డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన వైపు, మెహంది పార్టీలు, సంగీత్ పార్టీలు అంటు ఉండేవి కావు. పెళ్లికొడుకు గుర్రంమీద రావడం లేదు. ఏవి ఎలా జరుపుకున్నా అందరూ చాలా సరదాగా గడిపేస్తున్నారు.
ఆ సాయంత్రం సంగీత్ ఏర్పాటుచేసుకున్నారు మూర్తిగారి బేస్మెంట్‌లోనే. బాగా దగ్గర స్నేహితులు, బంధువులతో ఇల్లు నిండిపోయింది. అన్నయ్య కొడుకు చంద్రశేఖర్ (మా రాజకుమారుడు) వాడి భార్య, కొడుకుతో వచ్చాడు. మా నాన్న కజిన్ కొడుకు భాస్కర్, భార్య వచ్చారు. మా రాజకుమారుడి భార్య శ్రీలక్ష్మి రాంగానే నాకు కొండంత బలం వచ్చినట్లు అనిపించింది. ఆ అమ్మాయి కూడా 4,5 ఏళ్ళ నుండి ఈ దేశంలో ఉండటంతో ఆ అమ్మాయికి కూడా బాగా అన్నీ అలవాటయ్యాయి. ఇక నావైపు ఏం చెయ్యాలన్నా శ్రీలక్ష్మి చూసుకోవడం మొదలుపెట్టింది.
సంగీత్ కార్యక్రమంలో ఆ ఊరిలోనే ఉన్న మంచి మ్యూజిక్ టీచర్ పాట కచేరి. ఆవిడ స్టూడెంట్స్ ఒకరు ఒకరుగా, గ్రూప్‌గా పాడటం మొదలుపెట్టారు.
ఆ పూట తేజ చక్కగా గోధుమ రంగు గాంగ్రచోళి వేసుకుంది. విరబోసుకున్న జుట్టు, చేతినిండా గాజులు అచ్చం నార్త్ ఇండియన్‌లాగానే ఉంది.
ఆ అమ్మాయి పక్క వౌళి ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా అనిపించారు. అక్కడకు వచ్చిన వాళ్ళల్లో చాలామందికి అదే అభిప్రాయం మెదిలింది.
క్రింద కొంతమందికి చైర్స్, ముందు పెద్ద తివాచీ వేశారు. నేలమీద కూర్చోవడం కష్టం అనుకున్నవాళ్ళు చైర్‌లో కూర్చున్నారు. శ్రీలక్ష్మి, బాబు క్రింద కూర్చున్నారు. భాస్కర్ భార్య కూడా అక్కడే కూచుంది. ఆ అమ్మాయితోపాటు నేను కూడా కింద కూర్చున్నాను. నా మూలంగానో ఏమిటో సావిత్రి కూడా కింద కూర్చుంది. పెద్దగా ఇంట్రెస్ట్ లేనివాళ్ళు పైన టీవీ చూస్తూ ఉండిపోయారు. యధాలాపంగా వెనక్కి తిరిగిన సావిత్రి చటుక్కున హడావిడిగా లేచి వెళ్లింది. ఏమై ఉంటుందో అని నేను వెనక్కి చూచాను. వౌళి వంగి ఆవిడతో ఏదో అన్నాడు. ‘‘వౌళి సిగ్నల్ ఇస్తే చాలు అమ్మ గవర్నర్స్ ఆర్డర్స్‌లా పరుగెడుతుంది అంటోంది తేజ చెల్లెలు లత ఇంగ్లీషులో’’.
తల ఊగించి థాంక్స్ అంటు మామూలుగా సావిత్రి వచ్చి కూర్చుంది నా పక్కనే! తేజ చెల్లెళ్ళు, మూర్తిగారు, అంతా ఏమిటన్నట్లు ఆవిడ వంకే చూచారు. ఆవిడ ఏం లేదన్నట్లు తల ఊపి పాట వినడంలో మునిగిపోయింది.
