ఫోకస్

తొందరపాటు కూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అనర్థాలకు దారితీస్తుంది. అది వ్యక్తిగతమైనా, ప్రభుత్వాలకైనా ఎదురవుతుంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత అన్నీ తొందరపడి నిర్ణయాలే చేపడుతున్నది. అధికారంలోకి రాగానే మూడు నెలల్లో విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకుని వచ్చి, పేద కుటుంబాల్లో 10 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామన్న హామీ బుట్టదాఖలైంది. అటువంటివి ఎనె్నన్నో హామీలను విస్మరించి, ప్రజలను వేధించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దుతో ఏమి ఒరగబెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ చివరకు ప్రజలకు మాత్రం నరకం చూపించారు. బ్యాంకుల వద్ద భారీ ‘క్యూ’ లైన్లలో ప్రజలు నిలుచోవాల్సి వచ్చింది. ఎటిఎంలు అస్సలు పని చేయలేదు. అప్పుడే కాదు ఇప్పడూ అనేక ఎటిఎంల వద్ద ‘నో-స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ప్రజలకు డెబిట్/క్రెడిట్ కార్డులు అలవాటు చేస్తామన్నారు. చిరు వ్యాపారుల వద్ద అది సాధ్యంకాక అటు వ్యాపారులు, ఇటు ప్రజలు సమస్య ఎదుర్కొంటున్నారు. దీనికి ఎవరు జవాబు చెబుతారు. ఇక రెండో అంశం జిఎస్‌టి. దీనివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ దెబ్బతిన్నది. ఒకే దేశం-ఒకే పన్ను అన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏమి ఖరీదు చేసినా జిఎస్‌టి పేరిట దోపిడీ జరుగుతున్నది. అసలు ఎంత ఉన్నా, జిఎస్‌టి అని విడిగా పన్ను వేస్తూ బాజప్తా బిల్లు ఇస్తున్నారు. ఇక తాజాగా ఆధార్‌ను అన్నింటికీ అనుసంథానం అంటున్నారు. దీంతో వ్యక్తి గత స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతున్నది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, బ్యాంకుల్లో ఇదివరకే ఖాతాలు ఉన్నా ఆధార్ నెంబర్ తప్పని సరి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇంటి చిరునామా కోసమైతే ఫర్వాలేదు కానీ, సదరు ఖాతాదారుల అకౌంట్లను పరిశీలించడం అనేది భావ్యం కాదు. అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినట్లే. దేశంలో 130 కోట్ల మంది ఉంటే 70 కోట్ల మందికే ఆధార్ కార్డులు జారీ చేసి ఆధార్ తప్పనిసరి చేయడాన్ని కోర్టు కూడా తొలుత తప్పుపట్టింది. ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయరాదని, వ్యక్తుల ఇష్టాయిష్టాలకు వదిలి వేయాలని కోర్టు అభిప్రాయపడింది. అయితే అందరికీ ఆధార్ కార్డులు అందజేసిన తర్వాత అనుసంధానం చేయవచ్చని అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించి సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. కీలకమైన, ప్రాధాన్యత గల అంశాలపై దేశ ప్రజల అభిప్రాయాన్నీ తెలుసుకోవాలి. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోయే పరిస్థితులు ప్రజలకు ఎదురయ్యాయి. ప్రభుత్వ చర్యలపట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

- పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎమ్మెల్సీ, ఎఐసిసి కార్యదర్శి