కూతురు మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, వౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

సిసి రోడ్డు పనులకు భూమిపూజ
ఇందూర్, జూలై 24: ఎడపల్లి మండలం జానకంపేట్ శ్రీ లక్ష్మినర్సింహాస్వామి ఆలయ ఆవరణలో 3లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సిసిరోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ రేకులపల్లి భూపతిరెడ్డి భూమిపూజ చేశారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని అష్టముఖి పుష్కరిణిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోనేరు నుండి లక్ష్మినర్సింహాస్వామి ఆలయం వరకు చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ, లక్ష్మినర్సింహాస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గతంలో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే అష్టముఖి పుష్కరిణి నుండి ఆలయం వరకు నిధుల కొరత వల్ల రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోయాయని స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు తన దృష్టికి తీసుకరాగా, ఎమ్మెల్సీ కోటా నుండి 3లక్షల రూపాయలు మంజూరీ చేయడం జరిగిందన్నారు. పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టి, భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూడాలని ఆలయ కమిటీ చైర్మన్ విజయ్‌గౌడ్, నిర్వాహకులకు సూచించారు. అనంతరం లక్ష్మినర్సింహాస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ప్రత్యేక పూజలు చేయగా, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్మినర్సింహాస్వామి ఆలయం ఆవరణలో ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దశరథ్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పృధ్వీరాజ్, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శేఖర్‌రాజ్, నిజామాబాద్ మండల పరిషత్ వైస్ ఎంపిపి పూర్ణచందర్, ఎంపిటిసి సభ్యులు ఆకుల శ్రీనివాస్, అంగపట్నం ప్రమీలా, జక్కు పోశెట్టి, నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటాం
లింగంపేట్, జూలై 24: బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం మండలంలోని ఖన్నాపూర్ తాండలో ఆదివారం మద్యాహ్నం అటవీశాఖ వారు తవ్విన కందకాల్లో మృతి చెందిన చిన్నారులు శైలజా, కార్తీక్‌ల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామార్షించారు. అనంతరము అక్కడే ఉన్న అటవిశాఖ వారు తవ్విన కందకాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరము అక్కడే ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఖన్నాపూర్ తండాలో ఒకే కుటుంభానికి చెందిన ఇద్దరు చిన్నారురు ప్రమాదవశత్తు మరణించడం దురదృష్టమని అన్నారు. బాధిత కుటుంభానికి సహాయం చేయాలన్న ఉద్దెశ్యంతో తాను ఉదయం నుండి కలెక్టర్‌తో, అటవిశాఖ మంత్రి జోగురామన్నతో చర్చించి జరిగిన సంఘటన వివరాలు అందించడం జరిగిందన్నారు. అడవి జంతువుల వల్ల మరణిస్తే తాము సహాయం చేస్తాం తప్ప ఇలాంటి సంఘటనలకు తాము ఏం చేయలేమని తెలపడంతో వెంటనే ఈ సమస్యను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకుని పోయినట్లు వెల్లడించారు. దీంతో సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించి మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రెండులక్షల రూపాయల చొప్పున మొత్తం నాల్గు లక్షలు ఎక్స్‌గ్రేషియా, అలాగే మృతిని తండ్రికి ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌తో ఉద్యోగం ఇప్పిస్తానని, అలాగే మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అందించేందుకు అంగీకరించారని అన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తమ పట్ట్భామిలో అటవిశాఖ వారు అక్రమంగా కందకాలు తవ్వారని సంబందిత పట్టాదార్ పాస్‌పుస్తకాన్ని ఎమ్మెల్యేకు అందించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వెంటనే రెవెన్యూ శాఖ, అటవిశాఖ అధికారులను ఉమ్మడి సర్వేను చేపట్టాలని ఆర్డీఓ దేవేందర్‌రెడ్డిని ఆదేశించారు. వెంటనే హద్దులు గుర్తించాల్సిందిగా చెప్పారు దీంతో త్వరలో ఈ ప్రాంతానికి అటవిశాఖ మంత్రిని తీసుకుని రావడం జరుగుతోందని అన్నారు
శవరాజకీయాలు చేయడం సరికాదు
ఖన్నాపూర్ గ్రామంలో ప్రమాదవశత్తు ఇద్దరు చిన్నారులు మృతి చెందితే శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ తన పదవికి తగ్గట్టు హుందాగా మాట్లాడాలని, అర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, షబ్బీర్‌అలీ ఆరోపణలను ఆయన విజ్ఞతకె వదిలేస్తున్నట్లు చెప్పారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కాని శవాలను పక్కన పెట్ట శవరాజకీయాలను మానుకోవాల్సిందిగా సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఎంతమందికి మీరు సహాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్‌లో చనిపోతే సంస్థ వారితో మాట్లాడి ఐదు లక్షల నష్టపరిహారం ఇప్పంచిన ఘనత తమదని ఎమ్మెల్యే అన్నారు. గతంలో అచ్చయపల్లి మండలంలో పీర్ల పండగ సందర్భంగా జరిగిన సంఘటనలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ఇప్పించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ హాయంలో రైతులను సైతం పట్టించుకోకుండా ఇప్పుడు శవరాజకీయలు చేయడం సబబు కాదని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ సర్కార్ కేవలం 1లక్షల50వేలు ఇచ్చి చేతులు దులుపుకోలేదా అని ప్రశ్నించారు. కాని తమ ప్రభుత్వం ఐదులక్షల ఆర్థిక సహాయాన్ని అందించి మృతుల కుటుంబాలను ఆదుకుంటున్నామని అన్నారు. ఎవ్వరికైన రాజకీయాల ఆశశ్వాతం అని, మానవత్వం శాశ్వతం అన్న విషయాన్ని షబ్బీర్‌అలీ గుర్తించాలని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టడం సరైన విధానం కాదని అన్నారు. ఒక కాంగ్రెస్ నాయకుడు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు తనను ఆరోపించే అర్హత కూడ లేదని కాంగ్రెస్ సెగ్మెంట్ ఇన్‌చార్జీ సురేందర్‌ను ఉద్ధెశించి అన్నారు. ఎమ్మెల్యే వెంట జాయింట్ కలెక్టర్ సత్తయ్య, డిఎస్పీ నర్సింహా, ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన సంపత్‌గౌడ్, ఎల్లారెడ్డి ఎఎంసి చైర్మెన్ వెంకట్‌రాంరెడ్డి, సర్పంచ్ మంజుల ఎల్లేశం, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లమయ్యలు ఉన్నారు.

డిగ్రీ కళాశాల కోసం ఐక్య పోరాటం
దోమకొండ, జూలై 24:దోమకొండ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం అఖిలపక్షం పార్టీలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని రాష్ట్ర జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ఎంపిడిఓ కార్యాలయం వద్ద అఖిలపక్షం చేపడుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టపడి మనందరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా, పోరాటం చేయకుండా ఎదీ సాధించలేమని, అఖిలపక్షం నాయకులు ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలను సాధించుకోవచ్చని వివరించారు. దీనికి తమ జేఎసిల మద్దతు ఉంటుందన్నారు. కళాశాల ఏర్పాటు కోసం 54 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో కదలిక రాలేదన్నారు. మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడితే విద్యార్థుల కష్టాలు తీరతాయన్నారు. రిలే నిరాహారలో ప్రతీ గ్రామంలోని నాయకులు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి పార్టీ నాయకులు సిద్దరాములు, ఇరు జిల్లాల జెఎసి నాయకులు గోపాల్‌శర్మ, జగన్నాధం, సిద్దరాములు, మండల అఖిలపక్షం నాయకులు నర్సయ్య, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.