మైక్ పట్టుకుని పాడుతున్న అమ్మాయి పాట పూర్తి అయింది. అందరూ చప్పట్లు కొట్టారు. చాలా చక్కగా పాడింది. ఆ పిల్ల కూడా అమెరికాలోనే పుట్టి పెరిగింది. అక్కడే నేర్చుకుంటోంది. తెలుగు పాటలను ఇంగ్లీష్‌లో రాసుకుని మరీ పాడేస్తోంది. అక్కడక్కడ తెలుగు ఉచ్చారణ లోపం తప్పిస్తే చాలా చక్కగా పాటడింది. అదే అన్నాను ఆ అమ్మాయితో.
ఇంతలో సావిత్రి మైక్ పట్టుకుని నుంచుంది.
‘‘ఏమిటంటోయ్ మీరు కూడా పాడేస్తారా ఇప్పుడు. కూతురు పెళ్లనేటప్పటికి పాటలు కూడా వచ్చేస్తున్నయి’’ అంది ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ మమత. అక్కడ అందరికి తెలుసు సావిత్రి అసలు కూనిరాగం కూడా తీయదని. ఇంకా అందరూ తలా జోక్ వేయడం మొదలుపెట్టారు ఆవిడ పాటను గురించి.
సావిత్రి కూడా చాలా స్పోర్టివ్‌గా నవ్వేస్తూ ‘‘మరి మీకేదో సర్‌ప్రైజ్ చూపించాలి కదా ఈ పార్టీలో. అందుకే నేనూ, మూర్తిగారు మీ ముందు ఓ డ్యూయెట్ పాడాలని అనుకుంటున్నాం’’ అంది.
అందరూ చప్పట్లు కొట్టారు. ‘‘చూశారా, ఎవరికైనా పాట పాడాక చప్పట్లు కొడతారు, నేను పాడకుండానే కొట్టేశారు. అంటే నన్ను పాడవద్దనేగా మీ ఉద్దేశ్యం’’ అంది చిరుకోపం ప్రదర్శిస్తూ.
‘‘్థంక్ యూ! యూ గాట్ ఇట్ మామ్!’’ అరిచారు కూతుళ్ళు. రూం అంతా నవ్వులతో నిండిపోయింది. వెంటనే మూర్తిగారి వంక రమ్మన్నట్లు సౌంజ్ఞ చేసింది. ఆయన బుద్ధిమంతుడిలా వచ్చి సావిత్రి పక్కన నుంచున్నాడు.
‘‘చిన్నప్పుడు రౌడీలా వేసేవారే అలా ఓ ఈల వెయ్యండి’’ అంది. ఆయన నవ్వుతూ చెవులు చిల్లులు పడేలా ఈల వేశాడు. చూపుడు వేలు, బొటన వేలు కలిపి పెదవులమీద పెట్టుకుని.
ఒక్కసారి గది అంతా నిశ్శబ్దమయింది. అందరూ వాళ్ళిద్దరి వంకే చూడసాగారు. ‘‘అమ్మయ్యా!’’ అంది సావిత్రి. ‘‘నౌ ఐ హావ్ యువర్ అటెన్షన్’’ అంది. అందరూ కుతూహలంగా చూడసాగారు.
‘‘ఈ రోజు మన అందరి మధ్య ఒక చక్కని సంగీత విద్వాంసురాలు, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఆమెను ఒక పాట పాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను’’ అంది.
ఎవరయి ఉంటారా అని అనుకుంటుంటే ‘‘శ్రీమతి కల్యాణి’’ అంది.
చటుక్కున తల ఎత్తి చూశాను. సావిత్రి ననే్న ఆహ్వానిస్తోంది- ఆశ్చర్యంగా చూశాను.
‘‘లేదండి. నేను పాడలేను. ఈమధ్య అసలు పాడటం లేదు’’ అని తప్పించుకోవాలని చూశాను. కానీ ఆవిడ వినిపించుకోలేదు.
నేను ఎంతకీ ఒప్పుకోకపోవడం చూసి ‘‘దిస్ రిక్వెస్ట్ ఈజ్ ఫ్రమ్ గ్రూమ్. మీరు అతని కోరికను మన్నించాల్సిందే’’ అంది సావిత్రి.
