రాష్ట్రీయం

పాత ఫార్ములాను ఒప్పుకునేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: ఆంధ్ర, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం కొత్త సమస్యలకు తావిస్తోంది. వచ్చే నెలాఖరునాటికి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి నీటి ప్రవాహం పెరిగితే గత ఏడాది మాదిరిగా ఆంధ్రకు 512 టిఎంసి, తెలంగాణకు 299 టిఎంసి నీటి నిష్పత్తి మేరకు పంపకాలకు ఒప్పుకునేది లేదంటూ తెలంగాణ తెగేసి చెప్పేసింది. ఆగస్టులో ఈ ఏడాది కృష్ణా జలాల పంపిణీపై బోర్డు సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలో నీటి కేటాయింపులను అంగీకరించేది లేదని తెలంగాణ ముందే గొంతువిప్పింది. తమ ప్రాంతంలో కృష్ణా బేసిన్ ఎక్కువుందని, దాన్ని పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు ఉండాలని కోరింది. ఈమేరకు బోర్డుకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ లేఖ రాసింది. కాగా ఆంధ్ర సర్కారు మాత్రం బచావత్ నీటి కేటాయింపులకు లోబడి ఉంటామంటోంది. ఆంధ్రకు 512 టిఎంసి జలాలు కేటాయించాలని, ఒకవేళ ఆ మేరకు జలాలు లేక పోతే దామాషా ప్రకారం నీటి వాటా ఇవ్వాలంటూ బోర్డుకు లేఖ రాసింది. గోదావరిపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని మళ్లించి లాభపడుతున్న ఆంధ్ర, ఆ మేరకు కృష్ణా నది ఎగువ రాష్టమ్రైన తమకు కృష్ణా నదిలో అదనపు వాటా ఉంటుందని, దీన్ని వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని కోరింది.
కృష్ణా బోర్డు ఆదేశించినా సాగర్ నుంచి నీటి విడుదలలో సమస్యలు ఎదుర్కొంటున్నామని, ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోవాలని లేదా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద తమ పరిధిలోని కాల్వలను తామే నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆంధ్ర ప్రభుత్వం బోర్డును కోరుతోంది. మిషన్ కాకతీయలో భాగంగా తెలంగాణ చెరువుల మరమ్మతును చేసి నీటి వనరుల కింద కేటాయింపులను వినియోగించుకుంటోందని ఏపి బోర్డుకు రాసిన లేఖలో పేర్కొంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా బేసిన్‌కు 811 టిఎంసి జలాలు కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రకు 512 టిఎంసి, తెలంగాణకు 299 టిఎంసి కేటాయించారు. నీటి వివాదాలు తలెత్తడంతో 2015లో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ వద్ద జరిగిన సమావేశంలో పైన పేర్కొన్న నిష్పత్తి మేరకు నీటి కేటాయింపులకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 2016లోనూ పాత పద్ధతిలో నీటి కేటాయింపులకు తెలంగాణ అంగీకరించింది. కానీ పట్టిసీమ నీటి వాటా కావాలని పట్టుబట్టింది. ఈవిషయమై గోదావరి బోర్డు లేదా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఇంతవరకు తేల్చలేదు. కృష్ణా బోర్డు ఈ అంశం తమ పరిధిలో లేదని పేర్కొంది. ఈ వివాదాలను తేల్చేందుకు కేంద్రం ఒక కమిటీని నియమించింది. కమిటీ తన నివేదికను ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ త్వరలో కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో ప్రారంభం కానుంది. ఆగస్టు నెలాఖరు నాటికి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు అదనంగా 50 టిఎంసి నీరు చేరినా కుడి, ఎడమకాల్వలకు, రాయలసీమ పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నీటి కేటాయింపులపై పాతపద్ధతికి ఒప్పుకోమని తెలంగాణ స్పష్టం చేయడంతో ఆగస్టు రెండో వారంలో కృష్ణా బోర్డు సమావేశం కానుంది.