చటుక్కున వెనక్కి తిరిగి చూశాను. వౌళి ఉన్నవైపు, వాడు బాగా వెనక్కి వెళ్లి నుంచున్నాడు. నన్ను చూడగానే చిరునవ్వుతో తల పంకించాడు.
వాడి చిన్నప్పుడు డాబామీద కూర్చుని సంగీత సాధన చేసేదాన్ని. నా చుట్టుపక్కలే ఆడుకుంటూ ఉండేవాడు.
ఒకసారి తనూ నేర్చుకుంటానని మొదలుపెట్టాడు. చదువులో తీరిక లేకపోవడంతో వెనుకబడిపోయింది. తల వంచుకుని రెండు మూడు నిమిషాలు ఆలోచించాను. అసలు ఇలా పబ్లిక్‌గా పాడటానికి ఇష్టం లేకే ఎప్పుడూ టీచర్‌తో పాట కచేరీలు ఒప్పుకునేదాన్ని కాదు. కానీ ఆల్ ఇండియా రేడియోలో నాకు సుఖంగా ఉండేది. చుట్టుప్రక్కల వాయిద్యాలు తప్ప ఎవరూ ఉండేవారు కాదు. ఇప్పుడు ఇంతమందిలో వౌళి పాడమంటున్నాడు. పైగా అందరి ముందూ చెప్పించాడు.
మళ్లీ తల ఎత్తి వాడి వంక చూచాను. ఇప్పుడు వాడి పక్కనే తేజ కూడా నుంచుని ఉంది. ఏం పాడనా అన్నట్లు చూచాను. ఇక్కడనుంచే పాడతానని అన్నాను. అందరి ముందు నుంచుని మైక్‌లో పాడటం ఇష్టంలేదు. నేను ఆలాపన మొదలుపెట్టగానే తేజ చెల్లెలు శశి మైక్ పట్టుకుని నా పక్కన కూర్చుంది. టీచర్‌గారి విద్వాంసులు, వయొలిన్, తబలా మొదలుపెట్టారు.
‘చందన చర్చిత’ అంటూ అష్టపది మొదలుపెట్టాను. అప్పటిదాకా సందడిగా ఉన్న రూం పిన్‌డ్రాప్ సైలెంట్ అయిపోయింది.
పాట ముగించి కళ్ళు తెరిచి తల ఎత్తేసరికి హాలు పూర్తిగా నిండిపోయి ఉంది. ఇందాకటిదాకా మిగిలిన రూమ్స్‌లో ఉన్నవారు కూడా అక్కడికి వచ్చేశారు. చప్పట్లతో మారుమోగిపోయింది చాలాసేపు.
‘‘చూశారా! మీ పాట ఎంతసేపు వినిపించిందో- చప్పట్లు అంతసేపు వినిపిస్తున్నాయి’’ అంది సావిత్రి.
‘‘చాలా బాగా పాడారు. వౌళి చెప్పకపోతే ఇలాటి పాట వినే అదృష్టం కోల్పోయేవాళ్లం’’ అంది సావిత్రి. కొంచెం చిరునవ్వుతో తల వంచుకున్నాను.
‘‘మూర్తీ! మీ కుటుంబానికి పి.సుశీలగారు చాలా మంచి ఫ్రెండ్స్ అని తెలుసు. కానీ పెళ్లికి వస్తున్నారని అనుకోలేదు’’ అన్నారు ఒకాయన.
‘‘మీరు మరో రెండు అష్టపదులను పాడితేగాని మేము ఇవాళ ఇక్కడనుండి వెళ్ళం. మేము వెళ్ళకపోతే మీకే నష్టం. రేపు మీకు ఇంకా చాలా పనులున్నాయి’’ అన్నదొకావిడ, నాకు ఎదురుగా మఠం వేసుకుని కూర్చుంటూ, మీ ఇష్టం అంది కచ్చితంగా.
ఆ తరువాత మరో రెండు అష్టపదులను పాడాను వౌళికి ఇష్టమైన ఒక ఎంకి పాటతో పాటు.
పాట ముగించి మంచినీళ్లు అందుకుంటూ వౌళి వంక చూచాను.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి